ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖ స్థానం ఏర్పరచుకున్న రాజవంశీయులలో కాకతీయులు ఒకరు. రాజకీయంగా, భౌగోళికంగా ఒక పటిష్టత లేని సమయంలో దక్షిణాపథ తూర్పుభాగప్రాంతాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించినారు.
శాతవాహనులు, విష్ణుకుండినుల అనంతరం దక్షిణాపథంలో నెలకొని ఉన్న పరిస్థితులను చక్కదిద్ది చిన్న చిన్న మాండలిక రాజ్యాలను కలుపుకొని కాకతీయులు తెలంగాణం నుండి బలమైన రాజ్యంగా యావత్ ఆంధ్రదేశ భూభాగాలను జయించి కాకతిరాజ్యాన్ని సామ్రాజ్యంగా నిర్మించారు.
మొదట రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు సేనానులుగా, దండనాథులుగా, సామంత మాండలికులుగా ఉన్న వీరు క్రమంగా స్వతంత్రులై సువిశాల సామ్రాజ్య నిర్మాతలుగా, చాలామంది సామంత మాండలికులను కలిగి సుస్థిర పరిపాలకులుగా చరిత్రలో నిలిచిపోయినారు.
రాజకీయంగా వీరు రాజ్యవిస్తరణకు ఇచ్చిన ప్రాధాన్యం పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాహిత్యం… వంటి ఇతర అంశాలకు కూడా పూర్తిస్థాయి ప్రాధాన్యం ఇచ్చినారు. కాకతీయుల చరిత్రను తెలుసుకునే క్రమంలో శాసనాలు ప్రామాణికమైనవిగా మనం గుర్తించవచ్చు. వీరి కాలంలో వెలువడ్డ వందల కొద్ది శాసనాలు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలలో లభించినాయి. కాకతీయ రాజులు ప్రత్యక్షంగా వేయించిన శాసనాలే కాకుండా వీరి సామంతులు, దండనాథులు, వర్తకులు, మంత్రి, పురోహితాది అనేక వర్గాలవారు వేయించిన శాసనాలు కూడా మనకు చాలా కన్పిస్తున్నాయి. ఇవన్నీ తెలుగు, సంస్కృతం, కన్నడ భాషలో విడిగా, తెలుగు – సంస్కృతం, తెలుగు – కన్నడం, తెలుగు – కన్నడ – సంస్కృత భాషలలో మిళితంగా ఉన్నాయి. వీరి శాసనాల్లో తామ్రశాసనాలు, శిలా శాసనాలు ఉన్నాయి. తామ్ర శాసనాలు చాలా తక్కువ. 90 శాతం శిలా శాసనాలే ఉన్నాయని చెప్పవచ్చు.
శాసనాలు వచనంలో, పద్యరూపంలో, గద్యపద్యాత్మకంగా, సంస్కృత శ్లోకాలతో కూడి ఉన్నాయి. సుమారుగా 500 పైగా శాసనాలు కాకతీయులు, వారి సామంత మాండలికులు, వారి పాలనాకాలంలో ఇతరులు వేయించిన శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ దక్షిణభారతదేశ శాసన సంపుటాల్లో, తెలంగాణ శాసన సంపుటాల్లో, ప్రభుత్వ పురావస్తువాఖవారి ప్రచురణ గ్రంథాల్లో, జిల్లాలవారిగా వెలువడిన గ్రంథాల్లోను, వ్యక్తులు వ్యక్తిగతంగా ప్రచురించిన శాసన సంపుటాలలోను ప్రచురితమై ఉన్నాయి. కొన్ని కొత్త శాసనాలు ఇటీవల వెలుగులోనికి వచ్చినవి పుస్తకరూపంలో ప్రచురణ కాలేదు కానీ ఆయా దినపత్రికల్లో వాటి వివరణలు ప్రచురించబడ్డాయి. శాసనాలను ఆధారం చేసుకొని వారి పాలనా విధానంలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తూ ఒక సమగ్రమైన పరిశోధన నేను గమనించినంతవరకు జరగలేదు. ఒక గణపతిదేవుడు, లేదా ఒక రుద్రమదేవి, లేదా శాసనాలలో కాకతీయుల ఆర్థిక, సామాజిక, మత స్థితిగతులను సమీక్షిస్తూ పరిశోధనలు వచ్చినాయి.
కాకతీయులకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో లభించే అన్ని శాసనాలను పరిశీలించి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య, మత ధార్మిక, శిల్ప స్థితిగతులను గూర్చి చర్చించడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.
కాకతీయుల కాలంలో వెలువడ్డ శాసన సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే వందల సంఖ్యలో శాసనాలు ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో వెలుగు చూసినాయి, ఇంకా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాంతాల వారిగా, జిల్లాల వారిగా శాసనాల్లో కాకతీయులు, వారి సామంతులు వేయించిన శాసనాలు ఉన్నాయి. అన్నీ ఒక దగ్గర ప్రొఫెసర్ ఎస్.ఎస్. రామచంద్రమూర్తిగారి సంపాదకత్వంలో ఐ.సిహెచ్.ఆర్ వారు 327 శాసనాలను ‘‘ఇన్స్స్ప్రిప్షన్స్ ఆఫ్ కాకతీయాస్ ఆఫ్ వరంగల్’ అనే పేరుతో సుమారు 730 పేజీలతో ప్రచురించారు. ఇది 2011లో ప్రచురించబడింది. దీని తర్వాత కూడా పలు ప్రాంతాల్లో కాకతీయుల కాలం నాటి శాసనాలు వెలుగులోకి వచ్చాయి. శాసన సేకర్తలు, పరిష్కర్తలు వాటిని అధ్యయనం చేసి దినపత్రికల్లో, పరిశోధనాత్మక పత్రికల్లో ప్రచురిస్తున్నారు.
రామచంద్రమూర్తిగారు సంకలనం చేసిన ఆ గ్రంథం ఆధారంగా 1వ బేతరాజు నుండి ప్రతారుద్ర చక్రవర్తి వరకు ఎవరు ఎన్ని వేయించారో ఒక లిస్ట్ ఇచ్చారు. అందులో 1వ బేతరాజు – 1, 1వ ప్రోలరాజు 1, 2వ బేతరాజు – 5, 2వ ప్రోలరాజు 5, గుండరాజు – హరిహరరాజు 1, 1వ రుద్రుడు – 18, మహాదేవుడు – 3, గణపతిదేవ చక్రవర్తి – 143, రుద్రమదేవి – 66, ప్రతాపరుద్రుడు – 127 శాసనాలు వీరి కాలంలో వేయించబడినాయి.
అదేవిధంగా జిల్లాల వారీగా కూడా సమాచారం ఇచ్చినారు. ఆదిలాబాదు -1, కడప – 7, తూర్పు గోదావరి – 7, గుంటూరు – 92, కరీంనగర్ – 21, ఖమ్మం – 9, కృష్ణ – 20, కర్నూలు – 4, మహబూబ్‍నగర్ -14, మెదక్ – 11, నల్లగొండ -59, నెల్లూరు – 24, నిజామాబాద్ – 2, ప్రకాశం – 44, వరంగల్ – 48, పశ్చిమ గోదావరి – 3; ఇవి కాక తిరుచిరాపల్లి – 1, గయ – 1, చెంగల్పట్టు – 1, బీదర్ – 1 లభిస్తున్నాయి.
కాకతీయులు వేయించిన తామ్ర శాసనాలు చాలా ప్రశస్తమైనవి. చరిత్రకు చాలా ముఖ్యమైన ఆధారాలుగా నిలుస్తున్నాయి. అవి గణపతి దేవుని మొగలుట్ల దాన శాసనం, కోలవెన్ను తామ్ర శాసనం, కరీంనగర్ తామ్ర శాసనం, గారవపాడు తామ్ర శాసనం, దాడి గన్నయ చింతలూరు శాసనం, రుద్రమదేవి ఆలపాడు శాసనం, కోటగిరి తామ్ర శాసనం, ప్రతాపరుద్రుడి ఉత్తరేశ్వర శాసనం, ప్రతాపరుద్రుడి ఖండవల్లి శాసనం, గోరవంకపల్లి తామ్ర శాసనాలు ఉన్నాయి.
ఇక శాసనాలను స్థూలంగా పరిశీలిస్తే అనేక అంశాలను మనం అధ్యయనం చేయవచ్చు ముఖ్యంగా శాసనాలన్నీ దాన శాసనాలే. మనకు ఉన్న అవగాహనతో ఒక శాసనాన్ని ఎన్ని కోణాల్లో అధ్యయనం చేయవచ్చో గమనిద్దాం.
రాజకీయపరమైన అంశాలు
కాకతీయుల కాలంలో వెలువడ్డ శాసనాలు అన్నింటిలో వారి బిరుదావళి, వంశ ప్రశస్తి తప్పనిసరిగా ఉంటుంది. కాకతీయుల ప్రశస్తి ఆయా శాసనాల్లో మనం గమనించవచ్చు
బెక్కల్లు శాసనంలో ‘‘స్వస్తి సమధిగత పంచ మహాశబ్ద మహా మండలేశ్వర పరపుర త్రిపుర మహేశ్వర పరచక్ర భయంకర పరమ పరాక్రమ కిషోర కేసరి దాయగజకేసరి చతురుదధివలయ వేలావలయిత వసుంధార రక్షణ దక్షిణ భుజాదండ చలమర్తిగండ నామాది సమస్త ప్రశస్తి సహితం శ్రీమన్మహా మండలేశ్వర కాకతి రుద్రదేవరాజు’’ అని కీర్తించబడినాడు.
అదేవిధంగా వరంగల్లు ఫోర్ట్ శాసనంలో గణపతిదేవమహారాజు ‘‘మహామండలేశ్వర పరమ మాహేశ్వర, శ్రీ స్వయంభూనాథ దేవ దివ్యశ్రీ పాద పద్మారాధక, పరబల సాధక, ప్రత్యక్ష ప్రమథగణావతార, లాడ, చోడ, కటక చూఱకార మనియ బెంటకార, కదన ప్రచండ, చలమర్తి గండ విభవ దేవేంద్ర, సత్య హరిశ్చంద్ర, చతుస్సముద్ర వళయ దిక్పూరిత కీర్తి సప్తమ చక్రవర్తి ఉపమన్యు ప్రముఖాది సకళ భక్త జనానంద కారణ వైరి సంహరణ ఆదిరాజ చారు చరిత్ర సుజనైక మిత్ర సుస్థిర నిజ రాజాన్వయ నామాది సమస్త ప్రశస్తి సహితం శ్రీమన్మహా మండలేశ్వర కాకతియ్య పురవరాధీశ్వర గణపతిదేవ మహారాజులు’’ అని కాకతీయ ప్రశస్తి చెప్పబడింది.
రాజకీయ పరంగా ఆలోచించినట్లయితే మొదట వీరు రాష్ట్రకూటులకు, అటు తర్వా పశ్చిమ చాళుక్య రాజులకు దండనాయకులుగా, మండలాధీశులుగా, సామంతులుగా ఉండి క్రమక్రమంగా బలవంతులై తోటి రాజుల సహకారంతో స్వతంత్రులై, వారందరి సహకారంతో కాకతి రాజ్యాన్ని విశాల సామ్రాజ్యంగా విస్తరించుకున్నారు. వీరికి సామంతులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా కాయస్థులు, రేచర్ల పద్మనాయకులు, రేచర్ల రెడ్డి వంశీయులు, చెఱకురెడ్డి వంశీయులు, మల్యాల, విరియాల వంశీయులు, నతవాడి, యాదవ, గోన వంశీయులు. వీరందరు కాకతీయ ప్రభువులకు విధేయులుగా ఉండి తమ రాజ్యాలను సమర్థవంతంగా చూసుకుంటూ కాకతి సామ్రాజ్య విస్తరణకు, శత్రురాజులను జయించడానికి పూర్తి సహకారం అందించినారు. అందులో కాయస్థ వంశీయులు కొంత తిరుగుబాటు చేసినప్పటికీ రుద్రమ, ప్రతాపరుద్రుని కాలంలో వారి గర్వం అణచబడింది.
కాకతీయ రాజ్యం సామ్రాజ్యంగా రూపు దిద్దుకునే దిశలో ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలుగొందడానికి పునాది విరియాల వంశానికి చెందిన ఎఱ్ఱ నరేంద్రుడు, అతని భార్య కామసాని. ఈమె కాకతీయ నాల్గవ గుండరాజు సోదరిగా చరిత్రకారులు శ్రీ పి.వి.పరబ్రహ్మశాస్త్రి, శ్రీ బి.ఎన్.శాస్త్రిగార్లు నిర్ధారిస్తున్నారు. ఈమె తన భర్త ఎఱ్ణ నరేంద్రుడు చాళుక్యరాజు ఆజ్ఞను పాలించి తన అన్నను సంహరించిన అంశానికి చాలా బాధపడింది. పిల్లవాడైన తన మేనల్లుడు దిక్కులేనివాడయ్యాడు. అంతేకాక తన పుట్టింటి వంశం అంతరించిపోతుంది. ఆ వేదనతోనే పిల్లవాడికి సహాయపడవలనే కాంక్షతో తన భర్తతో కలిసి పల్లవరాయని నియోగానికి వెళ్ళి అతని ద్వారా చక్రవర్తిని సందర్శించింది. చాళుక్యచక్రవర్తికి దంపతులిద్దరూ పరిస్థితిని వివరించినారు. ఎఱ్ఱనరేంద్రుని స్వామి భక్తి తెలిసిన చక్రవర్తి వారికి సహాయం చేసెను. గరుడ బేతరాజుకు అనుమకొండ విషయాధిపత్యం ఇప్పించడంలో భార్యాభర్తలిరువురు చేసిన కృషి భావి కాకతీయ సామ్య్రా నిర్మాణానికి పునాదులు వేసిందని చెప్పవచ్చు.
చాళుక్య కుమార సోమేశ్వరుని కాలం, విరియాల బేతన కుమారుడైన మల్ల సమకాలీనంగా ఉన్నాడు. ఈ మల్ల గుముడూరులో కట్టించిన మల్లేశ్వరాలయానికే చాళుక్య కుమార సోమేశ్వరుడు గ్రామాన్ని దానమిచ్చినట్లు స్పష్టమైంది. కాబట్టి ఈ శాసనం వేయించినది మల్ల అని అర్థం చేసుకోవాలి.
ఇక ఈ శాసనం కామసాని గూడూరు శాసనంగానే ప్రసిద్ధి చెందింది. శాసనం కామసాని వేయించిందని చెప్తున్నారు. అసలు శాసనాన్ని గమనిస్తే ప్రస్తుత కాలంలో ఉండి పూర్వ విషయాలను పునశ్చరణ చేసుకోవడం కనిపిస్తుంది. విరియాల కామసాని మల్లనికి తాత తల్లి అవుతుంది. అంటే కామసాని తరువాత మూడవ తరంవాడు మల్లడు. శాసనకాలం క్రీ.శ. 1124. కామసాని సహకరించిన గరుడ బేతరాజు కాలం క్రీ.శ. 992 – 1052. ఒకవేళ కామసాని ఈ శాసనం వేయించి ఉంటే తన తరువాత జరిగిన సంఘటనలకు సంబంధించిన అంశాలు శాసనంలో చెప్పలేదు కదా.
అంతర్గత శత్రువుల ధాటిని ఎదుర్కొని బయటి శత్రువులను జయించిన ఘనత రాణి రుద్రమ దేవిది. రాజ్యవిస్తరణలో భాగంగా శత్రురాజులపై విజయం ఒక మార్గమైతే వారితో వివాహ సంబంధాలు కలుపుకొని పరస్పర సహకారంతో సత్సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించి నారు.
ఆర్థికపరమైన అంశాలు
కాకతీయ ప్రభువులు తమ రాజ్య విస్తరణకు పరిపాలనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చినారో ఆర్థికంగా రాజ్య పటిష్టతకు వ్యవసాయం, వర్తక వ్యాపారాలకు అంతే ప్రాధాన్యం ఇచ్చినారు. ఆర్థిక పుష్టి ఉంటేనే రాజ్య వ్యవహారం, యుద్ధ సమయాల్లో కావలసిన సామాగ్రి అన్నీ సమకూరుతాయి. ఆ ఉద్దేశంతోనే వారు వ్యవసాయానికి పెద్ద పీట వేసినారు. అందుకు ముఖ్య ఆధారం నీరు. ఆ నీటి వసతుల రూపకల్పనకు కొన్ని వందల చెరువులు త్రవ్వించినారు. కొత్తగా నిర్మించినారు. అనేక కుంటలు, చిన్న చెరువులు, పెద్ద చెరువులు, సాగరాలు, సముద్రాలు ఈవిధంగా అవసారాన్ని బట్టి, ఆదాయాన్ని బట్టి వ్యవసాయసంబంధంగా వీటిని నిర్మించినారు. మొదాటి ప్రోలరాలజు కాలంలో కేసరి సముద్రం, రెండవ బేతరాజు కాలంలో సెట్టికెరు అనే చెరువును త్రవ్వించినారు. బేతరాజు వరుణ ప్రతిష్ట కూడ చేసినట్లు తెలుస్తుంది. రుద్రదేవుడు పెద్ద తటాకాన్ని త్రవ్వించాడు. ఇక గణపతి దేవుని కాలంలో అనేక ప్రాంతాల్లో నెల్లూరు, ఏలూరు, గోదావరి తీరంలోని గణపురం, వరంగల్లు నగరానికి నైరుతి దిశలో ఉన్న గణపురం ప్రాంతాల్లో అనేక చెరువులు త్రవ్వించినాడు. వాటి విస్తీర్ణాన్ని బట్లి అవి సముద్రాలుగా పిలువబడ్డాయి. రేచర్లరుద్రుడు పాకాల చెరువును నిర్మించినాడు.
కాకతీయుల సామంతులు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో సప్త సంతానాలలో ఒకటిగా భావించి చెరువులను తమ ప్రభువుల కన్న మిన్నగా త్రవ్వించినారు. చౌండ సముద్రం, బాచ సముద్రం, గణప సముద్రం, కుప్ప సముద్రం, సబ్బ సముద్రం, నామ సముద్రం, ఎఱ్ఱ సముద్రం వంటికి మల్యాల, రేచర్లరెడ్డి వంశాల వారు నిర్మించినారు. అదేవిధంగా పెద్ద చెరవుల నుండి వ్యవసాయ భూములకు ప్రజల అవసరం దృష్ట్యా నీరు పారించడానికి కాలువలు త్రవ్వించేవారు. అట్లా అనేక కాలువల పేర్లు మనకు శాసనాల్లో కనిపిస్తున్నాయి. కుప్పమాంబ కాలువు, పోరెడ్డి కాలువ, దాడ్ల కాలువ వంటివి.
కాకతీయ సామంతులై రేచర్ల పద్మనాయకులు రాచకొండ కేంద్రంగా పరిపాలించినారు. ఆ వంశానికి చెందిన రావు మాధవుని భార్య రాణి నాగాంబిక. ఈమె దేవలమ్మ నాగారంలో తన పేరుమీద నాగసముద్రం అనే బృహత్ తటాకాన్ని త్రవ్వించి శాసనం వేయించింది.
నాగాంబిక ప్రజల సంక్షేమార్థం, వ్యవసాయాది కార్యకలాపాల కొరకు అతి పెద్ద చెరువును త్రవ్వించింది. ఈ బృహత్తటాకానికి సంబంధించిన వర్ణన శాసనంలో ఉంది. శ్రీరాజశైల (రాచకొండ) సమీపంలో నాగసముద్రమనే తటాకం ఉంది. దీన్ని నాగాంబిక త్రవించింది కాబట్టి నాగసముద్రంగా పిలువడింది.
ఈ చెరువు సారవంతమైన, లోతైన నీటిని కలిగి ఉంది. రఘుపతి ప్రేరణతో నిర్మించబడిన ఈ సముద్రం ఓడలతో కూడి ఉంది. నాగాంబిక చేత నిర్మించబడిన ఈ నాగసముద్రానికి కొత్తగా సేతువు నిర్మించబడింది. భూమిలో నాగాంబిక చేత ప్రతిష్ఠితమైన ఈ చెరువులోని నీళ్ళు చాలా మధురంగా ఉండేవట.
ఈ సముద్రాన్ని చూసి నాగకాంతలు మిక్కిలి అభినందిస్తున్నారట. ఎందుకంటే అందులోని ఓడల్లో విహరిస్తూ సముద్రపు సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారట. ఇంకా చేపలు, తాబేళ్ళు కూడా స్వచ్ఛమైన ఆ నీటిలో స్వేచ్ఛగా, ఏ ఉపద్రవాలు లేకుండా సంచరిస్తున్నాయట. అంతే కాదు నిత్యం మానవ కన్యలు కూడా ఈ చెరువును చూసి సంతోసిస్తున్నారట. అడవి ఎంత దట్టంగా ఉంటుందో ఈ సముద్రంలో కలువలు, కమలాలు అంత దట్టంగా ఉన్నాయట. వాటిని చూసి కలహంసలు క్రీడించడానికి అనుకూలంగా శోభాయమానంగా ఉందట.
వర్తక, వాణిజ్యాలు, పన్నులు
ఏ వస్తువైనా మారకాన్ని బట్టి దాని విలువ ఉంటుంది. వాటిని పన్నుల రూపంలో వెల కట్టేవారు. కొన్న వస్తువుకు, అమ్మిన వస్తువుకు పన్నులను చెల్లించాలి. ఆ పన్నులు ధనరూపంలో, ధాన్యరూపంలో వసూలు చేసేవారు. భూమిశిస్తును సాధారణంగా అరి అని పిలుస్తారు. వర్తక వ్యాపారాల మీద వేసే పన్నులను సుంకం అని అనేవారు. వస్తువులను అమ్మడానికి సంతలు, అంగడులు ఉండేవి. వాటి మీద కూడా పన్నులు చెల్లించాల్సి ఉండేది. ఉప్పు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, సన్నని నూలు వస్త్రాలు, తమల పాకులు, పోకలు, అన్ని రకాల పన్నులు బండికి ఇంత, వీసానికి ఇంత అని ఆయా కాలంలో వాటి ధరలను బట్టి నిర్ణయాలు చేయబడేవి. రాజ్యాంతర్గతంగానే కాకుండా విదేశీ వ్యాపారం కూడా కాకతీయుల కాలంలో విస్తృతంగా జరిగింది. అందుకు నిదర్శనం మోటుపల్లి శాసనం. ఈ శాసనం గణపతి దేవుని కాలంలో వేయించబడింది. మోటుపల్లి రేవు అభయ శాసనం వర్తకులకు భరోసా ఇచ్చి వారు కాకతీయ సామ్రాజ్యంలో వర్తక వ్యాపారాలు చాలా స్వేచ్ఛగా చేసుకునే అవకాశం కల్పించింది.
కాకతి గణపతిదేవ చక్రవర్తి కాలంలో వేయించబడిన శాసనం సర్వధారి సంవత్సరం శ్రావణశుద్ధ పంచమి = క్రీ.శ. 1228 జులై 17.
వరంగల్లు కోటలో ఉన్న ఈ శాసనం హనుమకొండ శాసనంగా ప్రసిద్ధి చెందింది. ఈ శాసనం ముఖ్యంగా దేశీయ, విదేశీయ వర్తకులు శ్రీ వీరభద్రేశ్వర స్వామి అంగరంగ భోగాలకు తమ వ్యాపార వస్తువులను అమ్మిన దాంట్లో కొంత భాగాన్ని ఇస్తూ వాటి వివరాలను తెలియజేసే శాసనం. ఇది పూర్తిగా వ్యాపార సంబంధమైన శాసనంగా పేర్కొనవచ్చు.
ఆధునిక కాలంలో షాపింగ్ మాల్స్లో ఏవిధంగా అయితే అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర ఉంటున్నాయో అదేవిధంగా కాకతీయుల కాలంలో అన్నిరకాల వస్తువులు ఒక ప్రాంతంలో క్రయ, విక్రయం జరిగేవి. మఠియ అంటే మార్కెట్ అని అనేవారని, అన్నిరకాల వస్తువులు లభించే మార్కెట్‍లు ఉండడం వల్ల అది మఠియవాడ – మట్టెవాడగా పిలవబడిందని పి.వి.పరబ్రహ్మశాస్త్రిగారి అభిప్రాయం.
ఈ మఠియవాడలో అనేక రకాల వస్తువులు లభించేవి. వాటిని అమ్ముకునే స్వదేశీ, విదేశీ వ్యాపారులు వీరభద్రేశ్వరునికి ఇవ్వవలసిన మొత్తం ఆయా వస్తువులను బట్టి నిర్ణయించినారు.
చీర మఠియ అంటే చీరలు అమ్మే మార్కెట్‍లో చీరలు అమ్మగా వచ్చిన సొమ్ములో ప్రతి మాడకు ఒక వీస చెల్లించాలని ఉంది. నీలిమందు అమ్మేచోట మాడకు రెండు వీసాలు, పోకమఠియ (మార్కెట్)లో స్వదేశీ, విదేశీ బేహారులు (వ్యాపారులు), నకరంవారు (వర్తక సంఘంవారు) లక్షకు పాతిక (1/4) పోకలు ఇవ్వడానికి నిర్ణయించారు.
ధాన్యపు మార్కెట్ అంటే ధాన్యాలు లభించేదగ్గర స్వదేశీ, విదేశీ బేహారులు ఇచ్చిన ఆదాయం నువ్వులు, గోధుమలు, పెసలు, వడ్లు, జొన్నలు మొదలైన వాటికి ప్రతి బండికి మానెడు, నూనె, నెయ్యిలందు బండికి మానెడు, స్వదేశీ, విదేశీ ఉప్పు వ్యాపారులు ఉప్పు మార్కెట్‍లో ఒక బండికి ఒక మానెడు, నూనె వ్యాపారులు ఇచ్చిన ఆదాయం ప్రతిరోజు బూఱ, మట్టెవాడలోని అశేష నకరంవారు ఘడియారానకు (గడియారం నిర్వహించడానికి) ప్రతి ఇంటికి పాతిక (1/4) బియ్యం ఇవ్వాలని సూచన చేయడం జరిగింది. ప్రతిరోజు స్వామి ఉపహారానికి సంతనకరంలోని ప్రతి షాపులో అమ్మే బియ్యంలో బుఱెడు,.
వెదురు మొదలైన గంధ్య భండాలలో మాడలో పాతిక(1/4) ఆవాలు, మిరియాలు, తేనె, కానుగ నూనె మొదలైన కొల భండాలలో మాడకు పాతిక, తగరంవారు, మూసఱవారు (లోహాలను కరిగించేవారు) ఇచ్చిన ఆదాయం సీసం, రాగి మొదలైన లోహాల్లో తులానికి 1 పలమెడు (రెండు కర్షములు), ఉభయ నానా దేశీ (స్వదేశీ, విదేశీ) వారు చందనం 1 తులానికి 1 పలమెడు, కర్పూరం వీసెకు రెండ చిన్నాలు, జవ్వాది 1 మాడకు పెరుక (1/8), కస్తూరి నూరు విణ్ణాలకు రెండు సిన్నాలు, పట్టు నూలునందు ప్రతి తులానికి 1 చిన్నము, చవరాలు (సవరము) తులానికి 1 చిన్నము, మంజిష్ట మాడకు అరవీస, దంతము, దాసూరి పట్టు, పచ్చపట్టులందు పాతిక (1/4), పగడమునందు 1 వీసకు 1 చింన్నము, ముత్యము, రుద్రాక్ష, గాజు మొదలైన మణి భండాలలో వాటికి మాడకు వీసము ఇచ్చునట్లు ఉంది.
ఉభయ నానాదేశివారు పసుపు, ఉల్లి, అల్లం, కంద, పెండలం (ఒకరకమైన దుంప) వంటివాటిలో మాడకు రెండు వీసాలు, నూలు వస్త్రాల్లో పాతిక (1/4), ప్రతి వంద మంచాలకు 1 చింన్నము, 100 పసుపు పెట్టలకు 1 చినముగా నిర్ణయించి చెల్లించడం జరిగేది.
పై అంశాలన్నీ గమనిస్తే మనం నిత్యం వాడుకునే ఆహార పదార్థాలతో పాటు సౌందర్య సాధనాలు, చలి నుండి కాపాడే నూలు వస్త్రాలు కూడా చాలానే వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాక సమయసూచిని తెలిపే గడియారం ఉండేదాన్ని, అది సక్రమంగా నడవడానికి, దాన్ని నిర్వహించడానికి కూడా కొంత పైకం చెల్లించేవారని తెలుస్తుంది.
వ్యాపారులు తమ స్వస్థానాలను విడిచి అన్యప్రాంతాలకు వెళ్లినపుడు ఇటువంటి పన్నులు చెల్లించడం తప్పదు, అదే సమయంలో వారికి తగిన సౌకర్యాలు కల్పించడం కూడా ఆయా ప్రాంతాల రాజులపై ఉంటుంది. పరస్పర సహకారంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కాకతీయ రాజులు కల్పించినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తుంది. (తరువాయి వచ్చే సంచికలో)
డా।। బిన్నూరి మనోహరి
ఎ : 9347971177