వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత!


మార్చి 3న వన్యప్రాణుల దినోత్సవం


అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి మార్చి 3న ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతారు. భూమి లెక్కలేనన్ని జీవజాతులకు, వృక్షజాలానికి నిలయం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, మనం ఉపయోగించే శక్తి, వంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన పదార్థాలన్నీ ప్రకృతి నుంచి పొందుతున్నాం.
అయితే రోజు రోజుకీ పెరుగుతున్న మానవ అవసరాలు వాతావరణ కాలుష్యం జీవ జాతులు, సహజ వనరులను జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో అన్ని జీవ జాతులలో నాలుగింట ఒక వంతు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఓ సర్వే అంచనా.. ఇలా జీవజాతులు అంతరించిపోతే ప్రక•తిలోని జీవుల మధ్య సమతుల్యత లోపించి మిగతా జీవజాతులు కూడా అంతరించే ప్రమాదం ఉన్నది. దీంతో మానవజాతి మనుగడ కూడా ప్రమాదంలో పడిపోతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వన్యప్రాణులను వేటాడడం తీవ్ర నేరం అనే నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతేకాదు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వార్షిక వేడుక అయినప్పటికీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతిరోజూ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇక ఈరోజును అటవీ వృక్ష జంతు సంతతి యొక్క విభిన్న రూపాలను సంరక్షించడానికి వచ్చిన అవకాశంగా జరుపుకుంటారు. ప్రజల్లో వీటిపై అవగాహన పెంపొందిస్తారు.
1973లో అంతరించిపోతున్న జాతుల వైల్డ్ ఫౌనా అండ్‍ ఫ్లోరాలో అంతర్జాతీయ వాణిజ్యంపై ఒప్పందం మార్చి 3న సంతకం చేశారు. అందువల్ల, డిసెంబర్‍ 20, 2013న ప్రకటించిన 68వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వన్యప్రాణుల దినోత్సవం అనే ఆలోచనను థాయిలాండ్‍ ప్రతిపాదించింది. ప్రపంచ దేశాల్లో అక్రమంగా జరుగుతున్న వన్యప్రాణుల రవాణా వన్యప్రాణుల వినాశనానికి దారితీస్తుంది. అందుకనే ప్రపంచ దేశాలు వాణిజ్య కార్యకలాపాలపై శ్రద్ద చూపాయి. పర్యవేక్షణ సంస్థలు వేట, వాణిజ్య కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతాయి.


వన్యప్రాణి సంరక్షణ కోసం రెండు రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను.. అరుదైన వృక్షజాతిని కాపాడడం. ఇక రెండవది వైవిధ్యమైన జంతులను సంరక్షించడం. ఇప్పటికే పలు దేశాలు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియ చేయడానికి వన్యప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించాయి. భారతదేశం‘పులి’, ఆస్ట్రేలియా ‘కంగారు’ ఇలా తమ జాతీయ జంతువును ప్రకటించాయి.
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాతోపాటు మనిషి ఆధునిక పోకడల కారణంగా అడవులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళలాడే అటవీప్రాంతాలు రానురాను కుంచించుకుపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో అరుదైన జీవ, జంతుజాలాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లుపొడుస్తూ అటవీ ప్రాణుల వేట యధేచ్ఛగా జరుగుతోంది. దుప్పిలు, అడవి పందులు, కుందేళ్ళు, నెమళ్ళు తదితర జంతుజాలాన్ని నిర్ధాక్షిణ్యంగా వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని జంతువుల చర్మాలకు డిమాండ్‍ పెరగడంతో వాటిని భూస్వాములు, అధికారులకు అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పక్షుల వేట సరేసరి. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణకు కేందప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించింది. కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రత్యేకించి కొన్ని జంతువులకు ప్రసిద్ధి. దేశంలో అడవుల పరిరక్షణ, అభివృద్ధి, విద్య, పరిశోధనకోసం డెహ్రాడూన్‍లో 1987లో భారత అటవీ పరిశోధన, విద్యా మండలి స్థాపించారు.


ఏం పాపం చేశాం.. మాకు బతకాలని ఉంటుంది!
పచ్చని అరణ్యాలు పలుచపడుతున్నాయి. కొండలు జన వాసాలుగా రూపాంతరం చెందాయి. దీంతో అరణ్యంలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశించి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా కనుమరుగవు తున్నాయి. అందుకే వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖాధికారులు, జంతు సంరక్షకులు అభిప్రాయపడుతున్నారు.
జూ సందర్శన
వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జూకి వచ్చిన సందర్శకులు సరదాగా వినోదం కోసం మాత్రమే వన్యప్రాణులను చూడాలనుకోకూడదు. వాటి జీవన విధానం, పర్యావరణంలో వాటి ఆవశ్యకత గరించి తెలుసుకోవాలి. ప్రతి ఏడాది జూలో వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. అందరూ వన్యప్రాణులను సంరక్షించడానికి కృషి చేయాలి. వాటిపై ప్రేమ చూపాలి. వాటి ఆవాసాలలోకి చొరబడకుండా ఉండాలి. ప్రస్తుతం మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. మిగిలిన జంతు జాతి అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *