‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అన్నారు గురజాడ.
రాచరికాల నుండి నేటి ఆధునిక ప్రజాస్వామ్య సమాజం వరకు స్త్రీ అనేక అసమానతలకు, వివక్షలకు, స్వేచ్ఛా రాహిత్యానికి గురవుతూనే ఉంది. విద్యకీ, భావప్రకటనా స్వేచ్ఛకీ, నిర్ణయాధికార హక్కులకూ, తన శరీరంపై తన హక్కులకు, పునరుత్పత్తి హక్కులకు, ఉపాధి అవకాశాలకు, ఆర్థిక, రాజకీయ హక్కులకు మొత్తంగా సామాజిక జీవితానికి దూరమవుతూనే ఉంది.
1975లో అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరిగిన తర్వాత మన దేశ స్త్రీలలోను అస్తిత్వ చైతన్యం పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ సాహిత్యం మనదేశ స్త్రీలను ప్రభావితం చేసాయి. ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచ మహిళలతో కలసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరుపుకుంటున్నారు. సామూహిక ప్రదర్శనలతో పాటు పలు అంశాలపై సభలు, సెమినార్లు నిర్హహించుకుంటున్నారు. సంఘటిత శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని సాధించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్త్రీకి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కలసికట్టుగా కృషి చేస్తున్నారు. భారత రాజ్యాంగం అందించిన అవకాశాలతో విద్య, శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో పురోగమిస్తున్నారు. రాజకీయ రంగంలో పంచాయితీ నుండి పార్లమెంటు దాకా ప్రయాణించారు. స్త్రీలకు వచ్చిన ఈ రాజకీయ అవకాశాలు పనిపద్ధతుల్లో స్వయం నిర్ణయాలు తీసుకునే దశ వరకూ చేరలేదు.
స్త్రీలు తమశక్తి సామర్థ్యాలను వివిధ రంగాలలో పూర్తిస్థాయిలో వినియోగించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరం. చట్ట సభలలో స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడే వారికవసరమైన విధానాల రూపకల్పనలో భాగస్వాములు కాగలుగుతారు. స్త్రీలలో వుండే సహజ భావుకతవల్ల విధానాల రూపకల్పనలో నైతికతకు, సున్నితత్వానికి అవకాశం ఏర్పడుతుంది. మహిళలతో పాటు, ట్రాన్స్ ఉమెన్‍కి అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలి. మహిళలకు ఉపాధి భద్రతతోపాటు, రక్షణ కల్పించి వారిలో ఆత్మస్థైర్యం పెరిగేందుకు కృషి చేయాలి.
ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించడం ప్రయోజనకరం. చిన్న చిన్న పనిచేసే మహిళలకు, చిరు వ్యాపారులకు, సేవారంగ స్త్రీలకు ఇదొక ఉపశమనం. ఈ స్వతంత్ర ప్రయాణం ఆత్మధైర్యాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. నూతన పరిచయాల మెరుగుదలవల్ల విషయ సంపద పరస్పర మారకమవుతుంది. ఆందోళనలేని స్థితి
ఉత్పాదక క్రియలో నైపుణ్యంతో కూడిన నాణ్యమైన వస్తూత్పత్తికి కారణమవుతోంది.
రాజ్యాంగం స్త్రీ పురుషులిరువురికీ యిచ్చిన సమాన అవకాశాలు, హక్కుల పట్ల స్ఫూర్తిని పెంచాలి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భంలో ఇటీవలే ముగిసిన విరోచిత మహిళలు సమ్మక్క సారక్కల జాతరను స్మరించకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారక్క జాతర. కుంభమేళా తర్వాత అతి పెద్ద జన సమ్మేళనం దాదాపు పదిమిలియన్ల మంది ప్రజలు తరలివస్తారు. ఈ మేడారం జాతర తెలంగాణా రాష్ట్రానికి మహోన్నత సాంస్క•తిక ప్రతీక. ఇది సాంస్క•తిక వారసత్వ సంపద. యునెస్కో (•చీజు•••) గుర్తింపుకి అన్ని అర్హతలూ ఉన్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యునెస్కో గుర్తింపు సాధన కోసం తగు ప్రయత్నాలు చేయాలని కోరుతూ…
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్