ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లా – గ్రామ నామాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లాకు ప్రత్యేక స్థానమున్నది. ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, త్రికూటులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, బోధన్‍ చాళుక్యులు, కళ్యాణీ చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, కుతుబ్‍ షాహీలు, బరిద్‍ షాహీలు, మరెడ్డి రాజులు, మొఘల్‍ చక్రవర్తులు, మహారాష్ట్రులు, అసఫ్‍ జాహీలు పరిపాలించారు. ఈ జిల్లాకు దక్షిణాన మరియు పడమరన కొంత భాగం ఉమ్మడి మెదక్‍, బీదర్‍, నాందేడ్‍ జిల్లాలు ఉండగా, తూర్పున ఉమ్మడి కరీంనగర్‍ జిల్లా, ఉత్తరాన ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మూడు రెవెన్యూ డివిజన్లు, 36 మండలాలు, 912 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిజామాబాద్‍ ప్రాంత నామాన్ని పూర్వం ఇందూరు, ఇంద్రపురి, ఇందూరుసీమ అను పేర్లతో వ్యవహరించేవారు. క్రీ శ.8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు ఇంద్ర వల్లభుడి పరిపాలనా ప్రభావం ఒక కారణం కాగా, ఇతర చారిత్రక కారణాలు కూడా ఉన్నాయని చరిత్రకారుల అభిప్రాయం. ప్రస్తుతం నిజామాబాద్‍ పేరుతో ఉన్న ఈ ప్రాంతం అశ్మక రాష్ట్రం, నాగభూమి, మంజీర భూమి, సపాదలక్ష భూమి, దక్షిణ కోసల, శక్రాభిదానపురం, పోదన నాడు, కాసలనాడు, ఇందూరు అనే పేర్లతో పిలువబడినదట. జైన యుగం నాటికి ఇందూరు ప్రాంతం పుళక ప్రాంతంగా పిలువబడింది. విష్ణుకుండిన రాజైన ఇంద్ర దత్తుడు క్రీ.శ. 388 ప్రాంతంలో తన పేరుతో ఇంద్రపురిని నిర్మించాడని ఒక కథనం. క్రీ.శ. 500 ప్రాంతంలో మొదటి ఇంద్రవర్మ ఇంద్రపురిని నిర్మించాడని కొందరు చరిత్రకారుల భావన. క్రీ.శ.1905లో జిల్లాల పునర్విభజన జరిగి కొత్తగా జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు ఇందూరు’ను నిజామాబాద్‍ జిల్లాగా మార్చడం జరిగింది. (ఆలోకనం – డా. సాగి కమలాకర శర్మ పుట.115,116) తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఈ జిల్లాను నిజామాబాద్‍, కామారెడ్డి అను కొత్త జిల్లాలుగా విభజించారు. జిల్లాలోని కొన్ని గ్రామ నామాలను చారిత్రకంగా ఆధార గ్రంథాలతో చర్చించడం ఈ వ్యాసం ఉద్దేశం.


కందకుర్తి:- రెంజల్‍ మండలంలోని గ్రామమిది. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే తొలి ప్రదేశమిది. కందకుర్తి అనే పేరులో కందకూడతి రెండు పదాలు ఉన్నాయి. కంద అనే పదము స్కంద నుండి వచ్చినది. గ్రామము ఏర్పడక ముందు స్కందుడి (కార్తికేయుడు) ఆలయం వెలసి యుండుట వలన స్కంద కాల క్రమంలో కందగా ఏర్పడినది. (పుష్కర విశిష్టత. డా. సంగన భట్ల నరసయ్య. పుట.40,41)కందకుర్తి అనే వంశీయుల పేరు మీదుగా ఈ గ్రామ నామం ఏర్పడి ఉండవచ్చునని మరో ఐతిహ్యమున్నది.
కామారెడ్డి:- కొత్త జిల్లా కేంద్రమిది. కామారెడ్డి పేరుని పూర్వం సర్కారు రికార్డుల్లో కామారెడ్డి పేట అని రాసే వారట. ప్రజలు కామారెడ్డి ప్యాట అని కూడా వ్యవహ రించేవారట. కామారెడ్డి నగరం మధ్యలో పురాతనమైన కిష్టమ్మ గుడి ఉంది. ఆ గుడికి ఉత్తరంగా కొంత దూరంలో కోడూరు హనుమాండ్లు అని మరో దేవాలయం దీనికి కొంత దూరంలో కోడి చెరువు (కోడూరు చెరువు) ఉండేదట. ఇప్పుడు లేదు. కానీ ఆ ప్రాంత భూముల రెవెన్యూ రికార్డుల్లో కోడిచెరువు భూములు’ అని ఉందని పరిశోధకుడు ఆచార్య రాజేశ్వర శర్మ గారు తన ఆత్మ నివేదనలో రాసుకున్నారు. పై విషయాల ఆధారంగా కోడూరు అనే గ్రామం ఇక్కడ ఉండేదని, దానిని ఏ దండయాత్రలోనో ధ్వంసం చేయడం ద్వారానే ఇప్పుడున్న కిష్టమ్మగుడిని కూడా ధ్వంసం చేసారని అంచనా వేసుకోవచ్చు. అటువంటి గ్రామాన్ని కామినేని వంశస్థులు పునరుద్ధరించి వారి వంశంలో ఒకరైన కామిరెడ్డి పేరు మీద కామాడిపేట, కామారెడ్డి పేట, కామారెడ్డిగా పేరు మార్చారని తెలుస్తుంది. (ఆలోకనం – డా. సాగి కమలాకర శర్మ. పుట.25)


చౌటుపల్లి:- కమ్మర్‍ పల్లి మండలం లోని గ్రామమిది. ఈ గ్రామంలో చౌడు భూములు అధికంగా ఉండడం వలన గ్రామానికి చౌడుపల్లె అను పేరు ఏర్పడి అనంతరం చౌడుపల్లి, చౌటుపల్లి గా మారి యుండ వచ్చునని స్థానిక కథనం.
జక్రాన్‍ పల్లి:- జైనుల ప్రభావం అధికంగా ఉన్న మండల కేంద్రమిది. చక్రేశ్వర పురం అని మరొక పేరు. జక్కుల రాణి నామ ప్రభావంతో జకరాణి పల్లిగా, జకరాన్‍ పల్లి’ గా మారిందని స్థానిక కథనం.
జానకం పేట్‍:- వేల్పూరు మండలంలోని గ్రామమిది. ఈ గ్రామ చెరువుకు జానకమ్మ చెరువు అని పేరు. ఈ పేరు మీదుగానే జానకమ్మ పేట, జానకం పేటగా స్థిర పడి యుండవచ్చు.
డిచ్‍ పల్లి:- జిల్లాలోని మండల కేంద్రమిది. ఈ నామాన్ని ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో డిచ్చుపల్లి అని పేర్కొన్నారు. గతంలో దీక్షపల్లిగా, డచ్‍ వారు ఉన్న ప్రాంతం కావడం వలన డచ్‍ పల్లి’గా పిలుస్తారని స్థానిక కథనాలు ఉన్నాయి.
బాన్స్ వాడ:- జిల్లాలోని మండల కేంద్రమిది. ఈ మండలంలోని దేశాయిపేట గ్రామంలోని శాసనంలో ఈ నామం బనవాసవాడి అని పేర్కొనబడి ఉన్నది. శాసన రూపం బనవాసవాడి కాల క్రమంలో బాన్స్ వాడగా మార్పు చెంది ఉండ వచ్చు.


బిచ్కుంద:- జిల్లాలోని మండల కేంద్రమిది. పూర్వం ఈ నామాన్ని ముచికుంద మహర్షి పేరు మీదుగా ముచికుంద అని వ్యవహరించే వారట. తదనంతరం బిచ్‍ కుంద’ గా మారినట్లు స్థానిక కథనం.
బోధన్‍:- అశ్మక రాజు పరిపాలించిన పౌదన్యం అనే నగరమే ఈ బోధన్‍ నగరం. ఋషభ దేవుని కుమారుడు బాహుబలి (గోమటేశుడు) ఈ బోధన్‍ ప్రాంతాన్ని పరిపాలించినట్లు చెబుతారు. ఆ తర్వాత సన్యాసం స్వీకరించి జైన మునులలో ప్రసిద్ధుడై పూజలందుకున్నట్లు చెబుతారు. నాటి జైనమత కేంద్రమైన బోధన్‍ దక్షిణ భారత దేశ యాత్రా స్థలంగా పేరుగాంచినది. ఈ ప్రాంతం మంజీరా నది పరీవాహక ప్రాంతం కావడం వల్ల మంజీరా భూమిగా కూడా పిలవబడింది. దక్కన్‍ పీఠభూమిలో మరియు దక్షిణ భారతదేశంలోనే గొప్ప జైన పుణ్యక్షేత్రం, కర్మభూమి ఈ బోధన్‍ ప్రాంతం. కాశీ, మధుర, హస్తినాపురాల వలె పోదనం’ (బోధన్‍) కూడా పవిత్ర తీర్థ క్షేత్రమని క్రీ.శ. ఒకటవ శతాబ్దికి చెందిన జైన మహాకవి కుంద కుందాచార్యుడు తన దసభత్తి’ అనే ప్రాక•త గ్రంథంలో ప్రశంసించాడు. పంప మహా కవి బోధన్‍ లోనే జన్మించినట్లు, తన చివరి దశను బోధన్‍ లో గడిపినట్లు అనేక ఆధారాలున్నాయని చరిత్రకారుల అభిప్రాయం. బాహుబలి గురించి రాయబడిన కన్నడ పురాణంలో బోధన్‍ నగరం పద్మపురం అని పేర్కొనబడింది. పంప కవి తాను పద్మపుర నివాసినని చెప్పుకున్నాడు. ఈ బోధన్‍ నగరానికి వసుమతి, పద్మపుర, ఏకచక్రపుర, బహుధాన్య పురము అనే పేర్లున్నాయని తన విక్రమార్జున విజయం’లో పేర్కొన్నాడు. (తెలివాహ గోదావరి – డా. సంగనభట్ల నరసయ్య. పుట. 69)


భిక్‍ నూర్‍:- జిల్లాలోని మండల కేంద్రమిది. బిక్కనూరు పేట, భిక్షువులపురం అని కూడా పిలుస్తారు. ప్రాచీన సంస్థానం దోమకొండకు బిక్కనవోలు అనే పేరు కూడా ఉంది.

భీమ్‍ గల్‍:-
మండల కేంద్రమిది. వేముగల్లు అని కూడా పిలుస్తారు. సింహాసన ద్వాత్రింశిక కర్త కొఱవి గోపరాజు గారిది ఈ మండలంలోని పల్లికొండ గ్రామం.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఉప్లూర్‍- ఉప్పలూర్‍, కాటేపల్లి -కాటేరిపల్లి, గాండ్లపేట్‍-గౌండ్లపేట్‍, బంజెపల్లి-బంజెరుపల్లి, ముల్తుమ్మెద -మాల్తుమ్మెద, దూద్‍ గావ్‍-దూద్‍ వాలేగావ్‍, దేవన్‍ పల్లి-దేవునిపల్లి, నడిపల్లి-నడిమిపల్లి, నసమల్లాబాద్‍-నజీరుల్లాబాద్‍, యాచారం-యాచవరం, సాంబాపూర్‍-సాంబయ్యపురం వంటి అనేక గ్రామనామాల ప్రత్యేక రూపాలను చూడవచ్చు.(నిజామాబాద్‍ జిల్లా గ్రామ నామాలు-సాహిత్య, చారిత్రక,పరిశీలన, సిద్ధాంత గ్రంథం. డా. అక్కెనపల్లి వెంకట్‍ రాంరెడ్డి, OU,HYD. 2015)
కామారెడ్డి పేట, బిక్కనూరు పేట, యీదల వాయి, జగనంపల్లి, ఆర్మూరు, బాల కొండ వంటి స్థల నామాలను సందర్శించినట్లు ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో రాసినారు. ఈ ప్రాంతంలో బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం ఇస్లాం మత సంబంధమైన గ్రామ నామాలున్నవి. ఆయా గ్రామ నామాలపై తెలుగు, ఉర్దూ, మరాఠ, కన్నడ, తమిళ భాషా ప్రభావం కనబడుతుంది. కౌలాస్‍ దుర్గం, దోమకొండ, వెల్మల, సిర్నాపల్లి సంస్థానాలు జిల్లాకు తరగని చారిత్రక ఆభరణాలు.


-డా. మండల స్వామి
ఎ : 9177607603

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *