తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ


పల్లెవాసుల బతుకులో బతుకమ్మ కదలాడుతుంది. వారి ప్రతి పనిలో బతుకమ్మ పాట ఉంటుంది. కొత్త పంటలు చేతికొచ్చే వేళ ప్రతి ఇంట్లో ఒక సంబురం. కొత్త బట్టలు ధరించి బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్క చోటుకు చేరి ఆడుతుంటే కళ్లార్పకుండా చూడాల్సిందే. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ వేడుకలు మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు కొనసాగుతాయి.
‘బతుకమ్మ బతుకు / గుమ్మడి పూలు పూయగా బతుకు / తంగెడి పసిడి చిందగా బతుకు/ గునుగు తురాయి కులుకగ బతుకు/ కట్ల నీలిమల చిమ్మగా బ్రతుకు’ అని ప్రజాకవి కాళోజీ తెలంగాణ వారసత్వ సంపద బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియచేశారు. బతుకుతో ఇంత ప్రత్యక్ష సంబంధమున్న పండుగ మరొకటి లేదు. ప్రకృతిలో నిబిడీకృతమైన నిసర్గ సౌందర్యాన్ని తెలంగాణ గుమ్మం ముందు నిలిపిన పండుగ బత్కమ్మ.


పుష్పం పునరుత్పత్తికి ప్రతీక, మానవ సమాజం ధరిత్రిపై అవిచ్ఛి న్నంగా కొనసాగడానికి స్త్రీకి ప్రకృతి కల్పించిన ప్రత్యేక ధర్మం సంతానోత్పత్తి. తల్లి కడుపులో శిశువు పెరుగు దలతో పాటు దాని జీవన సారాలన్నీ బొడ్డు తాడు ద్వారానే తీరుతాయి. ఈ బొడ్డు తాడుకు, మహత్మ్యాన్ని, దైవత్వాన్ని అపాదించి రూపం కలిపిస్తే బొడ్డెమ్మ అవుతుంది. ఈ మహోన్నత పవిత్ర కృతజ్ఞతను వ్యక్తం చేసుకోవడం కోసం పూలను బత్కమ్మగా, బొడ్డెమ్మగా కొలిచే అద్వితీయ సాంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం.


తెలంగాణ అంటేనే జాతర, పండుగలు, బహుజన దేవతారాధన. ఇక్కడి చెట్టు, పుట్ట, చేను, చెలక, పిట్ట, పువ్వు అన్నింటికీ ఒక చరిత్ర ఉంటుంది. కాకతీయుల సామ్రాజ్య పాలకులు తెలంగాణ అంతటా చెరువులను తవ్వించడం ఒక ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు. చెరువులను అభివృద్ధికి ప్రతీకలుగా భావించారు. అప్పటినుండి ఈ సాంప్రదాయాన్ని జానపదులు కాపాడుతూ వస్తున్నారు. చిరు మార్పులతో ఆనాటి పండుగను నేటికీ జరుపుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండేది చెరువుల వల్లే కాబట్టి అందరూ కలిసి ఏడాదికొకసారి చెరువులకు పూలతో కృతజ్ఞతలు చెప్పేవారు. అందుకే బతుకమ్మ చెరువుల పండుగ.
పండుగ జరిపే నాటికి వర్షరుతువు ముగింపులో ఉంటుంది. చెరువులు, కుంటలు నీలి బంగారంతో నిండి ఉంటాయి. ఎటు చూసినా ఆకుపచ్చ రంగు ఉంటుంది. రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది. బతుకమ్మలో వాడే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. పండుగ కొనసాగు తున్న 18 రోజులు పంచే ఫలహారాలలో పుష్కలమైన ఖనిజ, విటమిన్‍ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. లయబద్ధమైన పాదపు కదలికలు, లలితమైన చప్పట్ల మోతలు, అద్భుతమైన సారస్వత విలువలు గల పాటలతో రసరమ్య మోహనరాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రేమలు, ఆప్యాయ తలు, మానవ సంబంధాలను చిక్కపరిచే బతుకమ్మ చిరకాలం వర్ధిల్లుతూనే ఉంటుంది.


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్‍ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చి గౌరవించుకుంటూ ప్రపంచానికి తెలియజేస్తున్నది. పండగల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. బతుకమ్మ పండుగను ప్రపంచానికి తెలియ జేయడంలో తెలంగాణా మహిళా ఉద్యమ బిడ్డలు మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత కృషి ప్రత్యేకమైనది.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *