మనిషి పుట్టుక పుట్టకపోయినా.. మనలాగే అన్ని పనులు చేయగలిగితే.. మానవుడి వలె ఆలోచించగలిగితే… అదే ‘ మానవ-సమాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అవుతుంది. శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా విశేష కృషి ఫలితంగా ఈ అధునాతన టెక్నాలజీని ప్రపంచం త్వరలోనే అందిపుచ్చుకోబోతోంది. ఇందుకు సంబంధించి గ్లోబల్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇటివల కీలకమైన ప్రకటన చేసింది. అత్యంత సంక్లిష్టమైన సవాళ్లతో కూడిన ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ)’ రూపకల్పన పోటీలో తాము గమ్యానికి చేరువయ్యామని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ సొంతం చేసుకున్న బ్రిటిష్ కంపెనీ ‘డీప్‍మైండ్’ కీలక ప్రకటన చేసింది. ‘ఆట ముగిసింది. మానవ సమాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చేరువవుతున్నాం’ అని ఏజీఐపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త, ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాండో డీ ఫ్రెటాస్ పేర్కొన్నారు.
ఏజీఐ టెక్నాలజీలో మెషిన్ లేదా పోగ్రామ్‍కు అసాధారణ సామర్థ్యాలు ఉంటాయి. మనుషులు చేయగలిగే పనులను అవి సులభంగా నేర్చుకోగలవు, చేయగలవు. మనుషుల్లా ఆలోచించగలవు కూడా. మొత్తంగా ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే మనుషుల్లా ప్రవర్తించగలవు. ఏజీఐని సాధించేందుకు అదనపు డేటా, అధిక పనులు నిర్వహించగలిగే ఏఐ పోగ్రామ్స్ సామర్థ్యాన్ని పెంపొందించే పక్రియలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారని నాండో డీ ఫ్రెటాస్ వెల్లడించారు.
కాగా ఇటివలే డీప్‍మైండ్ కంపెనీ ఏఐ ఏజెంట్ ‘గాటో’ని ఆవిష్కరించింది. గాటో ఏఐ వేర్వేరు 604 పనులను సమర్థవంతంగా చేయగలదు. గాటోలో సింగిల్ న్యూట్రల్ నెట్‍వర్క్గా పిలువబడే కంప్యూటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్‍లోని నోడ్స్(భాగాలు) అంతర్గతంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. తద్వారా మానవ శరీరంలోని నరాల మాదిరిగానే అవి చురుగ్గా పనిచేయగలుగుతాయి. దీంతో గాటో మనుషుల మాదిరిగా చాటింగ్ చేయగలదు. చిత్రాలకు పేర్లు పెట్టగలదు. 1980ల నాటి వీడియో గేమ్‍లను కూడా ఆడగలదని డీప్‍మైండ్ తన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88