మార్పిడి


తెల్లారితే రంగుల పండగ. ఆ ఊరి పిల్లలంతా ఊరి మధ్యలో వేప చెట్టు కింద కూర్చుని ఉన్నారు. కొందరి మొహాలకి రంగులు పూసి ఉన్నాయి.
చెట్టా పట్టాలేసుకొని వస్తున్న రమణ, సాదిక్‍లు వారికి కనిపించారు. ఇద్దరూ కొత్త చొక్కాలు వేసుకొన్నారు. ఇద్దరి చొక్కాలు అచ్చు ఒకేలాగా ఉన్నాయి. వాటిని చూసిన వాళ్లెవరయినా సరే, ఒక చొక్కాలోంచి ఇంకో చొక్కా వచ్చిందని అనుకొంటారు. వాళ్ళ ఇళ్ళు కూడా ఎదురు బదురుగా ఉన్నాయి. రమణ తండ్రి, సాదిక్‍ తండ్రి ఇద్దరూ సన్నకారు రైతులే. వాళ్ళకు వచ్చే ఫలసాయం బొటాబొటిగా తినడానికి సరిపోతుంది. అనుకోని అవసరం ఏది వచ్చినా సరే అప్పు చెయ్యక తప్పదు వాళ్లకి. రమణకి తల్లీ, తండ్రి ఉన్నారు. సాదిక్‍కి తల్లి లేదు. తండ్రి మటుకు ఉన్నాడు.


కొత్త చొక్కాలు వేసుకొని పోతున్న వాళ్ళిద్దర్నీ చూశాక ఆ చెట్టు కింద కూర్చున్న పిల్లల్లో ఒక కొంటె కోణంగి ఇలా అన్నాడు. ‘‘అచ్చుగుద్దినట్టు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఏదీ, కుస్తీ పట్టండి. బలంలో కూడా ఇద్దరూ ఒకేలాగ ఉంటారేమో చూద్దాం’’. అన్నాడు. మిగతా పిల్లలందరూ ఆ కొంటె కోణంగికి వంత పాడారు.
‘‘ఏం కాదు. కుస్తీపట్టండి. ఊరికే సరదాకే, నిజంగా కాదు’’ అంటూ అరిచాడు. సాదిక్‍ రమణవైపు చూశాడు. ‘‘నేను ఒప్పుకోను మా అమ్మ చంపేస్తుంది’’ అన్నాడు రమణ.
రమణ, తల్లికి ఉట్టినే భయపడటం లేదు. దానికి కారణం ఉంది. సాదిక్‍ కొత్త చొక్కా కుట్టించుకొన్నాడని తెలియగానే రమణ తల్లి దగ్గరకు పరిగెత్తి, తనకూ అలాంటి చొక్కా కావాలని మారాం చేశాడు. ఎన్ని విధాల బుజ్జగించినా వినక ఆవిడ ప్రాణం విసిగించేశాడు. వాడిపోరు పడలేక ఆవిడ సాదిక్‍ తండ్రి కొన్న గుడ్డలాంటిదే కొని, ఆ చొక్కా కుట్టిన దర్జీ దగ్గరే రమణకు చొక్కా కుట్టించింది. అది వేసుకొని రమణ బయటకు వెడుతుంటే -‘‘ఆ చొక్కా కోసం ఎంత మంకు పట్టుపట్టి, నన్నూ మీనాన్నను ఎలా విసిగించావో జ్ఞాపకం ఉంచుకో. చొక్కా చింపుకున్నా, మాపుకున్నా నరిగిపోగులు పెడతాను జాగ్రత్త!’’ అంది.


అందుకే కుస్తీ పట్టడం ఇష్టంలేదు రమణకి. అదీగాక సాదిక్‍తో కుస్తీ పట్టడం అసలే ఇష్టం లేదు. ‘రా, దమ్ముంటే నాతో కుస్తీకిరా’ అంటూ పోకిరీ కుర్రాడయిన సాయి, రమణ చెయ్యి పట్టుకు లాగాడు. రమణ అతన్ని వదిలించుకోవాలని పెనుగులాడాడు. సాయి రమణను నేలమీదకు ఒక్క తోపుతోశాడు. రమణ దభీమని కింద పడ్డాడు. చుట్టూ ఉన్న పిల్లలందరూ గొల్లుమని నవ్వారు. సాదిక్‍కి కోపం ముంచుకొచ్చింది. వెంటనే సాయితో కలబడ్డాడు. ఇద్దరూ కొట్టుకున్నారు. సాదిక్‍ ముందు సాయి నిలబడలేక పోయాడు. సాదిక్‍ దెబ్బలకు తట్టుకోలేక పెద్ద పెట్టున ఏడుపు లంకించుకున్నాడు.
సాయి తల్లి వచ్చి తమందరి పని పడుతుందని ఆ పిల్లలకు తెలుసు. అందుకే అందరూ తలో దిక్కు పారిపోయారు. రమణ, సాదిక్‍లు కూడా పారిపోయారు. అలా కొంచెం సేపు పరిగెత్తాక ఒక చిన్న సందులోకి వచ్చారు. అక్కడ చూశాడు రమణ సాదిక్‍ చిరిగిన చొక్కాని. చొక్కా జేబు చిరిగిపోయి వేలాడుతోంది. ఆ చిరిగిన చొక్కాని చూడగానే వాళ్ళిద్దరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇంతలోనే సాదిక్‍ తండ్రి గొంతు వినిపించింది. ‘‘సాదిక్‍! చీకటిపడ్డా ఎక్కడ ఆడుతున్నావురా?’’ అంటూ ఆయన అరుస్తున్న అరుపులు వినిపించాయి.


ఆ అరుపులు వినగానే, వాళ్ళ ప్రాణం కొడిగట్టింది. ఆపుకుందామన్నా ఆగకుండా ఏడుపు ముంచుకొచ్చింది. జరగబోయే దేమిటో ఇద్దరికీ తెలుసు. సాదిక్‍ తండ్రి గనుక ఆ చిరిగిన చొక్కా చూస్తే సాదిక్‍ను గొడ్డును బాదినట్టు బాదుతాడు. మార్వాడీ దగ్గర డబ్బు వడ్డీకి అప్పు తెచ్చి సాదిక్‍కి ఆ చొక్కా కుట్టించాడు ఆయన.
‘‘ఎవర్రా అక్కడ ఏడుస్తూంది.’’ సాదిక్‍ తండ్రి మళ్లీ అరిచాడు.
రమణ బుర్రలో తళుక్కుమని ఒక ఉపాయం మెరిసింది. సాదిక్‍ను చెయ్యిపట్టుకొని చీకట్లోకి లాక్కెళ్ళాడు. తరవాత తన చొక్కా గుండీలు ఊడదీసుకోవడం మొదలు పెట్టాడు.


‘‘ఊ! కానియ్‍, గబ గబా నీ చొక్కా విప్పెయ్‍. నా చొక్కా వేసుకో’’ అన్నాడు రమణ.
‘‘మరి నువ్వో? నువ్వేం తొడుక్కుంటావు’’ అన్నాడు సాదిక్‍.
‘‘నేను నీ చొక్కా వేసుకుంటాను. ఊ! తొందరగా కానియ్‍.. ఎవరయినా వస్తే చిక్కుల్లో పడతావు’’ అన్నాడు రమణ.
సాదిక్‍ తన చొక్కా ఊడదీసుకోవడం మొదలుపెట్టాడు.
‘‘మనం చొక్కాలు మార్చుకుందామనేగా నువ్వన్నది. మరి మీ నాన్న సంగతి ఏమిటి? నీవంటి మీద చిరిగిన చొక్కా చూస్తే ఆయన నీతోలు వలిచేస్తాడు’’ అన్నాడు సాదిక్‍.
‘‘మరేం ఫరవాలేదు. నాకు అమ్మ ఉంది. మా నాన్న నన్ను కొడుతుంటే మా అమ్మ ఊరుకోదు. అడ్డు పడుతుంది’’ అన్నాడు రమణ.
సాదిక్‍ కాసేపు తటపటాయించాడు. ఇంతలో ఎవరో దగ్గినట్టుంది. వెంటనే ఇద్దరూ చొక్కాలు మార్చుకుని, ఎవరి ఇంటి వైపు వారు పరుగులు తీశారు.
పీచు పీచు మంటున్న గుండెతో రమణ ఇంట్లోకి అడుగు పెట్టాడు. తల్లి రమణ చొక్కాను చూడనే చూసింది.
ఆమెకు కోపం ముంచుకొచ్చింది. వెంటనే తమాయించుకుంది. రంగుల పండగ రోజులు. పిల్లలు ఒకళ్ల నొకళ్ళు తరుముకుంటారు. కిందా మీదా పడతారు. చొక్కా చిరిగి ఉంటుంది. అని సరిపెట్టుకుంది – రమణని ఏమీ అనకుండా సూదీ దారం తెచ్చి చిరుగు కుట్టేసింది.
మరునాడు సాదిక్‍ తండ్రి గుమ్మంలో నించుని రమణ తల్లితో అన్నాడు –
‘‘వదినా! రమణని నాకిచ్చెయ్‍. వాడిని నేను పెంచుకుంటాను’’
‘‘ఒక్క కొడుకుని పెంచడానికే పడుతున్నావు. ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచగలుగుతావ్‍?’’ అంది ఆవిడ.
‘‘రమణలాంటి కుర్రాళ్ళు పదిమందయినా సరే – హాయిగా పెంచుకోగలను’’ అన్నాడు సాదిక్‍ తండ్రి. తరవాత గొంతు సవరించుకున్నాడు. అతని గొంతు కొద్దిగా వణికింది.


‘‘నిన్న రాత్రి మీవాడు, మా వాడు సందులో చీకట్లో నించుని ఉంటే, చీకట్లో ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్ళాను. వాళ్ళ మాటలన్నీ విన్నాను. రమణ ఏమన్నాడో తెలుసా? నాకు అమ్మ ఉంది. నాన్న కొడితే అమ్మ అడ్డుపడుతుంది అన్నాడు’’ జరిగింది చెపుతూంటే సాదిక్‍ తండ్రి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘‘రమణ నా కళ్ళు తెరిపించాడు. సాదిక్‍ని తల్లిలేని లోటు లేకుండా పెంచాలని నాకు బుద్ధి చెప్పాడు’’ అన్నాడు.
‘‘మీరు మార్చుకుంది చొక్కాలు కాదర్రా. మీ పెద్దవాళ్ళ మనసుల్ని’’ అంది రమణ తల్లి.

బాల చెలిమి. మార్చి 1991

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *