శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసించేదేమిటి?


తెలుగునాట కనిపించే శాసనాలలో నామక శాసనాలది ప్రత్యేకస్థానం. కేవలం పేర్లు మాత్రమేకదా ఇవి శాసనాలా అని పెదవి విరిచే శాసనవేత్తలకు కూడా సవాలు విసురుతాయి కొన్ని లేబుల్‍ లేఖనాలు. రాజుల ఆజ్ఞలు, దానాలు, యుద్ధాలు, ప్రశస్తులు మాత్రమే కాదు శాసనాలు. చిన్నదైనా, పెద్దదైనా, పదమైనా, పదంలో ఒక ముక్కైనా, ఐదు, పది నుంచి వందల పంక్తుల శాసనాలైనా వాటిలోని విషయం, కాలాలకే ప్రాధాన్యత. రాజుల వివరాలు తెలిపే శాసనాలు చరిత్ర కాలక్రమణికకు ఎట్ల పనికొస్తాయో, ఒకప్పటి సామాజిక సంస్కృతిని ప్రతిబింబించే చిన్న నామక శాసనాలు కూడా అట్లే అవసరమైనవి. ఉత్పత్తి పిడుగు శాసనాలు అటువంటివే.
ఉత్పత్తిలో ‘ఉత్‍’ అంటే చెడుమార్గం. ‘పత్తి’ పథిక పదానికి పర్యాయపదం. పథిక అనే మాటకు బాటసారి అని అర్థం. ఉత్పత్తి అంటే చెడుమార్గంలో వెళ్ళేవారని. ఉత్పథం అనే మాటకు చెడుమార్గం అర్థం వస్తుంది.1 ‘‘కార్యాకార్య మజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్‍’’.హో2 ఏపని చేయాలో ఏది చేయద్దో తెలియక ‘దుర్మార్గాని’కి ఒడిగట్టిన వాడెవడైనా సంహరిస్తానంటాడు లక్ష్మణుడు. ఇందులో ఉత్పథం అంటే దుర్మార్గమనే అర్థం. ఉత్పత్తి అంటే పుట్టుక, పిడుగు అంటే నిప్పురాయే. ఉత్పత్తి (పుట్టుక), పిడుగు(అశని) అంటే జన్మ, పునర్జన్మలను లేకుండా చేసేది అంటే మోక్ష మిచ్చేదని అర్థం తెచ్చారు.


ఉత్పత్తిపిడుగు అంటే చెడుతొవ్వలో పోయేవారిమీద పిడుగులెక్క పడేది. శ్రీ అనేది గౌరవపదం, ఉత్పత్తి పిడుగుతో కలిసి శ్రీ ఉత్పత్తిపిడుగు అయింది. ఉత్పత్తిపిడుగు అనేది చెడుమీద పడే నిప్పురాయి. కనుక శ్రీ ఉత్పత్తి పిడుగు అనేది ఒక మనిషో, ఒక సమూహమో కావచ్చు. చెడు అనేది సాంఘిక ప్రవర్తన. ఈ సాంఘిక ప్రవర్తనలకు కారణం మనుషుల ఆలోచనావిధానం. అది తాత్వికత. దానికి మతాచరణ మూలాధారమై ఉంటుంది. ఒక మతాచరణ మరొక మతానికి గిట్టనిదైపోయినపుడు అది నిర్మూలించవలసినదౌతుంది. అపుడు ‘అహింసా పరమోధర్మః’ అనరు. ‘ధర్మహింస’కు పూనుకుంటారు. ఇక్కడ ధర్మమంటే గిట్టని ధర్మమని. ఇప్పటి మనదేశంలో ఎక్కడో ఒకచోట ధర్మాధర్మాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ ధర్మం దేశ, కాల, మానాలనుబట్టి మారుతూ వచ్చింది.
‘‘భారతీయ తాత్విక సంప్రదాయాల్లో దర్శనాలు-మతాలు రెండు విభాగాలు. దర్శనమంటే సత్యాన్ని దర్శింప చేసేది అని వ్యుత్పత్తి. మతం అంటే వ్యక్తి అభిప్రాయాన్నిగాని, ఒక దేవుని పారమాణ్యాన్ని కాని ప్రధానం చేసుకునేది. దర్శనం తర్కప్రధానం. మతం భావనాప్రధానం. నమ్మకానికి సంబంధించింది. దర్శనాలు-మతాలు మళ్ళీ ఆస్తికాలు, నాస్తికాలు అని రెండువిధాలు. ఆస్తికదర్శనాలు వేదాలను ప్రమాణంగా, పరలోకాన్ని నమ్మేవిగా వుంటాయి. దర్శనాలలో న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే ఆరింటిలో మొదటి 3 ఈశ్వరుని ఉనికిని గుర్తించవు. వేదప్రామాణ్యాన్ని అంగీకరిస్తాయి. ఆస్తికమతాలు ఆరు. మతాలకు భక్తి ప్రధానం. భక్తిప్రాధాన్య మతాలకు మూలమైన ఉపనిషత్తులలో శ్వేతాశ్వేతర, మహానారాయణ, అథర్వశిర మొదలైన ఆధునిక ఉపనిత్తులు. ‘ఏక ఏవరుద్రో నద్వితీయాయతస్థుః దేవ ఏకో నారాయణః ఏకోదేవః సర్వభూతేషు గూఢః’ అనే ఉపనిషద్వాక్యాలు షణ్మాతాలకు ఆధారాలు. అవి శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య, కౌమారాలు.


భగ శబ్దానికి ‘శ్రీ, శక్తి, కామం, యోని, మహత్మ్యం, సూర్యుడు, ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, జ్ఞానం, వైరాగ్యం అని అర్థాలు. ‘భగవంతుడు’ అన్నిమతాలకు అన్వయిస్తున్నాడు. బౌద్ధులు భగవాన్‍ అని, శాక్తులు ‘భగవతి’ అని అంటారు.
వేదకాలంనాటి శ్రద్ధ ఉపాసనలే పౌరాణిక కాలంలో భక్తిగా మారినవి. ఈ మతాలు అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శుద్ధాద్వైత, భావాద్వైత వంటి అచింత్య భేదతత్వాలు చేరి అనేక శాఖలుగా పిలువబడుతున్నాయి’’.
ఇక్కడ వైదికం, బౌద్ధం, జైనం, శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య, కౌమారాలు అనేవి వేర్వేరు మతాలు.
శివుడే దేవుడు, మిగిలిన దేవుండ్లంతా అతని పరివారజనులని శైవమత విశ్వాసం. భైరవకోనలో బ్రహ్మ, విష్ణువులను ద్వారపాలకుల పక్కన ఆ పరివారభావనతోనే చెక్కివుంటారు. శైవంలో కూడా మళ్ళీ అనేక శాఖా భేదాలున్నాయి. వాటిలో లకులీశ పాశుపతం, ప్రత్యభిజ్ఞాన (కాశ్మీర)శైవం, రసేశ్వరమనే శాఖల గురించి విద్యారణ్యుని ‘సర్వదర్శన సారసంగ్రహం’లో వివరించబడ్డది. పాశుపత, సోమ, లాకుళ శాఖలు (కారణాగమతంత్రం), కాపాలిక, నాకుల, వామ, భైరవ, పాశుపత శాఖలు (పద్మపురాణం), శైవ, పాశుపత, కారుణిక సిద్ధాంత, కాపాలికం (వాచస్పతి) అనే శాఖలున్నాయి.


లకులీశం:
లాకుళ పాశుపతం ప్రాచీనం. లగుడం (చేతిలో పట్టుకునే కర్ర, లకిడీ, లాఠీ, లకుటం) ధరించినవాడు లకులీశ్వరుడు. శివుడు లగుడధారియై కాయావరోహణ క్షేత్రంలో అవతరించాడని వాయుపురాణం, లింగపురాణాలు చెప్తున్నాయి. ఇది లాకుళ శైవం. లగుడధారి లకులీశ్వరుని శిష్యులు కౌశిక, గర్గ, మిత్ర, కారుణ్గులు. లకులీశ్వరశైవానికి కార్య, కారణ, యోగ, విధి, దుఃఖాంతాలు మూలసూత్రాలు. పశువు, పాశం, పతి ముఖ్యమైన ఈ సంప్రదాయం పాశుపతం. మహాభారతంలో యోగ, పాంచరాత్ర, వేద, పాశుపతాలు ముఖ్యధర్మాలుగా పేర్కొనబడ్డాయి. ఉపనిషత్తులు ఈ మతాన్ని శిరోవ్రతం, మహావ్రతం అన్నాయి. ఉజ్జయినీ కాళేశ్వరుని ఆరాధకులైన పాశుపతులే కాలాముఖులుగా పిలువబడ్డారు. లకులీశుల లగుడమే కాలాముఖులు చేతిలో పట్టుకుని ధరించే తిరిగే ఆయుధం. కట్టెతో చేసిన గదవంటి ఆయుధానికి ఒకవైపు కత్తి అంచు ఉండేది.


శుద్ధ శైవం:
శుద్ధశైవ మతశాఖలో విద్యాపాదం (పశు-పాశ-పతి), క్రియాపాదం (మంత్ర, జప, హోమ దీక్షలు), యోగపాదం (36తత్వాలు, అణిమ గరిమాది అష్టసిద్ధులు, సాధనలు) ముఖ్యం. ఈ శైవానికి 28 ఆగమాలు ప్రమాణం. కాపాలికుల్లో కపాలం ధరించడం, దిగంబరత్వం, నరబలి వుంది. అఘోరశైవులు ఈ శాఖవారే. మత్స్యేంద్రనాథ, ఘోరక్‍ నాథులు. భైరవులు కూడా వున్నారు. తమిళనాట 63మంది నాయనార్లు శివభక్తులుగా ప్రసిద్ధులు.


తెలుగునాట శైవం:
తెలుగునాట ప్రఖ్యాతం కాలాముఖ, పాశుపత శాఖలు. శ్రీశైలం, మహానంది, ఓరుగల్లు, కాళహస్తి, పుష్పగిరిలలోని దేవాలయాలు శైవమత శాఖల కేంద్రాలు. వీటిలో కొన్ని గోళకీమఠాలు.
ఉదాహరణకు ఆలంపురం కాలాముఖశైవ కేంద్రం. కాలాముఖ, పాశుపత, శ్రమణ సంప్రదాయాలను పాటించేవారు ప్రజలకు, గ్రామాలకు దూరంగా వుండేవారు. ఎల్లోరాలోని శైవగుహలు ఉత్పత్తిపిడుగు విషయాన్ని, బౌద్ధ థేరవాదుల శ్రమణత్వాన్ని కలుపుతున్న వంటారు కొందరు పరిశోధకులు.
తెలంగాణాలో క్రీ.పూ.5వ శతాబ్దం నుంచే విస్తరించిన బౌద్ధమతం హీనయాన, మహాయానాలుగా, మహాయానంలో శూన్యవాదం రానురాను మంత్రయాన, వజ్రయాన, గుహ్య సమాజాలుగా మారిపోయిందంటారు కొందరు చరిత్రకారులు. క్రీ.శ. 7వ శతాబ్దం ప్రారంభకాలంలో బౌద్ధమతానికి వ్యతిరేకంగా ఇతర మతాలు అసహనంతో ప్రవర్తించాయి. వజ్రయానంతో బౌద్ధం నీతిబాహ్యమైనదని బద్నాం అయింది. ప్రభుసమ్మితాలుగా వెలుగొందిన బౌద్ధ, జైన మతాలకు వ్యతిరేకంగా శైవమతశాఖలు కట్టుదిట్టంగా దాడులు మొదలుపెట్టాయి. బౌద్ధం శీలం కోల్పోయింది కనుక శిక్షార్హమైనదని భావించారు కాలాముఖ, కాపాలికులు.
ఈ సమయంలో లోకశీలాభిమానంతో బౌద్ధులను అరికట్టడానికి మాహేశ్వరులైన కాలాముఖులు రూపొందించిన ఉద్యమంలో భాగమే ‘శ్రీఉత్పత్తిపిడుగు’ పేరుతో కాలాముఖుల సంఘం ఉద్యమించడం. ఉత్పత్తిపిడుగు మహేశ్వర మతశాఖకు చెందిన పాశుపత, కాలాముఖాలలో ఒకదానికి చెందినదని వివరించారు చరిత్రకారులు.


ఉత్పత్తి పిడుగు శాసనాలలో కనిపించే లగుడం(లకుటం) లకులీశుల ఆయుధం. రెండవది వ•త్తం. ఇది బౌద్ధుల శూన్యవాదానికి ప్రతీక. బౌద్ధుల శూన్యవాదం ప్రమాదకరంగా భావించిన కాలాముఖులు ఉత్పత్తిపిడుగులై బౌద్ధాదుల ధ్వంసానికి పూనుకున్నారు. శ్రీ ఉత్పత్తి పిడుగు శాసనాలన్నీ కాలాముఖులకు సంబంధించినవే.
‘శ్రీ ఉత్పత్తిపిడుగు ఒక తాత్వికతను వ్యతిరేకించడానికి, నిరోధించడానికి, నిర్మూలించడానికి పూనుకున్న మతైక ఉద్యమమే కాని, శిల్పులకూటమి పేరు కాదు’. అంటారు చీమకుర్తి శేషగిరిరావు.


ఉత్పత్తిపిడుగు శాసనాలు-ప్రదేశాలు:

  1. విజయవాడ, అక్కన్న-మాదన్న గుహలు: 1. శ్రీ ఉత్పత్తిపిడు(గు)
  2. విజయవాడ, ఉండవల్లి గుహాలయాలు : శ్రీ ఉత్పత్తి పిడుగు / శ్రీ గుణాదిత్య
  3. ప్రకాశం జిల్లా, సత్యవోలు : శ్రీ ఉత్పత్తి పిడుగు
  4. ప్రకాశం జిల్లా, భైరవకోన : 1. శ్రీ ఉత్పాతి పిడుగు,2.ఏకన్త నివాసి
  5. కర్నూలు జిల్లా, పగిడాల మండలం, ప్రాతకోట -1.శ్రీ ఉత్పత్తి, 2.పిడుగు
  6. కర్నూలు జిల్లా, సాతానికోట : శ్రీ ఉత్పత్తి పిడుగు/ఏకాన్తనివాసి లోక శీలాభిమాన(శిలాభిమాన)/ శ్రీ అర్జునన్‍ మహేశ్వర కాలాముఖ
  7. కర్నూలు జిల్లా, నంద్యాల కడమల కాల్వ శివనందీశ్వరాలయం: శ్రీ ఉత్పత్తి పిడుగు/ ఏకాన్త నివాసి
  8. కర్నూలు జిల్లా, మహానంది, రామాలయం: …వాన్ఱిత (ఉ)త్పత్తి పిడుగు కొళువు క్కా/…మియప్రితిని భీ…/..వ్రాసే
  9. మహబూబ్‍ నగర్‍ జిల్లా, ఆలంపురం చండికాలయం :
    1.శ్రీ ఉత్పాత్తి పిడు, 2.గు
  10. నాగర్‍ కర్నూలు జిల్లా, ఊరుగొండ- చెన్నకేశవాలయం :
    శ్రీ ఉత్పత్తి పిడుగు
  11. మహబూబ్‍ నగర్‍ జిల్లా, సంగమేశ్వరాలయం, కూడలి : శ్రీ ఉత్పత్తి పిడుగు/ఏకాంతనివాసి(8వ శ. లిపి)
  12. జయశంకర్‍-భూపాలపల్లి జిల్లా, పాండవులగుట్ట, రేగొండ : 1. శ్రీ ఉత్పత్తి పిడుగు, 2.ఏకన్తవాసి పరమ మ, 3.హేశ్వర భతన్‍ మహాముని
  13. జయశంకర్‍-భూపాలపల్లి జిల్లా, పాండవులగుట్ట, రేగొండ : ఉత్పత్తి పిడుగు
  14. నల్గొండ జిల్లా, ఏలేశ్వరాలయం : శ్రీ ఉత్పత్తి పిడుగు
  15. బోకర్ధన్‍ గుహ,ఔరంగాబాద్‍, మహారాష్ట్ర : శ్రీ ఉత్పత్తి పిడుగు


ఈ శాసనాలు లభించిన ప్రదేశాలను కలిపి చూసినపుడు ఇవన్నీ గుహాలయాలు, దట్టమైన అడవులలో ఉండడం శ్రీశైలంతో ముడివడి వుండడం గమనించవచ్చు. శ్రీశైలం కాలాముఖులు, కాపాలికుల కేంద్ర క్షేత్రం. ఈ మతాచార ప్రవర్తకుల మార్గాలు ఏకోన్ముఖంగా ఉన్నాయని అనిపిస్తున్నది.
ఉత్పత్తి పిడుగు శాసనాలలో 8చోట్ల శ్రీ ఉత్పత్తి పిడుగు లేదా ఉత్పత్తి పిడుగు పేర్కొనబడింది. 3చోట్ల శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి అని ఉంది. కర్నూలు జిల్లా, మహానంది, రామాలయంలో ‘…వాన్ఱిత (ఉ)త్పత్తి పిడుగు కొళువు క్కా/… మియప్రితిని భీ…/..వ్రాసే’ అని రాయబడడం చిత్రంగా ఉంది. ఇందులో ఒక్క ‘ఉత్పత్తి పిడుగు’ను గుర్తించడానికి వీలున్నది కనుక ఇది ఉత్పత్తి పిడుగు శాసనం అన్నారు శాసనవేత్తలు.
భూపాలపల్లి జిల్లా రేగొండ గ్రామం పాండవులగుట్ట మీద గొంతెమ్మగుహలో ‘శ్రీ ఉత్పత్తి పిడుగు, ఏకాన్తవాసి, పరమ మహేశ్వర భతన్‍ మహాముని’ అని చెక్కివున్న శాసనంలో పేర్కొనబడ్డ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి, పరమ మహేశ్వరుడైన భతన్‍ మహాముని గురించి చెపుతున్నది. పరమమాహేశ్వరులు కాలాముఖులేకదా. భతన్‍ మహాముని పరమమాహేశ్వరవ్రతుడు.


మరొకటి కర్నూలు జిల్లా, సాతానికోట శాసనంలో ‘శ్రీ ఉత్పత్తి పిడుగు/ఏకాన్తనివాసి లోక శీలాభిమాన (శిలాభిమాన)/ శ్రీ అర్జునన్‍ మహేశ్వర కాలాముఖ’ అని రాయబడింది. ఈ శాసనంలో ‘అర్జునన్‍’ మహేశ్వర కాలాముఖ శైవశాఖకు చెందినవాడని పేర్కొనబడ్డాడు. మిగతా ఉత్పత్తిపిడుగు శాసనాలలో ఉన్నట్లే ‘ఏకాన్తనివాసి’ సామాన్యమే. కాని, ఈ శాసనంలో అర్జునన్‍ కాలాముఖుడు ‘లోకశీలాభిమానుడు’. కనుకనే ‘లోకశీలం’ లోపించింద నుకున్న బౌద్ధాదిమతాలను నిర్మూలించడానికి బద్ధకంకణులైన కాలాముఖులు పూనుకున్నారని చెప్పవచ్చు. అంతేకాని శ్రీ ఉత్పత్తి పిడుగు ‘శిలాభిమానం’కల శిల్పుల సమాఖ్యకు చెందినదని చెప్పడం సముచితం కాదు.
6,7,8 శతాబ్దాలలో కాలాముఖ, కాపాలికులు ఆచరించిన మతసిద్ధాంతాలు, ఆలోచించిన తాత్వికభూమికలను అనుసరించి చూసినపుడు వాళ్ళెంత వీరమతాభిమానులై ప్రవర్తించినారో అర్థమౌతుంది. కాపాలికులలో భైరవాచార్యులు ఎంత భయంకరంగా కనిపించేవారో, వారి కార్యకలాపాలు ఎట్లా రహస్యంగా నెరిపేవారో భవభూతి ‘మాలతీమాధవం’ చదివితే తెలిసిపోతుంది. కాలాముఖులు, కాపాలికులు శివార్పణంగా నరబలులిచ్చేవారని చరిత్రలో చెప్పబడ్డది. శ్రీశైలం హఠకేశ్వరానికి చెందిన కాపాలికులు ‘ఆదిశంకరాచార్యు’ణ్ణే పట్టుకుని బలివ్వబోయారనే కథనాన్ని కూడా తలచుకోవడం అసందర్భమేమీ కాదు. తమిళనాట సంబంధనార్‍ ‘జైనుల’ను ఊచకోతకు గురిచేసినాడని, వారిని హింసించిన తీరుకు నిదర్శనంగా కొన్ని దేవాలయాల్లో చిత్రించిన ‘మ్యూరల్స్’ ఉన్నాయి. పాలకుర్తి సోమనాథుడు రాసిన ‘పండితారాధ్య చరిత్ర’లో5 దేవర దాసిమయ్య చేసిన జైనవ్రతావలంబుల వధ, జైన బసదుల కూల్చివేత గురించి పేర్కొనబడి ఉంది.

కాలముఖుల ఆగ్రహానికి గురైన బౌద్ధ, జైనక్షేత్రాల జాబితే పెద్దదే లభిస్తున్నది. ఉదాహరణకు పటాన్‍ చెరు (పొట్లచెరువు), కొలనుపాక, వరంగల్‍, పూడూరు వంటివి.
ఉత్పత్తిపిడుగు శాసనాలు గుహాలయాలవద్ద దొరకడంవల్ల వీటి నిర్మాణంలో భాగస్వాములైన శిల్పులు ఏర్పరచుకున్న సమాఖ్య, శ్రేణి ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ పేరుతో ఉండేదన్న అభిప్రాయం విశ్వసనీయంగా లేదు. లేదా శిల్పులను ఆదరించిన పాలకుని బిరుదు అనే వాదన సమంజసం అనిపించదు. ఇందుకు రేనాటిచోడ రాజులకున్న బిరుదు ‘ఎరికల్‍’ అంటే నిప్పురాయే కనుక వారికి ఈ శ్రీ ఉత్పత్తిపిడుగుకు సంబంధముందనే చరిత్రకారులున్నారు. ఉండవల్లి గుహాలయాలవద్ద ఉన్న ఉత్పత్తిపిడుగు శాసనంలో మాత్రమే రాజరికం ధ్వనించే ‘గుణాదిత్య’ అనే పేరున్నది. ఏ పరిపాలకుడో, ఎప్పటివాడో చెప్పదగిన చారిత్రక ఆధారాలేమీ లభించడం లేదు.
అందుచేత ‘శ్రీ ఉత్పత్తిపిడుగు’ మాహేశ్వరమతాన్ని నిష్టురంగా ఆచరించే కాలాముఖ, కాపాలికుల శ్రేణి అనుకోవడానికే అవకాశ ముంది.
ఉత్పత్తి పిడుగు-కొత్త ‘కంకాళధారి’ శాసనాలు
శ్రీఉత్పత్తిపిడుగు కాలాముఖులు, కాపాలికుల శాసనమేనని బలంగా చెప్పడానికి కొత్తదారి చూపిస్తున్న కొత్త శాసనాలు ‘శ్రీ ఉత్పత్తి పిడుగు-శ్రీ విశిష్ట కంకాళధారి’ శాసనాలు.


ఉత్పత్తి పిడుగు-విశిష్ట కంకాళధారి శాసనాలు:
తెలంగాణాలో…

  1. మహబూబ్‍ నగర్‍, అచ్చంపేట-సలేశ్వరం : శ్రీ ఉత్పత్తిపిడుగు, శ్రీ విశిష్ట కంకాళధారి (సలేశ్వరుని గుడిలో ఎడమవైపున ‘శ్రీ విశిష్ట కంకాళధారి అని నాగరిలిపిలో, ఉత్పత్తి పిడుగు అని బ్రాహ్మీలిపిలో రెండు విడిగా శాసనాలు చెక్కిఉన్నాయి.)
  2. కూడవల్లి, సంగమేశ్వరాలయం, నందిమంటపం ఎడమవైపు గోడమీద: 1. శ్రీ విశిష్ట కం 2.కాళధారి (9వ శ. లిపి) (inscriptions on stones and other materials-1979-80,p.32)
    రాయలసీమలో…
  3. సాలంక మల్లేశ్వరస్వామి ఆలయం, సాలంక, కొండూరు గ్రా. అట్లూరు మండలం, కడప- ‘శ్రీ విశిష్ట కం, కాళధారి’5
  4. శ్రీ ఇష్టకామేశ్వరి నిత్యపూజేశ్వరస్వామి ఆలయం, నిత్యపూజకోన, వంటాతిపల్లి, సిద్ధవటం, కడప- ‘ఉత్పత్తి పిడుగు, 2. శ్రీ విశిష్ట కంకాళధారి’ (దేవనాగరిలిపి)6
  5. కామాక్షి కపర్థీశ్వర స్వామి ఆలయం , కపర్థీశ్వర కోన, సిద్ధవటం మం. కడప జిల్లా- ‘శ్రీ విశిష్ట కంకాళధారి’
  6. రామలింగేశ్వరస్వామి దేవస్థానం, లంకమల, బద్వేలు మం. కడప జిల్లా- ‘శ్రీ విశిష్ట కంకాళధారి’


కంకాళధారి అంటే అస్థిపంజరం ధరించినవాడు లేదా పుర్రెలు, ఎముకలు ధరించినవాడనే అర్థం వస్తుంది. కంకాళధారులు కాపాలికులు. వీరి దైవం కంకాళమూర్తి కావచ్చు. శివుణ్ణి, శివావతారమైన భైరవుణ్ణి ‘కంకాళమూర్తి’గా ఆరాధిస్తారు. కంకాళమూర్తి శివుని అవతారం. బ్రహ్మశిరసును ఖండించినప్పటి శివుని దేశదిమ్మరి రూపం.
మయమత శిల్పశాస్త్రం
‘‘అధవాష్ట చతుర్బాహుః షడ్భుజోవా మహేశ్వరః
మణిభిః శంఖజైర్నాగైర్భూషితస్త్వహి కుండలః
పాలికం వామపత్రంవా క్షురికాలంకృతాకటిః
వ్యాఘ్రచర్మాంబరోదేవః శ్వేతవర్ణస్త్రిలోచనః
పాదుకాలంకృతంపాదం ఢక్కావాద్యాన్వితః కరః
సర్వాలంకృత సంయుక్తః సర్వభూతగుణాన్వితః
విభ్రమస్త్రీగుణావృతః కంకాలశ్చారువేషభాక్‍’’ అని కంకాళమూర్తి- ప్రతిమాలక్షణాన్ని వివరిస్తున్నది.


ఈ ఉత్పత్తిపిడుగు శాసనాలలో ‘శ్రీ విశిష్ట కంకాళధారి’ని పేర్కొనడం తమ సమాఖ్యగా ఎంచుకొన్నవారితో కొత్తశాఖనా? ఒక శైవాచార్యుడి పేరా? అనే సందేహం కలుగుతున్నది. విశిష్ట కంకాళధారి శాసనాలన్నీ 9వ శతాబ్దపు నాగరిలిపిలో అగుపిస్తున్నాయి.
ఉత్పత్తిపిడుగు మట్టుకు ప్రతిచోట 7,8 శతాబ్దాలపు తెలుగన్నడలిపిలోనే రాయబడ్డది. రెండు పేర్లను ఒకేచోట రాసినపుడు లిపి, భాషాభేదాలు ఎందుకు పాటించారు. బహుశః ‘శ్రీ విశిష్ట కంకాళధారి’ ఉత్పత్తిపిడుగు సంఘంలో కొత్తగా ఆవిర్భవించిన కాపాలికుల మతశాఖ కావచ్చు. ‘శ్రీ విశిష్ట కంకాళధారి’ లేఖనాలు ఉత్పత్తిపిడుగు సంఘం వారి కార్యాచరణలు 9,10 శతాబ్దాల వరకు కొనసాగాయని చెప్పే శాసనాధారాలుగా భావించాలి.
శ్రీ ఉత్పత్తిపిడుగు శాసనాలను పరిశీలించి విడమర్చినపుడు, అవి దేవాలయాలు, మూర్తులను చెక్కే శిల్పుల సమాజానికి సంబంధించిన సమాఖ్య శాసనాలు కాదు, కాలాముఖశైవుల సంఘాల లేఖనాలని స్పష్టమౌతున్నది. భైరవకోన నుంచి బోకర్ధన్‍ దాకా వేయబడిన ఈ శాసనాల వెనక కాలాముఖుల అన్యమత నిర్మూలనాదీక్ష ఎంత తీవ్రంగా


ఉండేదో బోధపడ్తున్నది. 7వ శతాబ్దం నాటికి బౌద్ధం పతనం అంచులదాక చేరిందని, జైనం నిరీశ్వరతత్వం కంటగింపుగా మారిందని భావించిన కాలాముఖ, కాపాలిక శ్రేణులు తీసుకున్న నిర్ణయాన్ని చాటినవే శ్రీ ఉత్పత్తిపిడుగు శాసనాలు. తొలినాళ్ళ ఉత్పత్తిపిడుగు ఏకాన్తవాసులు, మలినాళ్ళ ఉత్పత్తిపిడుగు కంకాళధారి శాసనాలు వారి అన్యమత శిక్ష, స్వమత రక్షలకు నిదర్శనాలై నిలిచాయి. 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు తెలుగునాట సంభవించిన రాజరికాల మార్పులు, బౌద్ధ, జైన, శైవ మతాల్లో వచ్చిన పరిణామాలకు గ్రాఫ్‍ వంటివి ఈ ఉత్పత్తి పిడుగులనిపిస్తున్నది.


ఆధార భూమికలు:
  1. చీమకుర్తి శేషగిరిరావు – ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’
  2. ఈమని శివనాగిరెడ్డి(సంపాదకుడు)- తెలుగు శిల్పుల వైభవం
  3. ఆంధ్ర మహాభారతం, శాంతిపర్వం,1-108పద్యం- ఉత్పథం
  4. రామాయణం-బాలకాండ
  5. భవభూతి-మాలతీమాధవం
  6. Sri Utpattipidugu — unread histories by Snehal Tambulwadikar- Khedkar
  7. నాగదాసరి మునికుమార్‍-‘నిత్యపూజకోన క్షేత్రమహాత్మ్యం’, పే.20
  8. డా. నేలటూరి వేంకటరమణయ్య (సంపాదకులు)- కడప శిలాశాసనములు వగయిరా-1912, సిద్ధవటం శిలా శాసనములు, పే.200
  • శ్రీరామోజు హరగోపాల్‍, ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *