ఎడారుల చిరుగాలి వాణి సూఫీ సంగీతపు రారాణి రేష్మాకు నివాళి


గాలి దూమారాల మధ్య హోయలు పోయే ఇసుక తిన్నెల మధ్య స్వరధారలా సాగిపోయిన ఆ గొంతు అప్పుడే ఆగిపోయింది. అక్షరమంటే తెలియని ఆమె తన స్వరలయలతో తరతరాల భారత ఉపఖండపు సూఫీయోగుల మార్మికతా మర్మాలు అలవోకగా తను గాత్రపు చాలులో మొలకలెత్తి అనామకుల ఆత్మలను తట్టిలేపేవి. పాటలు కట్టేది ఆమే.. పాడేది ఆమే. ఆధునికార్ధంలో చెప్పుకుంటే ఆమె గొప్ప సూఫీ గీత రచయిత, సుస్వరాల సంగీతపు రారాణి. ఆమెది ప్రాచీన సుఫియానా (భారతదేశ సుఫీ మత యోగుల సంగీతం) సంప్రదాయం. పేరు రేష్మా. ఆమె పాడిన పాటకు పాకిస్తాన్‍ నియంతలు నివాళి పట్టారు. పామరుడు పాదాభివందనం చేశాడు. సంగీతపు, సాహిత్యాభిమానులైన విద్యావంతుల మధ్యతరగతి ఆమెకు నిరాజనాలు పలికింది. మనదేశానికి ఒక నైటింగేల్‍ ఆఫ్‍ ఇండియా సరోజనీనాయుడు ఉన్నట్లే.. చిరుగాలికి హోయలు పోయే ఇసకతిన్నెలు దారులకు ఒక నైటింగేల్‍ ఆఫ్‍ డిసెర్ట్ ఉన్నారు. వసంతాలకు కోకిలలు ఉండడం మనకు తెలుసు. ఎడారులకు కోకిలలు ఉండడం చాలా అరుదు. కానీ ఇటు భారత్‍ అటు పాక్‍ ఆమెను ఎడారి కోకిలగానే ప్రస్తుతించింది. ఇరుదేశాల ప్రాచీన సంగీత సంప్రదాయాన్ని తన కళాతత్వరతతో నిలబెట్టిన విధుషీ రేష్మా దేశాల సరిహద్దులు తెలియని బంజార జాతి ఆమెది. అటువంటి మహాగాయని మణి లాహెర్‍లో కాలం చేశారు. మరో విషయం కూడా చెప్పుకోవాలి. సూఫీ సంగీత ప్రపంచంలో మహిళలు అరుదుగా ఉంటారు. ఈ సంగీత సంప్రదాయంలో ఖవ్వాల్‍కే ప్రాధాన్యత. కానీ తన స్వర రాగ తీగెల ముందు అన్ని సంప్రదా యాలను అధిగమించారామె. గానమైనా, పాట కట్టడమైనా అంతా సూఫీ యోగుల దైవదత్తమంటారామె. తాను నిమిత్తమాత్రురాలినని అంటారు. జీవితాంతం శాఖాహారిగా బతికిన రేష్మా అనేక అవార్డులు వరించినా దేనికీ తలవంచని కళాతపస్వి.

ఈ మధ్య ఉపఖండపు ప్రజల మధ్య మంచి సయోధ్య కుదిర్చిన వారిలో ఆమె పాట కూడా చేరుతుంది. విచిత్రంగా ఆమె అలవోకగా కట్టిన పాటలు హిందీ సినిమాను కూడా అలరించాయి. ప్రసిద్ధ నటుడు బాలీవుడ్‍లో ఒకనాటి హీరో రాజ్‍ కపూర్‍, దర్శకుడు సుభాష్‍ఘాయి వంటి వారు ఆమె గీతాలను వెతికి ఆమెతో కొన్నింటిని పాడించి, మరికొన్నింటిని లతతో పాడించారు. రేష్మా ఒక సాధారణ మహిళ. భారతదేశంలో పుట్టి పాకిస్తాన్‍లో కాలిడింది. దేశ దిమ్మర జీవన విధానాన్ని పుణికి పుచ్చుకున్న బంజారాల సంప్రదాయానికి చెందినవారు. రేష్మా 12 ఏళ్ల వరకు ఒకానొక అనామక బాలిక. చదువులేదు,. సంధ్యాలేదు. కేవలం సింధ్‍ ప్రాంతం లోని సూఫీయోగులు సమాధుల దగ్గర జరిగే సమారాధనలో పాటలు పాడడం, అక్కడే పొట్టపోసుకోవడం మాత్రమే తెలుసు. విభజన కాలాన తల్లిదండ్రులతో పాటు పాకిస్తాన్‍ సింధ్‍ ప్రాంతంలో స్థిరపడింది. అయితే వారు జన్మత బంజారాలైందున ఎక్కడ విడిది చేసినా పాటలు, ఆటలతో గడపడం వారి జీవన విధానం. ఆమె ఒక రకంగా పాటల మధ్య కనుతెరచి, క్యాన్సర్‍ ఉన్నదని తేలినా చివరి వరకు పాడుతూ మరణించింది. దశాబ్దాల తరబడి దానితో పోరాడింది. 1998లో అనుకుంటాను ఆమె హైదరాబాద్‍కు వచ్చింది. మరోసారి కూడా వచ్చింది. ఆమె మెహఫిల్‍కు వేదిక కులీఖుతుబ్‍షా స్టేడియం. శ్రోతలు 25 వేల మంది ఉంటారు. అనాడు ధం!ధం! మస్త్ మస్త్ ఖలందర్‍ పాటకు పునారాషహర్‍ అలౌకిక భావనలో తేలియాడింది. చార్మినార్‍ గుమ్మటాల కొస నుంచి ఆమె పాట పరవళ్లు తొక్కి గోల్కొండ కోట గోడల మీదుగా అలల తరగలై పరవళ్లు తొక్కింది. ఆమె పాట ప్రభావం ఎటువంటిందంటే ఒకసారి వింటే మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఉర్దూ పండింతుడు, దాశరథి, కాళోజీలకు సన్నిహిత మిత్రుడు భువనగిరికి చెందిన జైన్లీ మల్లయ్య గుప్త ఆమె గాయనశైలిని ఇప్పటికీ గుర్తు చేస్తాడు. కలిసినప్పుడల్లా ఆమెను, ఆనాటి మాహెల్‍ను గుర్తు చేస్తారని రచయిత, కవి అయిన ఒక మిత్రుడు చెప్పారు.

ఉర్దూ, హిందీ మిశ్రమ భాషలో ఆమె సొంతంగా కట్టుకున్న పాటలు పండితులను సైతం అలరించడం ఒక వైచిత్రి. 12 ఏళ్ల బాలికగాఉన్నప్పుడు రాజస్థాన్‍కు సరిహద్దులోని షహదాబాద్‍ కలందర్‍ అనే సూఫీ యోగి జయంతి సమారాధనలో రేష్మా పాటను విన్న పాక్‍ ఆకాశవాణి అధికారి విస్తుబోయారు. వెంటనే ఆ బాలికను కరాచీ తీసుకెళ్లి ఆమె పాడే పాటను రికార్డు చేయించారు. ఆనాటి నుంచి ఆ బాలిక రేష్మాగా సుఫీయానా కలాంలో (సూఫీగాన రీతి) గానానికి, కవితాభివ్యక్తికి చిరునామాగా మారిపోయారు. ఆమె పాటకు అల్లామియా దిగొస్తాడన్నది ఒక నానుడి. కానీ, కదిపితే పరవళ్లు తొక్కే ఆమె పాటకు పాకిస్తాన్‍ సైనిక నియంతలు నివ్వెరపోయి నివాళిపట్టారన్నది. వాస్తవం. మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు పేరు మార్చుకుని ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడ్డారు. ఆమె ఇక లేరన్న విషయం తెలిసిన వెంటనే వ్యధ చెందిన మిత్రుడొకరు మహాభారతాన్ని గానం చేసిన ప్రముఖ తేజన్‍బాయితో ఆమెను పోల్చారు. నిజమా అనిపించింది. అయితే వారికి పోలిక ఉన్నది నిజమే. ఇద్దరికీ అక్షరజ్ఞానం లేదు. రేష్మా సూఫీ గీతాలను ఎన్ని గంటలైనా పాడగలరు. తేజన్‍బాయి కూడా అంతే. మహాభారతంలోని 18 పర్వాలను యాది ఆధారంగా గానం చేస్తారు. మొత్తం ముగియడానికి మూడు నెలలు పడుతుందట. చిన్ననాడే వీధిగాయకులను విని దానిపై మక్కువ పెంచుకున్నారు. తేజన్‍బాయి ఒక్కరే ఏరాను తీసుకుని చత్తీస్‍ఘఢ్‍ కుగ్రామాలలో పాడుతుంటే విని ఆమెను బయటి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఇండియన్‍ పీపుల్స్ థియేటర్‍ ఆఫ్‍ ఆర్టస్ (ఇష్టా) సభ్యుడు, నాటక రంగ ప్రముఖుడు హబీబ్‍ తన్వీర్‍ లేనట్లయితే నిరక్షరాస్య మహిళలైన తేజన్‍బాయి గురించి, మహాభారతంపై ఆమె గాన కళా విన్యాసం గురించి భారతదేశ ప్రజలకు తెలిసేది కాదు. వయస్సులో సమవుజ్జీలైన రేష్మా.. తేజన్‍బాయి కళా ప్రస్తానాన్ని చూస్తే భారత ఉపఖండపు సంప్రదాయ జీవనంలోని ఉన్నత విలువలకు ప్రతీకలుగా నిలుస్తారు. కులాన్ని, మతాన్ని, దేశకాల పరిస్థితులను అధిగమించి మానవాళి మంచిని కోరుకున్న మహనీయులే. తనపాటకు దేశాల సరిహద్దులు లేవని భారత్‍, పాక్‍కు తనకు రెండు కళ్లని ప్రకటించిన రేష్మాకు నివాళి.


సామిడి జగన్‍ రెడ్డి,
949049155

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *