పులుల చరిత్ర..
అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని గ్లోబల్ టైగర్ డే అని కూడా పిలుస్తారు. 2010 సంవత్సరంలో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ టైగర్ సమ్మిట్‌లో గంభీరమైన జీవులపై అవగాహన కల్పించడానికి దోహదపడిన రోజు. 2022 సంవత్సరం నాటికి ఆయా దేశాల్లో పులుల సంఖ్య రెట్టింపు చేయాలని నిర్ణయించాయి. అడవి పులుల సంఖ్య విపరీతంగా తగ్గుముఖం పడుతూ ఉండటంతో.. 1970 సంవత్సరం నుండి పులులను సంరక్షించే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, పులుల సంఖ్య వేగంగా తగ్గింది. ఈ నేపథ్యంలో 13 వేర్వేరు దేశాల ప్రభుత్వాలు 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనిని టిక్స్-2 లక్ష్యం అని కూడా పిలుస్తారు.
పులుల ప్రాముఖ్యత..
పులుల సంఖ్య తగ్గడానికి వివిధ కారణాలను మనం గమనించొచ్చు. పులులను అక్రమంగా వేటాడటం, వాటి చర్మం, గోర్లతో అక్రమ వ్యాపారం వంటివి చేయడం వల్ల వాటి ఆవాసాలు కోల్పోతున్నాం. వాతావరణ మార్పులు మనిషి-జంతు సంరక్షణ, పర్యాటకం పెరగడం, పులుల పరిరక్షణకు నిధుల కొరత వంటివి పులుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. అందుకే పులుల సంఖ్యను పెంచేందుకు, వాటి స్థిరమైన పరిరక్షణ స్థాపనకు క్షీణతకు కారణమయ్యే పరిస్థితులను పరిశీలించ డానికి అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
వన్యప్రాణుల సంరక్షణ..
వన్యప్రాణుల సంరక్షణ అనేది మనందరిది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ (ఔఔఖీ) ప్రకారం 2020 నాటికి ప్రపంచంలో ఉన్నది కేవలం 3,900 పులులే. వాటిలో సుమారు 70 శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి. మరో మంచి విషయమేమిటంటే.. ఇండియా, నేపాల్, చైనా, భూటాన్, రష్యాలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయినా కూడా వాటి సంఖ్య చాలా తక్కువనే చెప్పొచ్చు.
జాతీయ జంతువు పులి..
మన దేశ జాతీయ జంతువు పులి.. రాచఠీవికి పెట్టింది పేరు. పులి అనేది ఎప్పుడూ శత్రువు ముందు తల వంచదు. దాని అడుగులు ఎల్లప్పుడూ ముందుకు పడతాయే తప్ప.. వెనక్కి వెళ్లవు. అది ప్రాణాలను లెక్క చేయదు. అందుకే అడవుల్లో పులి స్థానం సుస్థిరం. పులులు పుట్టాక.. అవి ఎక్కువ కాలం తమ తల్లిదండ్రులపై ఆధారపడవు. తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇష్టపడతాయి. రెండేళ్లు కాగానే అవి విడిగా వెళ్లిపోతాయి. మగ పులులకు సెక్సువల్ మెచ్యూరిటీ వస్తుంది. ఆడపులులకు నాలుగేళ్ల తర్వాత అది వస్తుంది. బాగా పెరిగిన పులి ఒక్కొక్కటి 140 నుండి 300 కిలోల బరువు
ఉంటుంది. ఆడపులి ఒకేసారి 35 కిలోల ఆహారాన్ని తినగలదు.
20 ఏళ్ల వరకు..
పులులు పుట్టినప్పటి నుండి 15 నుండి 20 సంవత్సరాలు జీవిస్తాయి. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. పులులు పుట్టిన సమయంలో వాటికి కళ్లు కనబడవట. తమ తల్లి నుండి వచ్చే వాసనను బట్టి తల్లిని ఫాలో అవుతాయి. పులి పిల్లల్లో సగం ఆకలితో చనిపోతాయట. లేదా చలికి తట్టుకోలేక చనిపోతాయి. పుట్టిన రెండేళ్లలో ఇలా చాలా పిల్లలు చనిపోతాయి. ఔఔఖీ లెక్కల ప్రకారం.. చాలా పులులు పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతున్నాయి. పులులు గంటకు 65 కిలోమీటర్లు వేగంతో పరుగెత్తుతాయి. అంతేకాదు రాత్రి వేళ మనుషుల కంటే పులులు ఆరు రెట్లు బాగా చూడగలవు. అవి పగటి వేళ కంటే రాత్రి వేళ బాగా వేటాడగలవు. అలాగని పగటి పూట వేటను మిస్ చేసుకోవు.
ఒకేరకమైన చారలుండవు..
ప్రతి ఒక్క పులికి చారలు అనేవి వేర్వేరుగా ఉంటాయి. మనషుల్లో ఏ రకంగా ఇద్దరికీ వేలి ముద్రలు అనేవి వేర్వురుగా ఉండవో.. అలాగే ఏ రెండు పులులకు కూడా ఒకేరకమైన చారలు ఉండవట. టైగర్లు అందరి కంటే వేగంగా ఈత కొట్టగలవు. ఆహారం కోసం ఎంత దూరమైనా ఈదుకుంటూ వెళ్తాయట. బెంగాల్ సుందర్ బన్స్ అడవుల్లో చాలా పులులు.. ఈదుతూ వెళ్లడాన్ని పర్యాటకులు చూసి ఆనందిస్తుంటారు. అంతేకాదు పులులకు నీటిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమట. పులి ఉమ్ములో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయట. అందుకే పులులకు గాయాలైనప్పుడు అవి తమ నాలుకతో గాయాన్ని రుద్దుకుంటాయి. దానివల్లే ఆ గాయం మానిపోతుందట.
పులులను ఎలా లెక్కిస్తారు..
1913లో ప్రపంచంలో లక్ష పులులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 3200లోపే ఉండటం పరిస్థితి ఏ మేరకు దాపురించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ వందేళ్లలో 90 శాతంకుపైగా పులులు అంతరించిపోయాయి. విచక్షణ రహితంగా పులులను వేటాడటంతో పాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే అవి అంతరించి పోవడానికి కారణమని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు.
2010లో ప్రపంచ వ్యాప్తంగా 3200 పులులు ఉండగా, 2020 ఏడాది నాటికి ఆ సంఖ్య 3900కి చేరింది. పులుల జనాభాలో పెరుగుదల సుమారు 22శాతం ఉందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రపంచంలో 690 పులులు పెరుగగా, ఒక్క భారత్ లోనే వాటి సంఖ్య 500 పెరగడం విశేషం. ప్రపంచంకెల్లా ఎక్కువ పులులు ఉన్న దేశం మనదేశమే.
వన్య ప్రాణుల గణాంక ఎలా జరుగుతుంది..?
వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు.
ఐదు పద్దతుల్లో వీటి గణాంకాల సేకరణ
భారత్‌లో నాలుగేళ్లకోసారి పులులను లెక్కిస్తుంటారు. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది. ఐదు పద్దతుల్లో వీటి గణాంకాల సేకరణ జరుగుతుంది. అటవీ సిబ్బంది నడిచే మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు. పగ్ మార్క్ విధానంలో సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు.
పులి పాదముద్రను బట్టి వయసు నిర్దారిస్తారు
మొదటగా ఒక గాజుపలకపై స్కెచ్ పెన్ తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు. నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్‌ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. ఆ తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. దాదాపు ఓ 20 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డకట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది. పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినది నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనేదాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు.
అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి, సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)కి పంపిస్తారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు.
ఇక అడవి జంతువులకు చెట్లకు, రాళ్లకు వాటి పాదాలను, శరీరాన్ని రుద్దుకుంటాయి. గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు శరీరంపై దురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయని, అప్పుడు వాటి వెంట్రుకలు, గోళ్లు ఊడిపోతుంటాయని అధికారులు చెబుతున్నారు. అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తించగలుగుతారు. సేకరించిన వెంట్రుకలు, గోళ్లకు డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధారిస్తారు.
గిన్నిస్ రికార్డులకు ఎక్కిన భారత పులుల గణన
భారతదేశంలో పులుల లెక్కింపు విధానం గత ఏడాది కొత్త గిన్నిస్ రికార్డ్ స•ష్టించింది. కెమెరాల సహాయంతో వన్యప్రాణి గణన ఇంత పెద్ద ఎత్తున ఇంకెక్కడా లేకపోవడంతో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డస్’కు ఎక్కింది.
పులుల గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
- పులి గట్టిగా గాండ్రిస్తే ఆ శబ్దం 3 కిలోమీటర్ల పరిధి వరకు వినిపిస్తుంది.
- ఏ రెండు పులుల శరీరంపై ఒకరకమైన చారలు ఉండవు.
- గతంలో ఎనిమిది పులి ఉపజాతులు ఉండేవి. కానీ ప్రస్తుతం మూడు మాత్రమే ఉన్నాయి.
- పులులు ఒంటరిగా జీవించేందుకే ఇష్టపడతాయి. విశాలమైన ప్రాంతాల్లోనే నివసిస్తాయి.
- పులి గరిష్టంగా గంటకు 65 కి.మీ. వేగంతో పరుగెత్తగలదు
- ఇవి మంచి స్విమ్మర్స్. నీటిలో బాగా ఈదగలవు.
- ఆరోగ్యవంతమైన పులి గరిష్టంగా 363 కేజీల వరకు బరువు పెరుగుతుంది.
- ఒత్తిడిలో ఉన్నప్పుడు పులులు చెట్లపైకి ఎక్కుతాయి.
- అప్పుడే పుట్టిన పులి పిల్లలకు కళ్లు కనిపించవు. 6-8 నెలల తర్వాతే పూర్తి స్థాయిలో చూడగలవు.
ఎసికె. శ్రీహరి, ఎ : 9849930145