మానవ జాతి తప్పిదాలకు బలైపోతున్న పిచ్చుకలు

పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించు కునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రాలతో పక్షి జాతి నిర్వీర్యమవుతోంది. పిచ్చుకల జాతిని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి మార్చి 20 తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒకకొత్త థీమ్‍తో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు, వీటి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాలలు, కళాశాలల్లో అవేర్‍నెస్‍ క్యాంపైన్స్, వ్యాసరచన, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.


ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లో చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిలా రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచ కిచలు నేడు కరువయ్యాయి. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చు కోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్‍టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి.


పర్యావరణాన్ని తన శక్తిమేరకు కాపాడే పిచ్చుకలను రక్షించేందుకు పక్షుల ప్రేమికులు ప్రత్యేకంగా వీటికోసం అన్వేషించే పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఎంతో బాధాకరం. మన ఇంట్లో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటిబారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి.
వేకువ జామున కిలకిలారావాలతో మేలుకొలుపు పాడే పిచ్చుకలను చూస్తే మనసుకు కాసింత హాయి.. చూరుకు వేలాడదీసిన వరి కంకులు తింటూ ‘కిచ కిచ’ మంటూ గోల చేసే చిట్టి పిట్టలు కలిగించే ఉత్సాహం మాటల్లో చెప్పలేం.! ఇసుక, మట్టిలో పొర్లాడే ద•శ్యాలు.. అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోతూ పిట్టలు సందడి చేసిన క్షణాలు ఎంతో మందికి తీపి జ్ఞాపకాలు.


మనిషికి దగ్గరగా ఉంటూ మన కుటుంబంలో ఒకరుగా ఉన్న పిచ్చుకలు.. మానవజాతి చేస్తున్న తప్పిదాలకు బలైపోతున్నాయి. ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న పక్షుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న పిచ్చుకలను రక్షించుకోక పోతే జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి.
పిచ్చకుల చరిత్ర
పూర్వం మధ్యదరా ప్రాంతంలో ఆవాసముండే పిచ్చుకలు కాలక్రమంలో ప్రపంచమంతటా విస్తరించాయి. అడవుల్లో కాకుండా మానవులకు దగ్గరగా
ఉండేందుకే అవి ఇష్టపడతాయి. గూడుకు ముప్పు వస్తుందనుకుంటే ఇతర జాతుల పక్షులపై దాడి చేసేందుకూ వెనుకాడవు. మగ, ఆడ పిచ్చుకలు అదే వర్గానికి చెందిన పక్షులపై మాత్రమే దాడి చేయడం ఇక్కడ విశేషం.
65 ఏళ్ల క్రితం అంటే 1958లో చైనాలో పంటలు నాశనం చేస్తున్నాయనే నెపంతో లక్షల సంఖ్యలో పిట్టలను కాల్చి చంపారు. పంటల వద్ద పళ్లేలతో చైనీయులు చేసిన శబ్ధాల ధాటికి పిచ్చుకలు దూరంగా వెళ్లి తలదాచుకున్నాయి.
ఆ తర్వాత పంటలను చీడపీడలు ఆశించడంతో తిండి గింజలు కరువయ్యాయి. రెండేళ్లలోనే తాము చేసిన తప్పు చైనీయులకు తెలిసొచ్చింది. పిట్టలు బతికుంటేనే పంటకు రక్ష అని గుర్తించిన చైనీయులు వాటిని సంరక్షించడం మొదలుపెట్టారు. జీవవైవిధ్యానికి పిచ్చుకలు ఎంతలా దోహదపడతాయో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ.


ఖండాలు దాటి వచ్చే చిన్ని పిచ్చుక..
చూడటానికి పిచ్చుకల్లా ఉండే ఈ పక్షులు ఏటా శీతాకాలంలో పశ్చిమ దేశాల నుంచి నల్లమల అభయారణ్యానికి లక్షల సంఖ్యలో వలస వస్తుంటాయి. వీటితోపాటు వలస వచ్చే హారియర్స్ అనే గద్ద జాతి పక్షులు గ్రేటర్‍ షార్ట్ టోడ్‍ లార్క్లను వేటాడి తింటాయి.
పిచ్చుకలు అంతరించిపోతుండటానికి కారణాలు అనేకం. భూతాపోన్నతి నుంచి రక్షణ కోసం మానవ జాతి వినియోగిస్తున్న అన్‍లెడెడ్‍ పెట్రోల్‍ అందులో ఒకటి. ఈ పెట్రోల్‍ను మండించి నప్పుడు విడుదలయ్యే మిథైల్‍ నైట్రేట్‍.. చాలారకాల క్రిమికీటకాలకు విషంలా మారుతోందని, ఫలితంగా పిచ్చుకలకు ఆహారం దొరకకుండా పోతోందని ఆర్నితాలజిస్టులు (పక్షి శాస్త్రవేత్తలు) తమ పరిశోధనల ద్వారా గుర్తించారు.
పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ శైలి మారడంతో పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశాలు తగ్గాయి. పెరటి తోటలు అంతంతమాత్రంగా ఉండటం, వాహనాల రణగొణధ్వనులు, సెల్‍ టవర్ల రేడియేషన్‍, పంటల సాగులో రసాయనాలు అధికంగా వినియోగించడం తదితర కారణాలు పిచ్చుకల జీవనానికి ముప్పుగా పరిణమించాయి.


ప్రపంచంలో ఏటా పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుండటంతో ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇంటర్నేషనల్‍ యూనియన్‍ ఫర్‍ కన్సర్వేషన్‍ ఆఫ్‍ నేచర్‍ తయారు చేసిన రెడ్‍లిస్ట్ జాబితాలోకి పిచ్చుకలను చేర్చింది. మన దేశంలోనూ పిచ్చుకల్ని సంరక్షిం చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

  • పిచ్చుకల జీవిత కాలం నాలుగు నుంచి ఐదేళ్లు.
  • బరువు 35 నుంచి 40 గ్రాములు.
  • ఎగిరే వేగం గంటకు 38.5 నుంచి 50 కి.మీ.
  • ఐదు నుంచి ఎనిమిది గుడ్లు పెడతాయి. 10 నుంచి 15 రోజుల్లో పొదుగుతాయి.
  • ప్రత్యర్థుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు నీళ్లలో ఈదగలదు.
  • ఆడ పిచ్చుకల్ని ఆకర్షించేందుకు మగ పిచ్చుకలే గూళ్లు కడతాయి.
  • సత్యప్రసన్న
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *