ఎత్తు మడులపై పత్తి అంతరపంటగా కంది!


పత్తి సాగులో సమస్యలను అధిగమించడానికి బెడ్స్ (ఎత్తు మడులు) పద్ధతిని అనుసరించడం మేలని నిపుణులు చెబుతున్నారు. ట్రాక్టర్‍తో బెడ్స్ ఏర్పాటు చేసుకొని ఒక సాలు పత్తి, పక్కనే మరో సాలు కందిని మనుషులతో విత్తుకోవటం మేలని సూచిస్తున్నారు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా.. కండగల నల్లరేగడి నేలలైనా, తేలికపాటి ఎర్రనేలలైనా.. బెడ్స్పై పత్తిలో కందిని అంతర పంటగా విత్తుకోవటం రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగకరమని చెబుతున్నారు వ్యవసాయాధికారులు.
పత్తి పంటను ఎత్తుమడుల (బెడ్స్)పై విత్తుకోవటమే మేలని, అందులో కందిని అంతర పంటగా 1:1 నిష్పత్తిలో వేసుకోవటం వల్ల రైతులకు అనేక ప్రయోజనా లున్నాయని తెలిపారు.
పత్తిలో కంది పంటను బెడ్స్పై 1:1 నిష్పత్తిలో విత్తుకోవటం మేలని భావిస్తున్నారు. కందిని 1:1 నిష్పత్తిలోనే విత్తుకోవాలనేం లేదని, 4:1 నిష్పత్తిలో (4 సాళ్లు పత్తి, 1 సాలు కంది) కూడా విత్తుకోవచ్చని వారు సూచిస్తున్నారు. నల్లరేగడి నేలల్లో అయినా, తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా బెడ్స్ పద్ధతిలో పత్తిలో కందిని అంతరపంటగా విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు.


బెడ్‍ వెడల్పు అడుగు. రెండు బెడ్స్ మధ్య దూరం 5 అడుగులు. ట్రాక్టర్‍ సహాయంతో బెడ్స్ ఏర్పాటు చేయించుకోవాలి. మొక్కల మధ్య అడుగు దూరం పాటించాలి. మనుషులతో బెడ్స్పై విత్తనం నాటించాలి. సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసినప్పటికీ.. బెడ్స్ పద్ధతి వల్ల పొలంలో నీరు నిలబడదు. దీని వల్ల పంట పెరుగుదలకు ఎటువంటి ఆటంకం కలగదు.


బెడ్స్ పై సాగు వల్ల ఉపయోగాలేమిటి?

బెడ్స్ మీద విత్తిన విత్తనం సాధారణ పొలంలో కన్నా ఒకటి, రెండు రోజులు ముందే మొలుస్తుంది. అంతేకాదు, 90% వరకు మొలక వస్తుంది. వర్షపు నీరు ఒక్క రోజు కూడా పొలంలో నిలవకుండా కాలువల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీని వల్ల తొలి దశలో మొక్క పెరుగుదల ఒక్క రోజు కూడా కుంటుపడదు. బెడ్స్ లేకపోతే ఎక్కువ వర్షం పడినప్పుడు ఉరకెత్తే సమస్య ముఖ్యంగా నల్లరేగడి పొలాల్లో సాధారణం. బెడ్స్ వల్ల ఈ సమస్య లేకుండా పోతుంది.
అంతేకాదు, కాయకుళ్లు సమస్య కూడా వుండదు. బెడ్స్ లేకుండా సాగు చేసే పొలాల్లో పత్తి మొక్కలకు కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5-10% కాయలు కుళ్లిపోతూ ఉంటాయి. బెడ్స్ మీద వేయటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి, తేమ తగుమాత్రంగా ఉండటం వల్ల కాయ కుళ్లు వుండదు.
ఒక ఎకరంలో రెండు పంటలూ కలిపి 11 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒకవేళ పత్తి పంట ఏ కారణంగానైనా దెబ్బతింటే.. కంది పంటయినా రైతును ఆదుకుంటుందని.. అందుకని పత్తితో పాటు కందిని కూడా వేసుకోవటం మేలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
బెడ్స్పై కాకుండా మామూలుగా నల్లరేడగడి పొలంలో పత్తి మాత్రమే విత్తుకున్న రైతులు కూడా చాలా మంది ఐదారు
క్వింటాళ్లు మాత్రమే దిగుబడి తీయగలుగుతారని, అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించటం, గులాబీ పురుగు ఉధృతిని అదుపు చేయలేకపోవటం వల్ల దిగుబడి తగ్గుతుందన్నారు.
తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా పత్తితోపాటు కందిని బెడ్స్పై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదని తెలిపారు. తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటానికి బెడ్స్ ఉపయోగ పడతాయన్నారు. ఈ ఏడాది కూడా సాధారణం కన్నా అధికంగానే వర్షాలు పడతాయని భావిస్తున్న నేపథ్యంలో బెడ్స్ పద్ధతిని రైతులు అనుసరించడం మేలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

  • ఆనబోయిన స్వామి, ఎ : 9963 87 2222

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *