దేశం గర్వించదగిన ఇంజనీర్‍ ఎత్తిపోతల సలహాదారు శ్రీ కె పెంటారెడ్డి


2022లో 500 సంవత్సరాలకు ఒకసారి సంభవించే (500 Year Frequency Flood)) అతి భారీ వర్షం కురిసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన కన్నేపల్లి పంప్‍ హౌజ్‍ నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో.. 2009 వరదల్లో శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‍ కేంద్రం, కల్వకుర్తి పంప్‍హౌజ్‍ మునిగిపోయినప్పుడు వాటి పునరుద్దరణలో పాలు పంచుకున్న అనుభవంతో కాళేశ్వరం పంప్‍ హౌజ్‍లను కూడా పునరుద్దరించగలమని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రకృతి విపత్తుల సందర్భంగా దేశంలో అనేక ప్రాజెక్టులలో ఇటువంటి సంఘటనలు జరిగాయని, వాటిని స్వల్ప కాలంలోనే పునరుద్దరించగలిగామని ఆత్మ విశ్వాసంతో ప్రకటించాడు ఎత్తిపోతల సలహాదారు శ్రీ పెంటారెడ్డిగారు. ఆ మేరకు ఒక పత్రికా ప్రకటన కూడా జారీ చేసినాడు. ఆ ప్రకటన జారీ చేసినందుకు కొంత మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆయనను ఉద్దేశిస్తూ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసినారు.

తెలంగాణ ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో నిస్వార్థంగా, బాధ్యతాయుతంగా తన వయసును, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సేవలు అందిస్తున్న ఆ మహానుభావుడిని ఆయన వయసును కూడా గౌరవించకుండా ఆ రకంగా దుర్భాషలాడడం గుండెను మెలిపెట్టింది. ఆ సమయంలో పెంటారెడ్డి గారు మనోస్థైర్యం కోల్పోకుండా ఉండాలంటే తెలంగాణ పౌర సమాజం.. ముఖ్యంగా ఇంజనీర్లు ఆయనకు అండగా నిలవాలని, మద్దతు ప్రకటించాలని భావించి ఆయన మీద అపారమైన గౌరవంతో, ప్రేమతో అప్పట్లో ఒక చిన్న వ్యాసాన్ని ఫేస్‍ బుక్‍లో పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ ద్వారా పెంటారెడ్డి గారికి అనూహ్యమైన సంఘీభావం వ్యక్తం అయ్యింది. ఇప్పుడు పెంటారెడ్డి గారి మార్గ నిర్దేశనంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 145 మెగావాట్ల రేటింగ్‍ కలిగిన మొదటి పంపును ప్రారంభించిన సందర్భంగా మరికొంత సమాచారంతో పాత వ్యాసాన్ని విస్తృత పరచి ఈ వ్యాసం రాయడం జరిగింది.


పెంటారెడ్డి గారికి ఇప్పుడు 80 ఏండ్లు. ఈ వయసులో కూడా 25 ఏండ్ల యువకుడిలాగా పని చేస్తూ పంపులు, మోటార్లు, వాటి అనుబంద పరికరాల డిజైన్‍ దగ్గర నుంచి మొదలై వాటి తయారీ, తనిఖీ, అమర్చడం, వాటిని పని చేయించడంలో పెంటారెడ్డి గారి అనితరసాధ్యమైన క•షి కొనియాడదగింది. ఒక ప్రాజెక్టు నుంచి మరొక ప్రాజెక్టుకు రాష్ట్రమంతా అలుపెరగకుండా తిరుగుతూ ఇంజనీర్లకు, ఏజెన్సీల ప్రతినిధులకు సూచనలు సలహాలు ఇస్తూ ఒక హెడ్‍ మాస్టర్‍ లాగా వ్యవహరించి అవి విజయవంతం కావడానికి దోహదపడినాడు. వికారాబాద్‍ జిల్లా ధరూర్‍ మండలం కెర్రెలి గ్రామంలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 1944, ఏప్రిల్‍ 5 న జన్మించిన పెంటారెడ్డి గారు 1970లో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్‍ కాలేజీ నుండి ఎలక్ట్రికల్‍ ఇంజనీరింగ్‍లో పట్టా అందుకున్నారు. ఇంజనీరింగ్‍ కాలేజీలో ఉండగానే 1969 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది.

ఆఉద్యమంలో భాగస్వామి అయినాడు. ఒక సంవత్సరం కోల్పోయినాడు. జామె ఉస్మానియా రైల్వే స్టేషన్‍ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో ఇంజనీరింగ్‍ విద్యార్థి సర్వారెడ్డి మరణాన్ని చూసినాడు. అది అతని గుండెల్లో నిలచిపోయింది. రెండేండ్ల తర్వాత 1972 లో ఆనాటి విద్యుత్‍ బోర్డులో జూనియర్‍ ఇంజనీర్‍గా ఉద్యోగంలో చేరినాడు. 30 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో విద్యుత్‍ బోర్డులో సేవలు అందించాడు. ఏప్రిల్‍ 2002 లో విద్యుత్‍ శాఖలో సూపరింటెండింగ్‍ ఇంజనీర్‍గా పదవీ విరమణ చేసిన తర్వాత సాగునీటి శాఖకు ఆయన 25 ఏండ్లుగా సేవలు అందిస్తున్నారు. తెలంగాణలో మొదటి ఎత్తిపోతల పథకం అయిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (SLBC) నుంచి మొదలైన ఆయన సేవలు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‍ సాగర్‍, దేవాదుల, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, డిండీ, భక్త రామదాసు, తుమ్మిళ్ళ, చనాకా కొరట, సీతారామ, శ్రీరాంసాగర్‍ పునరుజ్జీవన పథకం, ఎల్లంపల్లి, చిన్నకాళేశ్వరం, గూడెం, మంథని, అలీసాగర్‍, గుత్పా, సంగమేశ్వర, బసవేశ్వర తదితర ప్రాజెక్టుల్లో, తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం అయిన, అవుతున్న చిన్నాపెద్దా ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‍ రంగ నిపుణిడిగా అనితరసాధ్యమైన సేవలు అందించారు. ఇంకా అందిస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్‍ ప్రభుత్వాలు చేపట్టిన ఎత్తిపోతల పథకాలలో కూడా ఆయన ఘనమైన పాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు పునాది రాయి లాంటి ప్రాజెక్టు ఎలిమినేటి మాధవ రెడ్డి ఎత్తిపోతల పథకం. ఆ ప్రాజెక్టును ఆంధ్రా ఇంజనీర్లు, సలహాదార్ల కుట్రల నుంచి కాపాడి విజయవంతంగా నిర్మాణం పూర్తి కావించాడు. విద్యుత్‍ బోర్డు ఉద్యోగిగా పదవిలో ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఎత్తిపోతల పథకం ఎలిమినేట్‍ మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో పుట్టంగండి పంప్‍ హౌజ్‍ నిర్మాణం, పంపులను అమర్చడం తదితర పనులను విద్యుత్‍ శాఖ తరపున పర్యవేక్షణ విధులు నిర్వహించారు. 18 మెగావాట్ల రేటింగ్‍, 600 క్యూసెక్కుల పంపింగ్‍ సామర్థ్యం కలిగిన 4 పంపులను ఈ పంప్‍ హౌజ్‍లో అమర్చారు. వీటిని తయారు చేసింది బిహెచ్‍ఇఎల్‍. 100 మీటర్ల ఒకే స్టేజి లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసే ఈ పక్రియ అద్భుతంగా విజయవంతం కావడంతో తెలంగాణలో భారీ ఎత్తిపోతలకు డిమాండ్‍ లు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం చేపట్టిన అన్ని ఎత్తిపోతల పథకాల్లో కూడా పంపులు, మోటార్ల ను అమర్చడంలో కన్సల్టెంట్‍ తన వంతు సహకారం అందించాడు. రిటైర్‍ అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పనలో పాలు పంచుకున్నాడు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం తరపున ఈ పథకం అమలు కోసం జరిగిన భావ ప్రచారంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా తిరిగి ప్రచారం చేశాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్‍ పెంటా రెడ్డి గారిని సాగునీటి శాఖలో ఎత్తిపోతల సలహాదారుగా నియమించారు. తెలంగాణలో మరిన్ని ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి తన మేధస్సును, చమటను ధారపోసిన వ్యక్తి పెంటారెడ్డి గారు. విద్యుత్‍ బోర్డులో వివిధ స్థాయిల్లో జల విద్యుత్‍ కేంద్రాల్లో పని చేసిన అపార అనుభవం ఆయన స్వంతం. ముఖ్యంగా నాగార్జునసాగర్‍, శ్రీశైలం జల విద్యుత్‍ కేంద్రాల్లో Reversible Turbinesను డిజైన్‍, తయారీ, టెస్టింగ్‍, అమర్చడం లాంటి పనుల ద్వారా అపారమైన అనుభవాన్ని గడించిన వ్యక్తి ఆయన. Reversible Turbines అంటే.. అవి సవ్యమైన దిశలో తిరిగితే విద్యుత్‍ ను ఉత్పత్తి చేసే యంత్రాలుగా పనిచేస్తాయి. అపసవ్య దిశలో తిరిగితే నీటిని ఎత్తిపోసే పంపు లాగా పనిచేస్తాయి. నాగార్జునసాగర్‍ జల విద్యుత్‍ కేంద్రంలో 108 మెగావాట్ల రేటింగ్‍ కలిగిన 7, శ్రీశైలం జల విద్యుత్‍ కేంద్రంలో 150 మెగావాట్ల రేటింగ్‍ కలిగిన 6 Reversible Turbines ను ఏర్పాటు చేయడంలో పెంటారెడ్డి గారు టీం లీడర్‍ గా కీలక పాత్ర పోషించినారు. ఈ Reversible Turbinesను మన దేశ బిహెచ్‍ఇఎల్‍, జపాన్‍ దేశ హిటాచి కంపనీ సంయుక్తంగా తయారు చేసినాయి.Rotor భాగాలను హిటాచి కంపనీ తయారు చేస్తే, Non Rotor భాగాలను బిహెచ్‍ఇఎల్‍ తయారు చేసింది. ఈ పనికి ముందు బిహెచ్‍ఇఎల్‍ నుంచి ఇద్దరు, విద్యుత్‍ బోర్డు నుంచి ఇద్దరు ఇంజనీర్లను హిటాచి కంపనిలో శిక్షణ కోసం జపాన్‍ కు పంపించారు. ఆ నలుగురిలో పెంటారెడ్డి గారు ఒకరు. జపాన్‍లో శిక్షణ కోసం ఎంపిక అయినప్పుడు ఆయన డిప్యూటీ ఇంజనీర్‍ మాత్రమే. అయినా ఆనాడు విద్యుత్‍ బోర్డ్ ఛైర్మన్‍ గా ఉన్న నార్ల తాతారావు పెంటారెడ్డి గారినే ఎంపిక చేసినారు. నార్ల తాతారావు గారికి, ఆయన తర్వాత ఛైర్మన్‍గా పని చేసిన పార్థ సారథి గారికి పెంటారెడ్డి గారి నైపుణ్యం, కార్య దక్షత పట్ల అపారమైన నమ్మకం ఉండేది. జపాన్‍ లో 6 నెలల పాటు కొనసాగిన శిక్షణలో పెంటారెడ్డి గారు భారీ పంపులు, మోటార్ల డిజైన్‍, తయారీ, వాటి అనుబంధ సాంకేతిక అంశాలను అత్యంత శ్రద్ధతో నేర్చుకున్నారు. వాటికి సంబందించిన సాంకేతిక పత్రాలను తన వెంట తెచ్చుకున్నారు. ఆ అనుభవం ఆయనకు నాగార్జునసాగర్‍, శ్రీశైలం, లోయర్‍ సీలేరు జల విద్యుత్‍ కేంద్రాల నిర్మాణంలో ఉపయోగపడినాయి. శ్రీశైలం కుడి జల విద్యుత్‍ కేంద్రాన్ని 1998లో ఒకసారి, 2009లో రెండవసారి కృష్ణా వరదలు ముంచెత్తితే, జల విద్యుత్‍ కేంద్ర పునరుద్దరణలో పెంటారెడ్డి గారు క్రియాశీల పాత్ర పోషించినారు. ఆ తర్వాత తెలంగాణ ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో కూడా ఈ అనుభవాలు ఉపయోగపడినాయి. మన రాష్ట్రంలోనే కాదు ఉత్తరాఖండ్‍ రాష్ట్రంలో హెచ్‍పిసిఎల్‍ నిర్మించిన తెహ్రీ జల విద్యుత్‍ కేంద్రం, ఒడిషా, కేరళ తదితర రాష్ట్రాల జల విద్యుత్‍ కేంద్రాల నిర్మాణంలో కూడా ఆయన కన్సల్టెంట్‍గా సేవలు అందించాడు. ఈ అంశంలో ఆయనకున్న అపార జ్ఞానాన్ని, అనుభవాన్ని పురస్కరించుకొని దేశ విదేశాల్లో ఉన్న ఇంజనీర్లు ఆయనను ఇప్పటికీ సంప్రదిస్తారు. ఉమ్మడి రాష్ట్ర విద్యుత్‍ బోర్డు ఇంజనీర్‍గా ఆయన చైనా, సింగపూర్‍, ఆస్ట్రియా, యుకె, ఫ్రాన్స్ దేశాలను సందర్శించినారు.


2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‍ గారు పెంటారెడ్డి గారిని లిఫ్ట్ పథకాలకు సలహాదారుగా ఎంపిక చెయ్యడం ఈ ప్రాజెక్టులకు వరం లాంటిది. 2015 మే నెలలో ఎత్తిపోతల సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అకుంఠిత దీక్షతో పని చేసి తెలుగుదేశం, కాంగ్రెస్‍ పాలనలో చేపట్టిన అన్ని పెండింగ్‍ ఎత్తిపోతల పథకాల పంప్‍ హౌజ్‍ లను పూర్తి చేయించి వాటిని రన్నింగ్‍ ప్రాజెక్టులుగా మార్చడంలో ఆయన సఫలం అయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్‍, ఆనాడు సాగునీటి శాఖా మంత్రిగా ఉన్న హరీష్‍ రావు గార్ల నమ్మకాన్ని ఆయన ఏనాడూ వమ్ము చేయలేదు. ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన సమయం లోనే పనులు పూర్తి చేయించినారు. ఈ రోజు ఉమ్మడి మహబూబ్‍ నగర్‍ జిల్లాలో ఎత్తిపోతల పథకాల కింద 10 లక్షల ఎకరాలకు నీరు పారుతుంది అంటే ఆయన కృషి లేకుండా సాధ్యం అయ్యేది కాదు. భక్త రామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేయించిన ఘనత ఆయనది. సెప్టెంబర్‍ 16 న ప్రారంభం అయిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 145 మెగావాట్ల రేటింగ్‍ కలిగిన నార్లాపూర్‍ మొదటి పంపుతో పెంటారెడ్డి గారు కమిషన్‍ చేసిన భారీ పంపుల సంఖ్య 251కి చేరిందని ఆయన స్వయంగా నాతో చెప్పాడు. అది నిజం కూడా. ఇన్ని భారీ పంపులను తిప్పిన ఇంజనీర్‍ దేశంలో మరొకరు లేరు. ఈ ఘనత సాధించిన పెంటారెడ్డి తెలంగాణ వాడు కావడం మన అందరికీ గర్వకారణం. కేసీఆర్‍ కల్పించిన ఈ అవకాశాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసినాడు. ఎస్‍ఎల్‍బిసితో మొదలైన అనితర సాధ్యమైన కృషి ఫలితంగా రాష్ట్రంలో అనేక ఎత్తిపోతల పథకాలు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల సాగర్‍, అలిసాగర్‍, గుత్ప, దేవాదుల, కాళేశ్వరం, భక్తరామదాసు, తుమ్మిళ్ళ, గూడెం, చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్‍ రెడ్డి, ఎల్లంపల్లి, ఎసారెస్పి పునరుజ్జీవన పథకాలు కమిషన్‍ అయి ఫలితాలు అందిస్తున్నాయి. సీతారామ, చనాక కోరాట, సంగమేశ్వర, బసవేశ్వర త్వరలోనే పూర్తి కానున్నాయి. ఇప్పుడు పాలమూరు మొదటి పంపు కమిషన్‍ అయ్యింది. ఇట్లా అనేక ఎత్తిపోతలలో పంపులు ఆయన సారథ్యంలో అమర్చడం జరిగింది. వాటిలో చాలా పంపులను ప్రారంభించడం జరిగింది. ఇందులో 145 మె వా రేటింగ్‍ పంపులు మొదలుకొని 139, 125, 85, 40, 32, 18 మెగావాట్ల రేటింగ్‍ పంపులు ఉండడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న లేదా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలలో ఆయన ప్రమేయం లేని ప్రాజెక్టు లేదు. ఇవి కాక ఈ తొమ్మిదేండ్లలో ×ణ• వారి చిన్న ఎత్తిపోతల పథకాలను వందల సంఖ్యలో పునరుద్ధరించారు. ఈ పనుల కోసం ఆయన వయసును, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నిరంతరాయంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. సలహాదారుగా పంపులు, మోటార్ల తనిఖీల కోసం ఆయన జర్మనీ, స్విట్జర్‍ ల్యాండ్‍, స్వీడన్‍, ఫిన్‍ ల్యాండ్‍, ఆస్ట్రియా, చైనా దేశాలను సందర్శించారు.


కల్వకుర్తి పంప్‍ హౌజ్‍ మునిగిపోతే ఒక నెలలో పునరిద్దరిస్తామని ప్రకటించి పని చేసి చూపించాడు. కల్వకుర్తి పునరుద్దరణ సమయంలో నేను కూడా రెండు రోజుల పాటు పెంటారెడ్డి గారితో ఉండి ఆయన పని తీరును గమనించాను. ఉదయం లేవగానే ఆ రోజు చేయవలసిన పనుల చెక్‍ లిస్ట్ తయారు చేసి, స్టాఫ్‍కు ఎవరి పనులను వారికి అప్పగించేవారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు పంప్‍ హౌజ్‍లోనే వర్కర్‍లకు, ఇంజనీర్లకు సలహాలు సూచనలు ఇస్తూ గడిపేవాడు. వెళ్ళిపోయే ముందు స్టాఫ్‍తో ఆ రోజు జరిగిన పని గురించి సమీక్ష జరిపేవాడు. ఉదయం తయారు చేసిన పనుల చెక్‍ లిస్ట్లో ఏ పనులు పూర్తి అయినాయి, ఏవి కాలేదు, కాకపోతే ఎందుకు కాలేదు అన్నవి సమీక్షించుకొని నోట్‍ చేసుకునే వాడు. మరుసటి రోజు ఇదే పద్దతిలో పని మొదలయ్యేది. అట్లా నెల రోజుల్లోనే కల్వకుర్తి పంప్‍ హౌజ్‍ను అనుకున్న సమయానికి పునరుద్దరించి మిషన్‍ భగీరథకు నీటి కొరత రాకుండా సరఫరాను ఖాయం చేసినాడు. ఇదే విధంగా కాళేశ్వరంలో కన్నేపల్లి పంపులను, అన్నారం పంపులను కూడా 3 నెలల్లో పునరుద్ధరించి చూపారు. ఆర్థిక శాఖా మంత్రి హరీష్‍ రావు అసెంబ్లీ వేదికగా 2022 అక్టోబర్‍లో కాళేశ్వరం పంపిలను తిప్పి చూపిస్తామని చేసిన ప్రకటనను నిజం చేసి చూపించాడు పెంటారెడ్డి గారు. ఇదే ఆయన ప్రతిభ, కార్య దక్షతకు నిదర్శనం. ప్రచార కాంక్ష లేకుండా తన పని తాను చుప్‍ చాప్‍గా చేసుకు పోయే ఆయన ఒక అసాధారణమైన ఇంజనీర్‍. సాగునీటి శాఖలో ఆయనతో పని చేసిన ఇంజనీర్లందరికి ఆయనంటే అపారమైన గౌరవం. అవసరమైనప్పుడు నిర్లక్ష్యం పట్ల హెడ్‍ మాస్టర్‍ లాగా కఠినంగా కూడా వ్యవహరించేవాడు. అందుకే ఆయనంటే భయం కూడా.


ముఖ్యమంత్రి కేసీఆర్‍ గారు ఆయన ప్రతిభను, కార్య దక్షతను గుర్తించారు కనుకనే ఎత్తిపోతల సలహాదారుగా నియమించారు. ఈ ఎత్తిపోతల విషయంలో ఆయన నిర్ణయాలే దాదాపు ఫైనల్‍. సాగునీటి శాఖ ఇంజనీర్లు, ఏజెన్సీలు, పంపులు, మోటార్ల తయారీ సంస్థలు ఆయన ప్రతిపాదనలని, నిర్ణయాలను అంగీకరించి పనులు చేస్తారు. ఆయనకు ఆ స్వేచ్ఛను కల్పించడం వల్లనే పంప్‍ హౌజ్‍లు ఇవ్వాళ్ళ సమర్థవంతంగా పని చేస్తున్నాయి. పంప్‍ హౌజ్‍ల నిర్వహణ కోసం పెంటారెడ్డి గారు సమగ్రమైన Operation Manualను, సమగ్రమైన Tender Document తయారు చేసినారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎత్తిపోతల కింద సుమారు 75 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. పంప్‍ హౌజ్‍ల సమర్థ నిర్వాహణ ఉన్నప్పుడే నీరయి సరఫరా ఆటంకం లేకుండా సాగుతుంది. కాబట్టి సాగునీటి శాఖలో తగినంత సంఖ్యలో ఎలెక్ట్రికల, మెకానికల్‍ ఇంజనీర్ల అవసరం ఉందని భావించి నియామకాలకు సిఫారసు చేసినాడు. సాగునీటి శాఖలో నియామకం పొందిన ఎలెక్ట్రికల్‍, మెకానికల్‍ ఇంజనీర్లందరూ తప్పని సరిగా పంప్‍ హౌజ్‍లలోనే పని చేయాలని నిర్దేశించి సివిల్‍, ఇతర పనుల్లో ఉన్నవారిని పంప్‍ హౌజ్‍ పనుల్లోకి బదిలీ చేయించారు. యువ ఇంజనీర్లను తన వారసులుగా తీర్చిదిద్దినారు. ఆయన మార్గ నిర్దేశనంలో యువ ఎలక్ట్రికల్‍, మెకానికల్‍ ఇంజనీర్‍లు తర్ఫీదు పొంది పంప్‍ హౌజ్‍లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పంప్‍ హౌజ్‍ల డిజైన్‍, పంపులు, మోటార్ల తయారీ, టెస్టింగ్‍, అమరిక, కమిషన్‍.. ఇవన్ని ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగాయి. ఇంజనీర్లు, కాంట్రాక్టింగ్‍ ఏజెన్సీలు, పంపులు మోటార్ల తయారీ సంస్థలు, సబ్‍ స్టేషన్లు, విద్యుత్‍ లైన్లు నిర్మించే తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో తదితర సంబందిత వ్యక్తులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించడం, నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయించడం.. ఇవన్నీ ఎంతో బాధ్యతతో, చాకచక్యంతో నిర్వహించారు పెంటారెడ్డి గారు. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు అవసరమైనప్పుడు ఇంజనీర్‍ ఇన్‍ చీఫ్‍, సాగునీటి శాఖ సెక్రెటరీ, సాగునీటి మంత్రి, ముఖ్యమంత్రి గార్ల దృష్టికి తీసుకుపోయేవారు. వారు కూడా ఆయన ప్రతిపాదనలను ఒకే చేసేవారు. హార్ట్ బై పాస్‍ సర్జరీ జరిగిన తర్వాత కూడా ఇంటి నుంచే ఇంజనీర్లకు సలహాలు సూచనలు ఇస్తూ పని కుంటు పడకుండా ముందుకు నడిపించాడు. తెలంగాణ పట్ల అవ్యాజమైన ప్రేమ ఆయనను ముందుకు నడిపించాయి. తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలకు విలువ కట్టలేము. తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో ఆయన సేవలు ఎల్లప్పటికీ నిలిచిపోతాయి. భారత దేశం గర్వించదగిన ఇంజనీర్‍ శ్రీ పెంటారెడ్డి గారు. భావితరాలు ఆయన సేవలను తప్పకుండా గుర్తు చేసుకుంటారు.

  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే,
    ఎ : 94910 60585

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *