ఖైదీల హక్కులు


పుట్టబోయే శిశువు నుండి మరణించబోయే వ్యక్తి దాకా భారత రాజ్యాంగం హక్కులు కల్పించింది. పుట్ట బోయే శిశువు ఆడో, మగో నిర్దారణ నిమిత్తం పరీక్షలు చేయటం, బహిర్గతం చేయటం నేరంగా పేర్కొంటూ 1994లో కేంద్ర చట్టం వచ్చింది. కేవలం ఆడ శిశువు అనే కారణం చేత గర్భ స్రావం చేయటం కూడా నేరమే అంటూ 1971లో చట్టం వచ్చింది. అదే విధంగా తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2005లో వచ్చింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, విచారణ నెదుర్కొంటున్న ఖైదీలకు కూడా కొన్ని పరిమితులకు లోబడి రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం (ఆర్టికల్‍ 14), స్వేచ్ఛ (ఆర్టికల్‍ 19), జీవించే హక్కు (ఆర్టికల్‍ 21) ఉన్నాయి. రాజ్యాంగం, ఇతర చట్టాలు కొన్ని నిబంధనల మేరకు మాత్రమే వారి హక్కులను, జీవితాన్ని, స్వేచ్ఛను నియంత్రిస్తాయి. పూర్వకాలంలో ఖైదీలు అంటే శత్రువులుగా, సమాజం నుండి వెలివేయబడ్డ వ్యక్తులుగా పరిగణింపబడే వారు. కన్నుకు కన్ను, కొరడా దెబ్బలు, ఒంటరి ఖైదు, బహిరంగ మరణశిక్ష లాంటి ప్రాచీన తరహా శిక్షలకు చాలా దేశాలు మంగళం పలికాయి. చట్ట పరంగా ఒక నేరస్తుడికి ఉరిశిక్ష విధించటం కూడా అనాగరిక చర్య అని భావించి కొన్ని దేశాల్లో మరణ శిక్షకు కూడా స్వస్తి పలికాయి. మన దేశంలో నేరం రుజువైతే జరిమానా విధించటం, సాధారణ జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష, ఉరిశిక్ష, ఆస్తి జప్తి చేయటం మాత్రమే ఉన్నాయి. మరణశిక్షను కూడా అరుదైన కేసుల్లో అరుదైన వాటికి మాత్రమే అమలు చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, మానవ హక్కుల కోర్టులు ఖైదీల హక్కులను, గౌరవాన్ని పరిరక్షిస్తాయి. ముఖ్యంగా సత్వర పరిష్కారం అనేది ఖైదీలకు రాజ్యాంగం ప్రసాదించిన ముఖ్యమైన హక్కు.


హుస్సైనారా ఖాతూన్‍ వర్సెస్‍ స్టేట్‍ ఆఫ్‍ బీహార్‍ అనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో 1979 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‍ భగవతి ధర్మాసనం ఏళ్ల తరబడి ఎటువంటి విచారణ లేకుండా సత్వర న్యాయం కోసం ఎదురు చూస్తూ జైలు జీవితం గడుపుతున్న ఖైదీల జీవితాల్లో వెలుగు నింపుతూ ఒక సంచలన తీర్పునిచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఈ కేసుతోనే గుర్తింపు లభించటమే కాకుండా రాజ్యాంగ హక్కుల కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను స్వయంగా ఆశ్రయించలేని వ్యక్తులు, ప్రజా సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు బాధితుల గోడు తెలియజేస్తూ వ్రాస్తున్న ఉత్తరాలను కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించటం జరుగుతుంది. పై కేసులోని తీర్పు ద్వారా దేశంలోని వివిధ జైళ్లలో సత్వర న్యాయానికి నోచుకోకుండా ఎటువంటి విచారణ లేదా శిక్ష లేకుండా మగ్గుతున్న దాదాపు 40 వేల మంది ఖైదీలు స్వంత పూచీకత్తుపై బెయిలుపై విడుదల చేయబడ్డారు. మున్నా వర్సెస్‍ స్టేట్‍ ఆఫ్‍ ఉత్తర ప్రదేశ్‍ అనే కేసు విచారణలో ప్రభుత్వం నిర్వహించే బాల సదనంలో నిర్బంధించాల్సిన బాల నేరస్తులను కాన్పూర్‍ కేంద్ర కారాగారంలో ఉంచినట్లు, బాల నేరస్తులను ఇతర ఖైదీలు సెక్స్ పరంగా వేధించేవారని తేలింది. బాల నేరస్తులను వెంటనే ప్రభుత్వ బాల సదనంకు మార్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. అదే విధంగా విచారణలో ఉన్న ఖైదీలు, శిక్ష పడిన ఖైదీలను జైళ్లలో వేర్వేరుగా నిర్బంధించాలి. ఖైదీలందరు ఉచిత వైద్య సదుపాయానికి అర్హులు. మొదటి సారి కోర్టు ముందు హాజరు పరచినప్పుడు న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత గురించి ఖైదీ ద్వారా తెలుసుకోవాలి. ఆర్థిక స్తోమత లేదని తెలియజేస్తే సంబంధిత కోర్టు ఉచిత న్యాయసహాయం అందించాలి. పోలీసు అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఖైదీ తెలియజేస్తే, ఆసుపత్రికి తరలించటమే కాకుండా కోర్టులు జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా జైళ్లలో విచారణ నిమిత్తం ఖైదీలుగా ఉన్న వారికి కూడా అవసరమైతే ఉచితంగా న్యాయవాదిని నియమించాలి. శిక్ష విధింపబడిన తర్వాత కూడ పై కోర్టుకు అప్పీలు చేసుకోడానికి అవసరమైతే ఉచితంగా న్యాయవాదిని నియమించాలి. కేసు పూర్వాపరాలను బట్టి ఖైదీకి బెయిలు పొందే హక్కు ఉంది.

నేరం రుజువైందని కోర్టు భావిస్తే శిక్ష విధించే ముందు న్యాయస్థానం నిందితుడు నుండి అతని వాంగ్మూలం విన్న పిదప మాత్రమే శిక్షాకాలం నిర్ణయించాలి. నేర శిక్షా స్మృతి ప్రకారం నిందితుడిని అరెస్టు చేసిన నాటి నుండి 60 రోజులు లేదా 90 రోజుల్లోగా ప్రాసిక్యూషన్‍ వారు చార్జిషీటు దాఖలు చేయనట్లైతే బెయిలు పొందే హక్కుంది.
జైలు అధికారులు నియమాలకు విరుద్ధంగా ఖైదీలతో ప్రవర్తిస్తే, న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉంది. మహిళా ఖైదీలు, బాల నేరస్తులను మిగతా ఖైదీల నుండి వేరుగా నిర్బంధించాలి. ఖైదీలు జైలు నియమాలను పాటిస్తూ తమ న్యాయవాదిని, బంధువులను జైలు ఆవరణలో కలుసుకునే హక్కు కల్పించ బడింది. బంధువులకు జైలు నిబంధనల ననుసరించి ఉత్తరాలు రాసుకోవచ్చు. ఇతర ఖైదీలకు భంగం కలుగకుండా మతపరమైన విధులు నిర్వహించుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. శిక్ష పడిన ఖైదీలు జైలులో వారు చేసిన పనికి వేతనం పొందే హక్కు జైలు నిబంధనలు కల్పించాయి.


జాతీయ క్రైమ్‍ రికార్డస్ బ్యూరో ప్రకారం 2020 చివరి నాటికి 4.83 లక్షల మంది ఖైదీలతో దేశంలోని 1,339 జైళ్లు కిక్కిరిసి ఉన్నాయి. ఇందులో 20వేల పై చిలుకు మహిళలు, 1,427 మంది బాలలు కాకుండా విదేశీ ఖైదీలు కూడా ఉన్నారు. జైళ్ల పని తీరు ఏ మాత్రం గొప్పగా లేదని, ఖైదీలకు సరిపడు సౌకర్యాలు, వైద్య సదుపాయాలు లేవని, బడ్జెట్‍ కేటాయింపులు అంతంత మాత్రమే అని, కిక్కిరిసిన ఖైదీల మూలాన వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయనేది వాస్తవం. జైలు స్థితిగతులు తెలుసుకోడానికి సంబంధిత జిల్లా కలెక్టర్‍, జిల్లా సెషన్స్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ అధికారులు స్వయంగా సందర్శించి, ప్రభుత్వానికి సూచనలు, జైలు సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. జైళ్ల నిర్వహణలో సంస్కరణలు తేవాలి. మొక్కుబడిగా బడ్జెట్‍ కేటాయింపులతో సరిపుచ్చకుండా తగిన విధంగా అభివృద్ధి దిశగా నిధులు మంజూరు చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను సిబ్బందితో వెంట వెంటనే భర్తీ చెయ్యాలి. ఖైదీలు పారిపోకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. సీసీ కెమెరాలను బిగించాలి. వాటి పర్యవేక్షణ ఉన్నతాధికారికి ఇవ్వాలి. జైలు సిబ్బంది లంచాలు తీసుకొని కొంత మంది ఖైదీలకు దొంగ చాటుగా మందు, సెల్‍ ఫోను, సిగరెట్లు, ఇంటి భోజనం, ఇతర ప్రత్యేక సౌకర్యాలు అందించకుండా నియంత్రణ చేపట్టాలి. సెల్‍ ఫోను ద్వారా బయటి వ్యక్తులకు సందేశాలు అందకుండా జామర్లు బిగించాలి. న్యాయమూర్తులు కేసుల ఆధారంగా అర్హులైన నిందితులకు బెయిలు మంజూరు చేయాలి. చిన్న నేరాల్లో జామీను ఇచ్చుకోలేని నిందితుడిని అవసరమైతే స్వంత పూచీ కత్తుపై విడుదల చేయాలి. లోక్‍ అదాలత్‍ పక్రియను సద్వినియోగం చేసుకొని కేసుల సత్వర పరిష్కారం కోసం కృషి చేసినప్పుడే జైళ్లపై భారం తగ్గుతుంది.

  • తడకమళ్ళ మురళీధర్‍
    ఎ : 9848545970

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *