ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా – కొన్ని స్థల నామాలు

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాను ఎదులాపురం, ఎడ్లపురం’గా పిలిచే వారట. తొలి తెలుగు యాత్రా చరిత్ర రాసిన ఏనుగుల వీరస్వామి తన కాశీ యాత్ర చరిత్రలో ఎదులాబాద్‍ గానే ప్రస్తావించాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీజాపూర్‍ సుల్తాన్‍ మహమ్మద్‍ ఆదిల్‍ షా పేరు మీదుగా ఆదిల్‍ షా బాద్‍ గా ఏర్పడి క్రమంగా ఆదిలాబాద్‍గా పరిణామం చెందిందని చారిత్రక కథన మున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం అయిదు రెవిన్యూ డివిజన్‍లుగా, యాభై రెండు మండలాలుగా, మొత్తం 1725 రెవిన్యూ గ్రామాలున్నవి. 2016లో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు. ఆదిలాబాద్‍, మంచిర్యాల, నిర్మల్‍, కుమ్రంభీం ఆసిఫాబాద్‍ అను నాలుగు జిల్లాలుగా ఏర్పడింది. ఆదివాసులు ఆరాధ్య దైవం కుమ్రంభీం జన్మించిన ప్రాంతం కుమ్రంభీం ఆసిఫాబాద్‍ జిల్లా. గోండులకు రాజధానిగా ఉండేది. నిర్మల్‍ ప్రాంతం నిమ్మ నాయుడు పరిపాలనా ప్రభావంతో నిర్మల్‍ అను పేరు స్థిరపడింది. పొనికి చెక్కలతో తయారుచేసే కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. మంచిర్యాల అను పేరును చారిత్రకంగా మంచిరేవుల అని కూడా పిలుస్తారు.


ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శుంగులు, శాతవాహనులు, వాకాటకులు, విష్ణుకుండినులు, బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, దేవగిరి యాదవ రాజులు, గోండురాజులు, నిజాంషాహీ, హైమద్‍ షాహీ, కుతుబ్‍ షాహీ, అసఫ్‍ జాహీలు పరిపాలించారు. పచ్చదనానికి ప్రతీకగా కొండలు, కోనలు నిత్యం కొత్త శోభతో అలరారుతూ గిరిజన జీవన సంస్క•తిని ప్రతిబింబిస్తాయి. గోదావరి,ప్రాణహిత, వార్ధా,పెన్‍ గంగ,కడెం,స్వర్ణ, పెద్దవాగు, సాత్నాల, వట్టివాగు వంటి నదీనదములు ప్రక•తి రమణీయతను పెంచుతాయి. చెన్నూరు,నిర్మల్‍ కోడూరు,ఉట్నూరు, భైంసా, కుబీర్‍, కర్నమామిడి,సిర్పూర్‍, తాండూర్‍, ఆసిఫాబాద్‍ ప్రాంతాలలో స్థల,గిరి దుర్గాలున్నవి. బాసర సరస్వతి ఆలయం, కేస్లాపూర్‍ నాగోబా గుడి, జైనథ్‍ లక్ష్మీనారాయణ ఆలయం, వాంకిడి శివకేశవాలయం, నిర్మల్‍, పొన్కల్‍ సూర్జాపూర్‍, గంగాపూర్‍ వంటి అనేక ప్రాంతాలలో వివిధ ఆలయాలున్నవి.


ఎల్‍.మడుగు: ఆదిలాబాద్‍ జిల్లా శివ్వారం గ్రామ శివారులో గుహలో తొలిచిన లంజగుళ్ళు కనిపిస్తాయి. ఈ గుళ్ళకు అభిముఖంగా గోదావరి కుడి ఒడ్డున ఖానాపూర్‍ శివారులో కొన్ని శిల్పాలు కనపడతాయి. ఆ గుళ్ళ కింద విశాలమైన ఎల్‍. మడుగు (లంజమడుగు) ఏర్పడింది. ‘‘వజ్రాయన బౌద్ధంలో బిక్షుకులు ఆచరించిన తాంత్రిక అభ్యాసంలో స్త్రీలను చేర్చుకోవడం వలన, మైథున తంత్రాల వల్ల బౌద్ధాన్ని ఆనాటి సమాజం బూతు పదాలతో అభిశంసించింది. నాటి బౌద్ధుల ఆరాధనాస్థలాలను లంజగుళ్ళు అని, ఆ ప్రదేశపు నీటిమడుగును ఎల్‍.మడుగు (లంజమడుగు)’’అని పిలిచారని (ప్రముఖ చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్‍ గారు తెలిపారు)


కుంటాల: నేరడిగొండ మండలం కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతమిది. ఉత్తర సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. పూర్వం శకుంతలా, దుష్యంతుల కథలోని శకుంతల ఇక్కడ నివాసం ఉండటం వలన ఈ ప్రాంతాన్ని కుంతల’ అని పిలిచేవారట. పరిణామ క్రమంలో కుంటాల మారిందన్న స్థల పురాణమున్నది.


కేస్లాపూర్‍: ఇంద్రవెల్లి మండలం లోనిది. ఈ గ్రామంలో గోండు గిరిజన తెగవారు ప్రతి సంవత్సరం పుష్య మాసంలో బహుళ అమావాస్య రోజున నాగోబా జాతర జరుపుకుంటారు. 1940లో ప్రొఫెసర్‍ హైమన్‍ డార్ఫ్ అనే గిరిజన స్కాలర్‍ నాగోబా జాతర సందర్భంగా గోండు దర్బార్‍ నిర్వహించడానికి కలెక్టర్‍ ని ఆహ్వానించి గిరిజన సమస్యలను విన్నవించుకునే సంప్రదాయాన్ని ప్రారంభించాడు.


గాడిదగుండం: నేరడిగొండలోని దట్టమైన అడవుల మధ్యలో ఉన్న జలపాతమిది. దీనికి మొక్కుడుగుండం, ముక్కడి గుండం అనే పేర్లు కూడా ఉన్నాయి. గాడిలో నుంచి దుంకుతుంది కాబట్టి గాడిదగుండం అని అంటారు.


జలపాతాలు: ఇచ్చోడ బజార్హత్నూర్‍ దారి మధ్యలో కడెం నది దగ్గర మూడు జలపాతాలు ఉన్నవి. అవి మొదటిది కనకాయి జలపాతం. స్థానిక ప్రజలు ఈ జలపాతాన్ని కనకాయి గుండంగా పిలుస్తారు. రెండవది గొలుసుల జలపాతం. ఇది గొలుసుల ఆకారంలోనే ఉంటుంది. దక్షిణాన సాకేరి గ్రామం నుంచి వస్తున్న వాగు కడెం నదిలో కలిసే చోట ఈ జలపాతం ఏర్పడింది. మూడవది చీకటి గుండం. చీకట్లో ఏమీ కనబడనట్లే ఈ జలపాతం కూడా కనబడదట. నిర్మల్‍ నుండి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో స్ఫటికమంత స్వఛ్చంగా పారే పొచ్చెర జలపాతం ఇరవై అడుగుల ఎత్తుమీది నుండి పారుతుంది.


బాసర: ఇక్కడ సరస్వతీ దేవాలయం ప్రధానమైనది. భాషలకతీతంగా, రాష్ట్రాలకతీతంగా వెలసిన పుణ్య క్షేత్రం. జ్ఞానానికి, కీర్తికి ప్రతీక అయిన బాసర సరస్వతీ దేవిని జ్ఞాన సరస్వతీ దేవిగా భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ వ్యాసుడు నివసించిన కారణంగా వ్యాసపురం ఏర్పడి, అనంతరం వాసర’గా మారిందని శాసనస్త ఆధారమున్నది. క్రీస్తుశకం పదో శతాబ్దం నాటి పశ్చిమ చాళుక్యులకు సమకాలీకమైన శాసనంలో ‘‘స్వస్తిశ్రీ వ్యాసాపురద మహారాజా’’ అని రాసి ఉంది. వ్యాసపుర బాసరగా మారి ఉండవచ్చు ఈ క్షేత్రం వ్యాసుని గాథను బట్టి, ఇక్కడి గోదావరి తీరాన 3000 సంవత్సరాల క్రితమే వెలిసిన గ్రామంగా స్పష్టమవుతున్నది. (పూత గోదావరి పుష్కర విశిష్టతబీ డా.సంగనభట్ల నరసయ్య, పుట.44) ‘‘బాసర నిజానికి ఒక ఊరు కాదు ఐదు గ్రామాల సముదాయం. అవి బాసర, రేణుకాపురం, మహదాపురం, రత్నాపురం, మయిలాపురం. ప్రస్తుతం బాసర, మయిలాపురం మాత్రమే ఉన్నాయి. మిగిలినవి రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. బాసరలో జ్ఞాన సరస్వతిని వ్యాసుడు ప్రతిష్టించినట్లు చెప్పబడుతున్నది. కానీ ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన కురిక్యాల చోళ రాజైన రెండవ బిజ్జల దేవుడే ఇక్కడ ఆలయాలు నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం. తాను జైనుడు. అతని బావ వీరశైవ ప్రవక్త బసవేశ్వరుడు. వారి కాలంలో వీరశైవ ప్రాబల్యం వల్ల జరిగిన జైనం, శైవాల సంఘర్షణలకు దర్పణంగా ఉంది బాసర. బాసరలోని నల్ల హనుమాన్‍ గుడి జైన శాసనంలో జైన గురువుకు ధారాపూర్వకంగా దానమిచ్చినట్లుగా పేర్కొనబడింది. జైన బసదుల నుంచే బాసర పేరు వచ్చింది బసదే కాలక్రమాన బాసరగా మారిపోయింది.’’ (తెలంగాణ చరిత్ర తవ్వల్లో, శ్రీరామోజు హరగోపాల్‍, పుట.171-174)


సిర్పూర్‍: దేశంలోనే మొట్ట మొదటి గోండు రాజ్య సంస్థానంగా వెలిసిన ప్రాంతమిది. తెలంగాణ కాశ్మీర్‍ గా కూడా పిలుస్తారు. దీనిని పూర్వం సూర్యాపురం’గా కూడా పిలిచేవారట.
ముగింపు: జిల్లాలోని అనేక స్థల నామాలలో అదెగావ్‍, డాంగర్గావ్‍, తక్లి, తోంతాల, దహెగావ్‍, పిప్పల్‍ గావ్‍, బత్తి సావర్‍ గావ్‍, బేల్గావ్‍, బోరెగావ్‍, లేఖర్వాడి, వాడగావ్‍, వాంకిడి, సింగన్గావ్‍, సుంకిడి, వంటి గ్రామ నామాలు మరాఠీ సంస్క•తిని చూపెడు తున్నవి. ధర్మపురి, దుర్గాపూర్‍, రాంలింగంపేట్‍, నారాయణపూర్‍ (తెలంగాణ ప్రాంత సంస్క•తి)రాంపూర్‍, లచ్చింపూర్‍(గిరిజన సంస్క•తి) చించోళి (కన్నడ) నిజాంపూర్‍, సయ్యద్‍ పూర్‍ (ఉర్దూ) వంటి అనేక రూపాలున్నవి. జిల్లాకు ఉత్తరం వైపు హిందీ భాషా సాంస్క•తి కనపడుతుండగా, పశ్చిమం వైపు మరాఠా సంస్క•తి అధికంగా ఉంటుంది. ఆయా నామాలలో చెన్నూరు-చెన్నుపురం (పంచకోశ ఉత్తర వాహిని) భైంసా-మహిషా, రాయపట్నం-కప్ప రాయపట్నం, సోన్‍-స్వర్ణ అనే ప్రత్యేక రూపాలు కనబడుతవి.


డా. మండల స్వామి
ఎ : 9177607603

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *