మట్టిలేనిదే మనుగడలేదు ‘సేవ్‍-సాయిల్‍’


మట్టిలేనిదే మనుగడలేదు. మట్టి సమస్త వనరులకు పుట్టినిల్లు. మనం ఉపయోగించే వస్తువులన్నీ ఈ మట్టినుంచీ, దానిలో దాగున్న రకరకాల ఖనిజాల నుంచే తయారవుతున్నాయి. నేల రేణువుల సముదాయం. ఈ రేణువుల నిర్మాణాలు నీరు, గాలి, మట్టి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మట్టి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల రేణువుల నిర్మాణంతో వుంటుంది. సేంద్రియ పదార్థం, నిరాకార ఖనిజ పదార్థం కూడా నేల మట్టి కణాలలో ప్రధాన భాగాలు. మట్టిలోని ఈ వైవిధ్యమే జీవరాసుల మనుగడకు జీవం పోస్తున్నది.


ఇతర గ్రహాల మీద ప్రాణికోటి జీవించే అవకాశాల కోసం పరిశోధనలు చేస్తున్న మనిషి తను జీవిస్తున్న నేల గురించి, దాని ఆరోగ్యం గురించి మరిచిపోయాడు. తన సుఖవంతమైన, విలాసవంతమైన, జీవితం కోసం భూమిని, నేలను, సహజ ప్రకృతి వనరులను అవసరానికి మించి వినియోగిస్తున్నాడు. ఈరోజు పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్‍ వ్యర్థాలు, గృహ సంబంధ వ్యర్థాలతో నిండిపోయింది. కొనడం, వాడటం, పారేయడం అనే యూజ్‍ అండ్‍ త్రో స్వభావం ఒక స్టేటస్‍ సింబల్‍గా మారింది. భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.


వ్యవసాయ రంగానికి ఉపయోగించే రసాయనాలు, క్రిమిసంహారక మందులతో ఈ నేల కలుషితమై విషపూరిత మవుతుంది. ఇప్పటికే మన దేశంలో 30 శాతం సారవంతమైన నేలలు బంజరుగా మారాయి. 2050 నాటికి 90 శాతం నిర్జీవమవుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. ఇదే నిజమైతే మానవ మనుగడకి పెను ప్రమాదం.


మరి ఈ నేలను, మట్టిని కాపాడుకోవడం ఎలా?

ఈ క్లిష్ట సమయంలో సద్గురు జగ్జీ వాసుదేవ్‍ ‘సేవ్‍ – సాయిల్‍’ ఉద్యమాన్ని ప్రారంభించారు. నేలను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని, వ్యవసాయ నేలలో 3.6% సేంద్రియ కంటెంట్‍ను తప్పనిసరి చేయాలని ప్రపంచంలోని అన్ని దేశాలను కోరడం ‘సేవ్‍ సాయిల్‍’ ఉద్యమ ప్రాథమిక లక్ష్యం. 75 రోజులు, 30,000 కి.మీ. బైక్‍ మీద ప్రపంచ దేశాల ప్రయాణంతో ప్రచారం ప్రారంభించారు. దీనికి 27 ప్రపంచ దేశాలు మద్దతు ప్రకటించాయి. మనదేశంలో 5 రాష్ట్రాలు గుజరాత్‍, రాజస్థాన్‍, ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, మహారాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ప్రకటించాయి. మన తెలంగాణ ప్రభుత్వం మద్దతు ప్రకటించిన, అవగాహనా ఒప్పందం పత్రాలపై సంతకం చేసిన ఆరవ రాష్ట్రంగా నిలిచింది. ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల ప్రజల మద్దతు లభించడం ద్వారా యిది రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. నేలరక్షణ కోసం, పర్యావరణ రక్షణ కోసం విధాన నిర్ణయాలు చేయడానికి, బడ్జెట్‍ కేటాయించడానికి దోహదం చేస్తుంది. ఇది మంచి ఫలితాలను సాధించి భూగోళాన్ని సారవంతమైన నేలగా పునర్జీవింప చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇప్పుడు ఈ ఉద్యమంలో మమేకం అవటం ద్వారా సృజనాత్మక, నిర్మాణాత్మక అభివృద్ధికి మరింత దోహదం జరుగుతుంది.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *