అభివృద్ధి, పరిరక్షణలనేవి పర్యావరణ చింతనలో తరచుగా ప్రస్తావితమవుతూ ఉంటాయి. అభివృద్ధి వాదులు పరిరక్షణ గురించి ఆలోచించరని పర్యావరణ వాదులు పేర్కొంటూ ఉంటారు. పరిరక్షణ వాదులు అభివృద్ధిని అడ్డుకుంటూ ఉంటారని అభివృద్ధి వాదులు అభియోగం మోపుతూ ఉంటారు. పర్యావరణ చింతనలో ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధమైనవిగా, పరస్పరం వ్యతిరేకించుకునేవిగా కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ రెండూ పార్శ్వాలు లేదా పక్షాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ ఒక సయోధ్యను సాధించవచ్చు. సామరస్య పూర్వకంగా వ్యవహరించవచ్చు. కారణాలు ఏవైనా గానీ అభివృద్ధికి, పరిరక్షణకు మధ్య ఒక వైషమ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉన్నట్లుగా గమనించగలం. ఆ వైషమ్యం మరింతగా ఈ రెంటి మధ్య దూరాలను, అంతరాలను పెంచుతూ పోవటం కంటే ఎక్కడో ఒక దగ్గర వీటిని మరింత సాన్నిహిత్యంలోకి తెచ్చే ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నాన్ని ఇటీవలి కాలంలో సయోధ్యపర్యావరణంగా భావించటం జరుగుతూ ఉన్నది. అభివృద్ధికి మూల్యంగా పరిరక్షణను వదులుకోవలసిన అవసరం లేదని, పరిరక్షణ కారణం సాకుగా అభివృద్ధిని ఆపుకోవలసిన, నిరోధించాల్సిన పనిలేదని కూడా ‘సామరస్య పర్యావరణం’ అనే భావన మనలను ఆలోచింపజేస్తున్నది.
మానవాళి సహజ ప్రపంచం లేదా ప్రకృతి మీద అపరిమితమైన ఒత్తిడిని వనరుల విషయంగా విధిస్తూ వస్తున్నది. మానవ ఆర్థిక సంక్షేమాన్ని త్యాగం చేయకుండానే భూమి మీద మనుగడ సాగిస్తున్న అనేక జీవజాతులను కాపాడుకోగలమనే విషయంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. లేదా ప్రజలు చర్చించుకునే విధంగా ప్రేరేపణ ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అసలు మానవ కార్యకలాపాల మధ్య భూమండలం మీది జీవజాతులు ఎలా మనగలుగుతాయనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. మానవాళి తన అభివృద్ధిని, తన సంక్షేమాన్ని మాత్రమే చూసుకోకుండా ఇతర జీవ జాతుల అభివృద్ధి, సంక్షేమంతోటే తను అభివృద్ధిమవుట
ఉంటుందనేది గుర్తించగల చైతన్యం, అవగాహన పెంపొందాలి. ఎకాలజీకి ఎకనమిక్స్కి జరుగుతున్న యుద్ధం, ఘర్షణ నివారింపబడాలంటే పరిసరాలతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవాలి. మానవ సంస్కృతి, నాగరికతలు భూమిమీది మానవేతర జాతులను మట్టుబెట్టకుండా వాటి అంతానికి, అంతరింపుకు కారణం కాకుండా జీవించడం నేర్చుకోవాలి.
అందుకు కావలసింది ఇతర మానవేతర ప్రాణులు, జీవ జాతులలో కలసి జీవించటం, ఈ భూమిని పంచుకోవటం జరగాలి. అంటే మానవ ఆవాసాలను ఉద్దేశపూర్వకంగా ఇతర జీవరాశులలో పంచుకొనేందుకు సంసిద్ధులం కావాలి. పర్యావరణ తాత్త్విక అవగాహనలో ఈ సయోధ్య పర్యావరణం లేదా సామరస్య పర్యావరణం ఇస్తున్న ఆలోచన ఇదే. అంటే మన పర్యావరణ అవగాహన చైతన్యంలో మన పరిసరాలలో ఎవరు పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి యాత్రాలు చేస్తున్నారో వాటిని అధ్యయనం చేయాలి. అవగాహన పెంచుకోవాలి. తద్వారా వచ్చే చైతన్యాన్ని ఉమ్మడిగా పంచుకోవాలి. మానవేతర జీవజాతులలో మనం పంచుకోవలసినది ఎంతయినా ఉన్నది. నిజానికి ఇటువంటి అవగాహనా చైతన్యాలు మన జీవన విధానంలో ఎన్నయినా కనిపిస్తాయి. ఒక వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కుటుంబం పాడికోసం రెండు పశువులను పెంచుకుంటే ఆ పశువు ఇచ్చే పాడి మొత్తాన్ని స్వీకరించడు. దాని సంతతికి ఒక భాగం వదిలి తక్కిన మూడొంతుల పొదుగును పిండుకోవటం అనేది గ్రామ సీమలో మనం చూసిందే.
అయితే పాడి పరిశ్రమగా మారాక పాడి పశువులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చి మరీ పొదుగు పిండేయటం, పొదుగుకు యంత్రాలు అమర్చి సైతం పొదుగు పిండటం కూడా మన అనుభవంలో ఉన్నదే. ఆ పశువులకు తమ సంతతిని దూరం చేసి యాంత్రీకరణతో మనిషి ప్రాణి ధర్మాన్ని విస్మరించిన వైనం కూడా మన అనుభవంలోదే. ఇటువంటివి మన సామాజిక జీవితంలో ఇతర ప్రాణుల నొప్పిని, బాధను అర్థం చేసుకోగలిగిన సంఘటనలు, ఉదంతాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ ఆచరణ వెనుక గల పర్యావరణ విలువల వ్యవస్థను అర్థం చేసుకోవటం ద్వారా సామరస్య పూర్వక పర్యావరణం సృష్టించుకోవలసిన అగత్యాన్ని గుర్తించగలుగుతాం. ఆమోదించ గలుగుతాం కూడా.

మనిషి కర్తవ్యం, ధర్మం భూమండాలాన్ని దోపిడి చేయటం కాదు. వనరులను పిండటం కాదు. సంపాదన ఆపివేయటం, జీవితాన్ని నిలిపివేయటం, లాభం ఆశించకుండా పని చేయటం అనే దాన్ని సామరస్య పర్యావరణం బోధించదు. భూమి మీద జీవరాశులు పెద్ద ఎత్తున అంతరించపోయే పరిస్థితులను సృష్టించకుండా ఈ ప్రమాదాలను నివారించాలని సామరస్య పర్యావరణం చెపుతుంది.
దీనికి ఒకటే దారి. భూమిపైన సహజ ఆవాసాలను కాపాడాలి. ఇప్పటికి మనిషి నీడపడని సహజ ఆవాసాలు కాపాడబడాలి. మనకు ఎన్ని ఆవాసాలను కాపాడటం చేతనైతే అన్నిటినీ యథాతథంగా ఉంచాలి. ఇక రెండవది. ఇప్పటికే మనుషులు ఆక్రమించి వృద్ధి పరచబడిన సహజ ఆవాసాలను మరింత సహజ స్థితికి తీసుకొచ్చే విధంగా రూపుదిద్దటం. దీనినే మనం పునరుద్ధరణ పర్యావరణం అంటున్నాం. ‘జాగ్రత్త గలిగిన పాదం ఎక్కడికైనా అడుగు వేయగలుగుతుంది’ అని ఒక చైనా దార్శనిక రుషి చెప్పినట్లుగా తగిన జాగ్రత్తలు మనం పర్యావరణ పరంగా తీసుకోవలసి ఉంది. ఇప్పటి వరకూ మనం వేటిని కాపాడుకుంటూ వచ్చామో, వేటివల్ల పర్యావరణ వ్యవస్థలు సురక్షితంగా ఉండగలిగాయో వాటిని కొనసాగించేందుకు వెనకాడకూడదు. మనమంతా మనుషులం. మానవాళిగా ఇప్పటి వరకు సాధించుకు వచ్చినదేదీ భావి తరాలకు అందకుండా పోకూడదు. మనం నిర్మించుకున్న ఈ ప్రపంచంలో భాగస్వాములం మనమే కనుక ఇది మనకే చెందుతుంది. మానవాళి తప్పిదాలు మానవేతర జీవ జాతుల మనుగడకు ముప్పును తేకూడదు. ఆపదలు సృష్టించకూడదు.
సయోధ్య లేదా సామరస్య పర్యావరణం అనేది అదొక శాస్త్రీయమైన ఆవిష్కరణ, వ్యవస్థీకరణ, నిర్వహణ ఈ మూడు సరికొత్త ఆవాసాలను నెలకొల్పి అక్కడ ఉండే అన్ని రకాల మానవేతర జీవరాశులను పరిరక్షిస్తాయి. అటువంటి స్థలాలు జీవజాతుల వైవిధ్యాన్ని ప్రేమిస్తూ, ఆ జీవ వైవిధ్యం కారణంగా తమ సాంస్క•తిక వైవిధ్యం ఇంతకాలం నిలిచి ఉందని గుర్తిస్తాయి. ఆ కొత్త ఆవాస స్థలాల్లో మనుషులు జీవిస్తారు. పని చేస్తారు. ఆడతారు పాడతారు. పునరుద్ధరణ లేదా సయోధ్య పర్యావరణం అంటే భూవినియోగం మానవాళి ఎలా చేస్తుందనే దాని మీద ఆధారపడి నిర్వహించబడుతుంది. ఇప్పుడు వాడుతున్న దాని కంటే వివేకవంతంగా, విచక్షణాయుతంగా భూమి వినియోగం జరగాలి. అది మన అవసరాలను ఎలా తీరుస్తుందో అలాగే వన్య ప్రాణుల, స్థానిక జీవరాశుల అవసరాలను కూడా సరి సమానంగానే తీర్చగలుగుతుంది. ఇప్పుడు మానవాళికి కావలసింది ఇతర మానవులతో సయోధ్య, సామరస్యాలు కావు ప్రకృతితో, పర్యావరణంతో, పరిసర ఆవాస వ్యవస్థలలో, ఆయా ఆవరణ వ్యవస్థలలోని అనేక జీవ జాతులతో సయోధ్య, సామరస్యం కావాలి.
డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519