తోటి గిరిజన కళారూపం-ప్రదర్శనలో వైవిధ్యాలు


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగల్లో ‘గోండ్‍’ తెగ అతిపెద్ద గిరిజన సమూహం. ఈ తెగకు ఆశ్రితులుగా పర్ధాన్‍, ‘తోటి’ రెండు గిరిజన తెగలవారు గోండ్‍ తెగ వ్యుత్పత్తి. గోండ్‍ రాజుల చరిత్రలను ప్రదర్శనపూర్వకంగా కథాగానం చేస్తారు. ‘తోటి’ గిరిజనులు వీటితోపాటు గోండు గిరిజనులకు సంబంధించిన పెళ్ళిళ్లు, కర్మకాండలు, పండుగలకు సంబంధించి సాంప్రదాయక, చారిత్రక, సాంస్కృతిక విలువలను కీకిరి, కుజ్జీ, డక్కి, ప్రేపేర్‍ కాలికొమ్ము, డోలు వంటి వాద్యాలను వాయిస్తూ తెలియజేస్తారు.
పూర్వం ఆదిలాబాద్‍ జిల్లాలో ఉన్న గోండ్‍ గిరిజనులు 4,5,6,7 సగాలకు సంబంధించినవారు మాత్రమే నివసిస్తున్నారు. ఒక్కొక్క సగాకు సంబంధించి మళ్ళీ వారికి ఇంటిపేర్లు ఉంటాయి. వీరికి ప్రత్యేక దేవతలు ఉంటారు. ఈ సగాలు అటు ‘పర్ధాన్‍’ తెగ, ‘తోటి’ తెగ వారికి కూడ ఉంటూ, అవే ఇంటిపేర్లు కలిగి ఉంటాయి. గోండ్‍ గిరిజనులు ఏ సగావారో ఏ ఇంటిపేరు గలవారో అదే సగా అదే ఇంటిపేరు గలవారు ‘తోటి’వారు మాత్రమే ఆశ్రితులుగా ఉంటారు. వీరినే గోండ్‍వారు అంగీకరిస్తారు. ‘తోటి’వారు చెప్పిన కథలను పాటగా సంబోధిస్తారు.


గోండు తెగవారికి వంశపారపర్యంగా ‘తోటి’ వారు చెప్పే కథల్లో ‘సానపాట’ ఇది మూడు రోజులపాటు చెపుతారు. ఇందులో శూన్యం నుండి కలియుగం వరకు భూమి ఎలా పుట్టిందో చెబుతారు. ఈ కథను గోండ్‍ వారు చనిపోయిన సందర్భంలో ఆరోజు రాత్రి మొత్తం కళాకారులు కూర్చొని కథలు చెప్పడం వీరి సంప్రదాయం.
‘సదర్‍బేడి’ కథలో వీరికి సంబంధించిన 4,5,6,7, సగాలు ఎలా ఉద్భవించాయి, ఒక్కొక్క సగాకు దేవతలు, ఆచారాలు ఎలా పాటించాలి, ఏ సగా వారితో పెండ్లిళ్ళు చేసుకోవాలి… ఇలాంటి పూర్తి విషయాలు ఇందులో చెపుతారు. ఒక్కొక్క సగాకు ఒక రోజు చొప్పున 4 రోజులు చెప్తారు. ‘అన్నోరాణి పాట’ ఈ కథను మూడు రోజులు చెప్తారు. ఇందులో అన్నం ఎలా పుట్టింది, దానిని ఏవిధంగా వాడుకోవాలి?, అదే బతుకు ఆధారం కాబట్టి దాని గొప్పతనం గురించి ఉంటుంది. తర్వాత ‘వంశబేడి’ కథలో ఒక్కొక్క వంశం (సగా) ఎలా పుట్టింది, వారి ప్రత్యేకతలు గురించి ఇందులో రెండు రోజులు చెప్తారు. ఈ కథలన్నీ గోండు, తోటి గిరిజనుల సంస్కృతిని తెలియజేస్తాయి. వీటితో ‘గోండురాజుల చరిత్రకు సంబంధించిన కథలు రెండు రోజులు చెప్తారు. రాజుల పరిపాలన, వీరత్వం వంటివి ఇందులో వస్తాయి. వీరు పూజించే దేవతల గొప్పతనాన్ని తెలియజేస్తూ చెప్పే కథల్లో పెర్సాపేన్‍, జల్లిదేవర దేవతల గురించి చెప్తారు. మహాభారత కథలు, భీమదేవ కథ లాంటివి కూడా ప్రదర్శిస్తారు.
తోటి వారు గోండి భాషలో మాత్రమే కథలు చెప్తారు. ప్రధాన కథకుడు ‘కీకిర’ వాద్యం వాయిస్తూ కథ చెప్తుంటే వంతలు డక్కి వాయిస్తుంటారు. ఐదుగురు వరకూ ఉండే కళాకారుల ప్రదర్శన రాత్రులు, పగలు తేడా లేకుండా గంటల తరబడి ప్రదర్శన ఇస్తూ ఒక ప్రవాహంలాగా వారి ముందు కూర్చున్న ప్రేక్షకులు తమ సంస్కృతిని గురించి వింటూ ఆనంద సమయంలో హాస్యం, బాధ సమయంలో కరుణరసాభరితంగా ఉద్రిక్తులౌతారు.


గోండువారు ఏ కార్యక్రమం చేసినా ‘తోటి’ వారు లేనిదే ఆ కార్యక్రమం పూర్తికాదు. దీనికి సంబంధించిన వాద్య విశేషాలతో వారిని మెప్పించి వారి దగ్గర నుండి డబ్బులు, ధాన్యం, పశువులు, ఆభరణాలను హక్కుగా పొందు తారు.
‘తోటి’ గిరిజనులు కొంతమంది అటవీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతాలకు వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. అలా వచ్చిన ‘తోటి’ వారు వరంగల్‍, కరీంనగర్‍ తదితర ప్రదేశాలలో నివాస మేర్పరచుకున్నారు. గతంలో వీరు గోండుకు సంబంధించిన కథలు చెప్పిన అనుభవంతో మైదాన ప్రాంతంలో గోండు గిరిజనులు లేకపోయేసరికి మైదాన ప్రాంతాల్లో అన్ని కులాలవారికి మహాభారత కథలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. సొరకాయ బుర్రతో ఒక వాద్యాన్ని తయారు చేసుకుని దానిని వాయిస్తూ ప్రధాన కథకుడు కథ చెపుతుంటే మిగతా ఇద్దరు మద్దెల, హార్మోనియం వాయిస్తూ వంత పాడుతుంటారు. దీనిని ‘తోటి’ బుర్రకథ అని, ‘కిన్నెర’ కథ అనే పేర్లతో పిలిచేవారు. ఇలా చాలా సంవత్సరాలుగా వీరు జీవనో పాధి కోసం ప్రదర్శనలు ఇస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ఇతర కళారూ పాలకు సంబంధించిన హాస్యపు కథలను బుర్రకథ ద్వారా చెప్పేవారు.


వరంగల్‍ జిల్లాలో నకాషి వాళ్ళతో బొమ్మలు వేయించి, పటం ద్వారా కుల పురాణాలకు సంబంధించిన కథలను చెప్పే పటం కళాకారులు ఎక్కువగా ఉన్నారు. ఆ కళాకారులతో ‘తోటి’ కళాకారులు వాద్య సహకారులుగా, వంతలుగా ప్రదర్శన ఇచ్చేవారు. ఇలా వీరికి పటం కథల మీద, పటం కథలపై ప్రేక్షకులకు ఉన్న అభిమానాన్ని ఆసరాగా చేసుకొని ‘తోటి’ వారిలో కొన్ని బృందాలవారు ‘కొర్రాజుల’ పేరుతో దగ్గరలో ఉన్న ‘నాయకపోడు’ గిరిజనులకు ‘పద్మనాయక వృత్తాంతం’ అనే గిరిజనుల తెగ వ్యుత్పత్తి కథలను పటంలోని బొమ్మలు చూపిస్తూ కథ చెప్తారు. పటం కథలు తెలంగాణలో పన్నెండు ఉన్నాయి. ఇవి వారివారి కుల పురాణాలను తెలియజేస్తాయి. తెల్లటి పొడవాటి గుడ్డ మీద నకాషి వారిచేత కుల పురాణాలకు సంబంధించిన వృత్తాంతాన్ని, ముఖ్యమైన సంఘటనలను బొమ్మల రూపంలో గీస్తారు. వీటిని గుండ్రటి కర్రకు చుట్టుకొని ప్రదర్శన సమయంలో వేలాడదీస్తారు. కథను చెప్పే సన్నివేశంకు సంబంధించిన బొమ్మలు చూపిస్తూ వివరిస్తాడు. ఇలా ఒకవైపు నుండి పటం చూపిస్తూ, మరొకవైపు దానిని చుట్టుతారు. ప్రేక్షకులు పాత్రల బొమ్మలు చూసి కథ మీద ఆసక్తి పెంచుకుంటారు. ఇలా పటం కథలు నేటికీ ప్రజల ఆదరణ పొందుతూ ఉన్నాయి.


ఇలాంటి సమయంలో గిరిజనేతరులకు ఆశ్రితులైనవారే పటం కథల ద్వారా కుల పురాణాలు ప్రదర్శిస్తున్నపుడు ఆ ప్రేక్షకుల స్పందనబట్టి ‘తోటి’ గిరిజనులు దగ్గరలో ఉన్న నాయకపోడు గిరిజనులకు సంబంధించిన కథను చెప్పడం, దానితో వారు ‘కొర్రాజుల వాళ్ళు’గా పిలవబడటం మనకు వరంగల్‍ జిల్లాలో కనబడుతుంది. దీనికి ప్రధాన కారకడు జ్ఞానం కనకయ్య (తోటి) వారి తండ్రి, వీరు సంప్రదాయంగా వస్తున్న గోండి భాషను కూడ వాడకపోవడంవల్ల నేటి ‘తోటి’వారి పిల్లలకు గోండి భాష రాకుండాపోయింది. దీనికి కారణాలేంటి అని అదే కళా కారుడిని అడిగితే గోండి భాషలో మేం మాట్లాడితే ఇక్కడి ప్రజలు అదోరకంగా చూసేవారు. దానితో మేం మా భాషలో మాట్లాడుటలేదు. దానిద్వారా మా పిల్లలకు ఆ భాష రాకుండాపోయింది అని ఆవేదన వ్యక్తం చేశాడు.


మీ పూర్వం ప్రదర్శనను మాని ఇన్నిరకాల ప్రదర్శనలు రావటానికి కారణమేమిటి అనే ప్రశ్నకు ‘బతుకుదెరువు కోసం బహురూప విద్యలు’ అని సమాధానం ఇచ్చాడు. ఒక గిరిజన కళారూపం, సంప్రదాయసిద్ధంగా ఉన్న ప్రదర్శన పద్ధతిని వారి పరిస్థితులు, సామాజిక అవసరాల దృష్ట్యా ఏవిధంగా మార్పులు చేసుకుని జీవనం సాగిస్తున్నారనేదానికి నిదర్శనమే ‘తోటి’ కళారూపం.


భాషను, వాద్య విశేషాలను, దాతలను, ప్రదర్శన విధానాన్ని మార్చుకుని బతుకు పోరాటంలో తమ సంస్కృతిని తామే కోల్పోయే స్థితిలో ఉన్నారు. ఇలాంటి కనుమరుగైపోతున్న జానపద, గిరిజన కళారూపాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం సంస్క•తిని కాపాడినవాళ్ళం అవుతాం.


డా।। శ్రీమంతుల దామోదర్‍
ఎ : 9989139136

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *