- అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన
- స్వాగతించిన విపక్షాలు, ప్రతిపాదనకు మద్దతు
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ.500
- ఐఏఎస్‌లు రూ.100, ఉద్యోగ, టీచర్లు రూ.25చొప్పున
- ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి కూడా
- మెడికల్, మద్యం షాపులు, రిజిస్ట్రేషన్ నుంచి
- హరిత నిధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది
- బాధ్యత చీఫ్ సెక్రటరీకి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్
‘‘మన దేశంలోనే అత్యంత నిరాదరణకు గురైన రంగం అటవీ రంగం. దీని కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వర్షాలు తగ్గిపోయాయి. కరువులు వచ్చాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తుంటారు. భవిష్యత్ తరాలకు ప్రమాదం, నష్టం జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పర్యావరణ సమతులత్యత పెంచడం, గ్రీనరీని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. న్యూజిలాండ్‌లో ఓ పార్టీ పేరే గ్రీన్ అని ఉంది. ఆ పార్టీ సృష్టించిన అవగాహన వల్ల అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతినలేదు. గ్రీనరీ పెంచడమే లక్ష్యంగా గ్రీన్ అని పార్టీకి పేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. సామాజిక అడవులతో అనేక ప్రయోజనాలుంటాయి. జీడీపీలు, జీఎస్డీపీలు పెంచినా, వ్యక్తులు తమ ఆస్తులు పెంచినా.. జీవించే పరిస్థితులు లేకపోతే ఏం చేయగలం. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలి. పచ్చదనం తగ్గిపోవడం, పరిస్థితులు మారిపోవడం, వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడం వలన జరుగుతున్న నష్టాన్ని గమనించి తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీని పునరుద్ధించాలనే ఉద్దేశంతో.. ఈ సబ్జెక్టుపై సమీక్ష చేశాను. వీటిని పునరుద్ధరించడం కోసం అనేక ప్రయత్నాలు ఉంటాయి. అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవాలంటే మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవచ్చు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా హరితహారం అమలుకు ‘తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్)’ని ఏర్పాటు చేస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారు. ఇందుకు సహకరించేందుకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు, టీజీవో, టీఎన్జీవో నేతలు అంగీకరించారని వెల్లడించారు. ‘‘డబ్బుల విలువ కాదు. ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలనే హరిత నిధిని ఏర్పాటు చేశాం. ఇది రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొస్తుంది. దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ హరితనిధి గురించి వివరించారు. ‘‘టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జీతంలోంచి ప్రతి నెల హరిత నిధికి రూ.500 జమ చేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగులు ప్రతి నెల రూ.100 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. టీజీవో, టీఎన్జీవో, పీఆర్టీయూ టీఎస్, టీటీయూ, పీఆర్టీయూ, టీఆర్టీఎఫ్, టీఎస్‌యూ టీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాలతో సీఎస్ స్వయంగా మాట్లాడారు. వారు నెలకు రూ.25 ఇస్తామని అంగీకరించారు. హరిత నిధిలో విద్యార్థులను భాగస్వాములను చేయాలనే ఆలోచన ఉంది.
ప్రవేశాల సమయంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రూ.5, హైస్కూల్ విద్యార్థులు రూ.15, ఇంటర్ విద్యార్థులు రూ.25, డిగ్రీ విద్యార్థులు రూ.50, వ•త్తి విద్యా కోర్సుల విద్యార్థులు రూ.100 జమ చేయాలి. రాష్ట్రంలోని మెడికల్, ఎరువులు, బార్లు, మద్యం దుకాణదారులనూ భాగస్వాములను చేస్తున్నాం. రెన్యువల్ సమయంలో వారు రూ.1000 జమ చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ 8 వేలకుపైగా భూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రతి రిజిస్ట్రేషన్‌కు హరిత నిధి కింద రూ.50 వసూలు చేయాలని ఆలోచిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. హరిత నిధికి నిరంతరం నిధుల కూర్పు జరిగితే అద్భుత ఫలితాలు వస్తాయని అన్నారు. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క, రాజాసింగ్‌తో ఫోన్లో మాట్లాడానని, వారంతా ముందుకు వస్తారని ఆశిస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం హరిత నిధికి మద్దతు తెలుపుతున్నట్లు వారంతా ప్రకటించారు.
మొక్కల పెంపకంలో మూడో స్థానం
మొక్కల పెంపకంలో ప్రపంచంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి తెలిపిందని, తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని గుర్తించి ప్రశంసించిందని చెప్పారు. గోబీ ఎడారి విస్తరణను అడ్డుకోవడానికి 1978 నుంచి 2006 వరకు ప్రయత్నాలు జరిగాయని, 5,000 కిలోమీటర్ల పొడవునా కోట్లాది మొక్కలు నాటారని, అమెజాన్ అడవులను బ్రెజిల్ పరిరక్షించు కుంటోందని, ఆ తర్వాత చేపట్టిన మూడో ప్రయత్నం తెలంగాణ హరితహారమని ఐరాస తెలిపిందని గుర్తు చేశారు. ‘‘జీడీపీలు, ఆస్తులు పెంచినా జీవించే పరిస్థితులు లేకపోతే వేస్ట్ అనే విషయాన్ని గుర్తించకపోవడం వల్ల అడవుల విధ్వంసం జరిగింది. తెలంగాణలో అడవుల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం.. ఒక దేశంలో తలసరి ఎన్ని చెట్లు ఉన్నాయని చూస్తున్నారని, కెనడాలో అత్యధికంగా ఒక్కో మనిషికి 10,163 చెట్లు ఉన్నాయని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో 4,964, ఆస్ట్రేలియాలో 3,266, అమెరికాలో 699, ఫ్రాన్స్‌లో 203, ఇథియోపియాలో 143, చైనాలో 130, యూకేలో 47 ఉంటే.. భారత్‌లో కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
‘కంపా’ నిధులు కేంద్రానివి కావు
అడవుల పునరుద్ధరణకు ఉద్దేశించిన కంపా నిధులు కేంద్రానివి కావని, అవి నూటికి నూరు శాతం రాష్ట్ర డబ్బులేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం అటవీ భూమిని సేకరిస్తే, అందుకు ముందుగా కేంద్రానికి డబ్బు చెల్లించాలని, అప్పుడే భూమిని అప్పగిస్తారని, ఇలా తెలంగాణ రూ.4,675 కోట్లను కట్టిందని తెలిపారు. సుప్రీం స్టే కారణంగా దేశవ్యాప్తంగా రూ.35 వేల కోట్లు నిలిపేశారని, ప్రధాని మోదీని కలిసి 100 వినతులు ఇచ్చానని, ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత రూ.3,109 కోట్లు విడుదల చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 200 కోట్ల మొక్కలు నాటామని, ఇందుకు రూ.6,555 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ‘‘రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,112 కోట్లు, కంపా నుంచి రూ.1,320 కోట్లు, నరేగా కింద రూ.3,673 కోట్లు, హెచ్ఎండీఏ ద్వారా రూ.367 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా రూ.83 కోట్లను ఖర్చు చేశాం. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగడం లేదు’’ అని వివరించారు. రాష్ట్రంలో మొక్కల మనుగడ రేటు 85% కొన్ని గ్రామ పంచాయతీల్లో 90% ఉందని చెప్పారు. పచ్చదనం పెంపు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో మొక్కల మనుగడ రేటును పరిశీలించాలని, ఎక్కడైనా తప్పు జరిగినట్లు తేలితే.. ఏపార్టీ వారినైనా వదిలిపెట్టమని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అతి త్వరలో సమగ్ర భూ సర్వే చేస్తాం
‘‘రెవెన్యూ, అటవీ సరిహద్దు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. వివాదాల్లో ఉన్న భూములకు కంప్లీట్ టైటిల్‌ను ప్రభుత్వం ఇవ్వదు. ఒకవేళ కోర్టులో పార్టీ ఓడిపోతే నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి. కంప్లీట్ టైటిల్ ఇవ్వాలంటే తొలుత భూ రికార్డులన్నీ డిజిటలైజేషన్‌తోపాటు సమగ్ర భూసర్వే కూడా చేయాలి. ఇందుకు బడ్జెట్ కేటాయించినా, కరోనా వల్ల ఆగిపోయింది. అతి త్వరలోనే సమగ్ర భూసర్వే చేపడతాం. రాష్ట్రంలోని మొత్తం భూమిని సర్వే చేస్తాం. అప్పుడు ఎవరూ ట్యాంపర్ చేయలేరు. హద్దులు జరపలేరు. పౌరులకు సంపూర్ణ రక్షణ వస్తుంది’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు
గిరిజనుల నుంచి ప్రభుత్వం భూములను లాక్కుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని, అది తమ ప్రభుత్వ విధానం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో 96,676 మంది గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ కింద 3.8 లక్షల ఎకరాల భూమిని పట్టాలు ఇచ్చారు. దీనికి అదనంగా ఆరేడు లక్షల ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి మంత్రి సత్యవతి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేశాం. నివేదిక వచ్చిన తర్వాత అర్హులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిస్తాం. వారికి కూడా రైతుబంధును వర్తింపజేస్తాం. ఒక్కసారి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చిన తర్వాత ఆక్రమణలకు తావుండదు’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం గడువును పెంచాలని కేంద్రాన్ని కోరాలని, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిద్దామని తెలిపారు. అవసరమైతే అఖిలపక్ష నేతలంతా ప్రధానిని కలిసి వివరిద్దామన్నారు.
గిరిజనులపై దాడులు చేయొద్దు
భూసేకరణలో భాగంగా అక్కడక్కడ కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. గిరిజనులు, ఆదివాసీలపై దాడులు మంచిది కాదన్నారు. వారిపై దాడులు చేయొద్దని అటవీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. అలాగే, మహారాష్ట్ర నుంచి లంబాడాలు, ఛత్తీసగఢ్ నుంచి గొత్తికోయలు తెలంగాణకు వలస వస్తున్నారని, స్థానిక ధ్రువపత్రాలు సంపాదిస్తున్నారని సీఎం తెలిపారు. దాంతో, తెలంగాణ ఎస్టీల హక్కులు పోతున్నాయని, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతోందన్నారు. ఈ రెండు సమస్యలపై సీఎస్‌తో మాట్లాడానని, వీటిపై ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పానని వివరించారు.
239 కోట్ల మొక్కలు నాటినం
అడవుల్లో 20 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాం. భూమిలో నిక్షిప్తమై ఉన్న చెట్ల వేర్ల ద్వారా 80 కోట్ల మొక్కలను పునరుజ్జీవింపచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. మొత్తంగా వందకోట్ల మొక్కలు అటవీ ప్రాంతాల్లో కొత్తగా పెరిగేలా చర్యలు తీసుకొంటున్నాం. ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటినం. మరో 42.42 కోట్ల మొక్కలను వేర్ల ద్వారా పునరుజ్జీవింపజేసినం. పీసీసీఎఫ్‌గా శోభ అంకితభావం, అటవీశాఖ అధికారుల కృషితో గజ్వేల్‌లోని 35 వేల ఎకరాల అటవీభూమిలో మొక్కలు నాటాం. ఆ అడవిలో ఇప్పుడు బయోడైవర్సిటీ పెరిగింది. నెమళ్లు, అడవిపందులు ఇతర జంతుజాలం అందులోకి వచ్చింది. నిర్మల్లోనూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో అడవుల పునరుద్ధరణ బాగా జరుగుతున్నది. అడవుల బయట జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి ప్రాంతాల్లో పదికోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే 14.5 కోట్ల మొక్కలు నాటినం. సోషల్ ఫారెస్ట్, రెవెన్యూ ప్లాంటేషన్ వంటివాటి కింద 120 కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకొంటే 162.77 కోట్ల మొక్కలు నాటినం. లక్ష్యాలకు మించి హరితహారం విజయాలు సాధిస్తున్నది. 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో హరితహారం ప్రారంభించి 239 కోట్ల వరకు మొక్కలు నాటాం.
75,740 ఎకరాల్లో అర్బన్ పార్కులు
ప్రమోషన్ ఆఫ్ గ్రీనరీలో భాగంగా మండలానికి ఒకటి చొప్పున బృహత్ ప్రకృతి వనాల కోసం 526 మండలాల్లో స్థలాల్ని గుర్తించాం. 7,178 ఎకరాల్లో ప్లాంటేషన్ పనులు జరుగుతున్నాయి. అర్బన్ ఫారెస్ట్ పెంపులో భాగంగా 109 ఏరియాల్లో 75,740 ఎకరాల్లో అర్బన్ పార్కు లు ఏర్పాటుచేస్తున్నాం. ఇండియాలోనే హైదరాబాద్ నగరం బెస్ట్ లివబుల్, లవబుల్ సిటీ. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల వల్ల రియల్ ఎస్టేట్ విపరీతంగా పుంజుకొన్నది. ఏటా అనేక లక్షల చదరపు అడుగులమేర భవనాలు వస్తున్నాయి. ఆఫీస్ స్పేస్ వస్తున్నది. నగరాన్ని ప్రపంచమంతా కొనియాడుతున్నది. పెద్దపెద్ద ఐటీ కంపెనీలు కూడా వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో చెట్లు నరికితే రూ.4 లక్షల జరిమానా విధించాము. లేఔట్లలో గతంలో ఖాళీ జాగాలు అమ్ముకునేవారు. ఇప్పుడు వాటిల్లో వెంటనే మొక్కలు నాటేలా చర్యలు తీసుకొంటున్నాం. హైదరాబాద్ చుట్టూ 188 రిజర్వు ఫారెస్ట్ బ్లాక్‌లను అభివ•ద్ధి చేస్తున్నాం. నగరం చుట్టూ 1,60,661 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్, గోడలు ఏర్పాటు పనులు జరిగాయి. హెచ్ఎండీఏ ద్వారా వందలకోట్లు ఖర్చుచేసి అభివ•ద్ధి చేస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ కూడా అద్భుతమైన ప్లాంటేషన్ వచ్చింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నేషనల్ హైవే కలిపి దాదాపు 1,00,156 కి.మీ. రోడ్లున్నాయి. ఇందులో 82,491 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ పూర్తయింది. పంచాయతీరాజ్‌లో 59 వేల కిలోమీటర్లు, ఆర్‌అండ్‌బీలో 865 కిలోమీటర్ల మేర మొక్కలు నాటగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ హైవేల వెంట మొక్కలు నాటుతున్నారు.
గ్రామాల్లోనూ పార్కులొచ్చాయ్
చెట్లు కొట్టడమే తప్ప పెట్టడం మర్చిపోయిన జనాలకు వనాల ప్రాధాన్యం తెలియజేయాలనే ఉద్దేశంతో 19,472 ఆవాసాల్లో నేడు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశాం. అన్ని నియోజకవర్గాల్లో అటవీ భూములున్నాయి. ప్రతి ఎమ్మెల్యే మీ పరిధిలో అటవీ ప్రాంతం ఎంత ఉన్నది? ఎంత మేరకు చెట్లు నాటారు? అనే అంశాలపై దృష్టి పెట్టండి. మనం ఇక్కడ ఎంత చేసినా క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లే కష్టపడాల్సి ఉంటుంది. హరితహారం విషయంలో సర్పంచులను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నా. చెప్పినదాని కన్నా ఒక అడుగు ముందుకేసే పని చేశారు. పల్లె ప్రకృతి వనాలను చక్కగా తీర్చిదిద్దారు. నడవడానికి అవసరమైన బాటలు, కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు, పిల్లలు ఆడుకొనేందుకు ఆట వస్తువులు ఏర్పాటుచేశారు.
అటవీ నేరాల అదుపునకు ‘సీక్రెట్ సర్వీస్ నిధి’: ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్రంలో మరింత సమర్థంగా అటవీ సంబంధిత నేరాలను అదుపు చేసేందుకు రహస్య సమాచార నిధి (సీక్రెట్ సర్వీస్ నిధి) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అటవీ శాఖ కార్యకలాపాలపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అన్ని అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లాల అటవీ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పచ్చదనం పెంపు, గ్రీన్ ఫండ్, అటవీ పునరుర్ధరణ, రక్షణ, ఆక్రమణల నివారణ, వన్య ప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల వంద శాతం అభివృద్ధిపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అధికారులంతా ఐదు గ్రూపులుగా ఏర్పడి సమస్యలు, పరిష్కార మార్గాలపై దాదాపు 10 గంటలపాటు చర్చించారు.
‘‘సీక్రెట్ సర్వీస్ నిధి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.4.06 కోట్లు కేటాయించారు. అడవుల రక్షణ కోసం ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ అరికట్టడంపై సమాచారం ఇచ్చే వ్యక్తులను ప్రోత్సహించేందుకు అటవీ శాఖ ఈ నిధిని వాడనుంది. ఈ నిధి నుంచి రహస్య సమాచారం విలువ ఆధారంగా ప్రోత్సాహకాలు అందించేలా నిబంధనలు రూపొందించాం. పచ్చదనం పెంపు, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత ద•ష్ట్యా అటవీ అధికారులు, సిబ్బంది బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు పని చేస్తూ అడవులను రక్షించే బాధ్యత చిత్తశుద్ధితో నిర్వహించాలి. ములుగు జిల్లాలో పులిని వేటాడిన ఘటన బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ•తం కాకూడదు. అటవీ శాఖ బలోపేతానికి సీఎం సుముఖంగా ఉన్నారు. అవసరమైతే సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటవీ శాఖకు సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తోంది. సంబంధిత శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని ఫలితాలు సాధించాలి. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశానికే ఆదర్శవంతంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో పనులు జరగాలి ’’అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
పచ్చదనం పెంచడమే లక్ష్యంగా..
రాష్ట్రాన్ని పచ్చగా.. హరితవనంగా తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ రూపొందించిన హరితహారం పథకం సూపర్ సక్సెస్ అయింది. హరితహారం కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశంలో ఇప్పటి వరకు లేని కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. శాసనమండలిలో హరితహారం కార్యక్రమం గురించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు తెలంగాణ హరిత నిధి (Telangana Green Fund) ఏర్పాటు చేసినట్టు సీఎం ప్రకటించారని మంత్రి తెలిపారు.
మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా ప్రజలకు మొక్కల పెంపకం, పచ్చదనం గురించి అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. ప్రజలకు పచ్చదనం గురించి మరింతగా తెలియజేసేందుకు ఈ హరిత నిధిని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు విడతల్లో హరితహారం కార్యక్రమం పూర్తయింది. మొత్తం 239.87 కోట్ల మొక్కలు నాటి.. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని, హరితహారం కార్యక్రమంలో భాగంగా 2014-15 నుంచి 2020-2021 వరకు దాదాపు 6,555.97 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు.
హరిత నిధికి ప్రతిపక్షాల మద్దతు
సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన హరిత నిధికి ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. అదే సమయంలో, పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సూచించాయి. హరితహారంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క, బీజేపీ సభ్యుడు రఘునందనరావు, మజ్లిస్ సభ్యుడు ఖాద్రీ తదితరులు హరిత నిధిని స్వాగతించారు. నాటిన మొక్కలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. అలాగే, హరితహారం పేరిట అటవీ ప్రాంతాల్లో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి వారు సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలను నాటి గిరిజనులను అక్కడి నుంచి తరిమేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోడు సమస్యను పరిష్కరించి పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఆనాడు అశోకుడి తర్వాత మళ్లీ ఇప్పుడు కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అధికార పార్టీ సభ్యులు గువ్వల బాలరాజు, మల్లయ్య యాదవ్ వ్యాఖ్యానించారు.
సాయపడతాం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ప్రభుత్వం ప్రతిపాదించిన హరితనిధి కోసం కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి కంట్రిబ్యూషన్ ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో అమాయక ప్రజల భూములు పోకూడదని.. సుమారు ఆరేడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాల విషయంగా వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని.. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. దళితులకు ఇచ్చిన భూములను హరితహారం కోసం తీసుకోవద్దని డిమాండ్ చేశారు.
బీజేపీ నేత రాజాసింగ్ : హరితనిధి ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు.
స్వాగతిస్తున్నాం: చాడ
పోడుసాగుదారులందరికీ భూములపై హక్కు కల్పించే విషయంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. దీంతో భట్టి, రాజాసింగ్, ఇతర నేతలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
- కట్టా ప్రభాకర్
ఎ : 8106721111