‘దక్కన్‍ల్యాండ్’ పత్రికను పదేండ్లు సుదీర్ఘ కాలగమనంలో, ఇది సామాన్యంగా కన్పింపచవచ్చునేమో కానీ, సాహిత్య, సామాజిక, కళారంగాలకు చెందిన పత్రికా ప్రపంచంలో ఇది తక్కువేమీ కాదు. పత్రికను ప్రారంభించడం తేలిక! రెండు, మూడు సంచికలు వెలువడ్డాక, పత్రికా నిర్వాహకులు ఎదుర్కొనే పరిస్థితులు అనేకం. నిర్వహణ ఖర్చు ముఖ్యమైనా, దాన్నటుంచి, పాఠకుల్లోకి చొచ్చుకుపోయి, వారి మదిలో సుస్థిరస్థానం పొందడం తేలికైనపని కాదు. దీనికి ఎన్నో
ఉదాహరణలు మన అనుభవంలో చూశాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలతో కూడిన అవసరాన్ని గుర్తించి, ‘దక్కన్ ల్యాండ్’ దీన్ని ప్రారంభించడం ముదావహం. సరైన సమయంలో, కొత్త రాష్ట్రాన్ని సర్వతో ముఖంగా ప్రతిబింబించడాన్కి, కాలక్రమంలో మరుగునపడి వెలుగుకు నోచుకోని అనేకానేక విషయాలను వివరించాల్సిన అవసరం వుందని పత్రికా నిర్వాహకులు భావించడం సబబే! భారతదేశ చరిత్రలో దక్కన్ పీఠభూమికి ప్రత్యేక చారిత్రక, సామాజిక, సాంస్కృతిక మనుగడలున్నాయి. అటు ఉత్తర, ఇటు దక్షిణ భారతాలలో భాగంగా కూడా, కొన్ని సామాన్యీకరణలకు లోబడి, చరిత్రలో దక్కన్ తన ప్రత్యేకతను నిలుపుకొన్నది. ఉత్తర, దక్షిణ భారతాల చారిత్రక, సాంస్కృతిక వారసత్వం లోని ధనాంశాలను తనలో ఇముడ్చు కొంటూనే, ‘దక్కనీయ సంస్కృతి’ (Deccan Cusine) గూడ తన ప్రత్యేకతను నేటికీ నిలుపుకుంటున్నది. ఆహార, జీవనసరళి యిందులో భాగం. ప్రముఖ చరిత్రకారిణి స్వర్గీయ సరోజనీ రేగాని, దక్కన్ సంస్కృతలోని విశిష్టాంశాలపై ప్రత్యేక అధ్యయనాలు అవసరమని చెప్పేవారు.
‘దక్కన్ ల్యాండ్’ పత్రిక దక్కనీయ సంస్కృతి పునరుద్ధరణలో భాగంగా నేను భావిస్తున్నాను. పత్రికకు పేరు పెట్టడంలో సంపాదకుల దృష్టిలో యీ సాంస్కృతికాంశం యిమిడి వుంటుందని నేను భావిస్తున్నాను.
ఇంతకీ ‘దక్కన్‍ల్యాండ్’ ప్రత్యేకత ఏమిటి?
ISSN ఆమోదం (International Standard Serial Number) రావడం అత్యంత ముదావహం. పరిశోధకులకు – చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, సమాజం- ఇదివరంలాంటిది. దీనివల్ల యిందులో ప్రచురితమయ్యే వ్యాసాలకు అదనపు అర్హత లభిస్తుంది. ఇదొక్కటేకాదు. రాజకీయ, సామాజిక రంగాలు, ఆర్థికంతో సహా – సంక్షోభాలకు గురవుతున్నాయి. వాటి ప్రకంపనలు, తెలంగాణతో సహా. అన్ని ప్రదేశాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. దీంతో సమ్యక్ సామాజిక దృష్టి, అభిలషించదగ్గ చైతన్యం కొరవడుతున్నాయి. చరిత్ర, వారసత్వసంపద పరిరక్షణ నామ మాత్రంగా మిగిలి పోతున్నాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రజా జీవన సరళి. అందులోని వైవిధ్యం, అంతరించి పోతున్న వారసత్వ సంపద, చేతి వృత్తులు, ప్రజా కళలు కనుమరుగువుతున్న శోచనీయ సందర్భంలో వాటిని పరిరక్షిం చాలన్న సత్సంకల్పంతో ‘దక్కన్‍ల్యాండ్’ మొదలై అనేకానేక ఇబ్బందులకు లోబడి, క్రమం తప్పకుండా వెలువడ్డం ప్రశంసనీయం.
‘‘దక్కన్‍ల్యాండ్’’ పత్రిక విజయ వంతంగా ముందుకు సాగడానికి, ఇతరత్రా ఎందరో సహాయ సహకారాలతో పాటు, శ్రీ వేదకుమార్ (సంపాదకులు) గారి పెద్దరికం, కార్యశీలత, సంయ మనం, స్నేహసంబంధాలు ఎంతగానో తోడ్పడ్డాయి.
ఇలాగే, మరో పదికాలాల పాటు, ‘దక్కన్‍ల్యాండ్’ మనుగడ సాగించాలని, తెలంగాణ ఇతిహాసపు చీకటి కోణంలోని ముఖ్యాంశాలను, చరిత్ర, సంస్కృతి, ప్రజాకళలు, జీవనసరళి వెలుగులోకి తేవాలని ఆశిస్తూ – సెలవు.
- వకుళాభరణం రామకృష్ణ
ఎ : 98668 4140