కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’


శాంతి కపోతం ఆరడుగుల అందగాడుగా రూపం ఎత్తితే ఎట్లా ఉంటుంది? అచ్చం గులాం యాసీన్‍లా ఉంటుంది. గులాం యాసీన్‍ ఎవరూ అని అడుగుతున్నారా? కొంచెం ఓపిక పట్టండి ఆ కథ ఈ కథ చివర్లో వినిపిస్తాను.
మొగల్‍పురాలో రిఫాయేఆం స్కూలు దాటి అక్కన్న మాదన్నల గుడి ముందు నుండి నడుచుకుంటూపోతే కుడివైపున మీర్‍ మోమిన్‍ దాయెర, మీర్‍జుమ్లా తలాబ్‍ (చెరువు) -ఎడమవైపు సుల్తాన్‍షాహీ బస్తీ ఉంటుంది. గాన సుజనులారా ప్రవేశించండి సుల్తాన్‍ షాహీలోకి! కుతుబ్‍షాహీల కాలంలో ఇచ్చోటనే కదా టంకశాల ఉండేది. అందులో రాజముద్రలు వేయబడిన టంకములను తయారు చేసేవారు!
మహామంత్రి మాదన్న కాలంలో ఈ ప్రభుత్వ టంకశాల ఏర్పాటు చేయబడింది. బంగారు, వెండి, రాగి, సత్తు నాణాలు ముద్రించబడేవి. సత్తు నాణాలకన్నా తక్కువ, చివరి విలువ కల్గినవి గవ్వలు. ‘‘గుడ్డి గవ్వకు కూడా పనికి రాడు’’ అన్న సామెత ఆరోజులలోనిదే. బంగారు నాణాన్ని ‘వరహా’ అనేవారు. ఫార్సీలో దీని పేరు ‘‘హోను’’. యూరోపియను ‘‘పెగోడా’’ అనే వారు. మళ్లీ ఒక వరహాను 15 ఫనములుగా విభజించేవారు. ఈ ఫనములు కూడా చిన్న సైజు బంగారు నాణాలే. అందుకే ‘‘తృణమో ఫణమో’’ అన్న సామెత పుట్టుకొచ్చింది. వరహా గుండ్రంగా, పలుచగా 5/8 ఇంచుల వెడల్పుతో ఉండేది. ఒక వరహా బరువు 52 1/2 గురిగింజలు (మాష లేక మాసం) లేదా 21 3/4 క్యారెట్లు. తూనికలలో 180 గురిగింజలకు సమానం ఒక తులం. ఈ వ్యవస్థ అంతా మాదన్న మహా మంత్రి మేధో ఫలితం.


నైజాముల కాలంలో ఉస్మానియా రూపాయి చెలామణీలో ఉండేది. దీనినే ‘‘హాలీ’’ రూపాయి అనేవారు. ఇది హైద్రాబాద్‍ రాజ్యానికే పరిమితం. సికింద్రాబాద్‍, ఆంధ్రా ప్రాంతంలో ‘‘కల్దార్‍’’ రూపాయి ఉండేది. హాలీ రూపాయికీ, కల్దార్‍ రూపాయికీ అణాలు పదహారే. అయితే హాలీ అణాకు ఆరు పైసలు కల్దార్‍ అణాకు నాలుగు పైసలు. ఒక్క హాలీ పైస రెండు దమ్మిడీలకు సమానం. దమ్మిడీల కన్నా చివరి విలువ కల్గినవి గవ్వలు. గ్రామీణులు గవ్వలను వాడేవారు. ఐదవ నిజాం కాలం వరకు గవ్వలు చెలామణీలో ఉండేవి.
అబుల్‍ హసల్‍ తానీషా నవాబు గారి ప్రధాన మంత్రి పేరు మీర్‍ జుమ్లా. ఆయన విశాలమైన చెరువుని తవ్వించాడు. దూర ప్రాంతాల నుండి వచ్చే వర్షం, వరద నీటితో అది హమేషా కళకళలాడుతుండేది. దానిని ప్రజలు మీర్‍జుమ్లా తలాబ్‍ అని పిలవసాగారు. ఆయన చెరువుకు సమీపంలో విశాలమైన ‘‘భాగ్‍ భగీచాను’’ నిర్మించి అందులో అందమైన అతిథి గృహన్ని ఏర్పాటు చేశాడు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యులు గాలి మార్పు కోసం ఎక్కడికైనా విశ్రాంతి కోసం వెళ్లమనగా ఆ పూదోటను చేరుకున్నారు. తానీషా ఆందోళన చెంది ఆయన్ని పరామర్శిద్దామని అక్కడికి చేరుకుని ఆ ఉద్యానవన అందాలకు ఆపూదోటల పరిమళాలకు పరవశించి ‘‘ఖాస్‍కర్‍’’ తన కోసం కూడా ఒక మహల్‍ను నిర్మించుకున్నాడు. అట్లా రసికజన మనోరంజనులు నివసించే ఆ ప్రాంతానికి సుల్తాన్‍ షాహీ అని పేరొచ్చింది.


అరవై ఏండ్ల కిందట ఆ తలాబ్‍ కట్టను రాచెరువుకట్ట అని పిలిచేవాళ్లు. రాజు తవ్వించిన చెరువు కావున పామరుల నోళ్లల్లో అది రాచెరువు అయిపోయింది. ముస్లింలు తాలాబ్‍ క్ట అనేవారు. ఆ చెరువు పక్కన్నే దట్టమైన అడవి. అందులో ఒక శివాలయం
ఉండేది. ఆ అడవిలో తాటి చెట్ల నీడల కింద ప్రజలు తియ్యటి కల్లు తాగుతూ పురుసత్‍గ బాతాఖానీ పెట్టేవారు. సాయంత్రం అయ్యేసరికి ఆ కట్ట మీద ఒక్క పురుగైనా కనిపించేది కాదు. ఎవరైనా అకేలా ముసాఫిరులు ఆ కట్ట మీద కాలినడకన వెళ్తుంటే దొంగలు నిలువు దోపిడీ చేసేవారు. మాఘమాసంలో కుటుంబాలు అక్కడికి వొండుకుని తినటానికి ‘‘చెట్లల్లకు’’ పోయేవారు. (వనభోజనాలు). ఇంగ్లిష్‍ వారు gone to the stones అంటారే అట్లన్న మాట. ఎద్దుల బండ్ల చక్రాలు కిర్రు కిర్రుమని చప్పుడు చేసుకుంట ఆ కట్ట మీది గులకరాళ్లపైన పోతుంటే ఆ సంగీతం విన సొంపుగా ఉండేది.


వనభోజనాలకు వచ్చినవారు ఆ అడవిలో మూడు రాళ్లు ఏరుకొచ్చి, అక్కడే దొరికిన చితుకులు, కట్టెపుల్లలతో పొయ్యి రాజేసి, పొగతో కండ్లు మండంగ, చెంపలుబ్బించి ఉఫ్‍ ఉఫ్‍ మని ఊది ఊది మంటను రగిలించి వెలిగించి సలసల కాగే నూనె కాడాయిలో గారెలు, పూరీలు తయారు చేసేవారు. మరికొందరు ఆడవాండ్లు ఇంటి నుండి తెచ్చిన ఎర్రకోడి పుంజును అక్కడే కోసి, బూరు పీకి, పసుపు రాసి, నిప్పుల మీద అటు ఇటు క్రిందా మీద కాల్చి ఆ తర్వాత పురుసత్‍గ పెద్ద కత్తితో ముక్కలు ముక్కలుగా కోసి అప్పుడు ఆ మాంసం భగోనాను భగభగల భుగభుగల పొయ్యిమీదికి ఎక్కించేవారు. కళపెళా ఉడుకుతున్న మాంసం ముక్కల మీద ఉప్పుకారం బాగా దట్టించి గరం మసాలా ముద్దను గంటెతో మిళాయించంగనే కమ్మని కోడికూర వాసన గుభాళించిపోయేది. మగవాండ్లు గీసి గీసి బేరం చేసి ఒక పెద్ద కల్లు కుండను తెచ్చి చల్లని చెట్టు నీడల క్రింద పెట్టేవారు. అప్పుడు అసలు సిసలు ‘‘వనంలో విందు భోజనాలు’’ శురువయ్యేవి తప్ప ఇప్పట్లా ఇంటి నుండి క్యారేజీలు పట్టుకపోయి అక్కడ తింటే క్యా మజా!
ఆ! ఏమడుగుతున్నారూ? ఇప్పుడు ఆ తలాబ్‍ కట్ట అదే ఆ రాచెరువు కట్ట ఎట్లా ఉందని అడుగు తున్నారా? అయ్యో ఏమని చెప్పను. మనుష్య తప్పిదాల వలన నగరంలోని అన్ని చెరువుల్లానే ఆ మీర్‍ జుమ్లా చెరువు కూడా ఎండిపోయింది. తర్వాత భూబకాసురుల ఆక్రమణలకు గురైంది. ఇప్పుడు అదొక మురికివాడ. ఎక్కడ చూసినా ఆ గుడిసెల నుండి ప్రవహించే మురికికాలువలే కనబడుతాయి. అధో జగత్సహోదరులకు అది ఆలవాలం. ఆవాస నివాసం. ఇప్పుడు ఆ బస్తీపేరు భవానీ నగర్‍.


ఇక ఆ చెరువు కట్ట పక్కనున్న బస్తీ సుల్తాన్‍ షాహీ కూడా అంతే. ఒకప్పుడు ఉన్నత వర్గాల ప్రభువులు నివసించే ఆ ప్రాంతం ఇప్పుడు ఇరుకిరుకు సందు గొందులతో అలరారుతుంది. మతకల్లోలాలు జరిగినప్పుడు తరుచుగా సుల్తాన్‍ షాహీ పేరు వినబడుతుంది. ఇప్పుడు ఆ బస్తీ ఒక ‘‘బద్నాం ఫరిస్తా’’.
ఈ సుల్తాన్‍ షాహీ దాటితే మేతర్‍వాడి బస్తీ వుంది. వీరందరూ రాజస్థాన్‍ నుండి కొన్ని వందల ఏళ్ల క్రితం వలస వచ్చిన కింద కులాల జాతిజనులు. అందరూ రాజస్థానీ భాష మాట్లాడుతారు. తరతరాల నుండి వీరి వృత్తి పాకీ పని. ఫ్లష్‍ టాయ్‍లెట్లు లేని ఆ కాలంలో చీపుర్లతో ఎత్తి శుభ్రం చేసి బకెట్లలో తీసుకెళ్లేవారు. మొగవాళ్ల పేర్ల చివరన ‘సింగ్‍’ ఉండేది. ఈ కుటుంబాల స్త్రీలు పండగపబ్బాలకు ఇండ్లల్లకు వచ్చి మిగిలిన పిండి వంటలను భోజన పదార్థాలను పట్టుకపోయేవారు. వీరి బస్తీలో కాలు పెట్టగానే వారి కన్న ముందు వారి వరాహాలే వచ్చిన వారికి స్వాగతం పలికేవి. నులకత్రాళ్ల కుక్కి మంచాలలో ముసలివారు ముడుచుకు పడుకుని మత్తుమందు నీళ్లల్లో హుక్కా గొట్టాలు పెట్టుకుని ఆరాంగ పొగతాగుతూ అర్ధనిమీలిత నయనాలతో చిదానందంతో కనబడేవారు. కొలిమిలో బాగా కాలిన రాగి రంగు ముఖం కలిగిన ఆ రాజస్థానీ సుందరీ మణులు వన్నె చిన్నెల మేలి ముసుగుల చాటున తమ ముఖారవిందాలను దాచుకునే వారు. తామంతా రాణా ప్రతాప్‍ వారసులమని యుద్ధంలో ఓడిపోయాక ప్రాణరక్షణకోసం ఇలా పారిపోయి ఈ దేశం వచ్చామని వారు చెప్పేవారు. కాలంమారి పోయాక, ఈ జాలిలేని లోకానికి మేతర్ల అవసరం లేకపోయింది. వారి వృత్తి మూలపడింది. మెదడువాపు వ్యాధికి పందులే మూల కారణం అన్న సాకుతో ప్రభుత్వం పందులన్నింటినీ చంపేసింది. వారు మళ్లీ ఎటు వలసపోయారో. ఏం ఆగమై పోయారో ఎవరికీ తెలియదు.


ఏమిటి? అరడుగుల అందగాడు గులాం యాసీన్‍ గురించి చెప్పాలా? సరే ఇక ఆ విషాదగాథ కూడా వినండి సన్నగా, పొడుగ్గా ముట్టుకుంటే మాసిపోయే గులాబీరంగుతో, మల్లెపూవు లాంటి తెల్లని లాల్చీ పైజామాలలో హమేషా చిర్నవ్వులు చిందిస్తూ అందర్నీ స్వచ్చమైన తెలుగులో ప్రేమతో పలకరిస్తూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్న పిల్లలకు తెలుగు పాఠాలు బోధిస్తూ, చల్లని సాయం కాలంలో గ్రంథాలయ భాండగారము నందు తెలుగు ప్రబంధాలనో, కావ్యాలనో పఠిస్తూ, ఉగాది కవి సమ్మేళనాలలో అచ్చ తెలుగు కవిత్వాన్ని వినిపిస్తూ తన కవితా పతాకాలను ఎగురవేసే గులాం యీసీన్‍ అసలు ఊరు హైదరాబాద్‍ దగ్గరి కల్వకుర్తి. చిన్నప్పట్నించి తెలుగు మీద ఎక్కువ మక్కువ పెంచుకుని తెలుగు మీడియంలో చదివి పట్నం వచ్చి తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి, తెలుగు మాట్లాడే హిందువులతోనే ఎక్కువగా దోస్తానాలు చేసేవాడు. ప్రతి ఉగాదికి రవీంద్రభారతిలో జరిగే కవి సమ్మేళనంలో తప్పనిసరిగా తన కమ్మని గొంతుతో కావ్య గానం చేసేవాడు. ఇక రేడియో – ఆకాశవాణిలో సరేసరి. సుల్తాన్‍షాహీలో హిందువులు అధికంగా ఉండే ఒక వాడకట్టులో చల్లని చలువపందిరి లాంటి ఇంటిలో భార్యా ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉండేవాడు.


అయితే చివరికీ ఏమయ్యిందీ అని అడుగు తున్నారా? 1980 దశాబ్దం చివరలో ఒక ముఖ్యమంత్రిని గద్దెదించి మరో ముఖ్యమంత్రిని గద్దె మీద అలంక రించెందుకు నగరంలో మతకల్లోలాలు జరిగాయి. తలలున్నా మెదళ్లులేని అగ్గిపుల్ల ల్లాంటి మతోన్మాదులు భగ్గున మండి పోయారు. నిరవధికంగా కర్ఫ్యూ కొనసాగుతూనే ఉన్నా మారణకాండ ఆగలేదు. ఒకానొక సంజవేళ రక్కసి మూకలు గులాం యాసీన్‍ ‘‘సతత హరిత పర్ణశాల’’ పై దాడి చేసి తేజ్‍ తల్వార్లతో అతణ్ణి నిలువునా చీల్చేశారు. ఆ తల్వార్లకు ఇంటిగోడ మీదున్న గులాం యాసీన్‍ అన్న ముస్లిం పేరు మాత్రమే కనబడిందికానీ ప్రతి ఉగాది పండక్కి అతను తెలుగులో కోయిలలా కావ్యగానం చేస్తాడన్న సంగతి ఆ పిచ్చి తల్వార్లకు తెలియదు కదా!


ఇంటి వాకిటి ముంగిట అతను కుప్పకూలగానే ముష్కర మూకలు లోపలికి వెళ్లి అతని భార్యను, పెద్దకొడుకును, ఊయలలో నిద్రపోతున్న చిన్న కొడుకును కూడా చంపేశారు. ప్రతి ఉగాది రోజు పాతనగరం తెలుగు దోస్తులు అతని కవిత్వం కోసం ఎదురుచూస్తుంటారు కాని అతను లేడు. అతని కమ్మని కవిత్వమూ లేదు.


పూల్‍ బన్‍కర్‍ ముస్కురానా జిందగి
ముస్కురాకే గమ్‍ బులానా జిందగి
హర్‍ దిన్‍ న మిలేతో క్యాహువా
దూర్‍ రహకర్‍ భీ దోస్తీ నిభానా జిందగి
పూవువలె చిర్నవ్వులు చిందించటమే జీవితం.
చిర్నవ్వులతో చింతలను, మరిపించటమే జీవితం
ప్రతిదినం కలిసి కనబడక పోతేనేం
దూరతీరాల నుండి స్నేహాన్ని కొనసాగించడమే జీవితం.


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍, ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *