నానమ్మ చెప్పిన కథ

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్‍ మణికొండ


అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు రామనాధపురం. ఆ ఊరిలో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు. ఆ కొడుకు పేరు రాము. రాము బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్నాడు. కొంతకాలం తర్వాత రాముకి తల్లిదండ్రులు పెళ్లి చేసారు. రాముకి ఇద్దరు పిల్లలు. వారి పేర్లు ప్రతిభ, శ్రీధర్‍. ప్రతిభ 10వ తరగతి, శ్రీధర్‍ 9వ తరగతి చదువు తున్నారు. ప్రతిభ వాళ్ళ నాన్నమ్మ చిన్నప్పటి నుండి కథలు చెప్తూ పెంచింది. నాన్నమ్మ చెప్పే కథలు చాలా నీతివంతంగా ఉంటాయి. అలాగే విలువలతో కూడినవిగా ఉంటాయి.
ఒక రోజు ప్రతిభ వాళ్ళ నాన్నమ్మ పర్యావరణం గురించి కథ చెప్తుంది. అప్పుడు ప్రతిభకు ఒక అనుమానం వచ్చింది. ‘‘నాన్నమ్మ మీ కాలంలో ఉండే పర్యావరణానికి, ఇప్పటి పర్యావరణానికి ఏమైనా తేడా ఉందా?’’ అప్పుడు వాళ్ళ నాన్నమ్మ ఇప్పటి పర్యావరణానికి అప్పటి పర్యావరణానికి చాలా తేడా ఉందని చెప్తుంది.


‘‘ఎలాగా నాన్నమ్మా’’ అని ప్రతిభ అడిగింది. ‘‘మా కాలంలో చాలా అడవులు, చాలా పక్షులు, జంతువులు, చెరువులు, బావులు, మంచి గాలి ఉండేవి. కాని ఇప్పటి కాలంలో అవన్నీ తగ్గిపోయాయి. నానమ్మ ఇప్పుడెందుకు అవన్నీ తక్కువగా ఉన్నాయని’’ అడిగింది ప్రతిభ.


‘‘ఈనాటి కాలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అంతస్థులు, భవనాలు ఉన్నాయి. ఆనాటి కాలంలో పూరి గుడిసెలు, మట్టి ఇళ్లు ఉండేవి. ఇప్పుడు చెట్లను నరికి వేసి భవనాలు కడుతున్నారు. అటవీ సంపద కోసం, ఖనిజాల కోసం అడవులను నరి కేస్తున్నారు. దీనివల్ల అడవుల్లో నివసించే జంతువులు కూడా కనుమరుగవుతున్నాయి. ఆనాటి కాలం చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ అడవులలో ఆ ఉండే చెట్ల నుంచి వచ్చే గాలి చాలా స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు గాలి కాలుష్యం అవ్వడం వల్ల, ఆ గాలిని పీల్చుకోవడంతో చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు’’ అని చెప్పింది నాన్నమ్మ.
‘‘నాన్నమ్మ మన ఊరి చివర్లో ఉన్న చెరువులో నీరెందుకు చాలా మురికిగా ఉన్నాయి’’ అని అడిగాడు శ్రీధర్‍. ‘‘ఈ కాలంలో ప్లాస్టిక్‍ వినియోగం చాలా ఎక్కువైపోయింది. ‘ప్లాస్టిక్‍ వినియోగం మంచిది కాదు’ అని చెప్పిన కూడా ఎవ్వరూ దాన్ని వినియోగించడం ఆపలేదు. వినియోగించిన ప్లాస్టిక్‍ కవర్లు, వ్యర్థ పదార్థాలు మొత్తం ఒక కుప్పలాగా వేస్తారు. వర్షం వచ్చినప్పుడు లేదా బాగా గాలి వీచినప్పుడు ఆ వ్యర్థ పదార్థాలు మన ఊరి చివర వున్న చెరువులో కలిసి పోతాయి. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కలుస్తాయి. అప్పుడు నీరు కాలుష్యం అయిపోతుంది. నీటి కాలుష్యం వ్యర్థ పదార్థాల ద్వారా జరుగుతుంది. నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పింది నాన్నమ్మ.


ఇలా చెప్తుండగా శ్రీధర్‍ వాళ్ళ నాన్న వచ్చి వీటిపై ఇంకా అవగాహనను పెంచాడు. ప్రతిభ, శ్రీధర్‍లు చాలా సంతోషించారు. ‘ఎలా ఉంది? కథ?’ అని నాన్నమ్మ అడిగింది. ‘‘నాన్నమ్మ కథ చాలా బావుంది’’ అని ప్రతిభ, శ్రీధర్‍లు సమాధాన మిచ్చారు. కథ చెప్పిన తర్వాత అందరూ వెళ్లి నిద్రపోయారు.

  • కొట్ల శిరీష, ఫోన్‍ : 8790325502

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *