రచనల నిషేధాలూ – భావ ప్రకటన స్వేచ్ఛ


పలానా రచనల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. అందుకని ఆ పుస్తకాన్ని నిషేధించండి. ఆ పత్రిక ప్రతులని జప్తు చేయండి అని చాలా మంది అంటూ వుంటారు. క్రిమినల్‍ కేసులు కూడా మరి కొంతమంది దాఖలు చేస్తున్నారు. భౌతిక దాడులు కూడా చేస్తున్నారు.
రాజ్యాంగం మన దేశ పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛని ప్రసాదించింది. దానికి కొన్ని పరిమితులు వున్నాయి. ఆ పరిమితుల్లో ఏదైనా రచన చేసినప్పుడు కూడా కొన్ని రచనలని నిషేధించాలన్న డిమాండ్‍ వస్తూ వుంటుంది. ఇలాంటి డిమాండుల్లో ఏమైనా న్యాయం వుందా? అలా డిమాండ్‍ చేయడం సరైందేనా? ఇలాంటి ప్రశ్నలకి సుప్రీంకోర్టు ఏం సమాధానం చెప్పిందో చూద్దాం. ఎన్‍ రాధాక్రిష్ణన్‍ వర్సెస్‍ యూనియన్‍ ఆఫ్‍ ఇండియా కేసులో రచయితల భావ ప్రకటనా స్వేచ్ఛని సుప్రీంకోర్టు పరిశీలించి కొన్ని కీలక పరిశీలనలని చేసింది.


‘మీషా’ అంటె మీసాలు. ఈ పుస్తకాన్ని నిషేధించడానికి సుప్రీంకోర్టులో ఆర్టికల్‍ 32 ప్రకారం ఒక కేసు దాఖలైంది. కేరళ రాష్ట్రంలోని కోజికోడు నుంచి వెలువడుతున్న ‘మాతృభూమి’ అన్న పత్రికలో ఈ రచన పబ్లిష్‍ అయింది. ఆ పత్రికని భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా చదువుతారు. ఇందులో హీరో క్యారెక్టర్‍ పేరు నవాచన్‍. అతను పెంచుకున్న మీసాలతో అతను చాలా ప్రసిద్ధుడు. అగ్రకులానికి వ్యతిరేకంగా, వాళ్ళ ఆధిక్యాన్ని ధిక్కరించడం కోసం అతను చాలా పెద్ద మీసాలు పెంచుతాడు.
ఒక సందర్భంలో నవాచన్‍కి అతని మిత్రునికి మధ్య జరిగిన సంభాషణలో అశ్లీలం వుందని అందుకని ఈ పుస్తకాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టులో రిట్‍ పిటీషన్‍ దాఖలైంది. ఆ పత్రిక ప్రధాన సంపాదకులపైన, యూనియన్‍ ఆఫ్‍ ఇండియా పైన ఈ కేసుని దాఖలు చేశారు. 2018 జులై నుంచి ప్రచురితమైన అన్ని సంచికలను జప్తు చేయాలని ఆ రిట్‍ పిటీషన్లో కోరినారు. అంతేకాదు ఈ నవలలోని అంశాలని తిరిగి ఏ పత్రికలో ప్రచురించకూడదని, ఇంటర్నెట్‍లో కూడా వుండకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆ రిట్‍ దరఖాస్తులో కోరినారు. అదేవిధంగా ఇలాంటి రచనలు తిరిగి ప్రచురించకుండా భారత ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాలని ఆదేశించాలని కోరినారు.


ఇంతకీ ఆ నవలలో పేర్కొన్న అశ్లీల సంభాషణల విషయానికి వస్తే అవి కొంత కఠినంగానే వున్నాయి. అయినా సుప్రీంకోర్టు ఈ విషయంలో రచయితల పట్ల, సృజనకారుల పట్ల సున్నితంగా వ్యవహరించింది. ఆ సంభాషణలని చూద్దాం.
‘‘ఈ అమ్మాయిలు గుడికి వెళ్ళే ముందు స్నానం చేసి
మంచి దుస్తులు వేసుకొని వెళ్ళతారు?’’ ఓ మిత్రుడి ప్రశ్న
‘‘దేవున్ని ప్రార్థించడానికి’’ జవాబు
‘‘కాదు… కాదు… వాళ్ళు చాలా మంచి దుస్తులని అందంగా వేసుకొని ప్రార్థన చేయాలా? తెలియకుండానే
వాళ్ళు ఓ విషయం తెలియ చేస్తున్నారు. అదే తాము సెక్స్కి సిద్ధంగా వున్నామని. లేకపోతే నెలలో ఆ నాలుగైదు రోజులు వాళ్లు గుడికి ఎందుకు రారు. సెక్స్కి తాము సిద్ధంగా లేమని ప్రజలకి తెలియ చేయడానికే ఆ నాలుగైదు రోజులు రారు.
సుప్రీంకోర్టు ఈ రిట్‍ పిటీషన్ని పరిష్కరించే క్రమంలో ‘మిషా’ నవలలోని ప్రధాన అంశాలని క్షుణ్ణంగా పరిశీలించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‍ 19(2) ప్రకారం నిషేధాలు విధించాల్సిన అవసరం వుందా? ఇదీ సుప్రీంకోర్టు తేల్చాల్సిన అంశం.
ఆ సంభాషణలో అశ్లీలత వుందా, పరువు నష్టం కలిగించే విధమైన సంభాషణలు వున్నాయా, దాని వల్ల ప్రజల మనస్సు దెబ్బతింటుందా? నైతికత, సత్‍ప్రవర్తన దెబ్బతింటుందా?


దీనికి సుప్రీంకోర్టు నెగటివ్‍గా సమాధానం చెప్పింది.
ప్రధాన న్యాయమూర్తి దీపక్‍ మిశ్రా, ఏఎమ్‍ డాన్విల్కర్‍, డి.వై. చంద్రచూడ్‍లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పుని పరిశీలనలు చేసింది. బేంచి తరపున ప్రధాన న్యాయమూర్తి ఈ తీర్పుని వెలువరించారు.
పుస్తకాలని నిషేధించడమంటే స్వేచ్ఛగా తమ ఆలోచలని వెలువరిస్తున్న వ్యక్తుల భావ ప్రకటనా స్వేచ్ఛని హరించడమేనని సుప్రీంకోర్టు ఈ తీర్పులో అభిప్రాయపడింది. ఏ సంభాషణ అయితే అవహేళనగా బాధిస్తున్నట్టు కన్పిస్తుందో అది పైకి మాత్రమే అలా కన్పిస్తుంది. అంతర్గతంగా దాని ఉద్దేశ్యం వేరు. ఆ మాటలు అన్న వ్యక్తి పురోగతిని, ఇతర సంఘటనలని గమనిస్తే అది అవహేళన చేసినట్టు అన్పించదు. ఈ కథలోని హీరో ప్రపంచాన్ని జయించాలని అనుకుంటాడు. పాఠకుడు దాన్ని ప్రేమించాలి అతనిపై సానుభూతి చూపాలి. ఆ సంభాషణలు సెన్సేషన్‍ కోసం రాసినట్టుగా లేవు. నవలలోని క్యారెక్టర్స్ని చూపించడం కోసం వాటిని రాశారు. అది ఊహాజనిత సత్యం.
దీన్నే షాబ్లో పిశాసో ఇలా అంటాడు. ‘‘నువ్వు ఊహించే ప్రతిదీ నిజమే’’ వక్రబుద్దితో చూసే పాఠకుడికి మాత్రమే అందులో అశ్లీలం, అనైతికత కన్పిస్తుంది. నిజానికి అవి ఏవీ అందులో కన్పించడం లేదు.
బేంచి ఇలా పరిశీలనలని చేసింది. ‘ఇలాంటి ఆరోపణల మీద పుస్తకాలని నిషేధిస్తే, సృజనాత్మకతనే వుండదు’. రచయితకు వున్న స్వేచ్ఛ సంపూర్ణం కాదు. కాని పరిమితులని విధించే ముందు కోర్టు ఆ పరిమితులు అవసరమా? అవి రాజ్యాంగంలోని ఆర్టికల్‍ 19 (2) పరిధిలోకి వస్తాయా నన్నది చూడాలి.
ఈ తీర్పులో ప్రధాన న్యాయమూర్తి దీపక్‍ మిశ్రా కొన్ని మంచి పరిశీలనలని చేశారు. అవి
సాహిత్యం అనేది స్వేచ్ఛని పలు విధాలుగా ప్రతిబింబిస్తుంది.
సృజనాత్మకతని మనం ఆపకపోతే అది సమాజానికి మేలు చేస్తుంది.
స్వేచ్ఛగా వున్న మనిషి ఆలోచనలని ఆమోదించే అవకాశం ఏర్పడుతుంది.
స్వేచ్ఛ అనేది సృజనాత్మకతకి మూలం. దానికి అడ్డుకట్ట వేస్తే అతని భావనకి ఆటంకం ఏర్పడుతుంది. తమ అభిప్రాయాలను రచయిత వెలిబుచ్చాలి. అప్పుడే పాఠకుడు వాటిని ఆనందంగా స్వీకరిస్తాడు.
సృజనాత్మక గొంతులని మౌనం వహించేలా చేయడం, మేధావి స్వేచ్ఛని ఆపకూడదు.
మనం అరాచ పాలనలో లేము ప్రజాస్వామ్య పాలనలో వున్నాం. ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం వుండాలి. భావ ప్రకటనా స్వేచ్ఛ వుండాలి. రచయితలు, సృజనకారులు వాళ్ళు ఆలోచించి నట్టుగా, భావాలని వెదజల్లాలి. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. దీన్ని కాపాడటమే కోర్టులు చేయాల్సిన పని.
తన పదాలతో స్వేచ్ఛగా రచయిత ఆడుకోవాలి. చిత్రకారుడు తన రంగులతో ఆడుకుంటున్నట్టు. ఊహశక్తిని నియంత్రించ కూడదు. ఆదేశించకూడదు.
ఇలా చాలా విషయాలని ప్రధాన న్యాయమూర్తి ఈ తీర్పులో చెప్పారు. తీర్పుని ఈ విధంగా వోల్టేర్‍ చెప్పిన మాటలతో ముగించారు. ‘మీరు చెప్పిన దానితో నేను ఏకీభవించను. కాని ఆ విధంగా చెప్పే హక్కుని నేను చచ్చేంత వరకు కాపాడుతాను. (యన్‍. రాధాక్రిష్ణన్‍ వర్సెస్‍ యూనియన్‍ ఆఫ్‍ ఇండియా (2018) ఏ ఎస్‍సి.పి. 725, తీర్పు తేది : 5.9.2018).
పాఠకుడి ఇష్టానికి వ్యతిరేకంగా ఓ రచన వున్నంత మాత్రాన ఆ రచనని నిషేధించడం సరైంది కాదు. నిషేధం విధించడం వల్ల స్వేచ్ఛగా అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం పోతుంది. అది సరైంది కాదు.
భావ ప్రకటనా స్వేచ్ఛకి – మరీ ముఖ్యంగా రచయిత స్వేచ్ఛకి గౌరవాన్ని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చింది.


-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *