మంచి పుస్తకం @ 20

పిల్లలు పరిపూర్ణులు. వాళ్ల భవిష్యత్తును వాళ్లు ఎంచుకోవాలి, అందుకు బాధ్యత కూడా వాళ్లే వహించాలి అన్న నమ్మకంతో మంచి పుస్తకం పని చేస్తుంది. అనుకరణ, ఇతరులను ఆరాధించటం ద్వారా పిల్లలు నేర్చుకుంటారన్నది నిజమే. అయితే, ఎవరితో (దేనితో) ప్రభావితం కావాలనేది ఎంచుకునేది పిల్లలే. కాబట్టి, వారికి నీతి కథలు చెప్పాల్సిన పనిలేదు, అందువల్ల ఉపయోగం కూడా లేదు. రోడ్లు మీద పాదాచారులతో సహా ఎవరూ నియమాలు పాటించరు. పుస్తకాలలో ట్రాఫిక్‍ రూల్స్ గురించి ఎంత చెప్పినా ఏం లాభం?


అందుకే, పిల్లలలో పుస్తకాల పట్ల ప్రేమ, తెలుగులో పఠనా సామర్థ్యం పెంచటం ప్రధాన ఉద్దేశంగా మంచి పుస్తకం సంస్థ పని చేస్తోంది. పిల్లలలో ఆసక్తి కలిగించటం వరకే మన పని. పుస్తకాలు చదవటం వల్ల పిల్లల్లో మనో వికాసం, ఎదుగుదల బాగుండటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాటిని మళ్లీ, మళ్లీ ఉద్ఘాటించనవసరం లేదు, ఉదాహరణలు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. పుస్తకాలను అందిస్తూ వెళ్లటమే మన పని అని త్రికరణ శుద్ధిగా నమ్మి, నమ్మిన భావాలను ఆచరణలో రాజీలేకుండా నడుస్తూ అప్పుడే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది మంచి పుస్తకం. 20 ఏళ్లుగా ఈ రంగంలో పని చేస్తూనే ఉన్నా మంచి పుస్తకం గురించి నలుగురికీ గట్టిగా తెలియదు. అందుకే ఈ సందర్భంగా 2024 ఏప్రిల్‍ 27న తమ పని గురించి, ప్రయాణం గురించి, తమతో నడిచిన వాళ్ల గురించి, సహాయ సహకారాలు అందించిన వాళ్ల గురించి తెలియ చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తార్నాకాలోని సేంట్‍ ఆన్స్ జనరలేట్‍లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మంచి పుస్తకం ప్రచురణలు అమ్మకానికి కూడా ఉంటాయి. (ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం పి. భాగ్యలక్ష్మిని 9490746614లో సంప్రదించ వచ్చు.)


పిల్లలు అభం శుభం తెలియని వాళ్లు. వాళ్ల మనసుల నిండా ఎన్నో ప్రశ్నలు, తెలుసుకోవాలనే తపన, వెల్లువెత్తే స•జన ఉంటాయి. కించిత్తు స్వార్థం ఉన్నా నిజాయితీ నిండుగా ఉంటుంది. చెప్పటమే తప్ప ఆచరించని పెద్దలు చిన్నప్పటి నుంచే పిల్లలను తీర్చి దిద్దాలని అనుకుంటారు. పిల్లల్లో ప్రోత్సహించాలి అనుకుంటున్న స•జనాత్మకతకు పెద్దవాళ్లు అడ్డుపడకుండా ఉంటే చాలు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కానీ ఆ బాల్యాన్ని గతానికి, పెద్దల మౌఢ్యానికి బలి చేస్తున్నారు. జీవితమే ఒక పాఠశాల అనే వాళ్లు నేర్చుకోవటం ఎప్పుడో మానేశారు. అందుకే చిన్నప్పుడే పిల్లల బుర్రలలో అంతా కూరెయ్యాలని పెద్దవాళ్లు అనుకుంటారు. దీనివల్ల హిపోక్రసీ, కపటత్వం తప్పించి పిల్లలు వేరేమీ నేర్చుకోరు. అలాగే, స•జనాత్మకతను ప్రదర్శించే పిల్లలను ప్రేమించినట్లే సాధారణ పిల్లలను కూడా ప్రేమించాలి. ఇవీ మంచి పుస్తకానికి ఒక రకంగా తాత్విక పునాదులు.
ఒకప్పుడు మధ్య తరగతి ప్రజలలో చదివే సంస్క•తి ఉండేది. ఎన్నో వార, మాస పత్రికలు వచ్చేవి. గ్రంథాలయాలు ఉండేవి, అద్దెకు పుస్తకాలు దొరికేవి. చందమామ వంటి పత్రికలు పిల్లలనే కాక పెద్దవాళ్లను కూడా అలరించేవి. వీటన్నిటి మధ్య చదవటం ఎలా నేర్చుకున్నారో తెలియకుండా నేర్చేసుకున్నారు. పదవ తరగతికి వచ్చేసరికి ధారాళంగా చదవటం వచ్చి పల్ప్ నవలల నుంచి ప్రగతిశీల పుస్తకాల వరకు చదివేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెలివిజన్‍, సెల్‍ ఫోన్‍, కంప్యూటర్‍లు రావటంతో చదివే సంస్క•తి కొన్ని వర్గాలలో తగ్గింది. దీనికి తోడు ఇంగ్లీషు భాషకి ప్రాధాన్యత, ఆ మాధ్యమంలో బోధన. వెరసి తెలుగు చదవగలగటం సమస్యగా మారింది. ఈ తరం పిల్లలకు చందమామ తరహా కథలు నచ్చకపోవచ్చు.


ఈ నేపథ్యంలో మంచి పుస్తకం తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుంది. తెలుగు నేర్చుకోవాలి, తమ పిల్లలకి తెలుగు నేర్పాలి అనుకుంటున్న వాళ్లకి సహాయపడటానికి రకరకాల పుస్తకాలు తీసుకుని వస్తోంది. పిల్లలకు పుస్తకం పట్ల ప్రేమ, తెలుగులో చదివే ఆసక్తి కలిగించాలి అనే సూత్రం చుట్టూ మంచి పుస్తకం క•షి చేస్తూ ఉంది. ఈనాటి పిల్లలకు తగిన కథలు, అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన అవసరం ఉందని గమనించారు. ఆ వైపు పని చేస్తూ బాల సాహిత్యంలో కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. బాలల్లో వచ్చిన మార్పులు అర్థం చేసుకుని ముందుకు సాగాలి అన్నది ఈ 20 ఏళ్ల అనుభవంలో తెలుసుకున్నామని మంచి పుస్తకం నిర్వాహకులు అంటారు.


మంచి పుస్తకం ప్రయాణం ఒక విధంగా చెప్పాలంటే సుదీర్ఘమయినది. అడుగులో అడుగేసుకుంటూ, హడావిడి, ఆర్భాటాలు లేకుండా స్థిరంగా లక్ష్యం దిశగా సాగుతూ వచ్చింది. ఈ రోజు మంచి పుస్తకం ఒక ట్రస్ట్గా, పుస్తకాలు అనువదిస్తూ, ప్రచురిస్తూ, ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది.


2002లో హైదరాబాద్‍ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలతో స్నేహం పేరుతో పాల్గొనటంతో మొదటి అడుగు పడింది. అప్పట్లో అందుబాటులో ఉన్న పలు సంస్థలు ప్రచురించిన బాల సాహిత్యం అంతా ప్రదర్శనకు పెట్టారు. తల్లిదండ్రులు, పిల్లలతో మాట్లాడటం ప్రధాన పనిగా నిర్వాహకులు, వాలంటీర్లు ఎంతో క•షి చేశారు. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 600కి పైగా ఉండిన ఆ పుస్తకాల రెండు సెట్లను ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ వేద కుమార్‍ కొనుగోలు చేయటంతో వాటి ఆధారంగా పుస్తకాల జాబితాను రఘుబాబు తయారు చేశారు. వయస్సు, విషయం వారీగానే కాకుండా ప్రచురణకర్తల వారీగా కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. పుస్తకాలను పిల్లలకు చేరవేయటంలో ఇలాంటి జాబితా, కేటలాగుల సంప్రదాయాన్ని మంచి పుస్తకం ఇప్పటికీ కొనసాగిస్తోంది.


మంచి పుస్తకం 2004 ఏప్రిల్‍లో పబ్లిక్‍ ట్రస్ట్గా నమోదయింది. దీని మూలాలు మాత్రం 1989లో పురుడు పోసుకుని పదేళ్ల పాటు పిల్లల సాహిత్యం, పుస్తకాలు కోసం తపించి, పరితపించి 40 పుస్తకాల దాకా ప్రచురించిన బాల సాహితి బుక్‍ ట్రస్ట్లో ఉన్నాయి. పిల్లల పుస్తకాల కోసం ఏర్పడిన పేగు బంధం అని చెప్పవచ్చు కూడా.
వివిధ పుస్తక ప్రదర్శనలలో పాల్గొంటూ, సొంతంగా, ఇతరులతో కలిసి పుస్తకాల ప్రచురణలు పెంచుకుంటూ కేరాఫ్‍ వాసన్‍గా ఉన్న చిరునామా 2007లో మారి స్వతంత్ర కార్యాలయంలో పని చేస్తూ ఉంది మంచి పుస్తకం.


మంచి పుస్తకం చేసిన మరో మంచి ప్రయత్నం ఏమిటంటే… గిరి గీసుకుని కూర్చోకుండా వారి లక్ష్యాలకు భంగం కలిగించని రీతిలో పని చేసే సంస్థలతో చేయి చేయి కలిపింది. ఉదాహరణకు మొదట్లో జన విజ్ఞాన వేదిక (ఇప్పుడు విజ్ఞాన ప్రచురణలు) ద్వారా పలు అంశాలపై వివిధ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు. ఇన్నేళ్లుగా ఈ అనుబంధం కొనసాగుతూ ఉంది. వందకి పైగా పుస్తకాలు ఈ రెండు సంస్థలూ కలిసి ప్రచురించాయంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ప్రచురణలు ద్వారా ఎక్కువ మందికి చేరువ కావాలనే మౌలిక ఆశయాన్ని మంచి పుస్తకం సాధించింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలో పాలపిట్ట ప్రచురణలు, వికాస విద్యా వనం, జాబిల్లి ట్రస్ట్, వాహిని బుక్‍ ట్రస్ట్, శాంతివనం, అలరు, దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‍ వంటి వాటితో కలిసి ఉమ్మడిగా ప్రచురణలు తీసుకు వచ్చారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అంది పుచ్చుకుంటూ పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం పెంచేందుకు చేసిన ప్రయత్నం చిన్నదేమీ కాదు. చిల్డ్రన్స్ బుక్‍ ట్రస్ట్, అమర చిత్ర కథ వంటి సంస్థలతో సోల్‍ డిస్ట్రిబ్యుషన్‍ ప్రాతిపదికన తెలుగు పుస్తకాలు (20 దాకా) తీసుకుని రావటం అభినందించ దగ్గ మరొక విషయం.
పుస్తకాలను పిల్లలకు చేర్చటంలో అనేక ఫౌండేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్‍.ఆర్‍.ఐ. సంస్థలు, వ్యక్తుల పాత్ర ఎంతైనా ఉంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవలసింది ఎం. వి. ఫౌండేషన్‍. నల్గొండ జిల్లాలో మొదటి దశలో 96 పాఠశాలలు, రెండవ దశలో 212 పాఠశాలల్లో ఆరేళ్ల పాటు సాగిన క్వాలిటీ ఇంప్రూవ్‍మెంట్‍ ప్రాజెక్టులో గ్రంథాలయాల భాగస్వామిగా పని చెయ్యటానికి మంచి పుస్తకం సంస్థకి అవకాశం దొరికింది. ఇది దీనికి బలమైన పునాదిగా మారింది.


డా. రెడ్డీస్‍ ఫౌండేషన్‍, బ్రెడ్‍ సొసైటీ, వందేమాతరం పౌండేషన్‍, ఆర్‍.డి.ఎఫ్‍., డి.ఎస్‍. ఫౌండేషన్‍, సాధన, మహిత, యునిసెఫ్‍, పాఠశాల గ్రంథాలయం, కీట్స్, రూం టు రీడ్‍, శిక్షణా ఫౌండేషన్‍, పిజిఎన్‍ఎఫ్‍, లర్న్ ఎండ్‍ హెల్ప్, బాల చెలిమి గ్రంథాలయాలు, పుస్తక మిత్ర – రీడ్‍ టు లీడ్‍, భారత్‍ దేఖో, మంత్ర ఫర్‍ ఛేంజ్‍- ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు మంచి పుస్తకం ప్రచురించిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల వద్దకు చేర్చాయి.
మంచి పుస్తకం… బాల సాహిత్యం గురించి చెప్పుకుంటూ సోవియట్‍ సాహిత్య ప్రభావం మాట్లాడక పోతే పాఠకులు అన్యధా భావించే అవకాశం ఉంది. ఇప్పుడు రాస్తున్న అనేకమంది కవులు, రచయితలపై సోవియట్‍ సాహిత్య ప్రభావం చాలా ఉంది. మనకు రష్యన్‍ రచయితలు తెలిసినంత బాగా ఇతర ప్రపంచ దేశాల రచయితల గురించి తెలియదు. సోవియట్‍ పుస్తకాల వల్ల అసంఖ్యాకమైన తెలుగు పాఠకులకు టాల్‍స్టాయ్‍, గోర్కీ వంటి మహా రచయితలు చిన్నతనంలోనే పరిచయమయ్యారు. ఆ రచయితలు పిల్లల కోసం రాసిన కథలను సోవియట్‍ ప్రచురణ సంస్థ ప్రపంచ భాషలలోకి అనువదించి, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో తెచ్చింది.


మొదట్లో అనువాదాలపై ప్రధానంగా ఆధారపడిన మంచి పుస్తకం తెలుగులో మూల రచనలు తీసుకు రావటానికి క•షి మొదలు పెట్టింది. ఈ క•షిలో 2017లో తానా సంస్థతో భాగస్వామ్యం అందుకోవటం ముఖ్యమయిన మలుపుగా చెప్పుకోవాలి. ఇందులో భాగంగా పది సంవత్సరాలు పైబడిన పిల్లలకు సాహసం, సైన్స్ ఫిక్షన్‍లలో నవలలు, పది సంవత్సరాల లోపు పిల్లల కోసం బొమ్మల కథ పుస్తకాలు ప్రచురించటానికి పూనుకుంది. ఈ ప్రయత్నానికి మంచి గుర్తింపు లభించింది. ఈ పుస్తకాలు పాఠకుల మన్ననలు పొందాయి. మొత్తం 4 దఫాలలో 28 బొమ్మల కథ పుస్తకాలు, 21 నవలలు ప్రచురితం అయ్యాయి.


ఒకటా, రెండా… ఇలా ఎన్నో, ఎన్నెన్నో చెప్పుకోదగిన ప్రయత్నాలు ఈ 20 ఏళ్లుగా చేస్తూ వచ్చారు, వస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తారు. తక్కువ ఖర్చుతో పుస్తకాలతో స్నేహం అన్న పేరుతో గ్రేడెడ్‍ పఠన సామాగ్రి అందించే ప్రయత్నం ప్రారంభించి ఇప్పటివరకు ఐదు స్థాయిలలో, 85 పుస్తకాలతో 1760 పేజీల గ్రేడెడ్‍ రీడింగ్‍ మెటీరియల్‍ అందించిన మంచి పుస్తకం గురించి ఏమనాలి మనం? జేజేలు పలకాల్సిందే.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సాధారణంగా నీతి కథలు, వ్యక్తిత్వ వికాసం, వివిధ రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలు ఎక్కువగా కోరుకుంటారు. వీటితోపాటు జీవన నైపుణ్యాలు, స్ఫూర్తిదాయక పుస్తకాలు కావాలని అడుగుతూ ఉంటారు. చదవటమే బాగా రాని పరిస్థితులలో పిల్లల పఠన స్థాయికి మించిన పుస్తకాలను ఎక్కువగా గ్రంథాలయాలకు కొంటున్నారు. మంచి పుస్తకం సంస్థకు ఒక మార్గం ఉంది. కష్టం అయినా ఆ తోవలోనే నడుద్దాం అనుకున్నారు. అందువల్ల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులకు అర్థమయ్యేలా చెప్పి వారిలో కొత్త ఆలోచనలకు ప్రేరణ కలిగించారు. పిల్లలు చదవటానికి ఇష్టపడే బొమ్మల కథలు, గ్రేడెడ్‍ మెటీరియల్‍ కొన్న తల్లిదండ్రులు, టీచర్లు వాటి వల్ల తమ పిల్లలు ఎలా లాభపడ్డారో తెలియ చేస్తుంటే తమ క•షికి తగిన ఫలితం లభించిందని మంచి పుస్తకం నిర్వాహకులు సంతోష పడుతుంటారు. ఈ ప్రయత్నంలో వందేమాతరం మాధవరెడ్డి ఎంతో సహకరించారు. ఈ రకంగా మంచి పుస్తకం ప్రచురించే విభిన్నమయిన పుస్తకాలుకు ఉన్న ప్రత్యేకతలను ఆ రంగంలో
ఉన్న అందరూ గుర్తించేలా చేయగలిగారు. వారికంటూ ఒక బ్రాండ్‍ ఇమేజ్‍ని స•ష్టించు కోవటం ద్వారానే 20 ఏళ్ల కాలంలో దాదాపు 500 పుస్తకాలు తేగలిగారు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు.


బాల సాహిత్యానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. కాకుంటే మనం ఎంత మెరుగైన సాహిత్యాన్ని, బొమ్మల పుస్తకాల్ని వారికి అందిస్తున్నాం అన్నది ముఖ్యం. ఈ విషయంలో ‘మంచి పుస్తకం’ లాంటి ప్రచురణ సంస్థలు చాలా ముందడుగు వేశాయి అని చెప్పటంలో సంశయం అక్కర్లేదు. వారి ప్రచురణలో ఇప్పటికీ సుతయేవ్‍ రాసిన పడవ ప్రయాణం, బాల సాహితీ ప్రచురించిన టాల్‍స్టాయ్‍ బాలల కథలు నిరంతరం ముద్రణకు వస్తూ పిల్లలను అలరిస్తూనే ఉన్నాయి.


తన ఇరవై ఏళ్ల ప్రయాణంలో మంచి పుస్తకం సంస్థకి అనేక మంది అనువాదకులు, రచయితలు, చిత్రకారులు సహకరించారు. మరో వైపు కొంతమంది రచయితలు, చిత్ర కారులను మంచి పుస్తకం పరిచయం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలున్నాయి… చదవడమే తగ్గింది. అందులోనూ తెలుగు పుస్తకాలు మరీనూ… పిల్లల పుస్తకాలు… తెలుగులో అయితే ఇంకా చెప్పవలిసింది ఏమీ లేదు అంటున్న సమయంలో కూడా గుండె మీద చెయ్యి వేసుకుని మా పుస్తకాల ద్వారా పిల్లలు తెలుగు నేర్చుకోవటం, వాళ్ళలో పుస్తకాల పట్ల ప్రేమ కలగటం మాకు సంత•ప్తిని ఇచ్చే విషయం, అది ఎంత తక్కువ సంఖ్య అయినప్పటికీ మేం సగర్వంగా, సంతోషంగా ఉన్నాం, ఈ తోవలోనే ముందుకు వెళ్తాం అంటున్న మంచి పుస్తకం సంస్థకు శుభాకాంక్షలు.

  • వలేటి గోపీచంద్‍
    ఎ : 9441276770

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *