పెరుగుతున్న జనాభా… తగ్గుతున్న వనరులు జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం


జనాభా పెరుగుదల ముఖ్యంగా ఇండియా, చైనా లాంటి దేశాలకు ఇది కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలను కలిగిస్తోంది. అధిక యువ శక్తితో ఇలాంటి దేశాలు అభివృద్ధిలో దూసుకు పోయేందుకు అవకాశాలు ఉన్నా.. అదే అధిక జనాభా ఈ దేశాలకు భారంగా కూడా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా ప్రతియేటా పెరుగుతూనే ఉంది. అందుకే జనాభా పెరుగుదల, దాని పరిణామాలపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేకించి ఓ రోజును కేటాయించారు. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1989లో ఐక్య రాజ్యసమితి ఈ రోజును ప్రారంభించింది.


1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువల్లే ఆ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 35 శాతానికి పైగా జనాభా.. ఇండియా, చైనాలోనే ఉన్నారు. ఎప్పుడో 1850లో ప్రపంచ జనాభా 100 కోట్లను దాటింది. 2020 మార్చి నాటికి 780 కోట్లను దాటినట్లు అంచనా. 2050 నాటికి 970 కోట్లు, 2055 నాటికి 1000 కోట్లకు చేరుతుందనే అంచనా ఉంది.


దేశంలో కరోనా కారణంగా చేపట్టని జనగణన

మన దేశంలో కరోనా మహమ్మారి కారణంగా తాజాగా జనగణన చేపట్టలేదు. 2011 లెక్కల ప్రకారం భారతదేశం జనాభా 1,21,05,69,573. ప్రస్తుతం 135 నుంచి 140 కోట్ల దాకా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 2020 జూలై 9 నాటికి భారత జనాభా 1,38,02,70,828 కోట్లుగా ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఇండియా, చైనా, అమెరికా, బంగ్లాదేశ్‍, పాకిస్థాన్‍ సహా 9 దేశాల్లో ఉంటారని అంచనా ఉంది.


జనాభా పెరిగే కొద్దీ భూమికి భారమే..
ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ భూమికి భారమేనని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. అడవులు అంతరించిపోతున్నాయి. నదుల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. మానవుల అత్యాశ కారణంగా భూమికి అంతా నష్టమే జరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. ఆహార కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ఆకలి చావులు తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో యంత్రాలు, పురుగు మందుల వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. సముద్రాల్లో ప్లాస్టిక్‍ వ్యర్థాలు రోజూ వేల టన్నులు పెరిగిపోతున్నాయి. ఇలా జనాభా పెరుగుదల వల్ల ఎన్నో నష్టాలు తప్పడం లేదు.


భారత్‍లో యువ జనాభా ఎక్కువే..
భారతదేశంలో యువ జనాభా ఎక్కువే. తద్వారా భారతదేశం త్వరగా అభివృద్ధి చెందేందుకు వీలవుతుంది. 2025 నాటికి జనాభాలో భారత్‍, చైనాను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో జనాభా నియంత్రణ అమలు కచ్చితంగా లేకపోవడమే ఇందుకు కారణం. నిజానికి ప్రపంచంలో కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశపెట్టింది భారత్‍లోనే. 1950లోనే కోట్లు ఖర్చు చేసింది. కానీ ఫలితాలు కనిపించలేదు. ఇప్పటికైనా కుటుంబ నియంత్రణా చర్యలు కఠినంగా పాటించకపోతే ఇండియాలో తీవ్రమైన కరవు పరిస్థితులు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


అభివృద్ధి దేశాల్లో మరణాల సంఖ్య తగ్గుముఖం
జపాన్‍ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మరణాల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. వైద్య రంగంలో అక్కడ వచ్చే అధునాతన మార్పుల వల్ల మరణాలు తగ్గి.. జనాభా సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఆ దేశాలకు భారంగా మారుతోంది. జపాన్‍లో ముసలివారి సంఖ్య బాగా పెరిగి పోయింది. ప్రస్తుతం భూమిపై 40 కోట్ల మందికి ఆహారం దొరకడం లేదు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆకలికి తోడు.. మురికి వాడల్లలో రకరకాల వ్యాధులు వస్తున్నాయి.


2050 నాటికి ఇండియా జనాభా ఎంతో తెలుసా ?
ఇండియా పరిస్థితి జపాన్‍, ఇటలీ స్థాయిలో కాకపోయినా ఇండియాలో కూడా జనాభా వృద్ధి రేటు తగ్గనుంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. 1991-2001 పదేళ్ల కాలానికి 2001-2011తో పోల్చితే జనాభా వృద్ధి రేటు 3.9 శాతం తగ్గింది. జనాభా పెరుగుదల విషయంలో భారతీయులు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పవచ్చు. 1950లో భారతీయ మహిళలు సగటున ఒక్కొక్కరు ఆరుగురు పిల్లలకు జన్మనిస్తే.. ప్రస్తుతం అది 2.1గా ఉంది.


మరో 25 ఏళ్లు
సాధారణంగా ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే జనాభా భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఆ దేశ లేదా ప్రాంత లేదా తెగకు చెందిన మహిళలు 2.1 మంది పిల్లలకు జన్మనివ్వాలి. ప్రస్తుతం ఇండియాలో జననాలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అందువల్ల మరో 25 ఏళ్ల పాటు ఇదే స్థాయిలో భారత జనాభా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అందులో హిమాచల్‍ ప్రదేశ్‍, పశ్చిమ బెంగాల్‍, మహారాష్ట్ర, పంజాబ్‍, ఆంధప్రదేశ్‍, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో మహిళలు జన్మనిచ్చే రేటు 2.1 కంటే దిగువకు చేరుకుంది.


2047లో గరిష్ట స్థాయికి
2018-19లో చేపట్టిన ఆర్థిక సర్వేలో 2030 నాటికి ఇండియాలో జననాల రేటు 2 కంటే దిగువకు చేరుకుంటుందని తేలింది. ఈ లెక్క ప్రకారం 2047 వరకు భారత దేశ జనాభా పెరుగుతూ పోయి గరిష్టంగా 161 కోట్లకు చేరుకుంటుందని.. ఆ తర్వాత తగ్గుదల నమోదు అవుతుందని అంచనా. మొత్తంగా 2100 నాటికి ఇండియా జనాభా 100 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా.


జనాభా తగ్గిపోతుంది
ప్రపంచ వ్యాప్తంగా జనాభా రేటు పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంటే మరికొన్ని దేశాలు… తమ జనాభా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. ఉదాహరణకు 2020లో జపాన్‍ జనాభా 12.70 కోట్లు ఉండగా 2050 నాటికి ఈ సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది. అంటే జనాభాలో 16 శాతం తగ్గుదల నమోదు అవుతోంది. ఇక ఇటలీ విషయానికి వస్తే ఇదే కాలానికి 6.10 కోట్ల జనాభా కాస్త 5.40 కోట్లకు చేరుకోనుంది. గ్రీస్‍, క్యూబా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనవచ్చని అంచనా.


అవగాహన కల్పించాలి
ఒక వైపు కుటుంబ నియంత్రణ పాటిస్తూ, మరో వైపు యువతను అభివృద్ధి వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. జనాభా విషయంలో అవగాహన కల్పించాలి. జనాభా పెరిగితే ఎలాంటి నష్టాలు ఉంటాయో యువతకు అవగాహన కల్పించాలి.


జనాభా పెరుగుదల తీరుతెన్నులు
భూమిపై మనిషి పుట్టుక మొదలైన తర్వాత వేల ఏళ్ల తర్వాత 1800లో మొదటి సారిగా జనాభా వంద కోట్లను దాటింది.

  • 1900 నాటికి జనాభా ఒకేసారిగా పెరిగి 200 కోట్లకు చేరుకుంది
  • 2000 వచ్చే సరికి జనాభా మూడింతలై 600 కోట్లకు చేరుకుంది
  • 2000 నుంచి 2012 అంటే పదేళ్లలో జనాభా 700 కోట్లు అయ్యింది
  • 2030 నాటికి రికార్డు స్థాయిలో 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చని అంచనా
  • 2100 నాటికి ప్రపంచ జనాభా 1000.90 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి లెక్కకట్టింది.
  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *