సీతమ్మలొద్దిలో సిత్రాలకోన


పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం గ్రామం అడివిలో సీతమ్మలొద్దిలో అబ్బురపరిచే రాతిచిత్రాలకోన ఆవిష్కారమైంది. ఈ రాతిచిత్రాల నెలవులో వందలాది రాతిచిత్రాలున్నాయి.


ఈ చిత్రాలతావును కనిపెట్టింది ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు శ్రీ దుగ్గెంపూడి రవీందర్‍ రెడ్డి(రవి స్టుడియోస్‍, సోమాజిగూడ, హైద్రాబాద్‍). పెద్దపల్లి గ్రామస్తుడైన రవీందర్‍ రెడ్డి గారి భూములు గుట్టల మీద ఎద్దుగుట్ట, సీతమ్మ లొద్దిల దగ్గరున్నాయి. గతంలో పురావస్తుశాఖవారితో పనిచేసిన అనుభవంవల్ల కుతూహలంతో ఆ ప్రదేశాల పరిశీలనలో ఈ కొత్త రాతిచిత్రాల తావును కనుగొన్నారు రవీందర్‍ రెడ్డిగారు. తనకు బంధువు, రాతిచిత్రాల నిపుణుడు, కొత్త తెలంగాణ చరిత్ర బ•ందం సలహాదారుడు డా. బండి మురళీధర్‍ రెడ్డిగారిని, చరిత్రబ•ందం కన్వీనర్‍ నైన నన్ను ఈ అపూర్వమైన చరిత్రపూర్వ యుగపు తావును చూడరమ్మని ఆహ్వానించాడు.


ఊరికే రమ్మనడం కాదు. హైదరాబాద్‍ నుంచి స్వయంగా తన కార్లో మమ్మల్ని తోడ్కొని వెళ్ళాడు. శనివారం రాత్రి పెద్దపల్లిలో మకాం చేయించాడు. ఆదివారం పొద్దున్నే బ్రేక్‍ ఫాస్టులు, కార్లో తనపొలాలవద్ద ఉన్న ఫార్మ్ హౌస్‍ కు, అక్కణ్ణుంచి ట్రాక్టర్‍ కు అమర్చిన సోఫావంటి ఆసనం మీద మమ్మల్ని కూర్చోబెట్టించాడు. ట్రాక్టర్‍ డ్రైవర్‍ శంకర్‍ ఆ పొలాల నుంచి, అడివితొవ్వల్లో నిదానంగా నడిపించుకుంటు సీతమ్మలొద్ది వద్దకు తీసుకుని వెళ్ళాడు. అక్కణ్ణుంచి మా వెంట రవీందర్‍ రెడ్డిగారి అసిస్టెంట్‍ యాదగిరి, సతీశ్‍, గణేశ్‍ లు రాతిచిత్రాలకోనకు ట్రెక్కింగ్‍ చేయించి తోడ్కొని పోయారు.
దారంతా ఎత్తులు, వంపులు రాళ్ళతొవ్వ. అడివికదా అందంగా ఉంది. పట్నవాసం కాదు, శిశిర రుతువులో పాత ఆకులన్నీ రాల్చి కొత్త ఆశలన్నట్లు, ననలు తొడుగుకొంటున్న చెట్లు, నీటి బాటలు, అంతెత్తున సిబ్బితం జలపాతానికి జలనిధైన మామిడికుంట దాటినంక, ఎద్దుగుట్టకు తూర్పున సీతమ్మలొద్దికదా. గుట్ట ఎక్కే ముందర కింద వున్న సెలయేటి ఒడ్డుననే డా.బండి మురళీధర్‍ రెడ్డి సార్‍ కు తొలి పాతరాతియుగం పరికరం రాతి గొడ్డలి (సుమారుగా లక్ష సం.ల కిందటిది) లభించింది.


గుట్టెక్కి చూడగానే ఎక్కడా చూడనంత పొడవైన, ఎత్తైన ఈ చిత్రిత శిలాశ్రయాన్ని చూడబోతున్నందుకు మనసు పులకరించి పోయింది. ఈ తావు 200 అడుగుల ఎత్తైన గుట్టమీద, పశ్చిమాభిముఖంగా ఉంది. 50 అడుగుల ఎత్తు, 200 అడుగులు (6 చిన్నరాతిగుహల పొడవు) 1000 అడుగుల పొడవున్న ఈ అఖండ శిలాశ్రయం, నెలవంక వంపుతో ఉంది. ఈ రాతిచిత్రాల తావును ఉత్తరం దిశనుంచి దక్షిణం వైపుకు చూస్తూ వెళ్ళాలనుకున్నాం.


మాతోపాటు వచ్చిన యాదగిరి మొత్తం మా ప్రయాణాన్ని, శిలాశ్రయంలో మా పరిశీలనలను కెమెరాలో రికార్డు చేసాడు. సతీశ్‍, గణేశ్‍ లిద్దరు స్థావరం కొలతలు తీసుకోవడానికి, మాకు మా పనిలో చేదోడు, వాదోడుగా ఉన్నారు. అక్కడికి ఉదయం 11గం.లలోపే చేరుకున్నాం. రెండుగంటలపాటు రాతిచిత్రాలను పరిశీలించడం, అబ్బురపోవడం మావంతైంది. ఒంటిగంట దాటిన తర్వాత సద్దిమూటల్ని విప్పి అందరం తిన్నాం. అడివిలో, చెట్ల కింద, ఇట్లా కొండనెలవుల్లో తినడం బాగుంటది. రోజువారీ దినచర్యల నుంచి మార్పు. వాతావరణమే మారిపోయిందికదా. ఆకలి తీరగానే మళ్ళీ ఈ చిత్రిత శిలాశ్రయంలో బొమ్మలవేట. నేను బొమ్మలతో పాటు అక్కడనేల మీద పరిశీలించినపుడు గుప్పిళ్ళకొద్ది సూక్ష్మరాతిపనిముట్ల (మైక్రోలిథిక్‍)చిప్స్ అగుపించాయి. వాటిలోంచి రాతిపనిముట్లను ఏరుకున్నాను. శిలాశ్రయం పొడుగునా సూక్ష్మరాతిపనిముట్లు దొరుకుతూనే వున్నాయి. పొద్దుతిరిగేలోగా రాతిచిత్రాల పరిశీలన పూర్తి చేయాలనే ఆలోచనవల్ల, ఎక్కువసేపు రాతిపరికరాల సేకరణకు సమయం పెట్టలేకపోయాను. అయిననేమి? అద్భుతమైన నత్తగుల్ల శిలాజం, గుప్పెడు రాతిపనిముట్లు దొరికాయి. సంతోషమనిపించింది.


మధ్యప్రదేశ్‍ రాష్ట్రంలో మాండ్సర్‍ జిల్లాలోని చతుర్భుజ నాలాలో ప్రపంచంలోనే పొడవైన రాతిచిత్రాల నెలవుంది. 5కి.మీ.ల పొడవైన రాతినెలవులలో 700 మీ.ల పొడవున్న చిత్రిత శిలాశ్రయం సందర్శకులకు అనువైనది. ఈ సీతమ్మలొద్దిలో రాతిచిత్రాలకోన పొడవు 365మీ.లు. ఇపుడీ రాతిచిత్రాల నెలవే చతుర్భుజనాలా తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది.


ఇక్కడున్న రాతిచిత్రాలలో ఎక్కువగా ఎరుపురంగు చిత్రాలే. కొన్ని తెలుపు, చాలా తక్కువగా పసుపురంగులో కూడా దొరికాయి. ఈ రాతిచిత్రాలు మధ్యరాతియుగానికి (పస్తుతానికి 12వేల సం.ల క్రితం), కొన్ని తొలి చారిత్రకయుగానికి (సా.శ. 1 నుంచి 6 శతాబ్దాలు) చెందినవి పురావస్తుశాస్త్రరీత్యా ఇక్కడ కనిపించిన చిత్రాల నమూనాలు ఇంతవరకు మరెక్కడా అగుపించలేదు.


రాతిచిత్రాలను పరిశీలిస్తూ, ఫోటోలు తీసుకుంటూపోయాం నేను, మురళీధర్‍ రెడ్డిసార్‍. కొత్త బొమ్మను గమనించినపుడల్లా ఆశ్చర్యానందాలు. ఎపుడో వేలయేండ్ల పురామానవులు ఇక్కడ ఈ నెలవులో ఎంతకాలం ఉన్నారో కాని, ఎంత అద్భుతమైన జీవన చిత్రాలను గీసారు. తమ జీవన సంస్క•తిని ఈ రంగులబొమ్మల్లో నిక్షిప్తం చేసారు. వారు తిరిగిన ఈ అడవిలో ఏయే జంతువులను చూసారో, వేటాడారో వాటిని చిత్రించారు. ఎందరిక్కడ ఉన్నారని తెలియడానికా, లేక కూడలి పండుగల వంటి సందర్భాల్లోనా, వారి కుడి, ఎడమచేతుల గుర్తులను ఈ రాతిగోడల మీద వారి సంతకాలుగా ముద్రించారు. ఆనందాతిశయంతో వారు నాట్యం చేసిన నాట్యద•శ్యాలను చిత్రీకరించారు. ప్రపంచమంతా లభించే రాతిచిత్రాలలో చేతిగుర్తులది ప్రత్యేకత. వాటిలో ఒకేచోట కుడి, ఎడమచేతుల గుర్తులు కనిపించడం అరుదైన సందర్భం. ఈ చేతిగుర్తులను ఇప్పటివారుకూడా గుడిగోడల మీద, ఇండ్లమీద ఎరుపురంగుతో వేయడం ఆచారంగా ఉంది.


ఈ రాతిచిత్రాలలో స్త్రీ, పురుషులు చేతులు పట్టుకుని వలయాకారంలో, వరుసలో సామూహికన•త్యాలు చేస్తున్న ద•శ్యాలున్నాయి. వాళ్ళు వేసుకొన్న మడిమెలపైకి ఉన్న పాదరక్షలు ప్రత్యేకంగా కనిపించాయి. రక,రకాల జంతువులబొమ్మలు. నాట్యం చేస్తున్న మనుషుల గుంపు వెనక గీతలలో కనిపిస్తున్న ఒక బొమ్మ అడివిపిల్లిని పోలివుంది. మరొక బొమ్మ ‘మాంసాహార జంతువు (కార్నివోరస్‍) తోకెత్తుకుని నిల్చున్నట్టు అగుపించింది. అందంగా గీసిన ఒక పెద్దతాబేలు చిత్రం. ఈ రాతిచిత్రాలలో ఎరుపు రంగునింపి వేసిన పొడవైన తోకలతో అడివిబల్లులబొమ్మలు ప్రత్యేకం. ఒకచోట వరుసగా వేసిన మూడు కోతులబొమ్మలు. వాటి పక్కన విల్లమ్ములతో ఒక మనిషి. పెద్దవి, చిన్నవి పాదాల ముద్రలు ఎరుపురంగు నింపినవి, గీతలలో ఉన్నవి కనిపించాయి.


ఈ రాతిచిత్రాలలో ఎన్నో ఎరుపురంగునింపిన అందమైన ఇఱ్ఱుల బొమ్మలు వేర్వేరు సైజుల్లో, వాటిలో ఒక ఎరుపురంగు గీతలలో గీసిన రెండు పెద్దకొమ్ములతో, వింతైన పూవువంటి కుచ్చుతోకలతో అగుపించాయి. అరుదుగా కనిపించే ఎన్నో కుడి, ఎడమచేతుల గుర్తులు కొన్ని ఎరుపు, తెలుపు, అరుదుగా పసుపు రంగునింపినవి, గీతలలో కొన్ని గుర్తించాము. ఒకచోట తొక్కుడు గీతలలో (పెట్రోగ్లైఫ్స్) జింకలబొమ్మలు, ఒక కంకణవ•త్తం, ఎదురెదురుగా నిల్చున్న ఇఱ్ఱుల తెల్లరంగుబొమ్మలు ముఖ్యమైనవి. నిల్చున్న మనుషులబొమ్మలు ఎరుపురంగులోనేకాదు ఇక్కడ తెలుపురంగులో ఉన్నాయి.


ఈ సీతమ్మకోనలో రాతిచిత్రాలే కాదు, చారిత్రకంగా ప్రాధాన్యతగల నామక (లేబుల్‍)శాసనాలు చెక్కినవి ఆరు, ఎరుపు రంగులో రాసినవి రెండు లభించడం విశేషం. వీటిలో ప్రాక•త భాషలో, బ్రాహ్మీలిపిలో లిఖించిన సాతవాహనకాలాని(1వ శతాబ్దాని)కి చెందినవి ఆరు, విష్ణుకుండినుల కాలానివి (6వ శతాబ్దానివి) రెండు ఉన్నాయి.


వీటిలో సాతవాహన సాతకర్ణి, నాగానికల పుత్రులలో ఒకడైన హకుసిరి పేరున్న నామక శాసనం లభించడం తెలంగాణాలో ఇది రెండవసారి. మొదటిది జగిత్యాల జిల్లా మొక్కట్రావుపేటలో 12 సం.రాల క్రితం గుర్తించిన 4 పంక్తుల కుమార హకుసిరి శాసనం. ఈ రెండవ శాసనంలో ‘సిద హారీతిపుత్ర కుమార అకుసిరి మితస’ (హారీతిపుత్రుడు కుమార హకుసిరి మిత్రుడు) అని ఉంది. మరొకచోట ఎరుపురంగులో రాసిన నామకశాసనం ‘నగకావో(ఱు)/సిద హారీతి పుతస’ అని వుంది. తొలి సాతవాహనుల పేర్లలో హారీతీపుత్ర అనే సంబోధన కొత్తది. ఈ శాసనాలవల్ల సాతవాహనుల చరిత్రలోనికి 1వ శతాబ్దంలోనే ‘హారీతిపుత్ర’ అనే పేరు చేర్చబడింది. ఆగ్నేయదక్కన్‍లో సా.శ.3వ శతాబ్దపు ప్రాంతీయ సాతవాహన పాలకులలో హారీతీపుత్ర సాతకర్ణి అనే పేరు ఒక్కటే కనిపిస్తున్నది. ఈ శాసనాల క్రమంలో మరొక లేబుల్‍ శాసనం ‘కుమారస సకసిరి పుతస’ అనేది కూడా చారిత్రక ప్రాధాన్యత కలిగినదే. కొత్తపేరును సాతవాహనయుగంలో వెతకవలసివుంది.


మరికొన్ని రంగుతో రాసిన లేబుల్‍ శాసనాలు చెదిరిపోయి, అక్షరాలు అగుపించడం లేదు. వాటి జాడలు మాత్రం మిగిలాయి.
ఈ పురాచిత్రాలశాలలో నేలమీద ఎన్నో మధ్యరాతియుగపు సూక్ష్మరాతి పనిముట్లు (మైక్రోలిథ్స్) దొరకడంతో ఈ చిత్రాలు మీసోలిథిక్‍ పీరియడ్‍ కు చెందినవేనని నిర్ధారించవచ్చు. ఈ రాతిపనిముట్లను తయారుచేసేందుకు వాడుకున్న ఎన్నో ఛెర్ట్, ఫ్లింట్‍ కండశిలలు (కోర్‍ మెటీరియల్‍) లభించాయి. వాటిలో ఒకటిన్నర కోట్ల సం.రాల కిందటి నత్తగుల్ల శిలాజం ఉంది. మరొకటి బోరో ఫాసిల్‍ కూడా.
ఈ శిలాశ్రయంలో దక్షిణంవైపు రాళ్ళతో నిర్మించిన తొలియుగాల నాటి రక్షణకుడ్యం ఉన్నది. లోపలివైపు తొలిచారిత్రక యుగపు గదివంటి కట్టడం కనిపిస్తున్నది.


ధన్యవాదాలు:

వరల్డ్ రికార్డుల్లో చేర్చదగ్గ రాతిచిత్రాల నెలవును గుర్తించిన చారిత్రక యాత్ర స్ఫూర్తిదాత: శ్రీ దుగ్గెంపూడి రవీందర్‍ రెడ్డి, ఫోటో జర్నలిస్టు (రవి స్టుడియోస్‍) గారికి, సహయాత్రికులు, రాతిచిత్రాల నిపుణులు, కొత్త తెలంగాణ చరిత్ర బ•ందం సలహాదారులు, ఈ వ్యాసరచనకు మూలద్రవ్యాన్నందించిన డా. బండి మురళీధర్‍ రెడ్డిగారికి.


– శ్రీరామోజు హరగోపాల్‍,
ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *