ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్ లోని మరో చారిత్రక కట్టడం కూడా చేరింది. కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథ్‍పురాలోని ‘హోయసల’ దేవాలయాలను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా లోకి చేర్చినట్లు యునెస్కో ప్రకటించింది. సౌదీ అరేబియాలో లోని రియాద్‍లో జరిగిన 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికంటే ముందుగానే పశ్చిమబెంగాల్‍లోని ‘శాంతి నికేతన్’ని వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది.
పదేళ్ల ప్రయాస
హోయసల పవిత్ర ఆలయాలు 2014 ఏప్రిల్ 15 నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తు తం వాటి పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. 12వ,13వ శతాబ్ధపు వాస్తుశిల్ప కళను కలిగిన హోయసల బేలూర్‍లోని చెన్నకేశ ఆలయం, హళీబేడు లోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయం యునెస్కో వారసత్వ ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకు న్నాయి.
దక్షిణ భారతదేశంలో కళ, వాస్తుశిల్పం, మతం అభివృద్ధిలో హోయసల శకం ఒక ముఖ్యమైన కాలం. ఈ సామ్రాజ్యం ఈ రోజు ప్రధానంగా హోయసల వాస్తుశైలికి గుర్తుండిపోతుంది. ప్రస్తుతం వందకు పైగా హోయసల కాలానికి చెందిన దేవాలయాలు కర్ణాటక వ్యాప్తంగా ఉన్నాయి.
‘‘అద్భుత శిల్పకళను ప్రదర్శించే ప్రసిద్ధ దేవాలయాలు’’ గా చెన్నకేశవ ఆలయం (బేలూర్), హోయస లేశ్వర ఆలయం, (హళేబీడు) చెన్నకేశవ ఆలయం (సోమనాథపుర) ప్రపంచప్రఖ్యాతి చెందాయి.
హోయసల పట్ల ఆధునిక కాలంలో ఆసక్తి వ్యక్తం కావడానికి వారి సైనిక విజయాల కంటే ఆలయ శిల్ప కళ, వాస్తుశిల్పానికి వారిచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణంగా ఉంది. హోయసల రాజుల కాలంలో దక్షిణాన పాండ్యులు, ఉత్తరాన దేవగిరి యాదవుల నుండి నిరంతరం యుద్ధ హెచ్చరికలు ఉన్నప్పటికీ రాజ్యమంతటా ఆలయాల నిర్మాణం చురుగ్గా జరిగింది. వీటి నిర్మాణ శైలి, పశ్చిమ చాళుక్య శైలి శాఖగా చెబుతారు. హొయసల నిర్మాణ శైలిని సాంప్రదాయిక ద్రావిడ కంటే విభిన్నంగా, కర్నాటక ద్రావిడ గా వర్ణించారు. ఇది అనేక ప్రత్యేక లక్షణాలతో ఉన్న దీన్ని స్వతంత్ర నిర్మాణ సంప్రదాయమని చెబుతారు.
విశిష్టతలు:
సూక్ష్మ వివరాలపై కూడా నిశితమైన దృష్టి పెట్టడం, నైపుణ్యం కలిగిన హస్తకళ వంటివి, హొయసల ఆలయ వాస్తు శైలిలోని విశిష్టతలు. ఆలయ మందిరం పై ఉండే విమానం సంక్లిష్టమైన శిల్పాలతో ఉంటుంది. గోపుర రూపం, ఎత్తుల కంటే అలంకారాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. దేవాలయ పీఠంలో ఒక క్రమాకృతిలో ఉన్న ఆరోహణ అవరోహణలు, గోపుర నిర్మాణంలో వివిధ అంతస్థుల్లో కూడా ఒక క్రమపద్ధతిలో కనిపిస్తాయి. హొయసల ఆలయ శిల్పం కూడా స్త్రీ సౌందర్యం, హొయలు, శరీరాన్ని వర్ణించడంలో ఇదే విధమైన కుశలతను, హస్తకళా నైపుణ్యాన్నీ ప్రదర్శస్తుంది. హొయసల కళాకారులు భవనానికీ, శిల్పాలకూ ఒక ప్రత్యేకమైన రాతిని ప్రధానంగా ఉపయోగించారు.
మరెన్నో ప్రాంతాల్లో…
బేలూరు వద్ద ఉన్న చెన్నకేశవ ఆలయం, హళేబీడు వద్ద ఉన్న హొయసలేశ్వర ఆలయం సోమనాథపుర లోని చెన్నకేశవ ఆలయంతో పాటుగా మరెన్నో ఆలయాలు హోయసల శిల్పకళకు పేరొందాయి. అర సికేరె, అమృతాపుర, బెలవాడి, నుగ్గహళ్ళి, హోసహోలలు, అరలగుప్పే, కోరవంగళ, హరన్‍హల్లి, మోసలే, బసరాలు లాంటి ప్రాంతాల్లోని ఆలయాలు కూడా హొయసల ఆలయ శిల్ప కళకు చక్కటి ఆనవాళ్లుగా నిలిచాయి. బేలూరు, హళేబీడు దేవాలయాలు వాటి శిల్పా సౌందర్యానికి బాగా ప్రసిద్ది చెందాయి. హొయసల కళ చిన్న దేవాలయాల్లో, తక్కువ ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లోనూ మరింత స్ఫుటంగా కనిపిస్తుంటుంది. ఈ దేవాలయాల వెలుపలి గోడలలో హిందూ ఇతిహాసాలను వర్ణించే శిల్పాలు, చిత్రఫలకాలూ ఉన్నాయి. ఇవి సాధారణంగా ప్రదక్షిణ చేసే దిశలో (సవ్యదిశలో) ఉంటాయి. హళేబీడు ఆలయం హిందూ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా వర్ణించారు. భారతీయ నిర్మాణ శైలిలో ఇదొక ముఖ్యమైన మైలురాయి. ఆలయ శైలిలోని వైవిధ్యానికి హోయసల శైలి ఉదాహరణగా నిలిచింది. తదనంతర కాలంలో నిర్మితమైన ఆలయాలపై ఈ శైలి ప్రభావం ఉంది. ఈ శైలికి సంబంధించిన ఆర్కిటెక్చర్, స్థలం ఎంపిక, ప్లానింగ్, వినియోగం లాంటివన్నీ కూడా ఆయా ఆలయాలకు విశ్వజనీన విలువను అందించాయి. కర్నాటకలోని హసన్ జిల్లాలో ఉన్న హోయసల ఆలయాలు నాటి కళాకారుల అద్భుత కళానైపుణ్యాలకు అద్దం పడుతాయి. వివిధ ఆకృతుల్లో ఉండే స్తంభాలు, నక్షత్ర ఆకారపు పై కప్పులు ఈ ఆలయాలకు ప్రత్యేకతలుగా ఉంటున్నాయి. ఆలయాల్లో మంటపాలను బాహ్య మంటపాలు, అంతర్ మంటపాలుగా నిర్మించారు. బాహ్య మంటపాలకు రాతి జాలీలు వంటివి ఉన్నాయి. దీంతో వాటిలోకి గాలి, వెలుతురు వస్తాయి. ఈ మంటపాలు బాగా పెద్దవిగా ఉంటాయి. అంతర్ మంటపాలు చిన్నగా ఉంటాయి. పైకప్పునకు సపోర్ట్ గా స్తంభాలు ఉంటాయి. గర్భగుడిపైన నక్షత్రాకారంలో లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉంటుంది. దీన్ని రకరకాల శిల్పాలతో చక్కగా అలంకరిస్తారు.
చెన్నకేశవ ఆలయం (బేలూరు):
ఇది హసన్ జిల్లాలోని బేలూరులో ఉంది. ఈ ఆలయ నిర్మాణం వర్తమాన శకం 1117లో ప్రారంభమైంది. ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు 103 ఏళ్లు పట్టింది. ఇక్కడ మహా విష్ణువును చెన్నకేశవుడిగా ఆరాధిస్తారు. చెన్న అంటే అందమైన అని అర్థం. కేశవుడు అంటే విష్ణుమూర్తి. ఆలయ ఆవరణలోని శిల్పాలు విష్ణుమూర్తి జీవిత విశేషాలను, అవతారాలను వివరిస్తాయి. ఇతర పురాణాలు, రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలు కూడా ఉన్నాయి. శివుడికి ప్రాతినిథ్యం వహించే శిల్పాలు కూడా ఉండడం ఓ విశేషం. చోళుల పై విజయానికి గుర్తుగా విష్ణువర్ధన రాజు దీన్ని నిర్మించాడు. ఇక్కడ 80కి పైగా మదనిక శిల్పాలు ఉన్నాయి. నాట్యం చేస్తున్నట్లుగా, వేటాడుతున్నట్లుగా, చెట్ల కింద నిలబడినట్లుగా… ఇలా రకరకాల భంగిమల్లో శిల్పాలున్నాయి. గర్భగుడి నక్షత్రాకృతిలో ఉంటుంది. విష్ణుమూర్తి ఇక్కడ విగ్రహంపై పడే కాంతిని బట్టి 24 రకాల రూపాల్లో దర్శనమివ్వడం విశేషం. అమరశిల్పి జక్కన ఈ ఆలయంలో, హోయసలేశ్వర ఆలయంలో, కేశవ ఆలయంలో శిల్పాలు చెక్కినట్లుగా చెబుతారు. అమరశిల్పి జక్కన, కుమారుడి జననం… కొడుకు కూడా శిల్పి కావడం… ఒకరికొకరు పరిచయం లేకపోవడం, తండ్రి శిల్పంలో కొడుకు తప్పు ఎంచడం…. జక్కన సవాల్ చేయడం…ఓటమితో కుడి చేయి నరుక్కోవడం… ఇదంతా నిజం కావచ్చు…లేద కథనే కావచ్చు… కాకపోతే జక్కన లాంటి అమరశిల్పులు మరెందరో ఈ ఆలయ నిర్మాణాల్లో అద్భుత శిల్పాలు చెక్కారనేది మాత్రం చరిత్రలో నిలిచిపోయిన సత్యం.
హోయసలేశ్వర ఆలయం (హళేబీడు):
హోయసల శిల్పకళా నైపుణ్యానికి పట్టం కట్టిన ఆలయాల్లో ఇది ఒకటి. వర్తమాన శకం 1121లో, హోయసల రాజు విష్ణువర్ధన హోయసలేశ్వర హయాంలో కేతమల్ల చే నిర్మించబడింది. ఇది ప్రముఖ శివాలయం. హళేబీడు లోని ద్వారసముద్ర లో ఉంది.అక్కడి సంపన్నులు, వ్యాపారులు ఈ ఆలయ నిర్మాణానికి సహకరించారు. బయటి గోడ పొడుగునా ఉన్న240 కుడ్య చిత్రాలకు ఈ ఆలయం పేరొందింది. హళెబీడు లో మూడు జైన ఆలయాలు, హోయసల కాలం నాటి మెట్ల బావి కూడా ఉన్నాయి.
కేశవ ఆలయం (సోమనాథపుర)
ఇది కేశవాలయం. మైసూరు జిల్లాలోని సోమనాథపుర గ్రామంలో ఉంది. హోయసలకు చెందిన భారీ కట్టడం. బహుశా ఆ స్థాయిలో జరిగిన వాటిలో కూడా చివరిది కూడా. అందమైన త్రికూటాలయం. జనార్దనుడు, కేశవుడు, వేణుగోపాలుడు అనే మూడు రూపాల్లో విష్ణుమూర్తి ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ మంటపాలన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. దురదృష్టవశాత్తూ కేశవుడి విగ్రహం కానరాకుండా పోయింది. జనార్ధునుడి విగ్రహం, వేణుగోపాలుడి విగ్రహం బాగా ధ్వంసమయ్యాయి. ఇది పన్నెండో శతాబ్ధంలో నిర్మితమైంది. మూడో నరసింహుడి పాలనలో సోమనాథ అనే దండనాయకుడు దీన్ని నిర్మించాడు. తూర్పు ద్వారం గుండా దీనిలోకి ప్రవేశించవచ్చు.
హోయసల వాస్తుశైలి:
చాలా వరకు దక్షిణ కర్నాటక ప్రాంతంలో కేంద్రీకృతమై వర్తమాన శకం 11 నుంచి 14 వ శతాబ్దం దాకా విరాజిల్లిన హోయసల సామ్రాజ్యం పాలనలో హోయసల వాస్తుకళ బాగా అభివృద్ధి చెందింది. 13వ శతాబ్దంలో ఈ సామ్రాజ్యం స్థాయి తారస్థాయికి చేరుకుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఆలయాలను వాటి విశిష్ట శైలిని బట్టి హైబ్రిడ్ శైలి అనో లేదంటే వెసర శైలి అనో అని కూడా అంటారు. ఇవి పూర్తిగా ద్రావిడ శైలికి చెందినవి కాదు, అలాగని నగర శైలికి చెందినవి కూడా కాదని అంటారు. ఈ రెండింటికీ మద్యస్థంగా తమదైన శైలిలో ఉంటాయి. ప్రాథమికంగా ద్రావిడ లక్షణాలు ఉన్నప్పటికీ, మధ్యభారతదేశంలో విస్తృతంగా కానవచ్చే భూమిజ విధానం ప్రభావం కూడా బాగా కనిపిస్తుంది. భారతదేశ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు చెందిన నగర శైలి సంప్రదాయాలు, కల్యాణి చాళుక్యులు అభిమానించి కర్నాటక ద్రావిడ విధానాలు కూడా కనిపిస్తాయి. హోయసల శైలి ఇతర ఆలయ శైలుల నుంచి స్ఫూర్తి పొందింది. వాటిని మార్చివేసింది. తద్వారా తనదైన ప్రత్యేక శైలిని రూపొందించుకుంది. ఈ క్రమంలో దీనిలో ఎన్నో వినూత్నతలు కూడా చోటు చేసుకున్నాయి. అంతిమంగా ఇది హోయసల ఆలయ శైలి రూపుదాల్చింది.
స్తంభాలతో కూడిన పెద్ద మంటపంలో ఒక సాధారణ అంతర్ మంటపానికి బదులుగా స్తంభాలతో కూడిన ఒక సెంట్రల్ హాల్ లో పలు ఆలయాలు ఉండడం హోయసల శైలిలో చూడవచ్చు. నక్షత్ర ఆకారంలో ఇవి కానవస్తాయి. ఇతర శిలలతో పోలిస్తు మృదువుగా ఉండే సోప్ స్టోన్ తో ఈ ఆలయాలు రూపుదిద్దు కున్నాయి. దాంతో ఈ శిలలపై చెక్కిన దేవతామూర్తులు మరింత అందంగా కూడా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా దేవుళ్ల ఆభరణాలు చెక్కడంలో దీన్ని గమనించవచ్చు.
ఈ మూడు ఆలయాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడంపై కర్నాటక ప్రభుత్వ ఆర్కియాలజీ, మ్యూజియమ్స్, హెరిటేజ్ విభాగం కమిషనర్ ఎ.దేవరాజ్ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటకం అభివృద్ధి చెందుతున్న ఆశాభావాన్ని వెలువరించారు. భారత ప్రధాని మోదీ సైతం ఈ ఆలయాలకు యునెస్కో హెరిటేజ్ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికి మరింత గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. దేశ ఘన సంస్కృతికి ఇవి అద్దం పడుతాయన్నారు. ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ దేశాల తరువాత అత్యధిక యునెస్కో వారసత్వ ప్రాంతాలు కలిగిన ఆరో పెద్ద దేశంగా ఇండియా నిలిచింది.
-సువేగా,
ఎ : 9030 6262 88