ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది. ప్రక•తి సహజ ఆవసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ, జల సేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తుచేసుకుంటారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు 1950, మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించబడింది. ఆ సంస్థ ఏర్పడిన రోజును ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవంగా నిర్ణయించబడింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరుపబడుతుంది.
కార్యక్రమాలు
వాతావరణ శాఖ నిపుణుల ఆధ్వర్యంలో ప్రజలకోసం అవగాహన సమావేశాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలు జరుగుతాయి.
వాతావరణ పరిశోధన చేసిన వాళ్ళకు ఈ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వాతావరణ సంస్థ బహుమతి, ప్రొఫెసర్ డాక్టర్ విల్హో వైసెల్ అవార్డు, ది నార్బర్ట్ గెర్బియర్-మమ్ అంతర్జాతీయ అవార్డులు అందజేయబడుతాయి.
ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి చాలా దేశాలు తపాలా బిళ్ళలను, ప్రత్యేక తపాలా స్టాంపు గుర్తులను విడుదల చేస్తాయి.
వాతావరణ మార్పులతో… అల్లకల్లోలం
వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. అయితే ఠారెత్తించే ఎండలు లేదంటే కుండపోత వర్షాలతో కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాలు సతమతమవుతున్నాయి. 2023 సంవత్సరంలో అనేక విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి. అందులో అత్యధిక భాగం వరదలు తుపాన్లే ఉన్నాయి. కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిలలాడాయి.
ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‍లో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విచ్ఛిన్నమవుతాయని డబ్ల్యూఎంఒ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోనే ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 1961-1990 మధ్య సగటు వేడి కంటే 1991-2023 మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపు అయింది. వరదలు, తుపాన్లతో పాటుగా పశ్చిమాసియా దేశాలు ఇసుక తుపాన్లతో విలవిలలాడాయి.
‘‘2023లో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది. సాధారణం కంటే అధిక వేడి, పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది. దీని వల్ల నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. కేవలం కరువు కారణంగా చైనాలో ఒక్క ఏడాది 706 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వచ్చింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్, భారత్‍లు వరదలు, తుపాన్లతో అల్లాడిపోయాయి’’ అని డబ్ల్యూఎంఒ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ పెట్రి టాలస్ వెల్లడించారు. ఈ అతివ•ష్టి, అనావ•ష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం, ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్‍ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.
నివేదిక ఏం చెప్పిందంటే..!
ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగి పోతున్నాయి. 2023 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల కెక్కింది. 1991-2020 సగటు కంటే ఎక్కువగా 0.72 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- కరువుతో ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోయాయి. నీటి వనరులు తరిగిపోయాయి. ఒక్క చైనాలో కరువు కారణంగా 706 కోట్ల అమెరికా డాలర్ల నష్టం వచ్చింది.
- భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్‍ను అతలాకుతలం చేశాయి. కేవలం మూడు వారాల్లో ఏడాది మొత్తంగా కురవాల్సిన వానలో 60% కురిసింది. పాక్ జనాభాలో 14% మందిపై వరదలు ప్రభావం చూపించాయి.
- ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 40 ఏళ్లలో హిమానీనదాలు పరిమాణం భారీగా తగ్గిపోయింది. గత కొంతకాలంగా మరింత వేగంగా క్షీణిస్తోంది. 2023లో అత్యధిక
- ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా చాలా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం మొదలైంది. తూర్పు తియెన్ షాన్‍లో ఉరుమ్‍కీ గ్లేసియర్ ఉపరితలం నుంచి 1.25 మీటర్ల మేర క్షీణించింది.
- ఆసియా ఖండంలో సముద్ర ఉపరితలాలు వేడెక్కి పోతున్నాయి. 1982 నుంచి సముద్రాలు వేడెక్కడం మొదలైంది. వాయవ్య అరేబియన్ సముద్రం, ఫిలిప్పైన్స్ సముద్రం, తూర్పు జపాన్‍లో సముద్రం మొదలైనవి ప్రపంచంలో సముద్రాలు వేడెక్కే సగటు రేటు కంటే మూడు రెట్లు అధికంగా వేడెక్కుతున్నాయి. గత దశాబ్దంలో 0.5డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడిమి నమోదైంది.
ఈ ఏడాది ఇంతే
ఆసియాలో ఈ ఏడాది కూడా వివిధ దేశాలను విపత్తులు వణికిస్తున్నాయి. ఇండోనేసియా సమద్రాల్లో కొండచరియలు విరిగిపడి 15 వేల ఇళ్లు ధ్వంసమైతే లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చైనాను గత ఏడాది కరువు కాటేస్తే, ఈ ఏడాది వరదలతో అతలాకుతలమవుతోంది. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‍లో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణాలను కూడా వణికించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక పాకిస్తాన్‍లోనూ వరదలకి 150 మందికి పైగా మరణించారు. ఇలా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలకు సవాల్ విసురుతోంది.
- ఎసికె. శ్రీహరి
ఎ : 9849930145