తెలంగాణ దళిత బంధు

  • దళితులకు ధనభాగ్యం
  • ఎస్సీ సోదరుల కోసం సాధికారత పథకం
  • దళిత సాధికారత పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‍ నామకరణం
  • పైలట్‍ ప్రాజెక్టుగా హుజూరాబాద్‍ నియోజకవర్గం అంతా అమలు
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక యూనిట్‍
  • రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు


దళిత ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారుతున్నది. సీఎం కేసీఆర్‍ సారథ్యంలో సప్త వసంతాల స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలు సిరిసంపదలతో సగర్వంగా తలెత్తుకు జీవిస్తున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక రంగాల్లో అద్భుత పురోగతి సాధించిన మన తెలంగాణ, నేడు దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‍ ప్రకటించిన ‘దళిత సాధికారత’ దళిత సమాజంలో గుణాత్మక మార్పులకు కారణం కానున్నది.


స్వాతంత్య్రానంతరం ఇప్పటి దాకా అనేకమంది నాయకులు, ప్రభుత్వాలు దళితోద్ధారణ కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించినా అనుకున్నంత ఫలితం రాలేదన్నది వాస్తవం. దళిత కుటుంబాలు నిజమైన ఆర్థిక పురోగతి సాధించకపోవడమే దీనికి సాక్ష్యం. రాష్ట్ర సాధనకోసం పుష్కర కాలం పాటు ఉద్యమం చేసిన కేసీఆర్‍ ప్రజల సాధకబాధకాలను ప్రత్యక్షంగా చూశారు. దళితుల కష్టాలు, కన్నీళ్ల వెనకున్న కారణాలను విశ్లేషించారు. సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొన్నారు. దళితుల బతుకులు మార్చేందుకు కేసీఆర్‍ కంకణం కట్టుకున్నారు.


‘దళిత్‍ ఎంపవర్మెంట్‍’
పథకం కింద మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద కుటుంబాల చొప్పున 119 నియోజకవర్గాల్లోని 11,900 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. దీంతో దళితుల ఆర్థిక స్థితి గతులు సమూలంగా మారనున్నాయి. పరిశ్రమలు నెలకొల్పేందుకు, వ్యాపారాలు ప్రారంభించేందుకు, దళితులు ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది.


ఇదొక్కటే కాదు ఎస్సీల ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోసం గత ఏడేండ్ల నుంచి టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో మార్కెట్‍ కమిటీల్లో రిజర్వేషన్‍ విధానం ప్రవేశ పెట్టింది టీఆర్‍ఎస్‍ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో అనేక మంది ఎస్సీ రైతులకు మార్కెట్‍ కమిటీ చైర్మన్లుగా అవకాశం లభించింది. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇస్తున్న ఆసరా పెన్షన్లతో 4,66,167 మంది ఎస్సీలు లబ్ధిపొందుతున్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీడీ కార్మికులకు ఇస్తున్న భృతితో 27,034 మంది ఎస్సీలకు మేలుజరుగుతున్నది. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీతో 6,01,024 మంది ఎస్సీలు, విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్‍ తో 2.5 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు లబ్ది పొందుతున్నారు. చిన్నపాటి వ్యాపారం చేసుకొనే ఎస్సీలకు పూర్తి సబ్సిడీతో రుణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీలకు 80శాతం సబ్సిడీతో రూ. లక్ష వరకు, 70శాతం సబ్సిడీతో రూ. 2 లక్షలు, 60శాతం సబ్సిడీతో రూ.10 లక్షల వరకు రుణాలిస్తారు. సబ్సిడీ పోగా మిగతాది లబ్ధిదారులు బ్యాంకు ద్వారా పొందాలి. ఎస్సీ కార్పొరేషన్‍ స్వయం ఉపాధి పథకం కింద 1,36,043 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రూ.1,57,222 లక్షలు అందజేసింది. ఇలా అనేక రకాల పథకాలతో, సీఎం కేసీఆర్‍ దళితుల స్థితి గతులను మార్చడానికి కృషి చేస్తున్నారు. దళిత పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‍ కృషి కారణంగా, తెలంగాణ దళిత సమాజం దేశంలోనే ధనిక సమాజంగా మారే రోజులు ఎంతో దూరంలో లేవు.


అఖిలపక్ష సమావేశం దళిత సాధికారతపై ముఖ్యమంత్రి కెసిఆర్‍ ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని రాజకీయ పక్షనేతలు పాల్గొన్నారు. ‘దళిత బంధు’ పథకాన్ని ప్రతిపాదించారు. దళితబంధువల్ల దళితుల జీవితాల్లో వచ్చే మార్పులను, ఆ పథకం అమలు తీరుపై కెసిఆర్‍ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి దళితులకు కూడా నేరుగా ఆర్థిక సాయం అందించాలను కుంటున్నామన్నారు. అందువల్లే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.


ఈ నేపథ్యంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగి పోవాలంటే, ఏం చేయాలో, దశలవారీగా కార్యాచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రజాకవి గోరేటి వెంకన్న పాడిన గల్లీ చిన్నది అనే పాటను మనసు పెట్టీ వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడి విడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలని పేర్కొన్నారు. దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలన్నారు. ‘మేము కూడా పురోగమించగలం’ అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలో ఆ సూచనలన్నీ చేయాల్సిందిగా సిఎం కెసిఆర్‍ అన్నారు. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానాన్ని అమలు పరుద్దామన్నారు.


నిధుల బాధ్యత తనదన్నారు. అందువల్ల రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత మనందరం తీసుకుందామని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‍ వ్యాఖ్యానించారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలన్నారు. ఇందుకోసం అట్టడుగున ఉన్న వారినుంచి సహాయం ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగిందని, మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలను చక్కదిద్ది ఇరిగేషన్‍ రంగాన్ని పట్టుబట్టి గాడిలో పెట్టినట్లు దళితుల సాధికారత కోసం కూడా ప్రభుత్వం అంతే పట్టుదలతో పనిచేయాలని నిర్ణయించిందన్నారు. వ్యాపార నిర్వహణ కోసం, తదితర స్వయం ఉపాధి రంగాల ఏర్పాటు కోసం ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్స్లు, అందించే పెట్టుబడులు, అంశాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్ల కోటా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.


వ్యవసాయ భూమిని గణన చేయాలి
దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలని సిఎం కెసిఆర్‍ అన్నారు. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలని సంబంధిత- అధికారులకు ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సూచించారు. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదిగా సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు. ఎటువంటి బ్యాంక్‍ గ్యారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తామన్నారు.


చైతన్యం పెంచాలి

దళిత సాధికారత కోసం, దళిత సమాజాన్ని ఆ దిశగా అవకాశాలను అందుకునే పద్దతిలో చైతన్యం చేయాలని సిఎం సూచించారు. ఆ దిశగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పాటలు, కళా రూపాల ప్రదర్శన, ఎలక్ట్రానిక్‍ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలను రూపొందించాలన్నారు. అవసరమైతే గోరేటి వెంకన్న వంటి కవులను, సాంస్కృతిక సారథి తదితర కళాకారుల సేవలను వినియోగించు కోవాలన్నారు. అలాగే దళిత యువత ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పుకు, ఆత్మన్యూనత నుంచి ఆత్మ స్థైర్యం పెరిగి, ఉన్నత స్థాయి ఓరియంటేషన్‍ అలవర్చుకునే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న, ఓవర్‍ సీస్‍ ఎడ్యుకేషన్‍ స్కాలర్‍ షిప్‍ పొందేందుకు.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇన్‍కమ్‍ సీలింగ్‍లో సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అంది పుచ్చు కోవడానికి, దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.


సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా..
‘తెలంగాణ దళితబంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాల్సి ఉన్నది. మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలి. వారు దళితబంధు పథకాన్ని మనసుపెట్టి అమలుచేయాలి. పూర్తిస్థాయి గణాంకాలు, సరైన సమాచారం లేకుండా ఏ ప్రభుత్వ పథకమైనా పరిపూర్ణంగా అమలుకాదు. ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వేను ఆధారం చేసుకుని, దళితబంధు పథకం అమలులో ముందుకుసాగాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. ‘మనం తిండి తింటున్నప్పుడు ఎంతైతే లీనమై భోజనం ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పనిచేస్తున్నప్పుడు ఎంతైతే దీక్ష కనబరుస్తామో.. దళితబంధు పథకం అమలులో అధికారులు అంతే తన్మయత్వంతో పనిచేయాలి’ అని స్పష్టంచేశారు. ‘తమ అభివృద్ధి గురించి, గత పాలకులు అవలంబించిన విధానాల ద్వారా దళితుల్లో ఎటువంటి పురోగతి కానరాలేదనే అపనమ్మకం ఏర్పడింది. వారిలో గూడుకట్టుకున్న అవిశ్వాసం తొలిగిపోవాలి. ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయి అనే విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన అవసరం మనమీదున్నది. సరైన గైడెన్స్ఇస్తూ దళితబంధు పథకం అమలును పర్యవేక్షించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. దళితబంధు పథకం అమల్లో అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని పేర్కొన్నారు.


దళిత కుటుంబాల ప్రొఫైల్‍
దళిత కుటుంబాల ప్రొఫైల్‍ను రూపొందించాలని, వారి జీవన స్థితిగతులను పొందుపరిచాలని సీఎం కేసీఆర్‍ అధికారులకు సూచించారు. దళిత సమస్యలు అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవని.. గ్రామీణ, సెమీఅర్బన్‍, పూర్తిఅర్బన్‍ అనే విభాగాలుగా వారి సమస్యలను విభజించాలని తెలిపారు. అందుకనుగుణంగా దళితబంధు పథకం ద్వారా అభివృద్ధి కార్యాచరణను అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘భారత సమాజంలో వ్యక్తుల వ్యక్తిత్వ పటిమ గొప్పది. అయితే.. అనేక వివక్షతల మూలంగా సామూహిక ఐక్యత ఆశించినంతగా లేకపోవడంతో సామాజిక అభివృద్ధి జరుగట్లేదు. ఇది విచారకరం. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తెచ్చింది. అవసరమైన మేరకు నిధులను అందుబాటులో ఉంచుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వవిప్‍ బాల సుమన్‍, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్‍రెడ్డి, కొప్పుల మహేశ్వర్‍రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‍శర్మ, సీఎస్‍ సోమేశ్‍కుమార్‍, డీజీపీ మహేందర్‍రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‍ సెక్రటరీ నర్సింగ్‍రావు, సెక్రటరీలు స్మితా సబర్వాల్‍, భూపాల్‍రెడ్డి, రాజశేఖర్‍రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‍ బొజ్జా, డైరెక్టర్‍ కరుణాకర్‍ తదితరులు పాల్గొన్నారు.


అమలులో మూడు ముఖ్యాంశాలు
తెలంగాణ దళితబంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుచేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని స్పష్టంచేశారు. వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పని చేయాల్సి ఉంటుందన్నారు. అట్లాంటి చిత్తశుద్ది, దళితుల పట్ల ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. కులం, జెండర్‍, ఆర్థికం, తదితర పేర్లతో వివక్షకు గురిచేసి ప్రతిభావంతులను ఉత్పత్తిరంగానికి దూరంగా ఉంచడం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగానే కాకుండా మొత్తం జాతికే నష్టం కలిగిస్తుందని సీఎం స్పష్టంచేశారు. దళిత సాధికారత కోసం కృషి చేయడమంటే సమాజంలో వివక్షకు గురవుతున్న ఒక ప్రతిభావంతమైన వర్గాన్ని ఉత్పత్తిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేయడమేనని తెలిపారు.


బ్యాంక్‍ ఖాతాల్లోకి ఆర్థిక సాయం

దేశంలోని ఇతర కులాలు, వర్గాల్లో కూడా ఆర్థిక వివక్ష ఉన్నదని.. అయితే దళితులపై సామాజిక వివక్ష అనే అదనంగా ఉన్నదని, తరతరాలుగా దేశంలో పట్టి పీడించబడుతున్నదని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. దళితులను ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి దూరంచేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్థితో ఉన్నదని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతును అభివృద్ధిపథంలో నడిపించిన విధంగా.. దళితబంధు పథకం ద్వారా రాష్ట్రంలో దళిత సాధికారతకోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కుటుంబం యూనిట్‍గా అర్హులైన, ఎంపిక చేయబడిన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం అందజేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని అభి వృ ద్ధి చెందే వెసులుబాటును కల్పించాలని.. ఇటీవలి దళిత ప్రజాప్రతినిధుల సమావేశం నిర్ణయించిందని గుర్తుచేశారు. ఆ నిర్ణయం మేరకు దళారుల బాధలేకుండా రైతుబంధు తరహాలో దళితబంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థికసాయాన్ని జమచేస్తామని పునరుద్ఘాటించారు.


ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో దళితులను పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం తెలంగాణ దళితబంధు పథకాన్ని అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ పథకానికి సంబంధించి జీవో ఎంఎస్‍ నంబర్‍ 6ను విడుదలచేసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన కుటుంబాలను ఎంపికచేసి పథకాన్ని అమలుచేయనున్నట్టు పేర్కొన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‍లోనే వెయ్యికోట్లతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభి వృద్ధి (ఎస్సీఎస్డీఎఫ్‍) కింద ఇప్పటికే కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాలతో సంబంధం లేకుండా తెలంగాణ దళితబంధును అమలుచేయనున్నట్టు ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. ఈ పథకానికి ఎంపికైన ఒక్కో కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఎలాంటి బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రూ.10 లక్షల చొప్పున నగదు సహాయాన్ని పూర్తి గ్రాంటు రూపంలో ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. ఈ పథకాన్ని ముందుగా కరీంనగర్‍ జిల్లా హుజూరాబాద్‍ నియోజకవర్గం నుంచి పైలట్‍ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ నియోజకవర్గంలో అర్హులైన దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తింపజేస్తామని.. ఇక్కడ పథకం అమలులో వచ్చే ఫలితాలను అధ్యయనంచేసిన తర్వాత రాష్ట్రమంతటా అమలుచేస్తామని జీవోలో ప్రభుత్వం వెల్లడించింది.


త్వరలో వర్క్ షాప్
తొలుత పైలట్‍ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్‍లో ఈ స్కీమ్‍ను పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఆ తర్వాత అక్కడ క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షించుకున్నాక.. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు మరింత సులువవుతుందని సీఎం కేసీఆర్‍ ఈ సందర్భంగా తెలిపారు. పైలట్‍ ప్రాజెక్టు అమలుకు కలెక్టర్లు, ఇతరఅధికారులతో త్వరలోనే వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. ఈ స్కీమ్‍లో మూడు ముఖ్యమైన అంశాలుంటాయని వివరించారు.


‘‘మొదటిది పథకం అమలు చేసి పర్యవేక్షించడం. రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం. మూడోది లబ్ధిదారులు-ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం. ఈ పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడికి ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తాం. లబ్ధిదారులకు అనుకోకుండా ఏదైనా ఆపద తలెత్తినప్పుడు.. ఈ నిధిని నుంచి వారికి ఆర్థిక సాయం అందుతుంది. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం అనుకోని పరిస్థితుల్లో ఆర్థిక కష్టాలకు లోనైతే.. ఈ నిధి ఒక రక్షణ కవచంగా నిలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకెళ్లడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం’’ అని సీఎం వెల్లడించారు.


కార్యకర్తల్లా పనిచేసే అధికారులు కావాలి
దళిత బంధును క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి దళితుల అభివృద్ధికి మనసుపెట్టి నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు. అధికారుల్లా కాకుండా.. సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పనిచేసేవారిని గుర్తించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుని, దళిత బంధు పథకం అమలులో ముందుకు సాగాలన్నారు.
దళితుల్లో గూడుకట్టుకున్న అవిశ్వాసం తొలగిపోవాలి. ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయనే విశ్వాసాన్ని, బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన అవసరం మనందరిపై ఉంది’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ పథకం అమల్లో అధికార యంత్రాంగం అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర కులాల్లో వర్గాల్లో కూడా ఆర్థిక వివక్ష ఉందని.. అయితే దళితులను సామాజిక వివక్ష అనేది తరతరాలుగా పట్టి పీడిస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి దూరం చేసి.. వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు.


‘‘రైతు బంధు పథకంతో రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని, రైతులను అభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపించాం. దళిత బంధు ద్వారా రాష్ట్రంలోని దళితుల సాధికారతకు విశేష కృషి చేస్తాం. కుటుంబం యూనిట్‍గా అర్హులను ఎంపిక చేసి, నేరుగా ఆర్థిక సాయం చేస్తాం. ఆ మొత్తాన్ని వారు ఏవిధంగానైనా ఉపయోగించుకోవచ్చు. ఈ విధానాన్ని ఇటీవలి దళిత ప్రజాప్రతినిధుల సమావేశంలో నిర్ణయించాం’’ అని గుర్తుచేశారు. దళితుల సమస్యలు అన్నిచోట్ల ఒకేలా ఉండవని, అందుకే దళిత కుటుంబాల ప్రొఫైల్‍ను రూపొందించుకుని, వారి జీవన స్థితిగతులను అందులో పొందుపరచాలని సూచించారు.


లబ్ధిదారులు కోరుకున్నట్టే దళితబంధు
తమ అభివృద్థిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని సీఎం కేసీఆర్‍ అన్నారు. అనతి కాలంలో ఆర్థిక స్వావలంబన కలిగించే వినూత్న ఉపాధి పథకాలను ‘తెలంగాణ దళిత బంధు’ పథకంలో భాగంగా రూపకల్పన చేసి లబ్థిదారుల ముందుంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.
‘‘క్షేత్రస్థాయిలో పైలట్‍ ప్రాజెక్టు చేపట్టి, నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించి దళిత కుటుంబాల స్థితి గతులను అర్థం చేసుకోవాలి. వారి అభిప్రాయాలను సేకరించాలి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పలు రకాల పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలి. ముందు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగా సెన్సిటైజ్‍ కావాలి’’ అని సీఎం కేసీఆర్‍ వివరించారు.
‘‘దళిత బంధు కింద లబ్థిదారులకు అందించే ఉపాధి స్కీం వారికి ఇష్టమైనదై ఉండాలి.. వారి జీవితాలను అనతికాలంలో అభి వృద్థి చేసేదై ఉండాలి.. తప్పితే.. పథకం కోసం మూస పద్ధతిలో వారికి అంటగట్టినట్టుగా ఉండకూడదు’’ అని అధికారులకు సీఎం వివరించారు. హుజూరాబాద్‍లో క్షేత్రస్థాయి అనుభవాలను అర్థం చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

నేతల స్పందనలు


ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచేపోయే పథకం : మోత్కుపల్లి నర్సింహులు – బిజెపి నేత
దళిత సాధికారతపై కేసీఆర్‍ నిర్వహించిన సమావేశం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని బిజెపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితుల అభి వృద్ధికి ఏమి చేయాలనే అంశంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకోవడంతో దళిత సమాజంలో ఒక మానసిక ఉత్తేజం కలిగిందన్నారు. దళిత సాధికారతలో భాగంగా దళారులు లేకుండా నేరుగా రైతుబంధు పథకం వలే దళితులకు ఆర్థికసాయం అందిస్తేనే మేలు జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు, కలెక్టరు వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే, వారి ఆకాంక్షలు నెరవేరుతుండటం ఆనందదాయక మన్నారు.


దళిత సమాజానికి ఒక భరోసాను, ధైర్యాన్ని కల్పించారు : భట్టి విక్రమార్క – కాంగ్రెస్‍ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు

అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం ద్వారా యావత్‍ దళిత సమాజానికి సిఎం కెసిఆర్‍ ఒక భరోసా, ధైర్యాన్ని కల్పించారని కాంగ్రెస్‍ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దళితుల కోసం తెచ్చిన పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా ఉండడం చాలా అవసరం. ముఖ్యమంత్రి ఆలోచనలను అధికారులు పటిష్టంగా అమలు చేస్తారనే విశ్వాసం తమకుందన్నారు.


సీఎం తీసుకున్న చొరవ అభినందనీయం : తమ్మినేని వీరభద్రం – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

దళిత సాధికారత కోసం సిఎం కెసిఆర్‍ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం, సంతోషాన్ని కలిగిస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దళిత సాధికారత కోసం ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్తశుద్దితో అమలు పరచాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తమ పక్షాన సంపూర్ణ సహకారం
ఉంటుందన్నారు.


సంతోషంగా ఉంది : చాడా వెంకట్‍ రెడ్డి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
దళిత సాధికారత కోసం సిఎం కెసిఆర్‍ స్వయంగా ముందుకు రావడం., అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా వుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‍ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న కళ్యాణ లక్ష్మి వంటి పలు అభివృధ్ధి సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయన్నారు.


చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్‍. రమణ
దేశంలోనే మొదటి సారిగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్‍ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని టీఆర్‍ఎస్‍ నేత ఎల్‍. రమణ అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా కేసీఆర్‍ తరతరాలకు గుర్తుంటారని పేర్కొన్నారు. హుజురాబాద్‍ నుంచి ప్రారంభించిన రైతు బంధు పథకం విజయవంతం అయినట్టే దళిత బంధు కూడా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


దళిత క్రాంతికి ప్రగతి వంతెన : క్రాంతి కిరణ్‍, శాసన సభ్యులు – ఆందోల్‍
‘స్వాతంత్య్రానంతరం ఈ 70 ఏండ్లకాలంలో దళితులు అంటే దేశంలోని అన్ని వర్గాలు ఈర్ష్యపడే విధంగా అభివృద్ధి చెందారంటూ ప్రచారంలో పెట్టారు. మాటలతో మోత మోగించారు ఈ దేశంలో దళితులు తప్ప ఇంకెవరూ లేరా వారికోసమే ఈ ప్రభుత్వాలు వున్నాయా అని మిగతా వర్గాల ప్రజలు అసూయ పడే విధంగా ప్రచారం జరిగింది. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా వుంది..’. ఇది దళితుల అభివృద్ధిపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‍ చెప్పిన చారిత్రక సత్యం.


నా వృత్తిపరమైన జీవితంలో నేను అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను, మాట్లాడాను. బహుశా నా జర్నలిస్ట్ జీవితంలో, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక దళితుల స్థితిగతులపైన ఇంత లోతైన అధ్యయనం చేసిన ముఖ్యమంత్రిని చూడలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‍ ప్రతిపాదించిన దళిత జీవిత సైద్ధాంతికతకు, ఆత్మగౌరవానికి సీఎం కేసీఆర్‍ ఆచరణ రూపం ఇస్తున్నారు. దళిత ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి, వారి భవిష్యత్తు తరాలకు బంగారుబాటలు వేసే అద్భుతమైన ఆలోచనే ఈ కేసీఆర్‍ దళిత సాధికారతా విధానం.


దళితులకు కొండంత ధైర్యం : నన్నపునేని నరేందర్‍, శాసనసభ్యులు – వరంగల్‍ తూర్పు
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు దళితులను ఓటు బ్యాంకుగానే చూశారు. ఓట్ల సమయంలో హామీలు గుప్పించి ఎన్నికలయ్యాక విస్మరించారు. సామాజికంగా, ఆర్థికంగా దళితులను వెనకబడేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి కోసం సీఎం కేసీఆర్‍ తీసుకున్న నిర్ణయాలు వారికి కొత్త ధైర్యాన్నిచ్చాయనే చెప్పవచ్చు.
ధనవంతులైన దళితులను తెలంగాణలో చూడాలనేది కేసీఆర్‍ ఆకాంక్ష. దానికోసం ‘దళిత ఎంపవర్‍మెంట్‍’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో మారుమూలన ఉన్న దళితుల జీవితాల్లో గుణాత్మకంగా అభివృద్ధిని సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‍ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయం. ప్రజలు, దళిత వర్గాల మేదావులు చేయిచేయి కలపాలి. దళిత సాధికారత పథకంతో దళితులను అభివృద్ధి బాటలో నిలుపుదాం.


లక్ష్యం గొప్పది, సహకరిద్దాం : సుంకె రవిశంకర్‍, శాసనసభ్యులు – చొప్పదండి

శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‍ రావు ప్రకటించిన దళిత సాధికారత పథకం ‘దళితబంధు’ రాష్ట్ర రాజకీయాలలో నవశకానికి నాంది పలుకుతున్నది.
కేసీఆర్‍ పథకాలు, సంస్కరణలు దేశానికే ఆదర్శం. ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపిస్తుంది. ఎస్సీ హాస్టల్‍లో పురుగుల అన్నం, పలుచటి చారు తిని చదువుకున్న నాలాంటి వారికి, హాస్టళ్లు ఇంతగా మారి దళిత బిడ్డలు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం చేస్తూ గొప్ప చదువులు చదువే రోజులు వస్తాయని ఊహకు కూడా అందలేదు. కానీ కేసీఆర్‍ చేసి చూపించారు. ఈ పథకాన్ని కూడా ఆయన విజయవంతం చేసి తీరుతారు.


దళిత బంధు పథకంపై ఎన్నారైల హర్షం

సీఎం కేసీఆర్‍ దళిత సాధికారత దళితబంధు పథకం ప్రకటించడం హర్షనీయమని ఎన్నారై టీఆర్‍ఎస్‍ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్‍ కూర్మాచలం హర్షం ప్రకటించారు.

కట్టా ప్రభాకర్‍
ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *