భారతదేశం వర్ణ, కులవ్యవస్థ ఆధారంగా నిర్మితమైనది. ఈ వ్యవస్థలపై ప్రజాజీవనం ఉందని పైకి అనక పోయినా జానపదులు దీనికి అలవాటై పోయారని చెప్పవచ్చు. గ్రామీణ వ్యవస్థకు జానపద విజ్ఞానం ఒక అమూల్య సంపద. ఇది ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమింపచేస్తున్న తరగని పెన్నిది. ఈ విజ్ఞానం పైకి బహుముఖాలతో, రూపాలతో, ప్రయోజనాలతో కనపడుతున్నా అంతస్సూత్రంగా మాత్రం జానపదుల జీవన విధానాన్ని వారికి కావల్సిన ముందు చూపును అంటి పెట్టుకునే లక్షణం జానపద విజ్ఞానానికి ఉంది.
జానపద విజ్ఞానంలో జానపద కళారూపాలు అంతర్భాగం. దీనిలో వస్తువైవిధ్యం, ప్రదర్శనా వైవిధ్యం కలిగిన కళారూపాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని కులాలకు వంశపారంపర్యంగా జీవన భృతిని కలిగిస్తున్నాయి. ఐతే ఇలాంటి కులాల్లో కుల పురాణాలు ప్రదర్శించే కళాకారులను ప్రధానంగా పేర్కొనవచ్చు. వీరిలో చాలా వరకు త్యాగం సంప్రదాయం ఉన్న వారే అధికంగా ఉన్నారు.
కులపురాణం ప్రదర్శకులు మొదటి నుంచి వైవిధ్యభరితంగా తమ కళారూపాన్ని ప్రదర్శిస్తూ పోషిత కులాలను రంజింప చేస్తున్నాయి. ఇదే క్రమంలో ధాతృకులాల ఔన్నత్యాన్ని కాపాడుతూ తమ ఉనికిని దశదిశలా వ్యాప్తి చేస్తున్నారు. ప్రతిఫలంగా వారిచ్చే త్యాగంతో జీవనం గడుపుతున్నారు. కుల పురాణాల ప్రదర్శనల ద్వారా భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
కుల పురాణాలు ప్రదర్శించే కళాకారుల్లో రుంజ, పిచ్చుక కుంట్ల, మాష్టి, కిన్నెర, భాట్స్, ఢాడి, తోటి, పర్దాన్, పట్టెడని కళాకారులు తమ కధాగానం ద్వారా, కాకి పడిగెల, ఏనంటి, గౌడజెట్టి, గుర్రపు, కొర్రాజుల, పూజరి, అద్దపు, కూనపులి, మాసయ్యలు, ఉక్కరి, కొమ్ము, తెల్జూరు, పాండవులోల్లు పటం కథా రూపంలోను, చిందు వాళ్లు నాటక రూపంలోను, నులకచందయ్యలు వచన రూపంలోను కులాపురాణాలు ప్రదర్శిస్తారు. ఈ కళాకారులు ఆయా ధాతృకులాల వద్దకు వెళ్లి వారి వారి కుల పురాణాలు ప్రదర్శిస్తారు.
జాంబ పురాణం – ప్రదర్శనా వైవిద్యం :
దళిత మౌఖిక సాహిత్యం చరిత్రలో జాంబ పురాణం అపూర్వమైనది. ప్రదర్శన సైతం వైవిధ్యభరితమైనది. ఈ పురాణాన్ని దళిత ఉపకులాలకు చెందిన వృత్తి కళాకారులు ప్రదర్శిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న త్యాగం/మిరాశి హక్కులను పొందుతూ కళామతల్లి ముద్దుబిడ్డలుగా పేరొందారు. ప్రదర్శనే జీవనాధారంగా భావించిన వీరు దళిత సంస్కస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్‍కు మార్గదర్శకంగాను, అనుసంధానకర్తలు గాను మారుతున్నారు. ముఖ్యంగా జాంబ పురాణాన్ని డక్కలి, చిందు, మాష్టి, కిన్నెర, నులక – చందయ్య కళాకారులు ప్రదర్శిస్తారు. ఈ పురాణం మాదిగ కులస్థులకే చెందినదే అయినా, విశ్వం పుట్టుక, దేవతల ఆవిర్భావం కూడా ఉంటుంది. అదేవిధంగా మాదిగ వారి పుట్టుక చరిత్రతో పాటు, సమాజంలోని వివిధ కులాల పుట్టుక, కుల నిర్మాణం, ఉత్పత్తి, వృత్తి పనిముట్లు ఆవిర్భావ చరిత్రలు సవివరంగా ఉంటాయి. వేదాలు, ఉపనిషత్తులు, యుగాలు వంటి ఎన్నో విషయాల వివరణ ఉంటుంది. జాంబ పురాణాన్ని లోతుగా అధ్యయనం చేస్తే సృష్టి రహస్యాలు, సామాజిక విలువలు, కట్టుబాట్లు అర్థం చేసుకోవచ్చు.
జాంబ పురాణం – ఇతర కుల పురాణాలతో సంబంధం :
జాంబ పురాణం ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఆశ్రిత వృత్తి కళాకారులు ఉన్నప్పటికీ, జాంబపురాణంలో అంతర్భాగమైన ఆది పురాణంను ఒక ఘట్టంగా చేసుకొని ప్రదర్శించే వృత్తి కళాకారులు కూడా ఉన్నారు. జాంబ పురాణ ప్రదర్శనలో ప్రధాన ఘట్టం ఆదిపురాణం. దీనినే శక్తిపురాణం శక్తి విలాసం, అని కూడా అంటారు. మిగతా కులపురాణాల్లో కూడా ఆది పురాణంను ప్రధాన ఘట్టంగా చేసుకొని మాసయ్యలు మడీలు పురాణం, ఏమాటి, గౌడజెట్టి వాళ్లు గౌడపురాణం, అద్దపువాళ్లు నాభికాపురణంను ప్రదర్శిస్తారు. కాగా బైండ్ల, పంచాల కథకులు మాత్రం ఎల్లమ్మ కథా ప్రదర్శనలో భాగంగా ఆదిపురాణంను వివరిస్తారు.
జాంబ పురాణం ప్రత్యేకతలు – అధ్యయన ఆవశ్యకత
జాంబ పురాణ ప్రదర్శన వెనుక జానపదుల నమ్మక వ్యవస్థ ఎంతో దాగి ఉంది. కులాల పుట్టక, సృష్టి ఆవిర్భావం వివరించడమే ఈ పురాణం ప్రత్యేకత. ప్రధాన ఘట్టమైన ఆదిపురాణం లేదా శక్తి పురాణంనకు కథకులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా ఈ పురాణంలో విశ్వం పుట్టుక, దేవతల వివాహాలు, వృత్తి పరికరాల తయారీ, వివిధ కులాలు, కులవృత్తుల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. యుగాల ప్రస్థావన చిందు, ఢక్కలి వారి జాంబ పురాణాల్లో చక్కగా వివరిస్తారు. నందవీర, అనంత, అచ్యుత, అద్భుత, తమండ, తారక, అందజ, భిన్నజ, అన్యోన్య, అలంకృత, విశ్వంభర, సరిభవ, సకధర్మ, సకల స్వరూప, కృతా, ద్రేతా, దాప్వర, కలియుగాల చరిత్ర, దేవతల పుట్టుక, వివిధ సంఘటనలు ఉంటాయి. ఆకాశం, భూమి పుట్టుక అనంతంర జాంబవవంతుడు, శ్రీమన్నారాయణుడు, ఆదిశక్తిల ఆవిర్భావం గురించి వివరించడం జరుగుతుంది. సృష్టి రచనలో భాగంగా ఆదిపరాశక్తి మూడు గుడ్లు పొదడం, ఆ గుడ్ల నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు జన్మించడం, గుడ్లపై పెచ్చులు ఆకాశం, భూమి, సూర్య, చంద్రులు, నక్షత్రాలుగా ఏర్పడిన విధానం ఉంటుంది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వివాహ సందర్భంలో జాంబవంతుడు వెండి, బంగారు, రాగి కొండలను కరిగించి మంగళ సూత్రాలు తయారు చేయిస్తాడు. ఇతర వస్తువుల తయారీకోసం ఢక్కలి వాడిని చంపి, అతని శరీరంలోని ఒక్కొక్క భాగం నుండి ఒక్కొక్క వృత్తి పనిముట్లు తయారు చేసి విశ్వబ్రహ్మకు అందిస్తాడు. ఈ వస్తువులతో మంగళ సూత్రం తయారు చేసి ఇస్తాడు.
జాంబ పురాణంలో ఎన్నో మానవీయ విలువలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న అస్పృశ్యత గతంలో లేదని వారించేదే జాంబ పురాణం. అస్పృశ్యత పేరుతో శూద్రులు, అణగారిన కులాలపై జరిగిన, జరుగుతున్న అణచివేతలను రూపుమాపేందుకు ఈ పురాణం ఎంతగానో దోహదపడుతుంది. చిందు, ఢక్కలి వారు ప్రదర్శించే జాంభపురాణంలో అగ్రకులాలు, అణగారిన కులాల మధ్య జరిగే సంభాషణతో ప్రారంభమవుతుంది. ఎవరిది ఎక్కువ కులం కాదు అందరు సమానం అని బోధపడే విధంగా కథాగమనం సాగుతుంది.
వ్యక్తుల మధ్య వావి వరుసలు ఏ విధంగా ఉండాలనే విషయాలు జాంబ పురాణ కథలో చక్కగా వివరించబడుతాయి. తల్లీకొడుకుల, అన్నా చెల్లెళ్ల అనుబంధం, తల్లి రుణం తీర్చుకోవడం వంటి వాటి గురించి శక్తి పురాణంలోని సృష్టి ఆవిర్భావంలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా తల్లి దండ్రుల నుండి వారసత్వంగా సంక్రమించే వస్తువులను అన్నదమ్ములు సమపాళ్లల్లో పంచుకోవాలనే విషయాన్ని జాంభపురాణం వివరిస్తుంది. ఆదిశక్తి నుండి సంక్రమించిన వివిధ విద్యలు, వస్తువులు త్రిమూర్తులు సమానంగా పంచుకొని నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు.
జాంబపురాణం – పాత్రల ప్రాధాన్యత :
జాంబ పురాణం ప్రదర్శనలో వివిధ పాత్రలు మనకు కనిపిస్తాయి. ప్రతీ పాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ప్రదర్శకులు తమ కథాగమనానికి అనుగుణంగా ఆయా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అవగతం అవుతుంది. ముఖ్యంగా ఢక్కలి, చిందు కళాకారులు ప్రదర్శించే జాంబపురాణంలోని ఆది పురాణం ఘట్టాన్ని పరిశీలిస్తే ఆదిపరాశక్తికి మొదటి ప్రాధాన్యతను, ఆ తరువాత శంకరుడికి రెండవ, జాంబవంతుడికి మూడ, ఆడ, మగ నెమళ్లకు నాలుగవ, ఐదవ ప్రాధాన్యత ఇచ్చినట్లు జాంబ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు. కథకులు ఆయా పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించినా ఆది జాంబవంతుడు చుట్టూ కథాగమన సాగడం గమనార్హం.
ముగింపు :
జాంబ పురాణ అధ్యయనం నేటి ఆధునిక యుగంలో అత్యంత ఆవశ్యకమైనదిగాను, ప్రాధాన్యత కలిగినది గాను చెప్పవచ్చు. జాంబ పురాణ ప్రదర్శకులైన చిందు, డక్కలి, మాష్టి, కిన్నెర, నులక చందయ్య కళాకారుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. వారిని పరిరక్షించుకొని భవిష్యత్ తరాలకు జాంబపురాణ ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరం అందరిపై ఉంది. దీనికై విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశోధకులు జాంబపురాణాన్ని వివిధ కథకుల ద్వారా సేకరించి తులనాత్మక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జాంబ పురాణం పరిరక్షణ, పరిపోషణ కోసం యువ కళాకారుల శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలి. ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు వివిధ స్థాయిల్లో దశల వారీగా పాఠ్యాంశాల్లో జాంభ పురాణం ఏర్పరిచేలా ప్రభుత్వం చర్య చేపట్టాలి.
జాంబ పురాణం వివిధ ప్రదర్శనలను ఆడియో, వీడియో, ఫోటో మాధ్యమంలో డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు కథల్ని ఉన్నదున్నట్లుగా ఎత్తిరాసి పుస్తకరూపంలో ప్రచురించాలి. జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో జాంబ పురాణ ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటు చేసి జాంభపురాణం ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి. ప్రభుత్వం జాంబపురాణం ప్రదర్శనా కళాకారులను గుర్తించి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. కళాకారులకు వృద్ధాప్య పెన్షన్లు, ఉచిత నివాసగృహాలు, ప్రయాణ రాయితీలు కల్పించి ఆదుకున్నట్లే జాంబపురాణ కథకులకు ఆదరణ కలుగడంతో పాటు, జాంబ పురాణం పదికాలాల పాటు సజీవంగా ఉంటుంది.
డా।। గడ్డం వెంకన్న
ఎ : 9441305070