తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు


మెగాలిథిక్‍ మెన్హిర్ల పరిరక్షణలో స్థానికులకు భాగస్వామ్యం
డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ మరియు
దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్‍ టేబుల్‍ మీట్‍

వరల్డ్ హెరిటేజ్‍ వీక్‍ -2023ని పురస్కరించుకొని 2023 నవంబర్‍ 20న తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ (DHT) విభాగం, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రౌండ్‍ టేబుల్‍ మీట్‍ జరిగింది. ముడుమాల్‍లోని మెగాలిథిక్‍ మెన్హిర్స్ : వాటి ప్రాధాన్యం అనే అంశంపై ఈ సమావేశం జరిగింది. ఈ మానవ నిర్మిత పురాతన ప్రాంతం ఆర్కియో ఆస్ట్రో నామికల్‍ విశిష్టతలను కలిగి ఉంది.


ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ యువజన వ్యవహారాలు, పర్యాటకం, సంస్కృతి విభాగం ముఖ్య కార్యదర్శి, తెలంగాణ హెరిటేజ్‍ విభాగం డైరెక్టర్‍, ఐఏఎస్‍ అధికారి శ్రీమతి శైలజా రామయ్యర్‍ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ ఇంజినీర్‍ వేదకుమార్‍ మణికొండ అధ్యక్షత వహించారు. యూనివర్సిటీ ఆఫ్‍ హైదరాబాద్‍ చరిత్ర విభాగం హానరరీ ప్రొఫెసర్‍ కె.పి.రావు కీలక ప్రసంగం చేశారు. హైదరాబాద్‍లోని పబ్లిక్‍ గార్డన్స్లో స్టేట్‍ మ్యూజియం లోని మహావీర్‍ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.


ప్రొఫెసర్‍ కె.పి.రావు, హైదరాబాద్‍ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం గౌరవ ఆచార్యులు ముడుమాల్‍ మెగాలిథిక్‍ సైట్‍ ముఖ్య విశిష్టతలపై పిపిటి ప్రదర్శన ఇచ్చారు. ఈ సైట్‍ కృష్ణా నదికి అతి సమీపంలో ఉంది. సైట్‍లో మొత్తం 80 పొడవైన మెన్హిర్‍లు ఉన్నాయి, వాటిలో కొన్ని 15 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ పొడవైన మెన్హిర్‍లలో కొన్ని 3000 సంవత్సరాల క్రితం నాటి ఉనికితో ఉన్నాయి.


ఈ మెన్హిర్ల పంపిణీని చూపించే శాస్త్రీయ డ్రాయింగ్‍లు వాటి అమరికలను వెల్లడిస్తున్నాయి. పొడవాటి మెన్హిర్‍లు కాకుండా, బౌల్డర్స్గా వ్యవహరించే వేలాది బండరాళ్లు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని వేర్వేరు దిశలకు ఎదురుగా అమరికలలో అమర్చబడి ఉన్నాయి. 2004లో అమెరికాలోని ఫ్లాగ్‍స్టాఫ్‍లోని అరిజోనా యూనివర్శిటీలో జరిగిన 7వ ఆక్స్ ఫర్డ్ ఆర్కియోఆస్ట్రానమీ కాన్ఫరెన్స్ లో తాను మొదటిసారిగా సైట్‍ విశిష్టత గురించి ప్రదర్శనలు ఇచ్చానని కేపీ రావు తెలిపారు. ఆ తర్వాత రిపబ్లిక్‍ ఆఫ్‍ కొరియా (2007), ఈజిప్ట్ (2009), వియత్నాం (2009), పోర్చుగల్‍ (2011), బల్గేరియా (2016), జపాన్‍ (2018)లలో కూడా ఆయన ఈ ప్రజంటేషన్స్ ఇచ్చారు.


వేసవి కాలంలో నిర్వహించిన పరిశీలనలు మెన్హిర్‍ల నిర్దిష్ట వరుస ఉదయించే సూర్యునితో సమలేఖనం అవుతాయని వెల్లడిస్తున్నాయి. సైట్‍ అధ్యయనం కోసం ఏర్పాటైన శాస్త్రీయ బృందం 2023 జూన్‍ 21 వేసవి అయనాంతం రోజున అటువంటి పరిశీలన చేసింది. సైట్‍లో అనేక రాతి వృత్తాలు కూడా ఉన్నాయి. ఈ రాతి వృత్తాలు, బండరాళ్ల వరుసల మధ్య, పైభాగంలో వాలుగా ఉండే చతురస్రాకారపు రాయి ఉంది. ఈ రాయి కప్‍-మార్క్లతో చేసిన సప్తర్షి నక్షత్ర మండలం వర్ణనను కలిగి ఉంది. ఆధునిక స్కై మ్యాప్‍లతో ఈ వర్ణన పోలిక సప్తర్షి నక్షత్ర మండలం (ఉర్సా మేజర్‍) గుర్తింపును నిర్ధారించింది.


సప్తర్షి నక్షత్ర మండ లంలో మెరాక్‍ (పులహ), దుభే (క్రతు) అని పిలువబడే మొదటి రెండు నక్షత్రాలు ఎల్లప్పుడూ ఉత్తరం వైపు చూపుతాయి. ముడుమల్‍ వద్ద కూడా, ఈ రెండు నక్షత్రాలను సూచించే రెండు కప్‍ మార్కస్ ఉత్తరాన్ని సూచిస్తాయి. ఆసక్తికరంగా, పోర్చుగల్‍లోని మెగాలిథిక్‍ సైట్‍లో ఒకదానిలో ఇదే తరహా కప్‍ మార్కస్తో కూడిన రాయి కూడా ఉంది. రీసెర్చ్ టీమ్‍ చేపట్టిన ముమ్మర అన్వేషణ కారణంగా, సైట్‍లో సప్తర్షి మండలం, ధ్రువ నక్షత్రం, మరియు లియో (సింహ) నక్షత్ర కూటమిని వర్ణించే ఒక కొత్త నక్షత్ర మండలం వెలుగులోకి వచ్చింది. ఇది ఈ సైట్‍ నుండి కొత్త ఆవిష్కరణ. ఈ కొత్త స్టార్‍ చార్ట్ మార్స్ గ్రహాన్ని వర్ణించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ, ఇది ధ్రువీకరించ బడినట్లయితే, ఇది ప్రపంచంలోనే ఒక గ్రహం యొక్క తొలి చిత్రణ కావచ్చు.


సైట్‍ ఇటీవలి కాలంలో విధ్వంసానికి గురవుతోంది. 2009లో తీసిన గూగుల్‍ ఎర్త్ ఉపగ్రహ చిత్రం పరిధీయ ప్రాంతంలో మాత్రమే సైట్‍కు నష్టాన్ని చూపుతుంది. కానీ 2011లో తీసిన ఒక చిత్రం మూడు భారీ గుంతలను చూపిస్తోంది. ఉర్సా మేజర్‍ (సప్తర్షి నక్షత్రమండలం) వర్ణన ఉన్న ప్రాంతానికి అతి సమీపంలో అతిపెద్ద గుంత ఉంది. విధ్వంసం ఫలితంగా సైట్‍ నుండి అనేక వందల బండరాళ్లు తొలగించబడ్డాయి. దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT), డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ ప్రభుత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుండి, ఈ స్థలాన్ని పరిరక్షించడానికి, కాపాడటానికి అనేక చర్యలు తీసుకోబడ్డాయి. అధిక రిజల్యూషన్‍ ఫోటోగ్రామెట్రిక్‍ డ్రోన్‍ సర్వే చేపట్టే లక్ష్యంతో గడ్డి లాంటివి సైట్‍ నుండి తీసివేయబడ్డాయి. వాచ్‍ అండ్‍ వార్డు నిర్వహణకు ఓ వ్యక్తిని నియమించారు.


సైట్‍లోని అన్ని రాళ్లు, చెదిరిన వాటితో సహా రికార్డును నిర్వహించడానికి, వివరాల సరైన నమోదు కోసం నంబర్‍లు వేయ బడ తాయి. ఉర్సా మేజర్‍ (సప్తర్షి నక్షత్రమండలం) ఉన్న రాయి చుట్టూ ఉక్కు పైపులతో ఒక దృఢమైన బారికేడ్‍ ఏర్పాటు చేయ బడింది. ఇది స్థలాన్ని సరిగ్గా భద్రపరచడానికి, అన్ని ముఖ్య మైన ఆధారాలకు ఎటువంటి నష్టం జరగ కుండా నిరోధించ డానికి వీలు కల్పిస్తుంది. గూడెబెల్లూర్‍ గ్రామం నుండి సైట్‍కు పర్యాటకులకు మార్గనిర్దేశం చేసే సూచికలు, సైట్‍ సాంస్కృతిక ప్రాముఖ్యత గురించిన సమాచారంతో కూడిన బోర్డులు సైట్‍లో ఏర్పాటు చేయబడ్డాయి.


ఈ నిలువు రాళ్ళ ప్రదేశం యొక్క విశిష్టాన్ని ఇటీవల శ్రీ మణికొండ వేదకుమార్‍, దక్కన్‍ హెరిటేజ్‍ ఎకాడమి ట్రస్ట్ చైర్మెన్‍,Australia, Sydney Cityలో ICOMOS,GA-2023 సదస్సులోUNESCO Team eT]jáTT ICOMOS International Committeeకి ముడుమాల మెగలితిక్‍ మెనిహిర్‍సైట్‍ ప్రజంటేషన్‍ ఇచ్చారు. అంతే కాక పాల్గొన్న ముఖ్యల దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రయత్నాలన్నీ, ఈ నిలువు రాళ్ళ ప్రదేశానికి ప్రపంచ సంస్కృతికి సంపద గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు.


వేదకుమార్‍ మణికొండ దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ ఇంజినీర్‍ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వపరంగా అధికారుల నుంచి పూర్తి మద్దతు, సహాయ సహకారాలు లభిస్తున్నాయి. ముడుమాల్‍ సైట్‍లో మేం ఎంతో జాగ్రత్తగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. అక్కడి స్థలంలో పిచ్చిమొక్కలు లాంటివి తొలగించాల్సి వచ్చినప్పుడు కూడా నేల పై పొర దెబ్బతినకుండా జాగ్రత్తపడుతున్నాం. అన్ని పనులు సైంటిఫిక్‍గా జరుగుతున్నాయి. ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులను సంప్రదిస్తున్నాం. వారు తమ సలహాలు, సూచనలు, ఆమోదాలు ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధాన సైట్‍ ఫెన్సింగ్‍ తో ఉంది. దాని తరువాత కూడా భారీ విస్తీర్ణంలోనే సైట్‍ ఉంది. చాలా చోట్ల నిలువురాళ్లు ఉన్నాయి. మొత్తం 80 ఎకరాల విస్తీర్ణం. అందులో సుమారు 15 ఎకరాల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ మిగితాది అంతా బానే ఉంది. ఈ ప్రాంతం పాతకాలంలో ఎలా ఉండేది అనే అంశంపై అవగాహన కోసం సర్వేఆఫ్‍ ఇండియా మ్యాప్స్, గూగుల్‍ మ్యాప్స్, పాత పటాలు… ఇలా ఎన్నో వాటి సహాయం తీసుకుంటున్నాం. చాలా బౌల్డర్స్ స్థానభ్రంశం చెందాయి. వ్యవసాయం చేయడం కోసం వాటిని కదిలించారు. అయితే ఆ బౌల్డర్స్ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం తీసిన ఫోటోలు, వీడియోలు మన వద్ద ఉన్నాయి. దాన్ని బట్టి మొత్తం నిర్మాణంపై మనం ఒక అంచనాకు రావచ్చు. ఈ సైట్‍ పై మనం జాతీయ, అంతర్జాతీయ సదస్సులు కూడా నిర్వహించనున్నాం. పోలికలను, తేడాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లోని ఈ తరహా సైట్స్ను కూడా సందర్శించనున్నాం. ప్రధాన సైట్‍కు మేం ఫెన్సింగ్‍ వేశాం. ఇందులో మూడో వంతు భూమి మాత్రమే ప్రభుత్వానిది. మిగితాది ప్రైవేటు పట్టా భూమి. అక్కడి రైతులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దాదాపు తొమ్మిది ఎకరాల మేరకు ప్రభుత్వ స్థలం ఉంది. ఐదారు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. భూమి సంరక్షణ విషయంలో గత అధికారులతో పాటుగా, ప్రస్తుత అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు. సైట్‍కు మొత్తం 80 ఎకరాలు కేటాయించాల్సిందిగా జిల్లా పాలనాయంత్రాంగాన్ని కోరాం. భూమిని తవ్వవద్దని, రాళ్లను కదిలించవద్దని స్థానికులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ, మండల అధికారులను కోరాం. ఈ చర్యలు ఇప్పుడు అమల్లో ఉన్నాయి. మేం చాలా మంది గ్రామస్తులతో మాట్లాడాం. ఈ ప్రాంతం నేల అంతా కూడా కనీసం నాలుగు వేల ఏళ్ల చరిత్రతో ముడిపడి ఉంది. స్థానికులు సైతం ఈ రాళ్ల పట్ల భయభక్తులతోనే ఉన్నారు. వాటిని తొలగిస్తే తమకు కీడు కలుగుతుందని భావించారు. వందల ఏళ్లుగా… 2003 వరకు కూడా అక్కడి రైతులు అక్కడి నిలువు రాళ్లనే కాదు… వృత్తాకారంలోని చిన్న రాళ్లను కూడా కదపకుండానే వ్యవసాయ పనులు చేసుకున్నారు. 2003లో ఆ ప్రాంతంలోకి కాలువలు రావడంతో ఈ భూమి అంతా కూడా మాగాణిగా మారిపోయింది. దాంతో వరి పంట ఎక్కువగా వేయడం… అందుకు తగ్గట్టుగా భూమిని మార్చుకునేందుకు ట్రాక్టర్లతో దున్నించడం… ఈ మొత్తం పక్రియలో నిలువు రాళ్లు కాస్తా పొలాలకు హద్దు రాళ్లుగా మారిపోయాయి. 80 ఎకరాలను సేకరించడం దీర్ఘకాలం పట్టే పని. ఇప్పుడు మన చేతిలో 13 ఎకరాల భూమి మాత్రం పూర్తిగా సురక్షితంగా ఉంది. అక్కడ మనం సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించాం. సైట్‍ సంరక్షణ విషయంలో రెవిన్యూ, పోలీసు, ఇతర అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. సైట్‍ విషయంలో గ్రామస్తులకు కూడా అవగాహన కల్పించాం. దాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు చేశాం. అక్కడ డ్రోన్‍ సర్వే కూడా నిర్వహించాం. ప్రధాన సైట్‍ తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా వీడియో చిత్రీకరణ చేశాం. ప్రతీ రాయికీ నెంబరింగ్‍ చేశాం. అక్కడ తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు పొందగలుగుతాం. అందుకు సహకరించాల్సిందిగా అధికారులను కోరుతున్నాను’’ అని అన్నారు.


శ్రీమతి శైలజా రామయ్యర్‍ తెలంగాణ ప్రభుత్వ యువజన వ్యవహారాలు, పర్యాటకం, సంస్కృతి విభాగం ముఖ్య కార్యదర్శి, తెలంగాణ హెరిటేజ్‍ విభాగం డైరెక్టర్‍, ఐఏఎస్‍ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ… రౌండ్‍ టేబుల్‍ మీట్‍ సందర్భంగా ఇచ్చిన ప్రజంటేషన్‍ ను ప్రశంసించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‍, చత్తీస్‍ గఢ్‍, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‍ లలో ఉన్న ఇతర సైట్స్తో పోలిస్తే ఈ సైట్‍ విశిష్టతను, ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ ప్రదర్శన ఉందన్నారు. ‘‘ఈ సైట్‍ను కాపాడుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ ప్రజంటేషన్‍ వివరించిం దన్నారు. ఈ ప్రాంతాన్ని అత్యవసరంగా కాపాడు కోవాల్సిన అవసరం తనకు అర్థమైందని అన్నారు. సైట్‍ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తొలగించిన రాళ్లు మొత్తం మీద అదే ప్రాంతంలో ఆ 13 ఎకరాల స్థలంలోనే భద్రంగానే ఉన్నాయి. చుట్టుపక్కల పట్టా భూములలో పరిరక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సైట్‍కు స్థానికుల భాగస్వామ్యం ముఖ్యం. ఈ విషయంలో సంబంధితులందరితో చర్చలు జరగాలి. సైట్‍ రక్షణ విషయంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం మరింత కృషి చేయాలి. మా వంతు ప్రయత్నాలు కూడా మేం చేస్తాం. మరింత స్థలానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. సైట్‍ విషయంలో మీరు DHA స్థానికులకు ఇప్పటికే మంచి అవగాహన కల్పించారు. రామప్ప ఆలయం బయటి నుంచి చూసేందుకు చాలా గొప్పగా ఏమీ కనిపించదు. కాకపోతే దానికి ఇసుకతో కూడిన పునాది, నీటిలో తేలే ఇటుకలు వంటి విశిష్టతలెన్నో ఉన్నాయి. అవన్నీ రామప్ప ఆలయానికి మరింత ప్రాధాన్యాన్ని అందించాయి. అదే విధంగా ముడుమాల్‍ లోని మెగాలిథిక్‍ మెన్హిర్స్ కు సంబంధించిన మరిన్ని విశేషాలను వెలుగు లోకి తెచ్చి వాటికి మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సముద్రం, అడవులు లేనటువంటి ప్రాంతంలో మెగాలిథిక్‍ మెన్హిర్స్ ఎందుకు ఉన్నాయి, అప్పట్లో ఈ ప్రాంతం మతపరంగా ప్రాధాన్యం కలిగిఉండిందా, కాలాన్ని ఎలా గుర్తించే వారు, సామాజిక ప్రాధాన్యం ఏంటి, పెద్ద రాళ్లకు తోడుగా చిన్న రాళ్లు ఎందుకు ఉన్నాయి, అసలు అవి ఏ కాలానికి చెందినవి, మరిన్ని పరిశోధనలు చేస్తే… మరింత పురాతనమైన అంశాలేమైనా లభ్యమ వుతాయా, ఈ తరహా ఇతర స్థలాలతో పోలిస్తే ఎందుకు ఇది ప్రత్యేకమైంది.. లాంటి ప్రశ్నలెన్నింటికో సమాధానాలు అన్వేషించాలని సూచించారు. ఈ స్థలం పరిరక్షణకు, ప్రాచుర్యం కల్పించేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలి. మనం ఏళ్లుగా కుతుబ్‍ షాహీల గురించి, కాకతీయుల గురించి మాట్లాడు కున్నాం… ఇప్పుడు మాత్రం మన ప్రాంతానికి ఉన్న మరెంతో ప్రాచీన చరిత్ర గురించి తెలుసుకుం టున్నాం. ఇన్నాళ్లూ ఉత్తర భారత దేశానికి సంబంధించిన ఇలాంటి విశేషాలు తెలుసు కున్నాం… ఇప్పుడు దక్షిణ భారత దేశంలోనూ అలాంటి విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాలి’’ అని అన్నారు.


ప్రొ।। కె.పి.రావు Honorary Professor, University of Hyderabad (UOH) మాట్లాడుతూ.. ‘‘మూడు వేల ఏళ్ల క్రితం మాగ్నటిక్‍ కంపాస్‍లు లేవు. దిక్కులు తెలుసుకోవడం కష్టంగానే ఉండేది. సూర్యుడిని బట్టి దిక్కులు నిర్ణయించుకోవాలి. సూర్యుడు కూడా కచ్చితమైన దిశానిర్దేశం చేయలేడు. రుతువులు, ఉత్తరాయనం, దక్షిణాయనం లాంటి వాటిని బట్టి కొద్ది మార్పులు ఉంటాయి. ఇక సూర్యుడు ఉండడు కాబట్టి రాత్రి పూట దిక్కులు నిర్ణయించలేం. దేశంలో, విదేశాల్లో సైతం ప్రాచీన సమాజాలకు ధ్రువ నక్షత్రం గురించి బాగా తెలిసే ఉంటుంది. ఈ నక్షత్రం కొద్ది పాటి తేడాలతో ఆకాశంలో స్థిరంగా ఒకే చోట కని పిస్తుంది. అదే విధంగా సప్తర్షి మండలం గురించి కూడా. ఇలాంటి విష యాలు ప్రాచీన కాలం నాటి ప్రజలకు తెలిసి ఉండవచ్చు. ఇక్కడి ప్రజలకు అప్పట్లోనే సుదూర ప్రాంతాల వారితో సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండవచ్చు కూడా. ఆ అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేం. కొరియా భాషలో ఎన్నో పదాలు తమిళంతో దగ్గరి సంబంధం కలిగిఉండడాన్ని భాషాశాస్త్రవేత్తలు గుర్తించారు’’ అని అన్నారు.


మహేందర్‍రెడ్డి (రిటైర్డ్, డైరెక్టర్‍, GSI) మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఏదైనా ప్రాంతంలో ఆలయం, ఇతర కట్టడాలు లాంటి వాటిని నిర్మించేటప్పుడు స్థానికంగా విరివిగా దొరికే రాళ్లను ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో వివిధ రకాల రాళ్లను ఉపయోగించారు. అంటే వాటిని మరెక్కడి నుంచో ఇక్కడికి రవాణా చేసినట్లుగా అర్థమవుతోంది’’ అని అన్నారు.


సిహెచ్‍. వేణుగోపాల్‍ (రిటైర్డ్, Dy D G , GSI ) మాట్లాడుతూ.. ‘‘జియోలాజికల్‍, ఆర్కియలాజికల్‍ ఫీచర్లకు మధ్య దగ్గరి సంబంధం ఉంది. పరిరక్షణ చర్యలు చేపట్టే సమయంలో మనం ఈ రెండింటినీ కలిపి వినియోగిస్తాం. పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వాల వద్ద నిధులు పెద్దగా ఉండవనుకుంటే, దీనిపై ఆసక్తి గల ప్రైవేటు వారిని నిధులు సమకూర్చవలసిందిగా అడగవచ్చు’’ అని సూచించారు.


ప్రొఫెసర్‍ డాక్టర్‍ రుక్మిణి (ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రానమీ) మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కల్చరల్‍ ఆస్ట్రానామీ సైట్స్ ఉన్నాయి. ముందు నుంచే పటిష్ఠమైన చర్యలు తీసుకుంటే తప్ప, చాలా సందర్భాల్లో అవి నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇంటర్నేషనల్‍ ఆస్ట్రోనామికల్‍ యూనియన్‍ ఈ తరహా సాంస్కృతిక సంబంధిత అంశాల్లో చురుగ్గా పని చేస్తోంది. స్థానికుల ప్రమేయంతోనే ఈ కార్యక్రమం అయినా విజయం సాధిస్తుంది. ఒక చోట అత్యాధునిక టెలిస్కోప్‍ నెలకొల్పాలని శాస్త్రవేత్తలు ప్రయత్నించినప్పుడు స్థానిక తెగ వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో అక్కడి ఆస్ట్రానమీ సైట్‍ కు, టెలిస్కోప్‍ కు మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. వారి వివరణతో సంతృప్తి చెందిన తెగ ప్రజలు టెలిస్కోప్‍ ఏర్పాటుకు అంగీకరించారు. ఇలా స్థానికులకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం ఉంద’’న్నారు.


ద్యావనపల్లి సత్యనారాయణ (గిరిజన మ్యూజియం క్యూరేటర్‍, చరిత్రకారులు) మాట్లాడుతూ… ‘‘మెగాలిథిక్‍ మెన్హిర్స్ లాంటివి ఉన్నాయంటే అక్కడో పెద్ద నగరం లేదా రాజకీయ వ్యవస్థ ఉండి ఉండాలని…. వాటికి అండగా ఉండే బాగా మేధస్సు కలిగిన వారు వాటిని నిర్మించి ఉండాలని భావిస్తుంటారు. మరి ఈ సైట్‍ వద్ద నగరం ఉందా? ఉందని అనేందుకు కొన్ని ఆధారాలున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతంలో లభించిన శాసనాల్లో అంధిర లోకం, సిద్ధాంతం అనే పదాలున్నాయి. అంధిర లోకం అనే ప్రాకృతపదం ‘ఆంధ్ర లోకం’ కావచ్చు, అదే విధంగా సంస్కృత పదం సిద్ధాంతం అంటే… అది శైవ సిద్ధాంతం కావచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆర్‍ సుబ్రహ్మణ్యం అనే ఐఏఎస్‍ అధికారి జర్నీ ఆఫ్‍ ఎ సివిలైజేషన్‍, ఇండస్‍ టు వైగై అనే పుస్తకం రాశారు. సింధూనాగరికత కుప్పకూలిన తరువాత అక్కడి ప్రజలు దక్షిణ భారతదేశానికి వచ్చి ఉండవచ్చని, అప్పటికే ఇక్కడ ఉన్న ప్రజలతో వారు మిళితమై ఉండవచ్చునని అందులో పేర్కొన్నారు. సింధూ నాగరికత అనేది ద్రావిడ నాగరికతకు చెందినదనే నిర్ధారణకు పలువురు చరిత్రకారులు వచ్చారు. వర్తమాన శక పూర్వం 1449లో ఇది జరిగి ఉండవచ్చని కూడా చెప్పారు. అది కలియుగం ప్రారంభ సంవత్సరంగా భావిస్తారు. కలియుగం ప్రారంభంలో ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస రావడం మొదలు పెట్టారు. తమతో పాటుగా సింధూ నాగరికత విశేషాలను కూడా తీసుకొచ్చారు. నక్షత్రాలను గుర్తించే, కాలాలను, వాతావరణ సమయాలను గుర్తించే సాంకేతికత కూడా అలా వచ్చి ఉండవచ్చు. ఇలాంటి సైట్‍ మరొకటి ఇదే తరహా నిర్మాణంతో రాచకొండ ప్రాంతంలో కూడా ఉంది. ఇందులోనూ ఏడు గుర్తులు ఉంటాయి. మొదటి నాలుగింటిని మంచం కోళ్లు అని… మిగితా మూడింటిని కలపి దొంగలు అని అంటారు. రాచకొండ ప్రాంతానికి, సింధునాగరికతతో పోలిక ఉన్న మరో అంశం పశుపతి. అక్కడ దొరికిన ముద్రలాంటిదే రాచకొండలో కూడా లభ్యమైంది. సింధూ నాగరికతకు, ముడుమాల్‍ లోని వాటికి కూడా సంబంధం ఉండవచ్చు. దీని గురించి మరింత అధ్యయనం జరగాల్సి ఉంది’’ అని అన్నారు.


డా।। ఎం.ఎ. శ్రీనివాసు,Asst. Prof (PSTU)
మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషులు ఆలోచించే పద్ధతి ఏదైతే ఉందో అది ఒకే రకంగా ఉంటుంది. దానికి వాళ్లు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. రాకూడదనీ లేదు. మనం గనుక అలా బయటి నుంచి వచ్చారని మొదలు పెడితే… స్థానిక సంస్కృతు లను బయటి నుంచి చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించాల్సింది మరొకటి కూడా ఉంది. మనం ఈ సైట్‍లో ఒకే డేట్‍ పొందలేం. ఒక సీక్వెన్స్గా చూడాలి. వేర్వేరు డేటింగ్స్ను పొందే అవకాశం ఉంది. జీపీఆర్‍ లాంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించాలి. ముడుమాల్‍ సైట్‍ లో పరిశోధనను దీనికే పరిమితం చేస్తూ ముందుకు సాగాలి. దేశంలోని మిగితా ప్రాంతాల వాటితో ఇప్పటికిప్పుడు ముడిపెట్టాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.


సాయిభక్త కేశవ, Retd Dy. Director, Archology & Musuim dept, A.P మాట్లాడుతూ.. ‘‘ముడుమాల్‍కు సంబంధించి నాకు తెలిసినంత వరకు ఎం.రామక•ష్ణా రావు అనే ఆయన ఈ సైట్‍ గురించి చాలా గొప్పగా రాశారు. అది చూసి నేను ఈ సైట్‍ చూడాలనుకున్నాను. నిజంగానే ప్రి-హిస్టరీలో అదో గొప్ప సైట్‍. వందలాది బౌల్డర్స్ వరుసగా పేర్చి ఉన్నాయి. ఆ రోజుల్లో వాటిని ఫోటోలు తీశారు. 1986లో ఇర్విన్‍ హ్యుమాయిల్‍ అనే ఆయన ఆస్ట్రియా నుంచి వచ్చారు. ఆయనను నేను ఈ సైట్‍ కు తీసుకెళ్లాను. ఆయన అప్పుడు వాటి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు ఆయన దగ్గర ఇంకా ఉన్నాయి. తొలగించిన బౌల్డర్స్ అన్నిటినీ తిరిగి అదే క్రమంలో అమర్చాలంటే ఆ ఫోటోలు గనుక ఉంటే చాలా బాగా ఉపయోగపడుతాయి. వాటిని తిరిగి అదే క్రమంలో అమర్చితే ఓవరాల్‍ వ్యూ అర్థమవుతుంది. అప్పుడు ఆర్కియా – ఆస్ట్రానమీ అనే దాన్ని అధ్యయనం చేయడానికి వీలవు తుంది. దాంతోపాటుగా 1946 నాటి జియాలాజికల్‍ రిపోర్టస్ లో కూడా ఒక విషయం ప్రస్తావించారు. వాటి ప్రకారం రాయచూర్‍ లో అద్బుతమైన సైట్స్ ఉన్నాయి. కోయిల్‍ కొండ దగ్గర కూడా ఒక సైట్‍ ఉంది. అది కూడా బాగా ప్రాచీనమైంది. నేను చూసిన దాదాపు 50 సైట్స్ లో కూడా కోయిల్‍ కొండ దగ్గర ఉన్న సైట్‍ బాగా ప్రాచీనమైంది అని అనుకుంటున్నాను. జియోలాజికల్‍ రిపోర్టస్ లో ముడుమాల్‍ ప్రాంతం అప్పట్లో జనావాస ప్రాంతం అని రాశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేయాల్సి ఉంటుంది’’ అని అన్నారు.


ఎం. వీరేందర్‍, Former Dy. Curetor, Salrjung Musuem మాట్లాడుతూ.. మనం మన పాఠ్య పుస్తకాల్లో ఉత్తర భారతదేశ చరిత్ర చదువుకుంటున్నాం. మనం ఇక్కడ చేస్తున్న పని మాత్రం మనం ప్రస్తావించుకోం. మన తవ్వకాల వివరాలేవీ పబ్లిష్‍ కావడం లేదు. ఆ వివరాలేవీ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చేరడం లేదు. వాటిని గనుక మనం ప్రచురిస్తే ఎంత చరిత్ర వెలుగులోకి వచ్చేది. తెలంగాణలో, ఆంధ్రలో 30 దాకా సైట్స్లో మనం తవ్వకాలు చేశాం. పబ్లిష్‍ అయినవి మాత్రం వేళ్లపై లెక్కపెట్టవచ్చు. స్థానిక రాజులు, రాజవంశాల చరిత్రను తెలుసుకునేందుకు ఆర్కియాలజీ తవ్వకాలు ఒక మార్గం. తవ్వకాలు చేసిన తరువాత కూడా మనం ఆ వివరాలు బయటకు చెప్పకపోతే… ఆ చరిత్ర ఎలా తెలుస్తుంది? ముడుమాల్‍ నిజంగా గొప్ప సైట్‍. దీని గురించి కూడా మనం బాగా ప్రాచుర్యం కల్పించాలి. నక్షత్రాల గురించిన అవగాహన మన పెద్దవారికి కూడా ఉంది. మూడు నక్షత్రాలు గనుక ఒకే వరుసలోకి వస్తే దాన్ని ఓ నిర్దిష్టపదంతో పిలుస్తారు. అదే విధంగా సాయంత్రం పూట బాగా ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రాన్ని కుందేటి చుక్క అనే వాళ్లు. అంటే ఆ చుక్క ఉన్నంత వరకు కుందేళ్లు మేతకు పోతాయట. ఆ తరువాత వాటిని వేటగాళ్లు పట్టుకునే వాళ్లట. అట్టా కొన్ని గుర్తులు ఉన్నాయి మనకు. అప్పట్లో రకరకాల విద్యలకు ఉజ్జయిని కేంద్ర బిందువుగా ఉండేది. బహుశా ఆస్ట్రోనమీకి ముడుమాల్‍ ఈ ప్రాంతంలో కేంద్రబిందువుగా ఉండి ఉండవచ్చు. అదే గనుక నిజమైతే… ముడుమాల్‍ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్లు స్థానికులేనా లేదంటే బయటివారా, ఎక్కడి నుంచి వచ్చారు…. లాంటి విషయాలు అధ్యయనం చేయవచ్చు’’ అని అన్నారు.


శ్రీరామోజు హరగోపాల్‍ (చరిత్ర పరిశోధకుడు) మాట్లాడుతూ, ‘‘ప్రతీ మెగాలిథిక్‍ సమాధిలో ఉత్తర దిశలో తలను పెడుతారు. ఉత్తర దిశను నిర్ణయించేందుకు ధ్రువ నక్షత్రాన్ని ఆధారం చేసుకుంటారు. మెన్హిర్స్ అన్నీ కూడా సమాధులను సూచించేవి కావు. అవి వేర్వేరు సందర్భాలను కూడా సూచిస్తాయి. సమాధులన్నీ కూడా శవాలను దాచేవి కావు. వాటిలోనూ రెండు రకాలున్నాయి. అదే విధంగా మెన్హిర్స్ కూడా సమాధి స్థలాన్ని నిర్ణయించేటప్పుడు అది ఊరి బయట ఉండాలి, దాన్ని సూచించేందుకు ఒక స్తంభం ఉండాలి అని వేదాల్లో చెప్పారు. అంటే అది వేదకాలం నాటికే సంప్రదాయంగా ఉంది. అంటే సమాధులను, స్మశానాన్ని సూచించేది కూడా మెన్హిర్‍. అలా గాకుండా ఇక్కడ ముడుమాల్‍ లో ఉన్నటువంటి మెన్హిర్స్ ఒకే రకంగా లేవు. రెండు కలసి ఉన్నవి ఉన్నాయి. విడివిడిగా ఉన్నవి ఉన్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సూచించేవి కావచ్చు. విషువత్తు (ఈక్వినాక్స్) (రాత్రి, పగలు సమానంగా ఉండేవి- మార్చి 21, సెప్టెంబర్‍ 23) లను కూడా గమనించాలి. విషువత్తు అంటే మార్చి 21న ముడుమాల్‍లో జాతర నిర్వహిస్తారు. నేను వెళ్లే సరికి ప్రజలు ఒక మెన్హిర్‍ కు పూజలు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా సిద్ధిపేట దగ్గర పొల్లూరు దగ్గర కూడా ఇలాంటి రాయిని మైసమ్మ అని అంటారు. ఇవన్నీ కూడా ఆచారాలుగా వస్తున్నయి. జనగాం జిల్లా బచ్చన్న పేట దగ్గర కొడవటూరు అని ఉంది. అక్కడ రాళ్ల తోట అని ఉండేది. అక్కడ ఇప్పుడు ఒక్క రాయి కూడా లేదు. మెన్హిర్లన్నీ పోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు దగ్గర కాచారంలో కూడా రెండు రాళ్లు మాత్రమే మిగిలాయి. పక్కన 9 అడుగులు, 4 అడుగులు ఉన్న వాటన్నిటినీ చుట్టుపక్కల వాళ్లు తీసుకెళ్లారు. ఇలా చాలా చోట్ల ఉన్నాయి. మరి ఈ విశ్వాసాలు ముడుమాల్‍ లోనే ఉన్నాయా…. చుట్టుపక్కల మరెక్కడైనా ఉన్నాయా… పొల్లూరు సమాధులు, నర్మట్ట పాలమర్రు సమాధులు తవ్వినప్పుడు బయటపడిన అస్తికలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాటికి సెంట్రల్‍ ఏషియా వారికి మద్య సంబంధం ఉందని చెప్పారు. అదే విధంగా నంగునూరులో దొరికిన ఎద్దు తల, అమ్మ తల్లి మట్టి బొమ్మ చాలా ప్రాచీనమైనవని, మన దగ్గర ఎక్కడా దొరకవని, వాయవ్య భారతం (ప్రస్తుత పాకిస్తాన్‍)లో మాత్రమే ఇలాంటివి దొరికాయని నిపుణులు తెలిపారు. మానవుడి ఆలోచనా విధానాలు ఒకేలా ఉంటున్నాయా లేదా? తప్పకుండా ఒకే విధంగా ఉంటున్నాయి. బయటి వాళ్లు ఇక్కడకు వచ్చారా లేదా అనే దానితో సంబంధం లేకుండా. నేను ముడుమాల్‍ లో మెన్హిర్ల మీద మూపురం ఎద్దుల బొమ్మలు చూశాను. అలాంటి మూడు నాలుగు మెన్హిర్లను నేను చూశాను. ఇలాంటివి బహుశా ఆయా సమూహాలు వేసుకున్న తమ గుర్తులై
ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో చాలా చోట్ల ఇలాంటివి ఉన్నాయి, వృత్తం, త్రిశూలం లాంటి గుర్తులు ఉన్నాయి. వీటిని గమనిస్తే మనకు ఒక క్రమం కనిపిస్తుందన్నారు.

ఈ సమావేశంలో ఫ్రీలాన్స్ ఆర్కియాలజీ వర్కర్‍ పి.ఎం. రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


పి.నాగరాజు(Duputy Director Deput of Heritage Telangana) మాట్లాడుతూ… ముడుమాల్‍ విషయానికి వస్తే ఇది చాలా ప్రత్యేకమైంది. భవిష్యత్‍ లో ఇక్కడ తవ్వకాలు చేపట్టి, డీఎన్‍ఏ వంటి సైంటిఫిక్‍ అనాలిసిస్‍ చేసే అవకాశం ఉంది.


సిహెచ్‍. బాబ్జిరావు (Retd, Dy. Superident Regional Director, ASI) మాట్లాడుతూ… మొదట ఇంటిగ్రిటీ ఆఫ్‍ సైట్‍ పరిశీలించాలి. ఆ తరువాత యూనివర్సల్‍ వాల్యూ ఆఫ్‍ ది సైట్‍ చూడాలి. ఈ రెండూ వేర్వేరు అంశాలు. ఈ సైట్‍కు ప్రారంభంలోనే ఒక ఆలయం వంటి కట్టడాన్ని నిర్మించారు. అదో పెద్ద పొరపాటు. అలాంటివి జరగకుండా చూసుకోవాలి. దాంతో ఒక పెద్ద వృత్తాకారం సరిగా కనిపించకుండా పోయింది. రేపటి నాడు ప్రపంచం ద•ష్టికి తీసుకెళ్లడంలో ఇలాంటివే ముఖ్యమైనవి. ఆ కట్టడాన్ని తొలగించాలి. దాన్ని గనుక తొలగిస్తే… ప్రతి ఒక్కరూ అది శిలాయుగం నాటిదనే భావనను సులభంగా గ్రహించగలుగుతారు. బస్తర్‍, బిలాస్‍ పూర్‍ ప్రాంతాల్లో కూడా ఈ తరహా నిలువురాళ్లు ఉన్నాయి. వాటితో దీనికి గల పోలికలు పరిశీ లించాలి. ఇక్కడి సైట్‍ ఏ యుగానికి చెందిందనే విషయంలో సందేహాలు తొలగించాలి.


డా।। మహమ్మద్‍ అక్తర్‍ అలీ (Asst. Prof of Geoprphy, OU)మాట్లాడుతూ.. టర్కీలో అనటోలియా అనే హెరిటేజ్‍ సైట్‍ ఉంది. కపడోషియా అనే సైట్‍ కూడా ఉంది. అక్కడ కూడా ఇలాంటి నిర్మణాలే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. అంటే నాటి ప్రజల ఆలోచనలు ఒకే తరహాలో ఉన్నాయి. ఈ ప్రాంత అధ్యయనానికి డిజిటల్‍ సాంకేతికతలను ఉపయో గించాలి. గతంలో నది ప్రవహిస్తూ ఉండిందా… లేదా పొడి ప్రాంతమేనా లాంటి అంశాలు తెలుసుకునేందుకు ఆయా పరికరాలు ఉపకరిస్తాయి. ఆ ప్రాంతం ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. యునెస్కో గుర్తింపు లాంటి వాటికి వెళ్లేందుకు ఇలాంటి వివరాలన్నీ తోడ్పడుతాయి.


ప్రొ।। ప్రగతి శ్రీవాత్సవ (Associte Prof JBR Architecture College) మాట్లాడుతూ… అసోసియేట్‍ ప్రొఫెసర్‍ ప్రగతి మాట్లాడుతూ, ‘‘ఈ సైట్‍ను కల్చలర్‍ టూరిజం స్పాట్‍గా అభివ•ద్ధి చేసే అవకాశం ఉంది. దేశంలో ఈ తరహా ప్రాంతాలున్నాయి. ఈ స్థలాన్ని పరిరక్షించాలి. స్థానికుల స్థితిగతులు మెరుగుపడేలా పర్యాటకంగా తీర్చిదిద్దాలి.


జి.వి.ఎస్‍.నారాయణమూర్తి (conservation Architecter (Kestra)) మాట్లాడుతూ… ‘‘ఈ రోజు నిర్వహించిన రౌండ్‍ టేబుల్‍ తో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జియోలాజికల్‍, ఆర్కియలాజికల్‍, ఇంకా మరెన్నో దృక్పథాలు చర్చకు వచ్చాయి. క్షేత్రస్థాయిలో సైంటిఫిక్‍ వర్క్ మరింతగా చేయాల్సి ఉంది. తవ్వకాలు చేయడాని కంటే ముందుగా కూడా, అందుబాటులో ఉన్న ఇతర ఆధునిక విధానాలను కూడా పరిశీలించాలి. ప్రొఫెసర్‍ కేపీ రావు, ఆయన బృందం ఇలాంటివి ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ నిలువురాళ్ల సైట్‍కి సంబంధించి యునెస్కో మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇప్పటికే ఒక టెంటేటివ్‍ ప్రొఫార్మా రూపుదిద్దుకుంది. 2021 డాక్యుమెంట్‍ ఇప్పుడు అందుబాటులో ఉంది. బాబ్జీరావు గారు చెప్పినట్లుగా ఇంటిగ్రిటీ ఆఫ్‍ ది సైట్‍, అథెంటిసిటీ ఆఫ్‍ ది సైట్‍ అనేవి ముఖ్యమైన అంశాలు. అక్కడ ఉన్న కాంపొనెంట్స్ మధ్య ఇంటిగ్రిటీ కూడా ఉండాలి. ప్రస్తుతానికి లభ్యమవుతున్న ఆధారాలను బట్టి దీన్ని మెగాలిథిక్‍ గానే వ్యవహరించవచ్చు. ఈ ప్రాంతంలో ఆవాసాలు, ఇతర ప్రాంతాల్లోని నిర్మాణాలతో పోలికలు లాంటివి కూడా పరిశోధించవచ్చు. అందుకు టైమ్‍ పట్టినా, ఇప్పుడు ఉన్న ఆధారాలతోనే ముందుకు సాగవచ్చు. మనం ఇది మెగాలిథిక్‍ సైట్‍ అన్నప్పుడు అందుకు తగ్గట్టుగా సత్యం నిరూపణ కావాలి. అదే డెసిషన్‍ మేకర్‍ గా ఉంటుంది. యూనివర్సల్‍ వాల్యూ అనేది ఆ సైట్‍ నుంచి బయటకు రావాలి. యునెస్కో గుర్తింపునకు అదే కీలకం అవుతుంది. మనం గనుక దీన్ని కల్చర్‍, సోషల్‍ లాంటి అంశాలకు కూడా లింక్‍ చేయగలిగితే, ఇది మెగాలిథిక్‍ కల్చరల్‍ ల్యాండ్‍ స్కేప్‍ అవుతుంది. ఇప్పటి వరకు మనం చేర్చిన అంశాలు ఏమిటంటే… ఇది అవుట్‍ స్టాండింగ్‍ ఎగ్జాంపుల్‍ ఆఫ్‍ ఎ ట్రెడిషనల్‍ హ్యూమన్‍ సెటిల్మెంట్‍… ఇది 5వ ప్రాధాన్యం కిందికి వస్తుంది. ఇక 6వ ప్రాధాన్యం కింద సజీవ సంప్రదాయాలతో అనుబంధం కలిగి ఉండడాన్ని కూడా చేర్చాం. ఈ రెండూ ఉండడం దీనికి గుర్తింపు వచ్చేందుకు మరింత దోహదం చేస్తుంది. కంపారిటివ్‍ సైట్‍ గా ఇంగ్లాండ్‍, ఇండోనేషియా, దక్షిణ కొరియాలలో ఉన్న ఇదే తరహా ప్రాంతాలను ఉదహరించాం. మనం ఈ టెంటేటివ్‍ లిస్ట్ దరఖాస్తును జనవరి 30లోగా దాఖలు చేయనున్నాం.


డా।। డి. రాములు నాయక్‍(Dy. Director Dept of Heritage Telangana) మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ పరిధి కింద 346 ప్రొటెక్టివ్‍ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అందులో 3 విభాగాలున్నాయి. సమాధులు, ఆలయాలు, కోటలు. వీటిలో 105 వరకు సమాధులే ఉన్నాయి. మొత్తం 346లో దాదాపు 95 శాతం మనకు నిజాం ప్రభుత్వం నుంచి బదిలీ అయినవే. కొన్ని మాత్రమే మేం ప్రొటెక్ట్ చేస్తున్నాం. నిజాం నుంచి వచ్చిన వాటికి చాలా చోట్ల ఎక్కడా హద్దులు అనేవి లేవు. దాంతో భూముల ధరలు పెరగడం, సెక్యూరిటీ సరిగా లేకపోవడం లాంటి రకరకాల కారణాలతో వీటిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముడుమాల్‍ లో మాత్రం సైట్‍ సురక్షితంగానే ఉంది. ఈ సైట్‍ తో పాటుగా ఛాయా సోమేశ్వర ఆలయం వివరాలను కూడా యునెస్కో పరిశీలనకు కూడా పంపించాం. జనావాసాలకు కనీసం కిలోమీటర్‍ దూరంలో ఉండాలన్నది యునెస్కో గుర్తింపులో ప్రధాన నిబంధనగా ఉంది. దాంతో ఎన్నో కట్టడాల వివరాలను యునెస్కోకు పంపలేకపోతున్నాం. అన్ని చోట్లా ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ముడుమాల్‍ విషయంలో ఆ సమస్య లేదు. ఒక కమిటీ రూపకల్పన విషయంలో వేదకుమార్‍ గారు బాగా సహకరించారు. అవసరమైన సందర్భంలో మరికొంత మంది నిపుణులను కూడా జోడించారు. ఈ విషయంలో అంతా సహకరిస్తున్నారు.


బి.నారాయణ డిప్యూటీ డైరెక్టర్‍ డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ హెరిటేజ్‍ తెలంగాణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ యువజన వ్యవహారాలు, పర్యాటకం, సంస్కృతి విభాగం ముఖ్య కార్యదర్శి, తెలంగాణ హెరిటేజ్‍ విభాగం డైరెక్టర్‍, ఐఏఎస్‍ అధికారి శ్రీమతి శైలజా రామయ్యర్‍ గారు తెలంగాణ ప్రభుత్వ అధికార శాఖలలో ఎంతో బిజీ షెడ్యుల్‍ ఉన్నా ఈ ముడుమాల మెగాలిథిక్‍ సైట్‍ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి రౌండ్‍ టేబుల్‍ సమావేశంను స్టేట్‍ ఆర్కియాలజి మ్యూజియంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు తెలియజేశారు.

కె.పి. రావు గారు, Former డైరెక్టర్‍గా హెరిటేజ్‍ డిపార్ట్మెంట్‍లో ఎన్నో సేవలందించారు. కె.పి. రావు గారు ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘‘ముడుమాల మెగాలిథిక్‍ సైట్‍’’ ప్రజంటేషన్‍ ఇవ్వడం ద్వారా ఆ యొక్క సైట్‍ గురించి పూర్తిగా వివరించినందుకు కె.పి.రావుకు ధన్యవాదాలు.
ప్రొ।। వేదకుమార్‍ మణికొండ గారు ఆసియాలోనే గొప్పదైన ముడుమాల మెగాలిథిక్‍ పరిశోధనల ద్వారా ఆ సైట్‍ని ప్రపంచ వారసత్వ కట్టడాలు జాబితాలోకి వెళ్ళడానికి మా డిపార్ట్మెంట్‍తో దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) అనుసంధానమై ఎంతగానో కృషి చేస్తున్నందుకు ధన్యవాదలు తెలియజేస్తున్నాను.


ఈ కార్యక్రమంలో Dr. కె. పద్మనాభ, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్‍, GSV సూర్యనారాయణ మూర్తి, ప్రొ।। అక్తర్‍ అలీ, ఎస్‍. రమేష్‍కుమార్‍, పి. శాంతి, మేధావులు, విద్యావంతులు, JBR ఆర్కిటెక్చర్‍ కాలేజ్‍, ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిటీ కాలేజీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • సికె. శ్రీహరి,
    ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *