తెలంగాణ ఆడపడుచు నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయం


పల్నాటినాయకురాలిగా, ధీరవీరవనితగా, తొలిమహిళా మంత్రిణిగా పేరుగాంచిన నాగమ్మ, మధ్యయుగపు తెలుగు వారి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొంది. కరీంనగర్‍ జిల్లా ఆరెపల్లిలో పుట్టిందనీ, తండ్రి చౌదరి రామిరెడ్డి (అరి అంటే పన్ను, చౌత్‍ అరి అంటే పండిన పంటలో, నాలుగో వంతును పన్నుగా వసూలు చేసే అధికారం పొందిన వారిని చౌదరి అని పిలిచేవారు. అంతేకాని ఇది కులానికి సంబంధించిన పదంకాదు!) గురజాల ప్రాంతానికొచ్చి జిట్టగామాలపాడులో నివాసమేర్పరచుకొని, వ్యవసాయం చేసుకొంటూ బతికాడనీ పరిశోధనలు తెలియ జేస్తున్నాయి. బావమరిది మేకపోతుల జగ్గారెడ్డి సహకారంతో అక్కడే స్థిరపడిపోయాడు చౌదరి రామిరెడ్డి. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొన్న నాగమ్మను ఎలాగైనా ప్రయోజకురాల్ని చేద్దామనుకొని, గోపన్న మంత్రి ఆధ్వర్యంలో మామూలు చదువులతో పాటు బాణాలు ఎక్కు పెట్టడం, గుర్రపు స్వారీ, యుద్ధవిద్యల్లో తర్ఫీదునిప్పించాడు. తమిళ, కన్నడ, సంస్కృత, తెలుగు భాషలను, రాజనీతి, తత్వశాస్త్రాలను కూడా ఆమెకు నేర్పించాడు చౌదరి రామిరెడ్డి.


అన్ని విద్యలనూ నేర్పి నాగమ్మను మేటిగా తీర్చిదిద్దిన గోపన్న మంత్రి శివారాధకుడు. ఆయన ప్రభావంతో నాగమ్మ కూడా శైవమతాన్ని ఆదరించింది. తన ప్రత్యర్థి బ్రహ్మనాయుడు వైష్ణవుడు కావడంతో, శివునిపై మరింత మక్కువ పెంచుకొంది. ప్రతిరోజూ శివపూజకు కొంత సమయం వెచ్చించేది. శివున్నే నమ్మిన నాగమ్మ పరమత సహనాన్ని కూడా పాటించింది. ఇతర మతాలపట్ల ఏ మాత్రం ద్వేషభావాన్ని ప్రదర్శించిన ఆధారాలులేవు!
నాగమ్మకు చౌదరిరామిరెడ్డి మేనల్లుడైన సింగారెడ్డితో వివాహం జరిగింది. పొంచివున్న దురదృష్టం కాళ్ళపారాణి ఆరకముందే సింగారెడ్డిని బలితీసుకుంది. మరోవైపు కన్న తండ్రిని బ్రహ్మనాయుడు హతమార్చాడు. విధిబలీయమైందని తెలుసుకొని, ఉన్నంతలో మనసును కుదుటపరచుకొని, శక్తియుక్తుల్ని కూడదీసుకొని కాలం వెళ్ళబుచ్చుతున్న నాగమ్మ, అనుకోకుండా అడవుల్లో వేటకెళ్ళి అలసిపోయిన అనుగురాజుకు, అనుచరులకు ఆతిథ్యమిచ్చింది. అనుగురాజు మెచ్చుకొని, నాగమ్మను వరం కోరుకోమన్నాడు. మంత్రి పదవినాశించిన నాగమ్మ కోరికను అనుగురాజు తీర్చాడు. మహామంత్రిణిగా అసమాన ప్రతిభాపాటవాలతో ఎత్తుకు పై ఎత్తువేసి, కుటిల రాజకీయాల్ని పటాపంచలు చేసి నిజమైన నాయకురాలనిపించు కొంది నాగమ్మ.


అంతటి ఆలోచనా పరురాలు, రాజనీతి జ్ఞురాలు, ప్రజా సంక్షేమానికి పెద్దపీటేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమెను గుర్తుంచు కోవడానికి కుల, మతాలకు అతీతంగా పల్నాడులో ఆడపిల్లలకు ఇప్పటికీ నాయకమ్మ అనీ, నాయకాంబఅనీ, నాగమ్మ అనీ పేర్లు పెట్టుకొంటూనే ఉన్నారు.
తాను శైవాన్ని నమ్మినా, గురజాలలోని పాతపాటేశ్వరిని పూజించేది. దాచేపల్లిలో రంగనాయకునికి ఒక ఆలయాన్ని నిర్మించింది. బ్రాహ్మనాయుడు మాచర్లలో చెన్న కేశవాలయాన్ని నిర్మిస్తే నాయకురాలు జిట్టగామాలపాడులో శివాలయాన్ని నిర్మించి చెన్నమల్లికార్జునాలయ మని పేరు పెట్టింది. (చెన్న అంటే అందమైన, చక్కనైన అని అర్థం).
దాచేపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో గల గామాలపాడుకు తూర్పుగా ఒక కి.మీ. దూరంలో జిట్టగామాలపాడు శిధిలాలున్నాయి. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక కోటగోడ, దానిలో ఉత్తరం వైపు ఒక శిధిలశివాలయం కనపడతాయి. ఈ శివాలయమే నాయకురాలు నాగమ్మ నిర్మించిన చెన్నమల్లికార్జునాలయం. స్థానికంగా దొరికే మాచర్ల నాపరాతితో, గర్భాలయం, అర్థమండప, మహామండపం (ప్రస్తుతం లేదు) తో నున్న ఈ ఆలయం, అధిష్ఠానం, పాదవర్గం, ప్రస్తరం, దానిపై నాలుగు అంతస్తుల నాగరవిమానం, గర్భాలయం ముందు నుంచి, అర్థమండంపై వరకూ నిర్మించిన శుకనాసి, కళ్యాణీ చాళుక్యవాస్తును తలపిస్తుంది. అప్పటి వరకూ ఆచరణలో నున్న కళ్యాణీ చాళుక్య వాస్తు సంప్రదాయంలోనే నాగమ్మ ఆలయాన్ని నిర్మించింది. అధిష్టానం వరకూ మట్టిలో మునిగిన ఈ ఆలయం గోడలపై నున్న సన్నటి, పొడవాటి స్థంభాలు వన్నె తెచ్చాయి. చిన్న కపోతం, దానిపైన ప్రతివర్గం, దానిపై నాలుగు అంతస్తుల శిఖరం ఆనాటి శిల్పుల పనితనానికి అద్దం పడుతున్నాయి. అర్థ మండపం గోడలకు రెండువైపులా కోష్టాలు, రాష్ట్రకూటుల శైలిని ప్రతిబింబిస్తున్నాయి.


గర్భాలయ ద్వారశాఖలపై చక్కటి శిల్పం, అర్థమండపంలో విరిగిన నంది, పగలిని భైరవ విగ్రహం సందర్శకులకు ఒక పక్క ఆనందం, మరోపక్క ఆవేదన ఒకేసారి అనుభవంలోకొస్తాయి. రాబర్ట్ సివెల్‍, బిఎస్‍ఎల్‍ హనుమంతరావు, స్వర్ణ వాచస్పతి, వైహెచ్‍కె మోహన్‍రావులు తమతమ రచనల్లో ఈ ఆలయాన్ని గురించి ప్రస్తావించినా ఈ గుడి, ఎక్కువమందికి తెలియని మాటనిజం. అర్థమండపం ముందు పై భాగాన ‘చెన్న మల్లికార్జునాలయమ’న్న శాసనముంది. నాయకురాలు నాగమ్మ నిర్మించిన – ఇప్పుడు శిధిలావస్థలో ఉన్న – యీ చెన్నమల్లికార్జునాలయాన్ని పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా ప్రకటించింది. 13వ ఆర్థిక సంఘం నుంచి 30 లక్షల నిధులతో ఊడదీసి పునర్నిర్మించింది. అయినా ఆలనా పాలనా లేక మళ్లీ శిథిలమైంది. పదిలపరిచేవారి కోసం ఎదురుచూస్తూనే ఉంది.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *