తెలంగాణతో సిక్కులకున్న అనుబంధాన్ని తెలిపే రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ!

దొరకునా ఇటువంటి సేవ!-73
గురునానాక్‍ (1469-1539) ప్రభోధనల ఆధారంగా ఏర్పడిందే సిక్కు మతం. అతడికి హిందూ ఇస్లాం మతాల మధ్య పెద్ద తేడా కనిపించలేదు.
ఈ రెండు మతాలను ఒక్క తాటి కిందికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా దేశ మంతా తిరిగి, మక్కా మదీనాల యాత్ర కూడా చేసి వచ్చి,ఆయనిచ్చినగొప్ప సందేశం ‘హిందువు లేడు, ముస్లిం లేడు, ఇద్దరూ ఒక్కటే!’ అన్నది.
హైదరాబాద్‍ లోని సిక్కుల చరిత్ర దాదాపు 200 సంవత్సరాల నాటిది.


మహారాజా రంజిత్‍ సింగ్‍ కాలంలో ఆనాటి హైదరాబాద్‍ 4 వ నిజాం (1829-1857) తన ప్రధాని చందూలాల్‍ (పంజాబ్‍ ఖత్రీ) సలహాపై ఒక ఒప్పందం ప్రకారం 1832లో లాహోరి ఫౌజ్‍ లో భాగంగా వీరిని హైదరాబాద్‍కు పిలిపించుకున్నాడు. వారు నిజాం ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పెట్టడంలో కూడా సేవలు అందించారు.


ఆనాడు సిక్‍ రెజిమెంట్‍ క్యాంపు అత్తాపూర్‍ దగ్గరున్న బరంబలాలో ఉండేది. అక్కడే హైదరాబాద్‍ లోని మొట్ట మొదటి గురుద్వారా నిర్మించబడింది. అలా వచ్చిన సిక్కులు హైదరాబాద్‍ జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణా అంతా విస్తరించారు, స్థానికులతో కలిసిపోయారు.


మాతృభాష పంజాబీని మరిచిపోకుండానే తెలుగు భాషా సంస్కృతులకు అలవాటుపడ్డారు. సికింద్రాబాద్‍లో ఏకంగా ఒక సర్దార్జీల గ్రామమే ఉంది. పారడైస్‍కు 3కిమీ దూరంలోనున్న ఆనాటి ‘సిక్కుల తోట’నే కంటోన్మెంట్‍ పరిధిలోనున్న నేటి ‘సిక్‍ విలేజ్‍’ చాలా మంది సర్దార్జీ లు వివిధ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ స్థిరపడి పోయారు, ఇక్కడో గురుద్వారా కూడా నిర్మించుకున్నారు.


శంషాబాద్‍ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒకప్పటి ‘గచ్చుబాయ్‍ తాండా’ ఇప్పుడు ‘గురుగోవింద్‍ నగర్‍’ గా మారిపోవడం విశేషం.
సిక్‍ హెరిటేజ్‍ ఫౌండేషన్‍ వారు ‘డెక్కన్‍ సిక్కుల సంస్కృతి’పై సాలర్‍ జంగ్‍ మ్యూజియంలో నున్న పెక్కు చారిత్రక వ్రాత ప్రతుల ఆధారంగా పరిశోధన చేయడం ముదావహం.
పూర్వ కరీంనగర్‍ జిల్లాలోని రాఘవ పట్నం కు చెందిన బహు గ్రంథకర్త రామసింహ కవి (1857-1963) సర్దార్జీయే.
నిజాం కాలం నాటి ఈ కవి ఆత్మకథ వారి మునిమనవడైన సర్దార్‍ గురుదేవ్‍ సింగ్‍ గారి వద్ద లభించగా దాన్ని నేను పరిష్కరించి, మిత్రుడు తాళ్లపల్లి మురళీధర్‍ గౌడ్‍ పర్యవేక్షణలో ప్రచురించగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘము వారి వేదికపై (తెలంగాణ సారస్వత పరిషత్‍ సమావేశ మందిరంలో) 2023 అక్టోబర్‍ 2 నాడు తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ ఆయాచితం శ్రీధర్‍, ప్రముఖ కథకుడు శ్రీ కాలువ మల్లయ్య గార్లు ఆవిష్కరించారు!


దొరకునా ఇటువంటి సేవ!-74
తెలంగాణ సిక్కు కవి పండితుడు, యధార్థవాది రాఘవపట్టణం రామసింహకవి రచనల పునర్ముద్రణకు ప్రభుత్వమే పూనుకోవాలి!
సీ.ఆదరించినవారి కాపకార మొనరించి ప్రజ్ఞ దెల్పుట
మహా పాతకంబు
ఆపద దొలగించి యాప్తులౌ వారితో పగబూనుటయు మహా పాతకంబు
నిజమేదొ తెలియక నిర్నిమిత్తంబుగా
పరనింద జేయుట పాతకంబు
నా వంటి పరిపూర్ణుడే వంక లేడని భావించు కొనుటయు పాతకంబు
తే. తగని పాపిష్టి గురుని పాదమును బట్టి
భక్తులై మొక్కుటయు
మహా పాతకంబు
భక్త జన నిందనము
మహా పాతకంబు
విశ్వ పాలన ధర్మ శ్రీ విశ్వకర్మ!
ఇది సురవరం ప్రతాపరెడ్డి గారి గోలకొండ కవుల సంచిక కెక్కిన రాఘవపట్టణం రామసింహ కవి గారి (1857-1963) పద్యం.
ఈయన ప్రస్తుత జగిత్యాల జిల్లా రాఘవపట్టణం గ్రామంలోని ఒక సిక్కు కుటుంబం నుండి వచ్చినా తెలుగు కవిగా రాణించినవాడు. సత్యాన్వేషి, హేతువాద భావాలు ఉన్నవాడు.
బహు గ్రంధకర్తయైన రామసింహ కవి రచనల్లో పేర్కొనదగినవి, ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించిన యధార్థ మహా భారతము (1950), యధార్థ రామాయణము (1955), యధార్థ భాగవతము (1960) వంటివి కవిగారు రామభక్తుడే అయినా ‘రామాయణ విమర్శ’ పేరుతో విడిగా వీరు ప్రచురించిన ఒకచిరు పొత్తములో లేవదీసిన ప్రశ్నల్లో ఆసక్తికరం ముఖ్యమైనవి కొన్ని.


శూర్పణఖ ముక్కు చెవులు గోయుట అన్యాయము.
ఇంతటి ఘోర కృత్యము రాముడు చేయించలేదని, బ్రహ్మచర్య దీక్షలో నున్న లక్ష్మణుడు పరస్త్రీని ముట్టుకొని చేయలేదని, ఎంతో దయామయురాలైన సీతాదేవి దీన్ని జరగనివ్వలేదన్నది వీరి అభిప్రాయం.
చివరగా తన రామాయణ విమర్శ సారాంశాన్ని చెబుతూ మహదవతార స్వరూపలైన సీతారామలక్ష్మణులనే అయోగ్యులనుగా, అజ్ఞానులనుగా, ఆధార్మికులనుగా చిత్రించిన కవుల రచనలను ఖండిస్తూ యదార్థ రామాయణము రచించానని చెప్పుకున్నాడు రామసింహకవి.
తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం 3వ మహాసభల్లో 2023 అక్టోబర్‍ 2 నాడు నా సంపాదకత్వంలో వెలువడిన కవిగారి ఆత్మకథ ఆవిష్కరణ సందర్బంగా ప్రసంగించిన వక్తలు, సభకు హాజరైన అభ్యుదయ కవులు రచయితలు 1950-60 నాటి రామసింహకవి గారి యధార్థ రామాయణం, భారతం, భాగవతాల పునర్ముద్రణకు తెలంగాణ సాహిత్య అకాడమీ వంటి ప్రభుత్వ సంస్థలు పూనుకోవాలని అభిప్రాయపడ్డారు!


-వేముల ప్రభాకర్‍
ఎ: 9398661025

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *