‘‘కాల చక్రంలో కదలికలెన్నో
చరిత్రపుటల్లో చెదరని సాక్ష్యాలెన్నో
తెలంగాణ సంస్కృతిలో పరిణామాలెన్నో
ఆధునిక రీతుల్లో ఆచరణలెన్నో’’
తెలంగాణ ప్రాంతమంటే ఒక చారిత్రక సత్యం. ఎన్నో విశిష్ట లక్షణాలతో విలసిల్లుతున్నది. తెలంగాణలో చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం ఆంధప్రదేశ్‍లో ఉన్న సమయంలో తెలంగాణ కవులకూ, వివిధ పక్రియల్లో రచనలు చేసిన రచయితలకూ సరియైన ప్రాధాన్యం ఇవ్వకపోగా తెలంగాణ భాషకూ, యాసకూ అనేక అవమానాలు జరిగేవి. చిత్ర పరిశ్రమలో కూడా విచిత్ర పోకడలు కొనసాగేవి. అలాంటి అవమానాల్ని భరించలేకనే స్వతంత్రయోచనలు అవసరమని భావించి సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికను స్థాపించి సమర్థవంతంగా తెలంగాణ ప్రభావాన్ని నిరూపించారు. తొలిదశ ఉద్యమం 1969లో అది ఎంతో ఉపయోగపడింది. అదే పద్ధతిలో ప్రత్యేక తరహాల్లో మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం మణికొండ వేదకుమార్ దక్కన్ ల్యాండ్ పత్రికను స్థాపించి తెలంగాణ చరిత్ర, సంస్కృతులు సామాజిక అంశాల్ని జోడిస్తూ 2012 సెప్టెంబర్‍లో మొదటి సంచికను దక్కన్ శిలలు ముఖ చిత్రంతో విజయవంతంగా వెలికితీసి ఎందరో ప్రముఖుల ప్రశంసల్ని పొందారు. 2021 దశాబ్ది ఉత్సవాల సమయానికి ఇంటర్నేషనల్ పత్రికగా గుర్తింపు లభించడం అభినందనీయం. అక్టోబర్ 2023 నాటికి 12వ వసంతంలో 134వ సంచికగా నవనవోన్మేషంగా కొనసాగుతూ ప్రజలకు సహకారాన్నిస్తున్నది దక్కన్ ల్యాండ్ పత్రిక.
దశ – దిశ కార్యక్రమాల్ని రామచంద్రమూర్తిగారు హెచ్‍ఎం టీవీ ఛానల్ ద్వారా నిర్వహించి సఫలీకృతమయ్యారు. మణికొండ వేదకుమార్‍గారు హైదరాబాద్‍లోని హిమాయత్‍నగర్‍లో చంద్రం బిల్డింగ్‍లో టీఆర్‍సీ తెలంగాణ వనరుల కేంద్రంలో తెలంగాణ వికాసం కోసం వివిధ ప్రాంతాల నుండి వివిధ మేధావుల్ని ఆహ్వానించి, వివిధ అంశాలపై చర్చలు జరిపి తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఎంతో సహకారాన్నిచ్చారు మణికొండ వేదకుమార్‍గారు. 200 TRC – Charcha వేదికలు, సుమారు 800 మంది తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక వేత్తలు, మేధావులతో నిర్వహించి విజయ వంతమయ్యారు. వాటిలో అనేక కార్యక్రమాలకు నేను హాజరయ్యాను. తెలంగాణ రీసోర్స్ కేంద్రంలో 193, 196, 197, 200 చర్చా క్రమాల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
మణికొండ వేదకుమార్‍గారు స్వతంత్ర భావాలు కల్గినవారు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణ పరిరక్షణ కోరేవారు. హైదరాబాద్ విధ్వంసాన్ని వివరించే వ్యక్తి. హైదరాబాద్ వికాసాన్ని ఆకాంక్షించడమే కాదు, తనవంతు సహాయ సహకారాలు అన్నివేళలా అందించాలని తపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వివిధ ప్రాంతాల సంస్కృతుల్ని అవగాహన చేసుకుంటూనే చారిత్రక కట్టడాల విశిష్టతల్ని దక్కన్‍ల్యాండ్ పత్రికలో వివరిస్తూ, తెలంగాణ ఆచార వ్యవహారాలను ప్రజలకు చక్కని పద్దతుల్లో తెలియపర్చడం వారి సామాజిక అవగాహనకు నిదర్శనం. హైదరాబాద్‍లో 1908 సంవత్సరంలో అప్జల్‍గంజ్ ప్రాంత ఉస్మానియా ఆసుపత్రి పరిధిలో ఉన్న 115 సంవత్సరాల చారిత్రక చింతచెట్టు మూసీవరదల నుండి అనేక మందిని రక్షించిన విధానాన్ని మణికొండ వేదకుమార్‍గారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28నాడు వివిధ మతాల ప్రముఖుల ఆధ్వర్యంలో చర్చలు జరపడం వారి పర్యావరణ ప్రేమకు నిదర్శనం. మీర్ ఉస్మాన్ అలీఖాన్ గద్దెనెక్కిన తదుపరి 1914లో సిటీ ఇంప్రూమెంట్ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేసి, ప్రముఖ ప్లానర్ సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య మార్గదర్శంలో పనిచేయడం ప్రారంభించిన సమయం నుండి నేటి వరకు హైదరాబాద్ పరిణామాల్ని వివరిస్తూనే మూసీనదీ పరివాహక ప్రాంతాలైన చాదర్‍ఘాట్, మూసారాంబాగ్, నాగోల్‍ల ప్రాంతాలు వివరిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ పర్యాటక కేంద్రం భూదానపోచంపల్లి ప్రాంతం నుండి సూర్యాపేట జిల్లా సోలిపేట మూసీ నదీ జలాల ప్రయాణ విధానాల్ని ప్రజలకు చక్కని పద్దతుల్ని మెరుగుపర్చుకోవడానికి తపించే వ్యక్తి మణికొండ వేదకుమార్.
మానవతావాదిగా, విద్యావేత్తగా, పర్యావరణ పరిరక్షణ కోరే వ్యక్తిగా, ప్రకృతి ప్రేమికుడిగా దక్కన్ ల్యాండ్ పత్రికకు తన అను భవాల్ని మరింత జోడించి దక్కన్‍ల్యాండ్ పత్రిక వికాసాన్ని కోరదాం.
–సుతారపు వెంకట నారాయణ, ఎ : 98489 58690