అనగనగా…


పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘రంగారెడ్డి బడిపిల్లల కథలు’ గురించి కవి జుగాష్‍ విలి గారి విశ్లేషణ.


కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారి ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 34 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు 13 కథలను ఎంపిక చేశారు. ఈ పుస్తకానికి కవర్‍ ఏలే లక్ష్మణ్‍, లోపలి బొమ్మలు కూరెళ్ల శ్రీనివాస్‍ వేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.
చిన్న పిల్లల్లో దాగిన సృజనాత్మకతను, ఊహాశీలతను, వ్యక్తీకరణ నైపుణ్యాలను వెలికి తీసి, మెరుగులు దిద్ది, వారి శక్తి సామర్థ్యాలకు ఒక ప్రయోజనం కల్పించి, వారి మానసికాభివృద్ధి దిశగా బాల సాహిత్యోద్యమం బలమైన కృషి చేస్తుంది. ఈ కృషి పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం కాకుండా అన్ని జిల్లాలలోని గ్రామీణ ప్రాంత బాలబాలికలను భాగస్వామ్యం చేయడం వరకూ విస్తరిస్తుంది. ఇందులో భాగంగానే 10 జిల్లాల బడి పిల్లల కథలు వెలువడు తున్నాయి. రంగారెడ్డి జిల్లా బడి పిల్లల కథలు కూడా అందులో ఒకటి.


పట్టణ, గ్రామీణ ప్రాంతాలకి ఒక అభివృద్ధిలోనే కాదు జీన విధానంలోనూ, సంస్కృతిలోనూ, అలవాట్లలోనూ, జీవన వికాసంలోనూ ఎంతో కొంత తేడా ఉంటుంది. రంగారెడ్డి జిల్లా నగర ప్రాంతంలో భాగంగా ఆధునిక, సాంకేతిక వసతులకు దగ్గరగా ఉన్న జిల్లా. పిల్లల ఆలోచనా విధానంపై సాంకేతిక జ్ఞానంపై ప్రాంతీయ విజ్ఞతా ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. కాని మౌలిక ఆలోచనల్లో, ఆసక్తులలో, మానవీయ స్పర్శలో ఒక ‘ఏకీకృత’ ఉంటుంది. అవన్నీ రంగారెడ్డి జిల్లా బడి పిల్లల కథల్లో కనిపిస్తాయి.


బాల్యంలో ఉండే భావధార నిండా ప్రస్ఫుటంగా కనిపించే అంశం మనిషి పట్ల, ప్రకృతి పట్ల అత్యంత ప్రేమ. నిజాయితీ, నిష్కల్మత్వం. ఈ కథలు పిల్లలకే కాదు, పెద్ద వాళ్లకి కూడా.
ఈ కథల్లో కథ రాసే పద్ధతి కన్నా కథ చెప్పే పద్ధతి చాలా కథల్లో కనిపిస్తుంది. దాదాపు అన్ని కథలూ ‘అనగనగా’ అని ప్రారంభమవుతాయి. వాక్య నిర్మాణం కూడా ‘కథ చెప్పే పద్ధతి’లోనే ఉంటుంది. కథ నెరేషన్‍ మన అమ్మమ్మలు, నాయనమ్మలు మనకి చెప్పినట్లే ఉంటుంది. అది పిల్లల సహజ వ్యక్తీకరణకి గుర్తు. పర్యావరణం పట్ల శ్రద్ధ, ధ్యాస పెద్దలకంటే పిల్లల్లోనే ఎక్కువ అని చెప్పే కథలు, కాలుష్య నివారణ గురించి, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించే, కుటుంబ విలువలను తెలియజేసే, అపాయాల నుంచి తప్పించే ఉపాయాలు గురించి, పొదుపు గురించి, జీవరాసుల్లో ఎవరి ప్రత్యేకత వారిదే అని చెప్పే కథలు ఈ సంకలనంలో ఉన్నాయి.
ఈ కథలు చిన్నారుల్లోని ఊహాశీలతకు, నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ బాల రచయితలకు ఆశీస్సులు. వీరిని ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు.


జుగాష్‍విలి, కవి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *