మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం
సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. జలం లేనిదే జీవం లేదు. నీరు లేకుంటే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ప్రపంచానికి ప్రతీ నీటిబొట్టు విలువ తెలియాలి. ప్రాణంతో సమానంగా నీటిని జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నీటి కరువు తాండవిస్తోంది. నీరు చేతినిండా ఉన్నప్పుడు దుర్వినియోగం చేస్తే భవిష్యత్ తరాలకు నీటికొరత అతి త్వరలోనే వచ్చే ప్రమాదముంది. ఈ క్రమంలో నీటి ప్రాధాన్యతను తెలిపేందుకుమార్చి 22న ప్రపంచ జల దినోతవ్సాన్ని జరుపుతోంది యునైటెడ్ నేషన్.
1993లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆనాటి నుంచి గణనీయంగా అభివృద్ధి చెంది.. సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేవిధంగా రూపొందించబడింది. జల దినోత్సవం రోజున యునైటెడ్ నేషన్స్, టోక్యోలో యుఎన్ -వాటర్ డికేడ్ పోగ్రాం ఆన్ అడ్వోకసీ అండ్ కమ్యూనికేషన్స్ పై జర్నలిస్ట్ వర్క్షాప్ ను నిర్వహించి వరల్డ్ వాటర్ డెవలప్‍మెంట్ నివేదికను విడుదల చేసింది.
మొత్తం భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు కాగా.. 1.7 శాతం భూగర్భ జలాలు.. మరో 1.7శాతం మంచు రూపంలో ఇమిడి ఉంది. దీంతో భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ప్రవహిస్తుంటుంది. మరి అతి కొద్ది శాతమే ఉండే నీటి వనరులను ప్రపంచ ప్రజలందరు పరిరక్షించు కోవాల్సిన అవసరం చాలా ఉంది.
నీటిని దుర్వినియోగం చేయటం.. నీటి కాలుష్యానికి కారణమయ్యే వాటిని నిషేధించటం వంటి పలు అంశాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. భూమిపై మానవుడు సుభిక్షంగా.. సురక్షితంగా మనుగడ సాగించాలి అంటే నీటిని రక్షించుకోవాలి. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యతగా గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచ జల దినోతవ్సం రోజున యునైటెడ్ నేషన్ సూచనలను పాటించి..ప్రతి ఒక్కరు నీటి పరిరక్షణకు బాధ్యత వహించాలి.
జీవకోటికి నీరే ప్రాణాధారం
నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా, నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతోంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97 శాతం సముద్రాల్లోనే ఉంది. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3 శాతమే. ఈ నేపథ్యంలో జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‍ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్ కు లీకయ్యే నీటి చుక్క రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించిన వెంటనే ట్యాప్‍లను జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకూ ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
వీలైనంతవరకూ స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించక పోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్‍లను అమరుస్తున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడమెలాగో.. ఆన్ చేయడమెలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయాల్లో.. వీటిని తిప్పి అలాగే వదిలేసి, బయటకి వెళ్లిపోతే చాలా నీరు వ•థాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికే ప్రాధాన్యమివ్వడం ప్రయోజనకరం.
నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా.. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృథాను అరికట్టడం, పొదుపుగా వాడటం, పునర్వినియోగం.. తదితరాలన్నింటికీ ప్రాధాన్యమివ్వాలి. మనసుపెట్టి ఆలోచిస్తే మురుగునీటిని కూడా శుద్ధి చేసి, మళ్లీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి. అలాంటి నీటితో పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు. తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88