మాటేటి రామప్ప


బహుముఖ ప్రజ్ఞాశాలి, పరోపకారి, తెలంగాణావాది, వెస్ట్రన్‍ జ్యోతిష ద్రష్ట, ఉన్నత పదవులను అధిరోహించిన మేధావి మాటేటి రామప్ప గారు. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదగడం వెనుక ఎంతి కార్యదీక్ష, పట్టుదల కఠోరశ్రమ దాగివుంటుందో అందుకు ఉదాహరణ మాటేటి రామప్పగారు.
మాటేటి రామప్ప గారు 1916 ఏప్రిల్‍ 20వ తేదీన ఆనాటి వరంగల్‍ జిల్లాలోని శనిగరం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లచ్చమ్మ, సాయన్నలు పద్మశాలి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. తండ్రి చిన్న వయసులో చనిపోవడంతో తల్లి బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వలసవచ్చింది. అందువల్ల రామప్పగారి విద్యాభ్యాసం హైదరాబాదులోనే కొనసాగింది.
రామప్ప గారు చదువులో చాలా చురుకైన విద్యార్థి, ఎన్ని కష్టాలెదురైనప్పటికి చదువును ఆపకుండా మ్యాథమెటిక్‍ ఆప్షనల్‍తో బి.ఏ. చదివి గోల్డ్మెడల్‍ సాధించారు. ఆ రోజుల్లో డిగ్రీ చదువడమంటే మామూలు విషయంకాదు. రామప్ప గారికి డిగ్రీ పూర్తయిన వెంటనే 1940లోనే గెజిటెడ్‍ తాహిసిల్దార్‍ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రామప్పగారు వెనకకు తిరిగి చూడలేదు.


ఉద్యోగజీవితంలో అంచలంచెలుగా ఎదిగి 1943లో డిప్యూటి కలెక్టర్‍గా, 1948లో రాయచూర్‍ కలెక్టర్‍గా ఉన్నత పదవి బాధ్యతలను నిర్వహించారు. అంతేకాకుండా నిజాం మున్సిపల్‍ కమీషనర్‍గా, సివిల్‍ సప్లైస్‍కి డైరెక్టర్‍గా ఇలా అనేక పదవులను అధిరోహించి తనదైన ప్రతిభను కనబరిచారు. తెలంగాణలో ఆనాడు ఎంతోమందికి ఉద్యోగ భిక్షను ప్రసాదించారు. బీదవారికి లేదనకుండా సహాయం చేసేవారు. దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగిన ఉదారవ్యక్తిత్వం రామప్ప గారిది. ఎంతోమంది పేదకుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు.
రామప్ప గారికి 12 ఏండ్ల వయస్సులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన లక్ష్మీదేవి గారితో పెండ్లి జరిగింది. వారికి నలుగురు పుత్రసంతానం. వారందరిని కూడా ఉన్నతచదువులు చదివించి ఆచార్యులను, డాక్టర్లను చేయగలిగారు. కుటుంబ విషయంలో భార్యాపిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు.
రామప్పగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పదవీ బాధ్యతల్లో నిరంతరం తలమునకలైనప్పటికి కూడా తనకు ఇష్టమైన జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూనే వచ్చారు. పాశ్చాత్య జ్యోతిష పద్ధతి ద్వారా అనగా సూర్యమాన జ్యోతిషాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పట్టు సాధించారు. ఎంతోమంది ప్రముఖులు జ్యోతిషం చెప్పించుకోవడం కోసం రామప్పగారి ఇంటి తలుపు తట్టేవారు. ఆనాడు రాజకీయ ప్రముఖులైన బెజవాడ గోపాలరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, ఎన్‍.టి.రామారావు మొదలైన వారికి జ్యోతిష గురువుగా కీర్తిని గడించారు.


రామప్ప గారు జాతకం విషయంలో కుండబద్దులుకొట్టినట్లు చెప్పేవారు. అట్లా చెప్పాలంటే సబ్జెక్టు విషయంలో సంపూర్ణ అవగాహన ఉండాలి. కాలాన్ని లెక్కకట్టగల సమర్థత ఉండాలి. ఈ రెండూ రామప్పగారిలో ఉన్నాయి కాబట్టే… జ్యోతిష్యుడిగా కూడా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలంలో తన ఆత్మీయ స్నేహితుడు దేవులపల్లి రామానుజారావు గారి సలహామేరకు రామప్పగారు సంస్కృత భాషను నేర్చుకున్నారు. ఆ రోజుల్లో రవ్వా శ్రీహరి గారు, రామప్పగారి ఇంటికి వెళ్ళి సంస్కృతం నేర్పించారు. రామప్ప గారు సంస్కృత భాషను నేర్చుకొని తద్వారా భారతీయ జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు. ఈ విధంగా రామప్ప గారు నిరంతరం జ్యోతిషశాస్త్రాన్ని పరిశోధనా దృక్పథంతో పరిశీలించి మెలకువలను సాధించేవారు.


రామప్పగారు తెలుగు, సంస్కృత భాషలే కాకుండా ఆంగ్లం, ఉర్దూ, హిందీ, పర్షియన్‍, అరబిక్‍ భాషల్లో మాట్లాడగలరు. రామప్ప గారి సాహిత్య కృషి గురించి కూడా చెప్పుకోవాలి. దయానందస్వామి వేదభాష్యాలను ప్రసంగించేవారు. ఖురాన్‍, భగవద్గీతను పోల్చి చెప్పేవారు. వేమన సాహిత్యాన్ని హిందీలోకి, ఉర్దూలోకి అనువాదం చేశారు. ఈ గ్రంథాన్ని ఆనాడు ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడమీ అచ్చువేసింది. ఉర్దూ అకాడమీ వారి కోరకమేరకు తెలుగు, ఉర్ధూ భాష నిఘంటువును తయారుచేశా రు. ఉన్నత పదవుల్లో కొనసాగుతూ ఇన్ని పనులు చేయడమంటే ఆషామాషికాదు. అయినప్పటికి రామప్ప గారు ఇష్టంగా చేసేవారు.


రామప్ప గారు అక్షరాల తెలంగాణవాది. ఆనాడు హైదరాబాదు, ఆంధ్రరాష్ట్రం కలిపి భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజకీయనాయకులు సంప్రదింపులు జరుపుతుంటే రామప్ప గారు ప్రభుత్వ ఉద్యోగి అయివుండి కూడా పెద్దమనుషుల ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఫజల్‍ అలీ కమీషన్‍కు స్వయంగా లేఖ రాసి హైదరాబాద్‍ రాష్ట్రం ఎందుకు ఆంధ్రరాష్ట్రంలో కలవకూడదో కారణాలతో సహా లేఖలో విశ్లేషించారు. అయినప్పటికి ఆంధప్రదేశ్‍ ఏర్పడక తప్పలేదు. ఆనాడు నీలం సంజీవరెడ్డి బాహాటంగా ‘‘తెలంగాణ వాళ్ళకి తెలివిలేదు’’ అన్నప్పుడు రామప్ప గారు ప్రభుత్వ ఉద్యోగిననీ కూడా చూడకుండా నీలం సంజీవరెడ్డిని నిలదీశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ‘‘పూలకుండీలు కనబడుటలేదు’’ అన్న చిన్న అపవాదుతో రామప్ప గారు పదవి నుండి అర్ధాంతరంగా తొలిగింపబడ్డారు. అయినా రామప్ప గారు అధైర్యపడలేదు. ఆ సమయంలో తన ఆస్తులను అమ్ముకొని కుటుంబ ఖర్చులు వెళ్ళదీసుకున్నారు. తిరిగి మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రామప్ప గారికి మంచిరోజులు వచ్చాయి.


1980-81 ప్రాంతంలో మాటేటి రామప్ప గారు అప్పటి అంతర్జాతీయ తెలుగు సంక్షేమ డైరెక్టర్‍గా నియమించబడ్డారు. 1975లో హైదరాబాద్‍లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానం మేరకు 1976 సెప్టెంబర్‍లో అంతర్జాతీయ తెలుగు సంస్థను ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో నివసించే తెలుగువారికి భాషా సాంస్కృతిక సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం, మొదటి మహాసభల తీర్మానం మేరకు రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ఈ సంస్థ ద్వార మలేషియాలో జరుపవలసి ఉంది. రామప్పగారు ఈ సంస్థకు డైరెక్టర్‍గా పదవీబాధ్యతలు స్వీకరించిన సమయంలో శ్రీ వందేమాతరం రామచంద్రారావు చైర్మన్‍గా ఉన్నారు.


ఆనాటి ముఖ్యమంత్రి కీ.శే. టి. అంజయ్యగారి నేతృత్వంలో 1981 ఏప్రిల్‍లో మలేషియాలోని కౌలాంపూర్‍లో రెండవ తెలుగు మహాసభలు విజయవంతంగా నిర్వహించిన ఘనత రామప్ప గారికి దక్కింది. అనంతర కాలంలో ఈ సంస్థ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమై అంతర్జాతీయ తెలుగు కేంద్రం అన్న పేరుతో పనిచేస్తోంది.
తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత మాటేటి రామప్ప గారు తమ సేవలను విశ్వవిద్యాలయానికి అందిస్తూనే వచ్చారు. విశ్వవిద్యాలయ జ్యోతిషశాఖలో ఆయన చాలాకాలం అతిథి అధ్యాపకులుగా విద్యార్థులకు జ్యోతిషశాస్త్రాన్ని బోధించారు. జ్యోతిషశాస్త్రంపై వీరు రచించిన ఆంగ్లపుస్తకాన్ని విశ్వవిద్యాలయం ప్రచురించింది.
రామప్ప గారు చనిపోయే ముందురోజు కూడా క్లాసు తీసుకున్నాడు. అంతకంటే ముందురోజు విశ్వవిద్యాలయం వారిని తన నెలజీతం ఇవ్వమని అడిగి తీసుకున్నారట. చనిపోయే ముందురోజు కరెంట్‍ బిల్‍, నల్లబిల్‍తో సహా చెల్లించి విదేశాల్లో ఉన్న మనవడికి డబ్బు పంపించారట. రామప్పగారు జ్యోతిషం తెలిసినవారు కాబట్టి చనిపోయేది ముందుగానే తెలిసిందని వారి కుటుంబసభ్యులు విశ్వసించడంలో ఆశ్చర్యంలేదు. మాటేటి రామప్ప గారు 1991 ఆగస్టు 30వ తేదీన పరమపదించారు. వీరు దివంగతులైన తర్వాత వీరి కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయంలో కొంత నిధిని ఏర్పాటు చేసి ప్రతియేట మాటేటి రామప్ప స్మారకోపన్యాసాలను ఇప్పిస్తున్నారు.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
డా।। యం. దేవేంద్ర

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *