ఆయిల్‍ ఫామ్‍ పై సందేహాలు – సమాధానాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‍ పామ్‍ తోటలను ఎక్కువ ఎకరాలలో రైతులు సాగు చేయాలని, ఆయిల్‍ పామ్‍ సాగు రైతులకు ఎంతో లాభదాయకమని జాతీయ ఆయిల్‍ పామ్‍ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త రామచంద్రుడు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆయిల్‍ ఫెడ్‍ ఆధ్వర్యంలో ఆయిల్‍ పామ్‍ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ములుగులో ఏర్పాటు చేసిన ఆయిల్‍ పామ్‍ నర్సరీని సందర్శించారు. రైతుల పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.


అబ్లషన్‍ (పూలగుత్తులను తొలగించుట) ఎప్పటివరకు కొనసాగించాలి?
పుష్సగుచ్చాలు మొక్క వయస్సు 12-14 నెలలు నుండి మొదలైన పూలగుత్తుల లేత మొగ్గ దశలోనే తుంచి వేయాలి. దీనిని అబ్లేషన్‍ అంటారు. పూలగుత్తులు లేత దశలో చేతితో లేదా ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. దీనిని అబ్లేషన్‍ పరికరం (త్రిశూలం ఆకారంలో) అంటారు. ఈ పరికరంతో తీయవచ్చు. 30 నెలల వయస్సు నిండేవరకు కొనసాగించాలి. అబ్లేషన్‍ వల్ల ఆకు ఉత్పత్తి, చెట్టు కైవారం, ఎత్తు, లావు మరియు విస్తారమైన వేరు వ్యవస్థ చెట్టు అన్ని పరిస్థితులలో తట్టుకునే శక్తిని ఇస్తుంది.


ఆయిల్‍పామ్‍లో సాగునీటి యాజమాన్య పద్ధతులను వివరించండి?
ఆయిల్‍పామ్‍ పంట ఎక్కువ దిగుబడిని ఇచ్చుటకు సమృద్ధిగా సాగునీరు అవసరం. నీటికొరత ఆకుల ఉత్పత్తి తగ్గిపోవుటకు, పెరుగుదల సన్నగిల్లటకు, ఎక్కువ మగ గెలలు రావటానికి, తద్వారా దిగుబడి తగ్గిపోవటానికి కారణం అవుతుంది. బిందుసేద్య పద్ధతిలో ఒక్కొక్క పాదులో కనీసం (04) బిందు పరికరాలను, తుంపర సేద్యమైనట్లయితే (02) తుంపర పరికరాల్ని మొక్కకి ఇరువైపుల వచ్చేటట్లు అమర్చుకోవలి. మొక్కకి సహజంగా 200-250 లీటర్లు / రోజుకి, వేసవిలో 300-350 లీటర్లు నీరు అందించాలి. అంటే రోజు కనీసం 2-3 గంటలు డ్రిప్‍ నడిపించాలి.


మొవ్వు కుళ్ళు తెగులు ఎలా గుర్తించాలి. నివారణ తెలపగలరు?

మొవ్వు ఆకు మొదలులోని కణజాలం పూర్తిగా కుళ్ళడం వలన మొవ్వు ఆకును లాగినప్పుడు సులభంగా ఊడి వస్తుంది. కుళ్ళిన మొవ్వు నుండి దుర్వాసన వస్తుంది. ఆకులు మొవ్వు భాగం పై నుండి క్రిందకు ఎండిపోతాయి. దీని నివారణకు తుంపర పరికరాలను దూరంగా అమర్చుకోవాలి. బావిస్టిన్‍ 1.5 గ్రామ్‍/లీ నీటికి గాని లాండా 1 గ్రా/లీటరు నీటికి కలిపి మొవ్వు భాగంలో పోసుకోవాలి.


ఎలుకల నివారణ పద్దతులను తెలుపగలరు?
జింక్‍ ఫాస్ఫెడ్‍, అల్యూమినియం ఫాస్ఫెడ్‍ బిళ్లలను ఎలుక కన్నములలో వేసి తడిమట్టితో కన్నాలను మూసి వేయాలి. వివిధ రకాలైన ఎలుక బోనులను ఉపయోగించవచ్చు.


కలుపు మొక్కలను ఏ విధంగా నిర్మూలించాలి?
చేతితో లేదా సిఫారసు చేసిన కలుపు మందులతో గాని క్రమంగా కలుపు మొక్కలను నిర్మూలించాలి. బ్రస్‍కట్టర్‍ ద్వారా, మల్చింగ్‍ విధానంతో అంతరసేద్యం ద్వారా కలుపుని నివారించుకోవాలి.


ఆయిల్‍పామ్‍ తోటలో దున్నే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపగలరు?
ఆయిల్‍ పామ్‍ పంటలో అంతర పంటలు చేపట్టే విధానంలో ఆకువిస్తరణ బయట భాగంలోనే దున్నటం చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పాదు లోన భాగంలో దున్నటం చేపట్టరాదు. పాదు అంతర భాగంలో దున్నటం చేయటం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతిని ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.


తెల్లదోమ నివారణను వివరించగలరు?

ఒక మిల్లి లీటరు వేప నూనె (10,000 పిపిఎం) మరియు 04 గ్రా. రిన్‍ సర్ప్ పొడిని ఒక లీటరు నీటికి కలిపి తెల్లదోమ ఆశించిన ‘ఆకుల క్రింద భాగం’ బాగా తడిచేలా వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.


ఆకులు క్రింది భాగం నుండి పైకి ఎండిపోతున్నాయి. దీనికి నివారణ తెలుపగలరు?
నీటి ముప్పునకు గురికానీయవద్దు. ఆరంభ దశలో వున్నప్పుడు బావిస్టిన్‍ 20 గ్రా. 100 ఎం.ఎల్‍ నీటికి కలిపి కుళ్లిన కణాన్ని తొలగించి పూతగాపూసి మొక్కను రక్షించవచ్చు.


పాదులు చేయు పద్ధతిని వివరించండి?

మొదటి సంవ్తసరము చెట్టు చుట్టూ 1 మీ. వ్యాసార్థతంతో పాదులను చెయ్యాలి. 2 సం।। వయస్సులో 2 మీ. 3 సం।। తరువాత 3 మీ. కి పెంచాలి.


అంతరపంటలుగా ఏ పంటలు వేసుకోవచ్చు?

ఏకవార్షిక పంటలను పండించవచ్చు. వరిని అంతర పంటగా వేయరాదు. కూరగాయలు, పత్తి, మొక్కజొన్న, పెసలు, మినుము, వేరుశనగ, బొబ్బర్లు వంటివి అంతరపంటలు వేసుకోవచ్చు. ఇవి మొదటి 3 సం।। కాలములో ఆదాయం పొందవచ్చు.


ఆయిల్‍పామ్‍ పంట నుండి ఎంత దిగుబడి ఆశించవచ్చు?

మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4-6 సం।। తోటలో 20-24 గెలలు (బరువు 3-15 కిలోలు) వరకు వస్తుంది. ముదురు తోటల్లో గెలల సగటు బరువు 20-35 కిలోలు. 5-9 సం।। తోటల్లో దిగుబడి 22-20 టన్నులు / హెక్టారుకు. 10 సం।। పైబడిన తోటల్లో 25-30 ట/హె. వరకు దిగుబడి వస్తుంది.


పచ్చిరొట్ట ఎరువలను గురించి తెలపగలరు?
ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయస్సుగల ఆయిల్‍పామ్‍ మొక్కల పాదులలో మూడు అడుగల దూరంలో, చుట్టూ రెండు వరసలు జనుము వేసి పూతదశ వరకు పెంచిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి పాదులలో వేయాలి. వేసవి సమీపిస్తున్నందున 0-3 సం।। వయస్సు తోట నిర్వాహకులు పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవాలి. ఇలా చేయడం వలన వడగాలులకు తట్టుకొని పాదు పరిధిలో తేమశాతం పెరుగుతుంది.


నల్లకొమ్ము పురుగు యాజమాన్యం గురించి తెలుపగలరు?

ఆకుల చివర ‘వి’ ఆకారపు ఖాళీలు ఏర్పడుతాయి. ఆకుల మొదళ్ళమీద శాశ్వత రంధ్రాలు ఏర్పడి నమిలిన పిప్పి బయటికి కనబడుతూ ఉంటుంది. మొవ్వు భాగంలోని ఆకులు ఈ పురుగు బారిన పడినప్పుడు కురచగా, విరిగినవిగా మెళికలు తిరిగి కనిపిస్తే కొమ్ముపురుగు ఉదృతి ఉందని గుర్తించవచ్చు. దీని నివారణకు రంధ్రాలు ఉన్న చిన్న పాలిథీన్‍ సంచిలో 20 గ్రా. ఫోరేట్‍ గుళికలను వేసి మొవ్వులో పెట్టడం వలన వాసనకు దూరంగా పోతాయి. పులిసిన ఆముదపు పిండి లేదా లింగాకర్షక ఎరల ద్వారా పురుగులను నిర్మూలించవచ్చు.

ఈ కార్యక్రమంలో ఆయిల్‍ ఫెడ్‍ జనరల్‍ మేనేజర్‍ సుధాకర్‍రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీత, అధికారులు శంకర్‍, భాస్కర్‍రెడ్డి, వర్షరాంరెడ్డి, బాలాజీ, రైతులు రాఘవాపురం రాంగోపాల్‍, ప్రజ్ఞాపూర్‍ మణికొండ వేదకుమార్‍, శ్రీకాంత్‍రెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • బాలారణ్యం
    ప్రజ్ఞాపూర్‍, గజ్వే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *