కాకి పిల్ల

అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరు పేరు రాజూరు. రాజూరి మధ్యలో నాలుగు బాటల కూడలి ఉంది. ఆ కూడలిలో రావి చెట్టు ఒకటుంది. ఎత్తైన ఆ చెట్టు కొమ్మల్ని నాలుగు బాటల మీదికి విస్తరించుకుంది. ఆ చెట్టును అందరూ కొంగల రావిచెట్టు అంటారు. ఎందుకంటే ఆ చెట్టుకు పై భాగంలో కొమ్మకొమ్మనా కొంగలు గూళ్లు ••ట్టుకుని ఉంటాయి.
కొంగలు గూళ్లు కట్టుకోవడానికి తెచ్చుకున్న చిన్ని చిన్ని పుల్లలు ఒకోసారి కిందికి జారి నేలమీద పడిపోతాయి. వాటిని ఏరుకుని కాకులు కింది కొమ్మల్లో గూళ్లు కట్టుకుంటాయి. పక్షులు గుడ్లుపెట్టి పొదిగే కాలంలో చెట్టుమీదంతా ఒక తిరణాల జరుగుతున్నట్టు సందడి సందడిగా ఉంటుంది.


గుడ్లను పొదిగే ఆడకొంగలు, వాటికి ఆహారం తెచ్చే మగ కొంగలు, చుట్టపు చూపు కోసం వచ్చే పొరుగూళ్ల కొంగల్తో ఆ ప్రాంతమంతా తెల్లని తెరచాప పడవలు గాలిలో ఎగురుతున్నట్టు ఉంటుంది. రాత్రివేళ కొంగలన్నీ కొమ్మల్లో ఉన్నప్పుడు రావిచెట్టు తెల్లని పెద్ద పెద్ద పూలు పూసినట్టు ఉంటుంది.
కింది కొమ్మల్లోని కాకులన్నీ కొంగలపట్ల విధేయంగా ఉంటాయి. ఎందుకంటే కొంగలు తెచ్చుకున్న చేపల ఆహారంలో కొన్ని చేపలు ఒకోసారి జారి కిందపడి కాకులకు విందుగా దొరుకుతాయి.


మొదట్లో కాకులు ఆ చేపల్ని తీసుకోడానికి జంకేవి. భయం భయంగా పైకి చూసేవి. అది చూసి కొంగలు ‘‘ఫర్వాలేదు తీసుకోండి. మేం చెరువుకెళ్లి మళ్లీ తాజా చేపల్ని తెచ్చుకుంటాంలే’’ అనేవి.


అలా కొంగలూ కాకులూ సఖ్యంగా ఉండేవి.
అటు కొంగలవి ఇటు కాకులవి గుడ్లన్నీ పిల్లలై కొత్త తరం వచ్చింది. ఒకసారి ఒక కాకిపిల్ల వాళ్లమ్మ తెచ్చిన ఎంగిలి మెతుకుల్ని నోట కరుచుకుని మెల్లమెల్లగా ఎగిరి పై కొమ్మ మీదికి వెళ్లింది. అక్కడ దానికొక కొంగపిల్ల నేస్తం ఉంది.


దానికి తన నోటిలోని అన్నాన్ని చూపించి ‘‘తింటావా, చాలా బావుంటుంది’’ అంది.
కొంగపిల్ల ఆసక్తిగా బైటికొచ్చి ‘‘ఏంటది?’’ అనడిగింది.
‘‘అన్నం’’ అంది కాకిపిల్ల.
కొంగపిల్ల దగ్గరకొచ్చి అదేంటో అని చూడబోయింది.


అంతలో బైటికెళ్లిన కొంగపిల్ల తల్లి ఇంటికొచ్చింది. ‘‘అయ్యయ్యో, ఏంటది?’’ అని తన పిల్లని ఆపింది.
అవతలి కొమ్మమీద గూడు కట్టుకున్న కొంగపిల్ల మేనత్త ఇదంతా చూడనే చూసింది. ‘‘చూసారా, కింది వరస వాళ్లతో స్నేహం వద్దని నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటూంటే విన్నారా? ఇవాళ ఎంగిలి మెతుకులు తెచ్చింది. రేపు ఏ అశుద్ధమో తెచ్చి తినమంటుంది. ఛీ•ఛీ…’’ అని చీదరించుకుంది. ‘‘ఏయ్‍ కాకిపిల్లా, పోవే. ఈసారి పైకి వచ్చావంటే కాళ్లు విరగ్గొడతాను’’ అంది కోపంగా.


కాకిపిల్ల భయంతో వణికిపోతూ కిందికొచ్చేసింది. తను చేసిన తప్పే మిటో దానికి అర్థం కాలేదు. ఏడు పొచ్చేసింది. వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఇదంతా వింటున్న రావిచెట్టు తొర్రలోని చిలకమ్మ బైటికొచ్చి కాకిపిల్లని ఓదార్చడానికి పచ్చని రెక్కల్ని విప్పి నాట్యం చేసింది. తోకను ఊపుతూ కాళ్లతో కొమ్మను పట్టుకుని గుండ్రంగా తిరిగింది. ఎర్రని ముక్కుని రెక్కల్లో దాచుకుని హఠాత్తుగా బైటికి తీసి కాకిపిల్లని నవ్వించింది.
‘‘ఏడవకు కాకిపిల్లా! అందరం రెక్కలున్న పక్షులమే అయినా ఎవరి ఆహారం వాళ్లది. మేం చూడు, దోరముగ్గిన పళ్లు తప్ప ఏమీ తినం. అలాగే కొంగలు నీటిలోని జీవుల్ని మాత్రమే తింటాయి. నువ్వు చిన్న పిల్లవు కదా, అందుకే నీకు ఇవేమీ తెలీదు. మీ అమ్మ వాళ్లకి బాగా తెలుసు ఇదంతా’’ అని ఊరుకోబెట్టింది.


ఆ ఎదుటి కొమ్మ మీద కూర్చుని రావి పళ్లు కోసుకుని తింటున్న ఉడత ఒకటి తను కూడా ఏదో ఒకటి మాట్లాడాలని ‘‘ఆఁ… మొన్నొక రోజు ఏమైందో తెలుసా, నేను పై కొమ్మల్లో రావి పళ్లు కోసుకోవడానికెళ్లేను. కొంగ పిల్లొకటి గూట్లోంచి తల బైటికి పెట్టి అదే పనిగా నా వైపు చూస్తోంది. ‘తింటావా’ అని రెండు కాయలు పట్టుకెళ్లి ఇవ్వబోయాను. వెనక నుంచి వాళ్ల నాన్న కొంగ తన ముక్కుతో ఠపీమని నా నెత్తిమీద ఒక్కటిచ్చింది. నేను ఒక్క పరుగుతో కిందకొచ్చి పడ్డాను’’ అంది కళ్లింతింతలు చేసుకుని అభినయించి చూపిస్తూ. చిలకమ్మ, కాకిపిల్ల కిలకిలా నవ్వేయి.

  • కె. వరలక్ష్మి ఫోన్‍ : 9866467062

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *