ఖమ్మం – బాల కథా తేజాలు

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘ఖమ్మంజిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త అమ్మిన శ్రీనివాసరాజు గారి విశ్లేషణ.


కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ బాలచెలిమి వారి ఆహ్వానం మేరకు ఖమ్మం జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 42 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు 18కథలను ఎంపిక చేశారు. ఈ పుస్తకానికి కవర్‍ బావండ్ల నరహరి, లోపలి బొమ్మలు సయ్యద్‍ హస్మంతుల్లా వేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ బాలచెలిమి నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.


ఖమ్మం పోరాటాల గుమ్మమే కాదు. సాహిత్యపు గుమ్మి కూడా! పలు సాహిత్య పక్రియలతో తన ప్రత్యేకతలు చాటుకుంటూ ముందుకు పోతున్న ఖమ్మం సాహితీక్షేత్రంలో బాలసాహిత్యానికి అత్యుత్తమ స్థానం ఉంది. జిల్లాలో ప్రౌఢ సాహిత్య సేద్యంలో అంతర్‍ పంటగా బాల సాహిత్యం వెలుగు చూస్తూనే వుంది.
ఇక ఈ పిల్లల కథలు చదువుతుంటే వాళ్ల ఆలోచనలు అర్థం చేసుకుంటే ఇప్పుడే ఇలా వుంటే ఇక పెద్దయి పెరిగాక ఇంకెంత గొప్పగా వ్రాస్తారో కదా!? అనే ఆనందపు అద్భుత రసాన్ని పంచుతాయి. అయితే మా జిల్లా పిల్లలు శైలి భలే గమ్మత్తుగా వుంది. కథ పాతపద్ధతిలో ప్రారంభించి కొత్తగా ఆధునికత జోడించి ముగించటం పెద్ద వాళ్లకే ఆశ్చర్యం కలుగుతుంది.


ఈ పుస్తకంలోని మొత్తం 18 కథలు వేటికవే ఒక ప్రత్యేకతను చాటుకున్నాయి. సహాయం, దుష్టులతో స్నేహం, కుందేలు తెలివి లాంటి కథల్లో గతంలో చెప్పిన ఆధునిక ముగింపులు అగుపిస్తాయి. ప్రతీకథలో బాలసాహిత్యానికి ప్రధాన లక్షణమైనన క్లుప్తత స్పష్టంగా కనిపిస్తుంది. మానవులకు వుండాల్సిన మంచిలక్షణాల్లో ఒక్కటి జీవకారుణ్యత అనబడే మూగజీవుల పట్ల ప్రేమ గురించి ఆవు-మనిషి కథలో ఎంతబాగా చెప్పాడో చదివితే మీరే పచ్చినిజం అంటారు.
ఈ పుస్తకంలో అక్షర పరిణితి పొందిన ఉన్నత పాఠశాలల పిల్లలేకాక సాధారణ పరిణితిగల ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు కూడా తమతమ బుల్లి మెదళ్లతో ఆలోచించి వారిదైన చిరుసృజనాత్మకతతో కథలు వ్రాయడం నిజంగా అభినందనీయమే! అందుకు కృషి చేసిన ఆయా బుల్లి రచయితల అమ్మా-నాన్నలు, ప్రోత్సహించిన ఉపాధ్యాయులు మరింత అభినందనీయులు. ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’’ కృషివలురందరికీ మా జిల్లా పక్షాన కృతజ్ఞతాభివందనలు అర్పిస్తున్నాను.

  • అమ్మిన శ్రీనివాసరాజు
    బాల సాహితీవేత్త

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *