పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘వరంగల్‍జిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త మెండు ఉమామహేశ్వర్ గారి విశ్లేషణ.
కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ బాలచెలిమి వారి ఆహ్వానం మేరకు వరంగల్ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 35 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు 10కథలను ఎంపిక చేశారు. ఈ పుస్తకానికి కవర్ ప్రీతి సంయుక్త, లోపలి బొమ్మలు టి.వి.రామకిషన్ వేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ బాలచెలిమి నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.
చదువుతో పాటు సంస్కారాన్ని అందించేది బాల సాహిత్యం అని నమ్ముతాను. చదువుకొనే వయసులోనే సంస్కారమైన సందేశాలతో చక్కని చిట్టి కథలు అందించిన చిన్నారులకు అభినందనలు. పాఠశాల స్థాయిలో పిల్లలకు పఠనాసక్తిని పెంపొందించడం వల్ల వారిలో సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించవచ్చు. తద్వారా వారిలో రచనాసక్తిని కలిగించవచ్చు. నేటి విద్యా విధానంలో గ్రంథాలయ పుస్తకాలను పఠించడానికి తగిన అవకాశం కల్పించడం తప్పనిసరి కావాలి. బాలసాహిత్యం రాయాలంటే ‘‘ఎంత చేయి తిరిగిన రచయిత అయినా తన స్థాయిని తగ్గించుకోవాల్సిందే’’ అని మిత్రులు అంటుంటారు. కానీ నాకు అనిపిస్తుంది మన స్థాయి నుండి ఎదిగితే కాని బాలసాహిత్యం అందించలేము అని.
పెద్దలు రాసిన పిల్లల కథలకంటే, పిల్లలు రాసిన పిల్లల కథల్లో సహజత్వం ఎన్నో జీవిత సత్యాలను అలవోకగా కథల రూపంలో దృశ్యీకరించిన నేర్పరితనం మనకు కనిపిస్తున్నది. రానున్న కాలంలో మనిషి మాయమై మరమనిషిలా బతుకవలసి వస్తుందని, భవిష్యత్తు ప్రమాదాన్ని, మానవ సంబంధాలను మన ముందుంచిన ‘‘మా‘నవ’ సృష్టి’’. మనలను ఆలోచించేలా చేస్తుంది.
ప్రజల బాగోగులు చూడని వాడు పరిపాలకుడు కానే కాదంటూ ‘రైతేరాజు’ కథ స్పష్టం చేసింది. ప్రకృతి పట్ల ప్రేమతో వ్యవహరించి, చెట్లను సంరక్షించుకోకుంటే బతుకు భారమవుతుందని ‘‘ప్రకృతి వాళ్ళ’’ తో చెప్పించడం బాగుంది. జారిన జాంపండు వల్ల తన ప్రాణం దక్కిందని, జాంపండే నా ప్రాణమని చెప్పిన చిన్నారి కథనం కదిలించింది. మనం చేసి తప్పులు మనల్ని శిక్షిస్తాయి అని ‘ఒక టీచరు’ కథ చెబితే, ఇతరులకు సహాయం చేస్తే తప్పకుండా లాభం కలుగుతుందని ‘వరించిన అదృష్టం’ చెప్పింది. దేశం పట్ల పౌరుల కుండాల్సిన భక్తిని, ‘దేశభక్తి’, ద్వేషభావంతో ఉన్న పెద్దల కళ్లు తెరిపించిన చిన్నారులు ‘‘ముందుచూపు’’, స్నేహం మానవ బంధాలను బలపరుస్తుందని ‘‘నెయ్యం – చేసిన నయం’’ స్నేహితుల మధ్య వైరం శాశ్వతంగా ఉండటం మంచిది కాదంటూ ‘‘నిజమైన స్నేహితుడు’’ చెప్పడం బాగుంది. చక్కటి రచనలు అందించిన చిన్నారులను వాటిని పుస్తక రూపంలో తెచ్చిన ప్రచురణకర్తలను మనసారా అభినందిస్తున్నాను.
-మెండు ఉమామహేశ్వర్
బాల సాహితీవేత్త