హైదరాబాద్‍ మహానగరంలో ఇక సాఫీ సడక్‍లు

  • పలు ప్లై ఓవర్లు, అండర్‍ పాస్‍లు, జంక్షన్‍లు
  • కొత్తగా రైలు వంతెనల నిర్మాణానికి చర్యలు
  • గ్రేటర్‍లో 3 ఆర్‍యూబీలు.. 6 ఆర్‍ఓబీలు
  • సిగ్నల్‍ ఫ్రీ సిటీగా మారనున్న గ్రేటర్‍ హైదరాబాద్‍
  • మునిసిపల్‍ శాఖ మంత్రి కేటీఆర్‍


మహానగరంలో ట్రాఫిక్‍ చిక్కులు లేని ప్రయాణాల కోసం ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‍డీపీ) ద్వారా పలు ఫ్లై ఓవర్లు, అండర్‍పాస్‍లు, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు చేస్తున్న జీహెచ్‍ఎంసీ ఆయా ప్రాంతాల్లో రైలు ఓవర్‍ బ్రిడ్జీలు (ఆర్‍ఓబీలు), రైలు అండర్‍ బ్రిడ్జీలు (ఆర్‍యూబీలు) కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న డజనుకుపైగా ఆర్‍ఓబీలు, ఆర్‍యూబీలతోపాటు కొత్తగా మరో మూడు ఆర్‍యూబీలు, ఆరు ఆర్‍ఓబీలు నిర్మించాలని భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‍ తెలిపారు. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్‍ చిక్కుల్ని తగ్గించేందుకు సదరు ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రాఫిక్‍ సర్వే పనులు జరుగుతున్నాయి.


ట్రాఫిక్‍ చిక్కుల్లేకుండా..

నగరంలో ట్రాఫిక్‍ చిక్కుల్లేని ప్రయాణాల కోసమే రూ.25వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వం ఎస్సార్‍డీపీ ద్వారా ఫ్లై ఓవర్లు, తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఆ పనులన్నీ పూర్తయ్యేలోగా ప్రధాన మార్గాల్లో ఎదురవుతున్న చిక్కుల్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలుగా మంత్రి కేటీఆర్‍ ఆలోచనతో లింక్‍, స్లిప్‍ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వాటితో మంచి ప్రయోజనం కలగడంతో శివారు స్థానికసంస్థల పరిధిలో సైతం లింక్‍, స్లిప్‍రోడ్లకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నారు.
మరోవైపు రైల్వే మార్గాలున్న ప్రాంతాల్లో ఆర్‍ఓబీలు, ఆర్‍యూబీలు నిర్మిస్తే చిక్కులు తగ్గుతాయని భావించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఆర్‍ఓబీలు, ఆర్‍యూబీలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్‍ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని విస్తరించాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్‍ రామ్‍గోపాల్‍పేట్‍ వంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విస్తరించాలని మంత్రి కేటీఆర్‍ సూచించారు.
రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‍.. రైల్వే క్రాసింగ్‍ల వద్ద ప్రమాదాలు జరగకుండా, ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా జీహెచ్‍ఎంసీ, రైల్వే అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. వాటితోపాటు ఇరుగ్గా ఉన్న ఆర్‍ఓబీలు, ఆర్‍యూబీలను విస్తరించాలని సూచించారు. అధికారులు వీటిని యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.


రైల్వే అండర్‍ పాస్‍, రైల్వే ఓవర్‍ బ్రిడ్జిలపై మంత్రి సమీక్ష
హైదరాబాద్‍ నగరంలో ఉన్న రైల్వే క్రాసింగ్‍ పైన చేపట్టాల్సిన నిర్మాణాలపై ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేయాలని మంత్రి కేటీఆర్‍ పురపాలక శాఖ అధికారులకు ఇటీవల సూచిం చారు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, పురపాలక శాఖ, జీహెచ్‍ఎంసీ మరియు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు మంత్రి కేటీఆర్‍ నగరంలో చేపట్టాల్సిన రైల్వే అండర్‍ పాస్‍, రైల్వే ఓవర్‍ బ్రిడ్జి మరియు ఇతర రైల్వే శాఖ సంబంధిత పెండింగ్‍ కార్యక్రమాల పైన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‍ మాట్లాడుతూ హైదరాబాద్‍ నగరంలో ట్రాఫిక్‍ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‍.ఆర్‍.డి.పి వంటి అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి, పెద్దఎత్తున రోడ్డు నెట్వర్క్ను బలోపేతం చేస్తుందని, అయితే కొన్ని చోట్ల ఇప్పటికీ రైల్వే క్రాసింగ్‍ల వలన ట్రాఫిక్‍ రద్దీని తగ్గించడంలో ఉన్న పరిమితులను చర్చించారు. జీహెచ్‍ఎంసీ చేపడుతున్న రోడ్ల మౌలిక వసతుల కల్పనలో సమన్వయం చేసుకొని రైల్వే శాఖ సైతం ఆర్‍.యు.బి, ఆర్‍.ఓ.బిల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇస్తే ఈ ట్రాఫిక్‍ రద్దీ మరింత తగ్గే అవకాశం ఉందని కేటీఆర్‍ అన్నారు. ఎస్‍.ఆర్‍.డి.పికి సంబంధించి జీహెచ్‍ఎంసీ టైం లైన్‍లు పెట్టుకొని మరీ వేగంగా పనులను పూర్తి చేస్తున్నదని తెలిపిన కేటీఆర్‍, రైల్వే శాఖ నిర్మాణ పనులు జీహెచ్‍ఎంసీతో పోల్చినప్పుడు కొంత మందకొడిగా నడుస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో జీహెచ్‍ఎంసీ మరియు రైల్వే శాఖ అధికారులు కలిసి నగరంలో చేపట్టాల్సిన రైల్వేశాఖ అభివ•ద్ధి పనుల పైన ఒక సమగ్రమైన ప్లాన్‍ని తయారు చేయాలని సూచించారు. నగరంలో ఉన్న ప్రతి రైల్వే క్రాసింగ్‍, ఇరుకుగా ఉన్న రైల్వే అండర్‍ బ్రిడ్జిలను అభివ•ద్ధి పరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన కేటీఆర్‍, ఈ దిశగా రైల్వే శాఖ, జీహెచ్‍ఎంసీ సమన్వయంతో కలిసి పనిచేస్తే సాధ్యమైనంత తొందరగా మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా దశాబ్దాల కింద నిర్మాణం చేసిన సికింద్రాబాదులోని రామ్‍గోపాల్‍ పేట రైల్వే అండర్‍ బ్రిడ్జ్ వంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు నగరంలో ఉన్న ఇలాంటి కీలకమైన ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి వేగంగా రైల్వే శాఖ అనుమతులు తీసుకుని ముందుకు పోవాలని జీహెచ్‍ఎంసీ అధికారులకు సూచించారు.


తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‍ నగరంలో రోడ్డు నెట్వర్క్ ని బలోపేతం చేయడంతోపాటు ట్రాఫిక్‍ రద్దీని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల తమకు అవగాహన ఉన్నదన్న దక్షిణ మధ్యరైల్వే ఉన్నతాధికారులు జీహెచ్‍ఎంసీకి సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. జీహెచ్‍ఎంసీతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తామని, సాధ్యమైనంత తొందరగా రైల్వేశాఖ అనుబంధ మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన అనుమతుల పక్రియను వేగంగా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‍కు హామీ ఇచ్చారు. తుది అనుమతులు రాగానే సనత్‍ నగర్‍, బాలానగర్‍ రైల్వే అండర్‍ పాస్‍ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు.


ఎల్‍బీనగర్‍ జంక్షన్‍

ఎస్సార్‍డీపీలో భాగంగా జీహెచ్‍ఎంసీ చేపట్టిన మరో అండర్‍పాస్‍ అందుబాటులోకి వచ్చింది. ఎల్‍బీనగర్‍ జంక్షన్‍ వద్ద కుడివైపు అండర్‍పాస్‍ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎడమవైపు అండర్‍పాస్‍ వినియోగంలో ఉండటం తెలిసిందే. ఈ అండర్‍పాస్‍ కూడా అందుబాటులోకి వస్తే ఇటు సికింద్రాబాద్‍ నుంచి శంషాబాద్‍ విమానాశ్రయం వైపు వెళ్లే వారికి, విమానాశ్రయం నుంచి ఆరాంఘర్‍, మిథానీల మీదుగా ఉప్పల్‍, నాగోల్‍, సికింద్రాబాద్‍ ప్రాంతాల వైపు వెళ్లేవారికి ట్రాఫిక్‍ చిక్కులు లేని సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది.


అండర్‍పాస్‍ వివరాలు..

  • పొడవు: 490 మీటర్లు
  • వెడల్పు: 12. 87 మీటర్లు
  • మూడు లేన్లు.. ఒకవైపు ప్రయాణం
  • అంచనా వ్యయం : రూ.14.87 కోట్లు


తుకారాంగేట్‍ ఆర్‍యూబీ సైతం..
ఎల్‍బీనగర్‍ అండర్‍పాస్‍తో పాటు తుకారాం గేట్‍ రైల్వే అండర్‍పాస్‍ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఇది కూడా నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక ట్రాఫిక్‍ లేని ప్రయాణం సాఫీగా సాగుతుంది.


ఒవైసీ-మిథాని ఫ్లైఓవర్‍
తెలంగాణ రాష్ట్రం రాజధాని నగరం యొక్క అద్భుతమైన టోపీలో మరో రెక్కలా, ఒవైసీ-మిథాని జంక్షన్‍ వద్ద భారీ ఫ్లైఓవర్‍ నిర్మించబడింది. ఈ మూడు లైన్ల నిర్మాణాన్ని టీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍, మున్సిపల్‍ అడ్మినిస్ట్రేషన్‍ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఒవైసీ-మిథాని జంక్షన్‍లో కొత్తగా నిర్మించిన 1.365 కిలోమీటర్ల ఫ్లైఓవర్‍ను హైదరాబాద్‍ ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర మున్సిపల్‍, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‍ ట్వీట్‍ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‍ మానసపుత్రికగా రూ.80 కోట్లతో ఈ ఫ్లైఓవర్‍ను జీహెచ్‍ఎంసీ నిర్మించిందని తెలిపారు. స్ట్రాటజిక్‍ రోడ్‍ డెవలప్‍మెంట్‍ పోగ్రామ్‍ ఎస్‍ఆర్‍డిపి కింద ఈ నిర్మాణం జరిగింది. ఎస్‍ఆర్‍డీపీ బృందానికి కేటీఆర్‍ తన అభినందనలు తెలుపుతూ ట్వీట్‍ చేశారు. 80 కోట్ల భారీ బడ్జెట్‍తో 1,365 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్‍కు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‍ కలాం పేరు పెట్టారు.


షేక్‍పేట్‍ ఫ్లై ఓవర్‍
షేక్‍ పేట్‍ ఫ్లై ఓవర్‍ సుదీర్ఘంగా 2.8 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాద్‍లో ఎస్‍ఆర్‍డీపీ ద్వారా చేపట్టిన ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది. హైదరాబాద్‍ వాసులకు తెలంగాణ సర్కార్‍ న్యూ ఇయర్‍ గిఫ్ట్ ఇచ్చింది. భాగ్యనగరంలో మరో ఫ్లై ఓవర్‍ అందు బాటులోకి వచ్చింది. షేక్‍పేట్‍ ఫ్లై ఓవర్‍ను మంత్రి కేటీఆర్‍ ప్రారంభించారు. గ్రేటర్‍ హైదరాబాద్‍ను సిగ్నల్‍ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో షేక్‍పేట్‍ ఫ్లై ఓవర్‍ ఒకటి.
ఆరు లేన్లు ఉన్న ఈ ఫ్లై ఓవర్‍ను 333 కోట్ల 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు. షేక్‍పేట్‍ ఫ్లై ఓవర్‍ను నూతన సంవత్సర కానుకగా ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‍ ప్రారంభించారు. షేక్‍ పేట్‍ ఫ్లై ఓవర్‍ సెవన్‍ టూంబ్స్ జంక్షన్‍, ఫిల్మ్ నగర్‍ రోడ్‍ జంక్షన్‍, ఓయూ కాలనీ జంక్షన్‍, విస్పర్‍ వేలీ జంక్షన్ల మీదుగా వెళుతుంది. దీంతో ఈ రూట్‍లోని ట్రాఫిక్‍ ఇబ్బందులు తొలగిపోయాయి.


గచ్చిబౌలి-రాయదుర్గం మార్గంలో వంతెన కింద వంతెన
వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‍డీపీ)లో భాగంగా జీహెచ్‍ఎంసీ చేపట్టిన పనుల్లో మరో ఫ్లైఓవర్‍ పనులు పూర్తయి నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. బయోడైవర్సిటీ జంక్షన్‍ వద్ద సెకండ్‍ లెవెల్‍ ఫ్లైఓవర్‍ ఇప్పటికే అందుబాటులోకి రాగా, ఫస్ట్ లెవెల్‍ ఫ్లైఓవర్‍ను మునిసిపల్‍ మంత్రి కేటీఆర్‍ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‍తో బయోడైవర్సిటీ జంక్షన్‍ వద్ద ట్రాఫిక్‍ సమస్య తీరింది. గచ్చిబౌలి వైపు నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే వారికి దీని వల్ల ట్రాఫిక్‍ చిక్కులు తగ్గుతాయి. దీని వ్యయం రూ.30.26 కోట్లు.


ఎస్సార్‍డీపీ ప్యాకేజీ-4 పూర్తి:
ఈ ఫ్లైఓవర్‍ పూర్తితో ఎస్సార్‍డీపీలో ప్యాకేజీ-4 కింద మొత్తం రూ.379 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే మైండ్‍స్పేస్‍ అండర్‍పాస్‍, మైండ్‍స్పేస్‍ ఫ్లైఓవర్‍, అయ్యప్ప సొసైటీ జంక్షన్‍ అండర్‍పాస్‍, రాజీవ్‍గాంధీ జంక్షన్‍ ఫ్లైఓవర్‍, బయోడైవర్సిటీ జంక్షన్‍ సెకెండ్‍ లెవెల్‍ ఫ్లైఓవర్‍ వినియోగంలోకి వచ్చాయి. దీంతో బయోడైవర్సిటీ జంక్షన్‍ (ఓల్డ్ ముంబై హైవే) నుంచి జేఎన్‍టీయూ(ఎన్‍హెచ్‍-65) మార్గంలో ట్రాఫిక్‍ సమస్యలు తగ్గినట్టేనని, మొత్తం 12 కిలోమీటర్ల కారిడార్‍ పనులు పూర్తయ్యాయి.


దుర్గం చెరువు తీగల వంతెన
రూ.184 కోట్లతో దుర్గం చెరువు కేబుల్‍ బ్రిడ్జి తీగల వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జిగా ఈ కట్టడం రికార్డు కెక్కింది. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్‍ అండ్‍ టీ సంస్థకు అప్పగించగా.. నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. ఈ బ్రిడ్జిని పూర్తిగా కేబుల్‍ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం. గచ్చిబౌలి, మాదాపూర్‍లో పని చేసే సాఫ్ట్వేర్‍ ఉద్యోగులకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడనుంది. అంతేకాక, దుర్గం చెరువు వద్ద పర్యాటకంగానూ మరింత వృద్ధి చెందనుంది.


పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‍వే
దుర్గం చెరువు కేబుల్‍ బ్రిడ్జితో పాటు జూబ్లీహిల్స్ రోడ్‍ నెంబర్‍ 45ను కలుపుతూ ఓ ఫ్లై ఓవర్‍ను నిర్మించారు. బ్రిడ్జితో పాటు ఫ్లై ఓవర్‍ను కూడా కేటీఆర్‍ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్‍ నెంబర్‍ 45 ఫ్లై ఓవర్‍కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‍వేగా నామకరణం చేశారు.


బాలానగర్‍ ఫ్లై ఓవర్‍ కార్మికురాలితో కలిసి ప్రారంభించిన మంత్రి కేటిఆర్‍

హైదరాబాద్‍ నగరంలో ట్రాఫిక్‍ కష్టాలకు చెక్‍ పెట్టేందుకు మరో ఫ్లై ఓవర్‍ అందుబాటులోకి వచ్చింది. బాలానగర్‍ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్‍ను ఓ కార్మికురాలితో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కలిసి కేటీఆర్‍ ప్రారంభించారు. కాగా దీనికి బాబు జగ్జీవన్‍రాం పేరును పెట్టనున్నట్టు మంత్రి కేటిఆర్‍ ప్రకటించారు.
అంత్యంత దుర్భరమైన ట్రాఫిక్‍ సమస్యను ఎదుర్కొంటున్న బాలాపూర్‍ చౌరస్తాలో ట్రాఫిక్‍ సమస్యకు నేటి నుండి చెక్‍పడనుంది. ఈ కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‍ఆర్‍డీపీ నిధులచేత హెచ్‍ఎండీఏ ప్రారంభించి మొత్తం సుమారు నాలుగు సంవత్సరాల సమయంలో పూర్తి చేశారు. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు.


ఎస్‍ఆర్‍డీపీ క్రింద నగరంలో మొత్తం 30 వేల కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్లు, అండర్‍పాస్‍ల నిర్మాణం చేపట్టామని మంత్రి వివరించారు.. కాగా ఇందులో ఒక్క కూకట్‍పల్లి నియోజకవర్గంలో వేయి కోట్ల రూపాయల అభివ•ద్ది పనులు జరిగాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‍ నగరంలో ట్రాఫిక్‍ సమస్యను తీర్చేందుకు నడుం బిగించారని అందులో భాగంగానే ఎస్‍ఆర్డీపీ నిధుల క్రింద ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు.
బాలానగర్‍ ఫ్లైఓవర్‍కు బాబు జగ్జీవన్‍రాం పేరును పెట్టబోతున్నట్టు మంత్రి కేటిఆర్‍ ప్రకటించారు. మరోవైపు ఈ ఫ్లైఓవర్‍ ప్రారంభోత్సవానికి మంత్రి కేటిఆర్‍ రిబ్బన్‍ కటింగ్‍ చేయకుండా… సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ ఫ్లైఓవర్‍ నిర్మాణంలో భాగస్వాములు అయిన కార్మికులను గౌరవించుకునేందుకు గాను గత నాలుగు సంవత్సరాలుగా వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేత రిబ్బన్‍ కట్‍ చేయించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఇస్తున్న గౌరవమని వ్యాఖ్యానించారు.
మరోవైపు నగరంలో పాట్నీ నుండి తూంకుంట వరకు మరోవైపు సుచిత్ర చౌరస్తావరకు ఫ్లై ఓవర్‍ను ప్రారంభించేందుకు రాష్టప్రభుత్వం నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా… కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో వాటి నిర్మాణాలు ఆగాయని తెలిపారు. కేంద్రం నుండి అనుమతులు వచ్చిన వెంటనే సుచిత్ర తోపాటు రెండు స్కై ఓవర్‍లు నిర్మాణం చేపడతామని చెప్పారు.


ఆస్తుల సేకరణ కోసం..

  • ఆర్‍డిపి కింద నేషనల్‍ హైవే 65 ముంబయి (అశోక గోల్డెన్‍ మాల్‍) నుంచి గ్రీన్‍ హిల్స్ రోడ్‍ వయా ఐడీఎల్‍ లేక్‍, ఐడీఎల్‍ ఎక్స్ప్లోజివ్‍ లిమిటెడ్‍ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 10 ఆస్తుల సేకరణకు, కూకట్‍ పల్లి ట్రాఫిక్‍ పోలీస్‍ స్టేషన్‍ నుంచి ఐడీఎల్‍ లేక్‍ వయా ఎన్‍ఆర్‍సీ గార్డెన్‍, ద క్రీక్‍ ప్లానెట్‍ స్కూల్‍ వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు 43 ఆస్తుల సేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం తెలిపారు.
  • రీవైస్డ్ ఆర్‍డీపీ కింద రాంనగర్‍ నుంచి అంబేదర్‍ కాలేజ్‍ జంక్షన్‍ వయా వీఎస్‍టీ జంక్షన్‍ వరకు సెకండ్‍ లేవల్‍ ప్లై ఓవర్‍, 15 మీటర్లు, 24 మీటర్లు, 27.8 మీటర్లు, 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 39 ఆస్తుల సేకరణకు..
  • ఆర్‍డీపీ కింద ఫరూక్‍ నగర్‍ బస్‍ డిపో నుంచి వట్టేపల్లి వయా ఫాతిమానగర్‍ 12 మీటర్లు, 18 మీటర్లు, 24 మీటర్ల రోడ్డు వెడల్పునకు, హెచ్‍టీ లైన్‍కు ఇరువైపులా 10 మీటర్ల రోడ్డు వెడల్పునకు మాస్టర్‍ ప్లాన్‍లో పొడి గించడానికి, 174 ఆస్తుల సేకరణకు..
  • ఆర్‍డీపీ కింద సాయిఎన్‍క్లేవ్‍ నుంచి కాప్రా చెరువు వయూన్‍ మిడోస్‍ వెంచర్స్, శివసాయి నగర్‍ 12 మీటర్ల రోడ్డు వెడల్పు నకు 13 ఆస్తుల సేకరణకు..
  • ఆర్‍డీపీ కింద ఐజి స్టాచ్యూ నుంచి బొల్లారం – కొంపల్లి వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 408 ఆస్తుల సేకరణకు..
  • ఆర్‍డీపీ కింద బిస్మిల్లా హోటల్‍ నుంచి డీఆర్‍డీవో కాంపౌండ్‍వాల్‍ వరకు 9 మీటర్ల రోడ్డు వెడల్పునకు 118 ఆస్తుల సేకరణకు..
  • రాజేంద్రనగర్‍ శాస్త్రీపురం ఆలీభాయ్‍ క్రాస్‍ రోడ్‍ వద్ద కాంప్రహెన్సివ్‍ డెవలప్‍మెంట్‍ స్పోర్టస్ సెంటర్‍ ఏర్పాటుకు అయ్యే వ్యయం రూ. 5.95 కోట్లకు సేకరణ.
  • కట్టా ప్రభాకర్‍
    ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *