ఫుట్‍బాల్‍ దిగ్గజం హబీబ్‍ ఒక బ్రాండ్‍ కోల్‍కత్తాను ఊపేసిన హైదరాబాద్‍ ఫుట్‍బాల్‍ ఆటగాడు

ప్రముఖ ఫుట్‍బాలర్‍ మహ్మద్‍ హబీబ్‍ గురించి ఇప్పటితరం వాళ్లకు తక్కువగా తెలిసుండొచ్చు. కానీ ఆయన ఘనతలు వింటే ఇలాంటి మేటి ఆటగాడు ఆడుతున్న తరంలో మనం ఎందుకు లేము అనిపిస్తుంది.


భారత మాజీ ఫుట్‍బాలర్‍, అర్జున అవార్డు గ్రహీత మహ్మద్‍ హబీబ్‍ (74) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హబీబ్‍ స్వస్థలమైన హైదరాబాద్‍లో ఇదొక మామూలు వార్త. కానీ కోల్‍కతాలో మాత్రం ఇదొక పెద్ద విషాదం. సాకర్‍ అంటే పడిచచ్చే బెంగాలీలకు హబీబ్‍ ఒక సూపర్‍ స్టార్‍. 70వ దశకంలో ఆయన విన్యాసాలకు ఊగిపోయిన అప్పటి తరం సాకర్‍ ప్రియులు.. హబీబ్‍ ఘనతలను గుర్తు చేసుకుంటూ విషాదంలో మునిగిపోతున్నారు. హబీబ్‍ ఘనతల గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రపంచ సాకర్‍ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరున్న పీలే సైతం హబీబ్‍ ఆటపై ప్రశంసలు కురిపించా డంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.


మనోడు.. పీలే మెచ్చినోడు
అది 1977వ సంవత్సరం. మహ్మద్‍ హబీబ్‍ బెంగాల్‍ క్లబ్‍ మోహన్‍ బగాన్‍కు ఆడుతున్నాడు. ఈ క్లబ్‍తో స్నేహ పూర్వక మ్యాచ్‍ ఆడేందుకు న్యూయార్క్కు చెందిన కాస్మోస్‍ క్లబ్‍ వచ్చింది. అది ఆషామాషీ జట్టు కాదు. ఆల్‍ టైం గ్రేట్‍ పీలేతో పాటు కార్లోస్‍ ఆల్బర్టో, జార్జియో చినాగ్లియా లాంటి మేటి ఆటగాళ్లతో నిండిన ప్రపంచ స్థాయి జట్టది. మోహన్‍ బగాన్‍ ఇండియాలో బెస్ట్ క్లబ్‍ అయినప్పటికీ.. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే చాలా దిగువనే ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే ఏకపక్షంగా సాగుతుందని.. మోహన్‍ బగాన్‍ చిత్తుగా ఓడిపోతుందని విశ్లేషకులు అంచనా వేశారు.


కానీ అంచనాలను తలకిందులు చేస్తూ మోహన్‍ బగాన్‍.. కాస్మోస్‍ క్లబ్‍కు దీటుగా నిలబడింది. మ్యాచ్‍ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. చివరికి స్కోరు 2-2తో సమమైంది. మ్యాచ్‍ డ్రా అయింది కానీ.. మోహన్‍ బగాన్‍ స్థాయికి ఈ ప్రదర్శన చేయడమంటే గెలుపు కంటే ఎక్కువే. ఈ ఆటలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో మహ్మద్‍ హబీబ్‍ ఒకరు. ఆయన ఈ మ్యాచ్‍లో ఒక గోల్‍ కూడా కొట్టాడు. మ్యాచ్‍ అనంతరం పీలే.. హబీబ్‍ ప్రతిభ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. హబీబ్‍ను వ్యక్తిగతంగా అభినందించాడు. పీలే పొగడటం వల్ల హబీబ్‍ గొప్పవాడు అయిపోలేదు. ఆయన ఘనతల గురించి చెప్పుకోవడానికి చాలానే ఉంది.


చిరస్మరణీయ క్షణం అదే
మిడ్‍ఫీల్డర్‍గా మూడు ప్రఖ్యాత క్లబ్‍లు మోహన్‍బగాన్‍, ఈస్ట్ బెంగాల్‍, మొహమ్మదాన్‍ స్పోర్టింగ్‍లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. హబీబ్‍ కెరీర్‍లో చిరస్మరణీయ క్షణం 1977లో వచ్చింది. కోల్‍కతా ఈడెన్‍ గార్డెన్స్లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‍లో హబీబ్‍ మోహన్‍బగాన్‍ తరఫున బరిలోకి దిగగా… ప్రత్యర్థి టీమ్‍ కాస్మోస్‍ క్లబ్‍లో ఆల్‍టైమ్‍ గ్రేట్‍ ఆటగాళ్లు పీలే, కార్లోస్‍ ఆల్బర్టో ఉన్నారు.


బెంగాల్‍ దత్తపుత్రుడు
60, 70 దశకాల్లో స్వర్ణయుగం చూసిన భారత ఫుట్‍బాల్‍ జట్టులో కీలక సభ్యుడు మహ్మద్‍ హబీబ్‍. భారత జట్టుకు 35 మ్యాచ్‍ల్లో ప్రాతినిధ్యం వహించిన హబీబ్‍.. 11 గోల్స్ సాధించాడు. 1970 బ్యాంకాక్‍ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో హబీబ్‍ సభ్యుడు. హబీబ్‍ కంటే ముందు, తర్వాత ఎంతోమంది మేటి ఆటగాళ్లున్న ప్పటికీ.. భారత ఫుట్‍బాల్‍ చరిత్రలోనే అత్యుత్తమ మిడ్‍ఫీల్డర్‍గా ఆయన్ని సాకర్‍ నిపుణులు పరిగణిస్తారంటే తనెంత గొప్ప ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. భారత్‍లో తొలి తరం ప్రొఫెషనల్‍ ఫుట్‍బాలర్లలో హబీబ్‍ ఒకరు. ఆయన 60వ దశకంలోనే క్లబ్‍ ఫుట్‍బాల్‍లో అడుగు పెట్టాడు. 1968లో మోహన్‍ బగాన్‍ తరఫున ఆయన క్లబ్‍ ఫుట్‍బాల్‍లోకి అడుగు పెట్టాడు.


ఈస్ట్ బెంగాల్‍.. తదితర స్పోర్టింగ్‍ క్లబ్‍లకు కూడా ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. మోహన్‍ బగాన్‍ తరఫున ఆయన ప్రదర్శనలు, సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోయేవే. ఎందరో దిగ్గజ ఆటగాళ్లు ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. మహ్మద్‍ హబీబ్‍ తమ క్లబ్‍కు ఆడటాన్ని ఇప్పటికీ గర్వకారణంగా భావిస్తుంది మోహన్‍ బగాన్‍. ఈ క్లబ్‍తో పాటు ఈస్ట్ బెంగాల్‍కు అనేక మరపురాని విజయాలను అందించాడు హబీబ్‍. కేవలం ఆయన ఆట చూడటానికే లక్షల మంది అభిమానులు స్టేడియాలకు తరలి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. కోల్‍కతా వాసులు ఆయన్ని ముద్దుగా ‘బడే మియా’ అని పిలుచుకునేవారు. ఫుట్‍బాల్‍ క్లబ్‍లు హబీబ్‍ను దక్కించుకోవడానికి క్లబ్‍లు ఖాళీ చెక్కులు పట్టుకుని ఆయన వెంట తిరిగేవట. ఒక సందర్భంలో మోహన్‍ బగాన్‍ నుంచి అడ్వాన్స్ చెక్కు అందుకున్న హబీబ్‍ను ఎలాగైనా తమ క్లబ్‍కు ఆడించాలనే ఉద్దేశంతో ఈస్ట్ బెంగాల్‍ క్లబ్‍ ప్రతినిధులు.. కోల్‍కతా నుంచి హైదరాబాద్‍లో ఉన్న హబీబ్‍ కోసం ఇక్కడికి వచ్చి సంప్రదింపులు జరపడం విశేషం.


పుట్టింది పెరిగింది హైదరాబాద్‍లో అయినా.. బెంగాల్‍కు దత్తపుత్రుడిగా మారిపోయిన హబీబ్‍.. ఓవైపు క్లబ్‍ ఫుట్‍బాల్‍ ఆడుతూనే, మరోవైపు బెంగాల్‍ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టుకు నాలుగు సంతోష్‍ ట్రోఫీలు అందించాడు. ఆటలో సాధించిన పేరు ప్రఖ్యాతుల వల్ల ఎన్నో సంస్థలు హబీబ్‍కు భారీ జీతాలతో ఉద్యోగాలు ఇవ్వజూపినా హబీబ్‍ ఒప్పుకోలేదు. కెరీర్‍ ముగిశాక కోచ్‍గా మారాడు. మూడు దశాబ్దాల పాటు వివిధ క్లబ్‍లు, అకాడమీల్లో కోచ్‍గా పని చేశాడు. కొన్నేళ్ల కిందట ఆయన డెమెన్షియా బారిన పడ్డాడు. ఆ తర్వాత పార్కిన్సన్‍ బాధితుడిగానూ మారాడు. 74 ఏళ్ల హబీబ్‍ అనారోగ్యంతో (ఆగస్టు 15, 2023) చికిత్స పొందుతూ స్వస్థలమైన హైదరాబాద్‍లోనే కన్నుమూశారు.

  • ఎం.డి. కరీం
    ఎ : 9618644771

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *