తెలంగాణ ఇక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‍, మీడియేషన్‍ కేంద్రం

  • నాలుగు నెలల్లోనే అత్యాధునిక, అంతర్జాతీయ సౌకర్యాలు
  • సింగపూర్‍ సెంటర్‍ కంటే గొప్పగా ఐఏఎంసీ
  • ఇక కేసులు విదేశీ సెంటర్లకు వెళ్లడం తగ్గుతుంది
  • ఇక్కడికి జాతీయ, అంతర్జాతీయ వినియోగదారులు వస్తారు
  • ప్రారంభానికి ముందే లలిత్‍ మోదీ కేసు సిఫారసు చేశాం
  • కుటుంబ వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీకి వెళ్లాలని చెప్పాం
  • గ్లోబల్‍ సిటీగా అర్హతలూ ఉండడం వల్లే హైదరాబాద్‍కు ఐఏఎంసీ
  • ఐఏఎంసీ హైదరాబాద్‍ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీజేఐ రమణ
  • రాష్ట్రంలో జరిగే కాంట్రాక్టులూ ఇక్కడికే.. ఆర్డినెన్స్ జారీ చేస్తాం
  • జస్టిస్‍ రమణ దీవెన ఫలితమే రాజధానికి ఐఏఎంసీ: కేసీఆర్‍


హైదరాబాద్‍కు అనుకూలంగా నేను ఏ నిర్ణయాలు తీసుకోలేదు. దానికున్న అర్హతల కారణంగానే అన్ని కేంద్రాలు ఇక్కడికి వస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతానికి హైదరాబాద్‍ వారధిలా ఉంది. వివిధ భాషలు, సంస్కృతులు, మతాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. అన్నింటికన్నా మిన్నగా ఇక్కడి ప్రజలు సాదరంగా ఆహ్వానించే సాటి లేని గొప్ప మనస్తత్వం కలిగిన వారు.
– సీజేఐ జస్టిస్‍ ఎన్వీ రమణ

ప్రచారం చేసుకోవట్లేదు అంటున్నారు
‘‘అంతర్జాతీయ ప్రమాణాలకు మించి హైదరాబాద్‍ పురోగమిస్తోంది. ఈ మధ్య విదేశాల్లోని చాలా మంది స్నేహితులు చెప్పారు. మీరు హైదరాబాద్‍లో చాలా చేస్తున్నారు. కానీ, ప్రచారం చేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. సింగపూర్‍ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా హైదరాబాద్‍ను సందర్శించి.. మీరు ప్రమోట్‍ చేయడం లేదంటున్నారు.’’ – ముఖ్యమంత్రి కేసీఆర్‍


‘‘హైదరాబాద్‍ ఐఏఎంసీ ఏర్పాటుతో ఆర్బిట్రేషన్‍, మీడియేషన్‍ విషయంలో మన దేశం అంతర్జాతీయ కేంద్రంగా మారుతుంది. ఢిల్లీ, ముంబైల్లో ఆర్బిట్రేషన్‍ సెంటర్లు ఉన్నా.. జాతీయ, అంతర్జాతీయ పార్టీలు ఇంకా విదేశాల్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‍ కేంద్రాలైన లండన్‍, సింగపూర్‍కే వెళుతున్నాయి. హైదరాబాద్‍ సెంటర్‍లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విదేశాల్లోని ఆర్బిట్రేషన్‍ సెంటర్లకు వెళ్లడం తగ్గుతుంది. జాతీయ, అంతర్జాతీయ వినియోగదారులు హైదరాబాద్‍కు వస్తారు. ఈ సెంటర్‍కు వచ్చే కేసులు పెరుగుతాయి’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‍ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. దేశ, విదేశాలకు చెందినవారు ఆర్బిట్రేషన్‍ కోసం ఇక నుంచి హైదరాబాద్‍ ఐఏఎంసీ వైపు చూస్తారని జస్టిస్‍ ఎన్వీ రమణ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రకాల కుటుంబ, వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీ హైదరాబాద్‍ గొప్ప కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. దేశంలోని గొప్ప నగరాల్లో హైదరాబాద్‍ ఒకటని, ఇటువంటి నగరంలో ఏర్పాటు చేయడం కూడా ఐఏఎంసీకి మరో ఆకర్షణ అని చెప్పారు. హైదరాబాద్‍లోని నానక్‍రాం గూడలోని ఫీనిక్స్ వీకే టవర్స్లోని 21, 22 అంతస్తులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‍ ఆర్బిట్రేషన్‍ అండ్‍ మీడియేషన్‍ సెంటర్‍ (ఐఏఎంసీ)ను ముఖ్యమంత్రి కేసీఆర్‍తో కలిసి ఆయన ప్రారంభించారు.


ఐఏఎంసీ ప్రారంభోత్సవంలో భాగంగా సెంటర్‍ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను సీజేఐ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్‍ అందజేశారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. తన సొంత నగరం కాబట్టి హైదరాబాద్‍ను ఎంపిక చేశానని అనుకుంటారేమోనని, గ్లోబల్‍ సిటీ అయిన హైదరాబాద్‍కు అన్ని అర్హతలూ ఉండడం వల్లే ఐఏఎంసీ ఇక్కడికి వచ్చిందని తెలిపారు. ‘‘హైదరాబాద్‍ నగరాన్ని ఎంపిక చేయడం పట్ల కొంత వివక్ష చూపానని నన్ను నిందిస్తారేమో! కానీ, నిజాయితీగా చెప్పాలంటే దేశంలోని గొప్ప నగరాల్లో హైదరాబాద్‍ ఒకటి. వాణిజ్య, వ్యాపారాలకు గొప్ప డెస్టినేషన్‍గా ఉంది. ఇలాంటి గొప్ప నగరమైన హైదరాబాద్‍ కీర్తిని పెంపొందించే విధంగా నా వంతు కృషి చేయడం నాకు గర్వకారణంగా ఉంది. హైదరాబాద్‍కు అనుకూలంగా నేను ఏ నిర్ణయాలు తీసుకోలేదు. దానికున్న అర్హతల కారణంగానే అన్ని కేంద్రాలు ఇక్కడికి వస్తున్నాయి. అన్నింటికన్నా మిన్నగా ఇక్కడి ప్రజలు సాదరంగా ఆహ్వానించే సాటి లేని గొప్ప మనస్తత్వం కలిగిన వారు’’ అని వివరించారు.


అనతి కాలంలోనే కల సాకారం
ముఖ్యమంత్రి కేసీఆర్‍ చొరవ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనతి కాలంలోనే కల సాకారమైంది. ఆగస్టు నాటికి ఎంవోయూ, ట్రస్ట్ డీడ్‍ రిజిస్ట్రేషన్‍ పూర్తికావడం, కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎంసీ హైదరాబాద్‍ను ప్రారంభించు కోవడం చాలా సంతోషంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ‘‘ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‍ సైతం పాల్గొనడం సంతోషకరం. నేను సుప్రీం కోర్టు చీఫ్‍ జస్టిస్‍గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూన్‍ 12న హైదరాబాద్‍ వచ్చాను. అప్పుడే ఐఏఎంసీ సెంటర్‍ గురించి చెప్పాను. సీఎం కేసీఆర్‍ చాలా వేగంగా స్పందించారు. నాలుగు నెలల్లోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రం అందుబాటులోకి వచ్చింది. సింగపూర్‍ ఆర్బిట్రేషన్‍ సెంటర్‍ కంటే గొప్పగా ఉందని చాలామంది చెబుతున్నారు. తక్కువ సమయంలో ఇంత గొప్ప కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకు రావడం రాష్ట్ర ప్రభుత్వ గొప్పదనం’’ అని కొనియాడారు. 15 రోజుల కిందటే ఐఏఎంసీ పరిచయ సదస్సు నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. ఆర్బిట్రేషన్‍ అండ్‍ మీడియేషన్‍కు భారత్‍లో చాలా చరిత్ర ఉందన్నారు. 1995లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు ఢిల్లీలో అంతర్జాతీయ ఏడీఆర్‍ సెంటర్‍ను ప్రారంభించారని, తక్కువ ఖర్చుతో ప్రభావశీలమైన వివాద పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉంటేనే ఏ ప్రజాస్వామ్యానికైనా మనుగడ ఉంటుందని అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక (ఏడీఆర్‍) అవసరం ఏర్పడిందని, దానికి అనుగుణంగానే ఆర్బిట్రేషన్‍ అండ్‍ కన్సీలియేషన్‍ యాక్ట్ వచ్చిందని వివరించారు. ‘‘ఐఏఎంసీ ఏర్పాటు అందరం కలిసి ఉమ్మడిగా సాధించిన విజయం. ప్రపంచంలో గొప్ప మీడియేషన్‍ సెంటర్లలో ఐఏఎంసీ ఒకటిగా ఉంటుంది. ప్రారంభం నుంచీ దీనికి అండగా ఉన్న సీఎం కేసీఆర్‍కు ధన్యవాదాలు. ఏదైనా సవాల్‍గా తీసుకుంటే సాధించే వరకూ వదలరనే పేరు కేసీఆర్‍కు ఉంది. ఆయన సంకల్పం వల్లే ఈ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించాం’’ అని తెలిపారు.


లలిత్‍ మోదీ కుటుంబ వివాద పరిష్కారానికి..

హైదరాబాద్‍ ఐఏఎంసీ సెంటర్‍ను ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జస్టిస్‍ హిమా కోహ్లి సైతం సభ్యురాలిగా ఉన్న తమ ధర్మాసనం ఎదుటకు లలిత్‍ మోదీ కుటుంబ వివాదం వచ్చిందని, మీడియేషన్‍కు వెళ్లాలని తాము సూచించామని, దానికి వారు అంగీకరిం చారని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. ఐఏఎంసీ హైదరాబాద్‍ సేవలు సైతం ఉపయోగించు కోవాలని వారికి సూచించామన్నారు. ‘‘ప్రారంభానికి ముందే ఒక కేసు వచ్చింది. ఐఏఎంసీకి రావడానికి చాలా కేసులు సిద్ధంగా ఉన్నాయని జస్టిస్‍ ఎల్‍.నాగేశ్వర్‍ రావు చెప్పారు. తెలంగాణ, ఏపీ చీఫ్‍ జస్టిస్‍లు ఇక్కడే ఉన్నారు. ఏమైనా మధ్యవర్తిత్వం కేసులు ఉంటే ఇక్కడికే సిఫారసు చేయాలని కోరుకుంటున్నాం. తక్కువ ఖర్చు, ప్రభావశీలమైన పరిష్కారం ఉండే ఈ సెంటర్‍ ఆసియాతోపాటు ప్రపంచంలోనే గొప్ప ఆర్బిట్రేషన్‍ సెంటర్‍గా ఎదుగుతుంది’’ అని ఆకాంక్షించారు.


రాష్ట్రంలో జరిగే కాంట్రాక్టులు ఇక్కడికే వచ్చేలా చట్టాలు మారుస్తాం: కేసీఆర్‍

రాష్ట్రంలో జరిగే కాంట్రాక్టులు ఐఏఎంసీకే వచ్చేలా చట్టాలను సవరిస్తామని, అందుకనుగుణంగా ఆర్డినెన్స్ను జారీ చేస్తామని సీఎం కేసీఆర్‍ తెలిపారు. ‘‘ఐఏఎంసీ పరిచయ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ గారు తెలుగులో మాట్లాడారు. ఆయనను చూసి నేను తెలుగులో మాట్లాడుతున్నాను. మనందరం గర్వించే స్థాయిలో భారత న్యాయ వ్యవస్థ శిఖరంగా ఉన్న సీజేఐ ఎన్వీ రమణ ఐఏఎంసీ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు. మీరందరూ చప్పట్లతో ఆయన కృషిని అభినందించాలి. జస్టిస్‍ రమణ హైదరాబాద్‍లో ప్రాక్టీస్‍ చేసి ఇక్కడే ఎదిగారు. తాను ఎదిగిన ప్రాంతానికే ఐఏఎంసీని తీసుకు రావాలని ఆయన కృషి చేశారు. వారి దీవెన ఫలితమే ఐఏఎంసీ’’ అని వివరించారు. త్వరితగతిన ఐఏఎంసీకి కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‍, సీఎస్‍, పరిశ్రమల శాఖ కార్యదర్శికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సెంటర్‍ అభివ•ద్ధికి జస్టిస్‍ హిమా కోహ్లి, జస్టిస్‍ రవీంద్రన్‍, జస్టిస్‍ లావు నాగేశ్వర్‍ రావు చాలా ఆసక్తి చూపారని గుర్తు చేశారు.
‘‘భవిష్యత్తులో అనేక రంగాల్లో హైదరాబాద్‍ ప్రపంచస్థాయి డెస్టినేషన్‍ కాబోతోంది. అనేక కారణాల వల్ల కోర్టుల్లో కేసుల పరిష్కారం ఆలస్యమవుతోంది. ఆర్బిట్రేషన్‍ అనేది అంతర్జాతీయంగా ఫ్యాషన్‍గా మారింది. అలాంటి సెంటర్‍ హైదరాబాద్‍లో రావడం.. అందుకు జస్టిస్‍ రమణ దీవెనలు ఉండడం గర్వకారణం. దీనికి గొప్ప భవిష్యత్తు ఉంది’’ అని చెప్పారు. సెంటర్‍ ప్రారంభానికి ముందే చాలా పెద్ద కేసు రావడం సంతోషకరమైన విషయమని, సీజేఐగా ఎన్వీ రమణ ఉన్న కాలంలోనే చాలా కేసులు ఈ సెంటర్‍ వస్తాయని, తద్వారా ఈ సెంటర్‍కు గొప్ప పేరు వస్తుందని ఆకాంక్షించారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వంతో జరిగే కాంట్రాక్టులు, ప్రైవేటు కాంట్రాక్టులు, పెద్ద పెద్ద పరిశ్రమలతో జరిగే ఒప్పందాలు ఈ సెంటర్‍కే వచ్చేలా రాష్ట్ర చట్టాలను సవరించాల్సి ఉంది. ఈ విషయంలో మా సీఎస్‍కు గైడెన్స్ ఇవ్వాలని జస్టిస్‍ ఎల్‍.నాగేశ్వర్‍ రావుకు విజ్ఞప్తి చేశాం. చట్టాల్లో మార్పుల కోసం వెంటనే ఆర్డినెన్స్ తెస్తాం’’ అని వివరించారు. చేతులు జోడించి సీజేఐ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని సీఎం కేసీఆర్‍ అన్నారు.


ఈ కేంద్రాన్ని ప్రోత్సహించండి : జస్టిస్‍ నాగేశ్వరరావు

ఆర్బిట్రేషన్‍తో పరిష్కరించుకోవాలని చెబుతూ హైదరాబాద్‍ కేంద్రానికి వెళ్లాలని లలిత్‍ మోడీ కుటుంబానికి చెందిన కేసు విచారణ సందర్భంగా షరతు విధించాం. అలా కేంద్రం ప్రారంభం కాకముందే పెద్ద కేసు వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయ మూర్తులు, న్యాయమూర్తులు ఆర్బిట్రేషన్‍కు పార్టీలను సుదూర ప్రాంతాలకు పంపకుండా అనుకూలంగా ఉన్న ఈ కేంద్రానికి సిఫారసు చేయాలని కోరుతున్నా. విదేశీ ఆర్బిట్రేషన్లు కూడా ఇక్కడికి వస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

హనుమకొండలో రూ. 23 కోట్లతో నూతన భవన సముదాయం నిర్మాణం
10 కోర్టుల సముదాయ భవనం ప్రారంభించిన సీజే


తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‍ ఎన్వీ రమణ అభినందించారు. కోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్టును నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. ముందుగా కాళోజీ నారాయణ రావు కవితలను చదివి వినిపిస్తూ సీజేఐ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగులో మాట్లాడటం గర్వంగా ఉందన్నారు. ఓరుగల్లుతో తనకు ఎంతో విడదీయరాని బంధం ఉందని తెలిపారు. ప్రగతిశీల ఉద్యమాలకు పుట్టినిల్లు ఓరుగల్లు అని అన్నారు. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అంటూ దాశరథి శతకాన్ని ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ గుర్తు చేశారు.


హనుమకొండలో కోర్టు భవనాల సముదాయం ప్రారంభం
హనుమకొండ జిల్లాలో కోర్టు భవనాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‍ ఎన్వీ రమణ ఆదివారం (18.12.21) ఉదయం ప్రారంభించారు. ఆపై కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హనుమడు, కొండడు శిలను సీజేఐ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. కోర్టు భవన సముదాయంతో పాటు ఫ్యామిలీ కోర్టు, ఫోక్సో కోర్టు భవనాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‍ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్‍ రావు పాల్గొన్నారు. చారిత్రక వరంగల్‍ జిల్లా కోర్టు నూతన హంగులను సంతరించుకుంది. కోర్టు ప్రాంగణంలో రూ. 23.30 కోట్ల వ్యయంతో న్యాయ భవన సముదాయాన్ని నిర్మించారు. ఈ నూతన భవనాల నిర్మాణంతో అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.21.65 కోట్లతో సువిశాలమైన భవన సముదాయాన్ని నిర్మించగా రూ. కోటి వ్యయంతో పార్కింగ్‍, అంతర్గత సీసీ రోడ్లు, లాన్‍ను ఏర్పాటు చేశారు. మరో రూ. 65 లక్షలతో కోర్టు ప్రాంగణంలోనే శిశు సంక్షేమ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
సీనియర్‍ సివిల్‍ న్యాయస్థాన హాలు పోక్సో కోర్టుగా మార్చారు. లైంగికదాడుల కేసుల్లో విచారణకు వచ్చేవారు కనపడకుండా ఏర్పాట్లు చేశారు. చిన్నారులు, తల్లిదండ్రులు, కక్షిదారులు కనపడకుండా ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు. విచారణ కోసం ప్రత్యేక గదులను అందుబాటులోకి తెచ్చారు. ప్రవేశ మార్గం వద్ద ఆకట్టుకునే రీతిలో కాకతీయ కళాతోరణం, కోర్టులోనికి వెళ్లే మార్గంలో పూల మొక్కలు, సందేశాత్మక చిత్రాలను డిజైన్‍ చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేశారు.


కొత్త న్యాయ భవన సముదాయంలో పది కోర్టులను ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్‍ జూనియర్‍ సివిల్‍ జడ్జి కోర్టు, మొదటి అదనపు సివిల్‍ జడ్జి కోర్టుతో పాటు రెండవ, మూడవ, నాల్గవ, అయిదవ, ఆరవ, ఏడవ అదనపు సివిల్‍ జడ్జి కోర్టులు వీటిలో ఉన్నాయి. వీటితో పాటు ఇదే భవనంలో ఎక్సైజ్‍ అండ్‍ ప్రొహిబిషన్‍ కోర్టు, పీసీఆర్‍ కోర్టును కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న నిజాం కాలం నాటి పాత భవనంలో ప్రిన్సిపల్‍ జిల్లా జడ్జి కోర్టుతో పాటు నాలుగు అదనపు జిల్లా కోర్టులను కొనసాగిస్తారు. సీనియర్‍ సివిల్‍ జడ్జి కోర్టులను పాత సబ్‍ కోర్టు భవనంలోనే యథావిధిగా కొనసాగిస్తారు. ఫ్యామిలీ కోర్టును ప్రస్తుతం ఉన్న ప్రత్యేక భవనంలో కొనసాగిస్తారు. ప్రస్తుతం ఉన్న పాత మూడవ అదనపు మున్సిఫ్‍ కోర్టు (నక్సలైట్‍ ప్రత్యేక కోర్టు) భవనాన్ని శిశు సంక్షేమ కేంద్రంగా మార్చారు. 1,23,980 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించారు

కట్టా ప్రభాకర్‍, 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *