భారత్‍ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం ఏ ఎంఐఆర్‍వీ టెక్నాలజీ..!!

మహా భారతంలో అర్జునుడు రెండు చేతులతో బాణాలు ప్రయోగించి శత్రు సైన్యంపై అరవీర భయంకరంగా విరుచుకు పడేవారని, అందుకే అతనిని సవ్యసాచి అని పిలుస్తారని మనం పుస్తకాలలో చదివే ఉంటాం. అంటే అర్జునుడు ఏకకాలంలో రెండు లక్ష్యాలపై బాణాలతో దాడిచేసేవారన్నమాట. దీనిని నేర్పరితనంతో కూడిన యుద్ధకళగా, ఆనాటి పరిస్థితులకు అది ఎంతో గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. అది వాస్తం కూడా! అయితే ఏక కాలంలో, శత్రువు ఏం జరుగుతుందో గుర్తించే లోపే బహుళ లక్ష్యాలపై క్షిపణులతో విరుచుకుపడి, ప్రత్యర్థి సైన్యాన్ని తుత్తునియలు చేస్తే ఎలా ఉంటుంది? నమ్మశక్యంగా లేదు కదూ, అసలు అది ఎలా సాధ్యం అన్న ప్రశ్న మన మదిలో ఉదయిస్తోంది కదూ! అలాంటి అసాధ్యాన్ని అగ్ని-5 క్షిపణి ద్వారా ఎంఐఆర్‍వీ (మల్టిపుల్‍ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‍ రీఎంట్రీ వెహికల్‍) అన్న సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఏక కాలంలో బహుళ లక్ష్యాలపై వార్‍ హెడ్లను ప్రయోగించే పరీక్షను వియవంతంగా నిర్వహించి, సుసాధ్యం చేసింది మన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‍డీఓ). ‘‘ఎప్పుడొచ్చా మనద్ని కాదన్నయ్యా, బుల్లెట్‍ దిగిందా లేదా’’ అన్న తెలుగు సినిమాలోని డైలాగ్‍ లాగా, కేవలం అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్రదేశాలకే సొంతం అనుకుంటున్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనదేశం సైతం ఒడిసి పట్టడం భారత రక్షణ రంగ చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అగ్ని-5 క్షిపణి గురించి, ఎంఐఆర్‍వీ సాంకేతిక పరిజ్ఞానం గురించీ, మనమూ తెలుసుకుందామా!!


అగ్ని క్షిపణులు
ఎంఐఆర్‍వీ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకునే ముందు మనం అగ్ని క్షిపణుల గురించి తెలుసుకోవాలి. క్షిపణులలో బాలిస్టిక్‍ మరియు క్రూయిజ్‍ క్షిపణులు అని రెండు రకాలు ఉంటాయి. బాలిస్టిక్‍ క్షిపణులు వాతావరణం నుండి వెలుపలికి, మళ్ళీ వాతావరణంలోకి పునఃప్రవేశించి నిర్దేశించిన లక్ష్యాలపై దాడులు చేస్తాయి. బాలిస్టిక్‍ క్షిపణులు వాతావరణం నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్‍ లేకుండా ప్రయాణించాల్సి వస్తుంది. కాబట్టి, బాలిస్టిక్‍ క్షిపణులలో ఒక ఆక్సిజన్‍ ట్యాంకు కూడా ఉంటుంది. కానీ క్రూయిజ్‍ క్షిపణులు వాతావరణంలోనే ప్రయాణిస్తాయి. నిర్దేశించిన లక్ష్యం కదులుతూ ఉన్నప్పటికీ క్రూయిజ్‍ క్షిపణులు కూడా నిర్దేశించిన లక్ష్యం యొక్క కదలికలకు అనుగుణంగా తమ కదలికలను మార్చుకుంటూ, వాటిని వెంటాడి, వేటాడి దాడులు చేస్తాయి. వీటినే గైడెడ్‍ క్షిపణులు అని కూడా అంటారు. క్రూయిజ్‍ క్షిపణులు తక్కువ దూరం ప్రయాణిస్తాయి. బాలిస్టిక్‍ క్షిపణులు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. వేరే ఖండంలో ఉన్న లక్ష్యాలపై కూడా ఈ క్షిపణులతో దాడులు చేయవచ్చు. అలాంటి క్షిపణులను ఖండాంతర్గత క్షిపణులు (ఇంటర్‍ కాంటినెంటల్‍ బాలిస్టిక్‍ మిస్సైల్స్) అంటారు. అగ్ని క్షిపణులు బాలిస్టిక్‍ క్షిపణుల రకానికి చెందినవి.
అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్‍ క్షిపణుల శ్రేణిని అభివృద్ధి చేసేందుకు భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‍డీఓ) 1983లో అగ్ని క్షిపణుల కార్యక్రమాన్ని ప్రారంభించింది.


అగ్నిక్షిపణుల సిరీస్‍లో అగ్ని-1 మొదటి క్షిపణి. ఇది 700 కి.మీ. పరిధి గల స్వల్ప శ్రేణి బాలిస్టిక్‍ క్షిపణి. దీనిని మొదటిసారి 1989లో పరీక్షించారు. 2007లో సైన్యంలో ప్రవేశపెట్టారు.
తరువాత వచ్చిన అగ్ని సిరీస్‍లోని క్షిపణులన్నీ వాటి పరిధి మరియు పేలోడ్‍లు మోసుకెళ్లగలిగే సామర్థ్యపరంగా గణనీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. అగ్ని-2 క్షిపణి పరిధి 2000-2500 కి.మీ. దీనిని 1999లో తొలిసారి పరీక్షించారు. 3500 కి.మీ. పరిధి కలిగిన అగ్ని-3 క్షిపణిని 2006లోనూ, 4000 కి.మీ. పరిధి కలిగిన అగ్ని-4ను 2011లోనూ తొలిసారి పరీక్షించారు.
అగ్ని-5, 2012వ సం।।లోనూ తొలిసారి విజయవంతంగా పరీక్షించబడింది. దీని పరిధి 5000 కి.మీ. ఇది ఖండాంతర్గత బాలిస్టిక్‍ క్షిపణి (ఐసీబీఎం) రకానికి చెందినది.


ఎంఐఆర్‍వీ టెక్నాలజీ అంటే…!!

సాధారణంగా ఏదైనా ఒక లక్ష్యంపై దాడి చేయాలంటే సాంప్రదాయ క్షిపణులకు వార్‍హెడ్‍ను అమర్చి వాటిపైకి ప్రయోగిస్తారు. అలా…. ఎన్ని లక్ష్యాలపై దాడులు చేయాలంటే, అన్నిసార్లు క్షిపణులకు వార్‍హెడ్‍లను అమర్చి మనం ప్రయోగించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకే క్షిపణికి బహుళ వార్‍ హెడ్లను అమర్చి, అవన్నీ ఏక కాంలో విభిన్న లక్ష్యాలపై దాడులు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంఐఆర్‍వీ టెక్నాలజీ అంటారు. ఎంఐఆర్‍వీ అంటే (మల్టిపుల్‍ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‍ రీ ఎంట్రీ వెహికల్‍) స్వతంత్రంగా బహుళ లక్ష్యాలను ఛేదించే పునఃప్రవేశ వాహనం అని అర్థం. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక అగ్ని-5 క్షిపణిని మిషన్‍ దివ్యాస్త్ర అన్న పేరుతో మార్చి11న 2024 డీఆర్‍డీవో విజయవంతంగా పరీక్షించింది.
చేధించాల్సిన లక్ష్యం ఒక వార్‍హెడ్‍తో నాశనం కాకపోతే, ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్ని వార్‍హెడ్లను, ఒకే లక్ష్యం పైకి ఒకదాని తరువాత మరొకటి తాకేలా కూడా చేయవచ్చు. తద్వారా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో నాశనం చేయవచ్చు. అదేవిధంగా అణువార్‍ హెడ్లను శత్రువు తేరుకునే అవకాశం లేకుండా ఏక కాలంలో ప్రయోగించడం వల్ల వారికి కోలుకోలేని స్థాయిలో నష్టం కలిగించవచ్చు. తద్వారా వారు మనతో కాళ్ళ బేరానికి వచ్చే అవకాశం ఉంది.


కొత్తదేం కాదు…!!
ఎంఐఆర్‍వీ టెక్నాలజీ ఇప్పుడే కొత్తగా వెలుగులో కొచ్చినదేం కాదు. దీనిని 1960వ దశకంలోనే అమెరికా పరీక్షించి మైన్యూట్‍ మ్యాన్‍-3 క్షిపణి వ్యవస్థలో దీన్ని వాడింది. 1970లో సైన్యంలోకి చేర్చింది. తదుపరి అప్పటి సోవియట్‍ యూనియన్‍ కూడా ఈ సంకేతికతను సొంతం చేసుకొంది. తరువాతి సం।।రాలలో ప్రాన్స్, యూకే, చైనా కూడా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాయి. నిరుడు ‘‘అబాబీల్‍’ అనే మధ్య శ్రేణి ప్రయోగం ద్వారా తానూ ఎంఐఆర్‍వీ సాంకేతికతను పరీక్షించినట్లు పాకిస్తాన్‍ చెబుతున్నా, దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.


ఎంఐఆర్‍వీ సాంకేతికత ఎలా పనిచేస్తుంది
ఎంఐఆర్‍వీ సాంకేతికత దశలవారీగా పనిచేస్తుంది. ఇందులో 4 దశలుంటాయి.

1.ప్రయోగ దశ (Launch) :
ఎంఐఆర్‍వీ సాంకేతిక పరిజ్ఞానం అమర్చిన క్షిపణి ఇతర బాలిస్టిక్‍ క్షిపణుల మాదిరిగానే ప్రయోగించిన వెంటనే అంతరిక్షంలోకి ప్రవేశించి బాలిస్టిక్‍ పథాన్ని అనుసరిస్తూ ప్రయాణిస్తుంది.

2.పోస్ట్ బూస్ట్ దశ (Post Boost Phase) :
బూస్ట్ దశ తరువాత ‘బస్‍’ (Bus) అని పిలువబడే క్షిపణి యొక్క ఎగువదశ వాతావర ణంలోని ఉపకక్ష్యా మార్గాన్ని (Sub Orbital Space) చేరుకుంటుంది. ఈ సమయంలో నిర్దేశించిన లక్ష్యాల కనుగుణంగా ‘బస్‍’ తనంతకు తాను సరళరేఖా మార్గంలో ప్రయాణించేటట్లు సమలేఖనం మరియు విన్యాసాలు చేస్తుంది.

3.మోహరించు దశ (Deployment Stage) :
ఈ దశలో క్షిపణి యొక్క ఎగువ దశ అయిన బస్‍ (Bus) నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే ప్రతిస్పందనా చర్యలలో భాగంగా ఒక వరుస క్రమంలో వార్‍ హెడ్లను మరియు ప్రత్యర్థిని గందరగోళ పరిచే ఉపకరణాలను (Decoys) మోహరిస్తుంది. ప్రతి వార్‍హెడ్‍కు కూడా ఒక ప్రత్యేక కక్ష్యామార్గం ఉంటుంది.

4.పునఃప్రవేశం మరియు ప్రభావం (Re entry and impact):
క్షిపణికి అమర్చిన వార్‍హెడ్‍లు భూవాతావరణం వెలుపల కొంత సమయం ప్రయాణించి తదుపరి తిరిగి భూవాతావరణంలోకి స్వతంత్రంగా ప్రవేశించి వాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని ప్రత్యర్థికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తాయి.


ప్రయోజనాలు
క్షిపణి రక్షణ వ్యవస్థలను మోసగించడం :
ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపణులను అడ్డుకోవడానికి చాలాదేశాలు అధునాతన క్షిపణి నిరోధక వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకున్నాయి. వాటితో గుర్తించడం (Detecting), అనుసరించడం (Tracking), నిరోధించడం (Intercepting), ప్రత్యర్థి ప్రయోగించిన క్షిపణిని నాశనం చేయడం లాంటి సమీకృత నెట్‍వర్క్ ఉంటుంది. ఇందుకోసం అధునాతన రాడార్లు, కమ్యూనికేషన్‍ వ్యవస్థలు, ప్రత్యర్థి ప్రయోగించిన క్షిపణులను నిరోధించే క్షిపణులు లాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఇవన్నీ సాంప్రదాయ క్షిపణులను నిరోధించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఎంఐఆర్‍వీ సాంకేతికతతో కూడిన క్షిపణుల ముందు ఇవేవీ పనిచేయవు.
బహుళ సంఖ్యలో గల వార్‍హెడ్లు, ప్రతి వార్‍హెడ్‍ కూడా స్వతంత్రంగా పయనించే సామర్థ్యం ఉండడం వల్ల వీటిని గుర్తించి, నిరోధించడం ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలకు చాలా సంక్లిష్టమవుతుంది. పైగా వార్‍హెడ్ల్కు ప్రత్యర్థిని మోసపుచ్చే ఉపకరణాలు వాడడం వల్ల, వారి క్షిపణి రక్షణ వ్యవస్థ గందరగోళానికి లోనవుతుంది. కాబట్టి ఒకటి లేదా బహుళ సంఖ్యలో వార్‍హెడ్లు ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థను చేధించుకొని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకొని వారికి అపార నష్టాన్ని కలిగిస్తాయి.


ఒకే క్షిపణి – బహుళ వార్‍హెడ్లు :

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఒకే క్షిపణి ద్వారా, బహుళ వార్‍హెడ్లను ప్రయోగిం చడం ద్వారా సమయాన్ని ఆదాచేయడంతో పాటు, ఖర్చును తగ్గించవచ్చు. మరియు ప్రత్యర్థికి అపార నష్టం కలిగించవచ్చు.
ఖచ్చితత్వంతో కూడిన లక్ష్యఛేదన :
ఆరునూరైనా, ఎంఐఆర్‍వీ సాంకేతికతతో కూడిన క్షిపణులు నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. గురితప్పడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు.
స్వతంత్రంగా వ్యహరించే నేర్పు :
ఎంఐఆర్‍వీ సాంకేతికత ద్వారా ప్రయోగించే, క్షిపణిలోని ప్రతీ వార్‍హెడ్‍ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తూ భిన్న లక్ష్యాలపై దాడిచేయడం దీనిలోని ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు.
ప్రతికూలతలు :
ఎంఐఆర్‍వీ సాంకేతికతను ఇండియా విజయవంతంగా పరీక్షించినప్పటికీ అందులో ఎన్నో సంక్లిష్టతలున్నాయి. వాటికి మెరుగైన పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది.
సాంకేతిక సంక్లిష్టతలు :
నిర్దేశించిన లక్ష్యంపైకి వేగంగా దూసుకెళ్లి, గరిష్టస్థాయిలో ప్రభావం చూపేందుకు గానూ, క్షిపణిలో అమర్చే వార్‍ హెడ్ల్ను వీలైనంత తక్కువ స్థాయికి సూక్ష్మీకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా స్వతంత్రంగా పయనిస్తూ, లక్ష్యంపై దాడి చేసేందుకు గానూ ఖచ్చితమైన, సునిశితమైన మార్గనిర్దేశం (గైడెన్స్), గమన నియంత్రణా పరిజ్ఞానం (నావిగేషన్‍ కంట్రోల్‍) క్షిపణికి అందజేయడం అత్యంత సంక్లిష్టమైన పక్రియ.
ప్రెసిషన్‍ ఇంజనీరింగ్‍ :
ఎంఐఆర్‍వీ సాంకేతికత ద్వారా ప్రయోగించిన క్షిపణిలోని ప్రతి వార్‍హెడ్‍ కూడా అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో అభివృద్ధి చెందిన స్వదేశీ ఎవియానిక్‍ వ్యవస్థలు మరియు సెన్సార్‍ సిస్టమ్స్ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.


అణ్వాయుధ సంఘర్షణలు పెరిగే ప్రమాదం :
ఎంఐఆర్‍వీ సాంకేతికత కలిగి ఉండడం వల్ల రక్షణ వ్యవస్థ బలోపేతమవడం ఆహ్వానించదగ్గ పరిణామ మయినప్పటికీ, మరోవైపు ప్రత్యర్థులు ఈ సాంకేతికతను ఎదుర్కోవడం కోసం మరిన్ని అణ్వాయుధాలను పోగుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎంఐఆర్‍వీ సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది.
అంతర్జాతీయ ఒడంబడికలు:
ఏక కాలంలో బహుళ వార్‍హెడ్లను ప్రయోగించే క్షిపణులను అభివృద్ధి చేస్తున్నప్పుడు అంతర్జాతీయ పరిమితులను, విభిన్న ఒప్పందాలను వాటివల్ల కలిగే ప్రతికూలతలను సునిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
భద్రత మరియు విశ్వసనీయత :
సుదూరు తీరాలకు బహుళ వార్‍హెడ్లను మోసుకెళ్లగలిగే క్షిపణుల యొక్క భద్రత మరియు విశ్వసనీయతను సునిశితంగా అధ్యయనం చేసి నిర్ధారించాల్సి ఉంటుంది.
మహిళాశాస్త్రవేత్తల విజయం..!!
మిషన్‍ దివ్యాస్త్ర విజయం మహిళా శాస్త్రవేత్తల ఘనతేనని పలువురు విశ్లేషకులు వాఖ్యానిస్తున్నారు. ఈ మిషన్‍ కోసం పలు కీలక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి పలువురు మహిళా శాస్త్రవేత్తలు గణనీయ సేవలందించారు.
షీనారాణి అగ్ని-5 పోగ్రామ్‍కు డైరెక్టర్‍గా పనిచేయడంతో పాటు, ఆ ప్రాజెక్టస్కు నాయకత్వం వహించింది. ఆమె నాయకత్వం మరియు నైపుణ్యం అగ్ని-5 క్షిపణిలో ఎంఐఆర్‍వీ సాంకేతికతను విజయవంతంగా అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె మిసైల్‍ మ్యాన్‍ ఆఫ్‍ ఇండియా.
అబ్దుల్‍ కలాం స్ఫూర్తితో పనిచేస్తూ, ప్రాజెక్ట్ డైరెక్టర్‍ స్థాయికి చేరుకుంది. షీనారాణితో పాటు ఈ ప్రాజెక్ట్లో ఉషావర్మ, నీరజ, విజయలక్ష్మి మరియు వెంకటమణి వంటి మహిళా శాస్త్రవేత్తలు ఇతోధిక సేవలు అందించారు. ఈ విధంగా మహిళా శాస్త్రవేత్తల చొరవ, సైన్స్ మరియు రక్షణరంగంలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యాన్ని సూచిస్తోది.


భవిష్యత్‍ ప్రాజెక్టులు :
అగ్ని సిరీస్‍ క్షిపణుల పరంగా :
అగ్ని-6 క్షిపణి అభివృద్ధి :

రాబోయే రోజుల్లో 12000 కి.మీ. పరిధి కలిగిన అగ్ని-6 క్షిపణిని అభివృద్ధి పరిచే పక్రియలో డీఆర్‍డీఓ నిమగ్నమై ఉంది. దీనికి ఎంఐఆర్‍వీ సాంకేతికతను కూడా అనుసంధా నించే అవకాశం ఉంది.
మెరుగైన స్టెల్త్ ఫీచర్స్ :
ప్రత్యర్థుల రాడార్ల మరియు క్షిపణి నిరోధక వ్యవస్థలను ఏమార్చే అధునాతన స్టెల్త్ ఫీచర్స్ను డీఆర్‍డీఓ అభివృద్ధి చేస్తోంది.
మరింత పేలోడ్‍ను మోసుకెళ్ళగలిగే సామర్థ్యం :
ఎక్కువ పరిమాణం కలిగిన వార్‍హెడ్లు లేదా అధిక సంఖ్యలో వార్‍ హెడ్లను మోసుకెళ్ళ గలిగే విధంగా క్షిపణుల పేలోడ్‍ కెపాసిటీని డీఆర్‍డీఓ అభివృద్ధి పరుస్తోంది.


మిసైల్‍ టెక్నాలజీ పరంగా :
హైపర్‍ సానిక్‍ టెక్నాలజీ
:

ప్రత్యర్థుల క్షిపణి రక్షణ వ్యవస్థలను సులువుగా చేధించేందుకుగా మాక్‍-5 కన్నా అధిక వేగంతో ప్రయాణించ గలిగే హైపర్‍ సానిక్‍ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేసేదిశగా ఇండియా దృష్టి సారించింది.
కృత్రిమమేధ సమన్వయం :
లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేధించేందుకు, సత్వర నిర్ణయాలను తీసుకొనేందుకు, మరియు స్వతంత్రంగా వ్యవహరించగలిగే నావిగేషన్‍ సిస్టమ్స్ను అభివృద్ధిపరిచేందుకు గానూ, క్షిపణి సాంకేతికతకు కృత్రిమమేధను జోడించే దిశగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.
అధునాతన ప్రొపల్షన్‍ సిస్టమ్స్ :
క్షిపణులను సత్వరం లక్ష్యసాధన దిశగా మోహరించేందుకు ఘన ఇంధనంతో కూడిన ఇంజన్లను మరియు సుదీర్ఘ దూరాలకు వార్‍హెడ్లను మోసుకెళ్లేందుకు ద్రవ ఇంధనం కూడిన హైబ్రిడ్‍ ఇంజన్లతో కూడిన ప్రొపల్షన్‍ సిస్టమ్స్ను అభివృద్ధి చేసే దిశగా ఇండియా తీవ్రంగా కృషి చేస్తోంది.


చివరగా
ఎంఐఆర్‍వీ సాంకేతి కతను సాధించడం ఇండియా రక్షణ రంగ చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సాంకేతికత సాధించడంతో ఇండియా యూఎస్‍, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటి అగ్ర దేశాల సరసన చేరింది. ఇదే సమయంలో ప్రాంతీయ భద్రతను స్థిరీకరించడం లోనూ, ఇండో పసిఫిక్‍ రీజియన్‍లో చైనా, పాకిస్తాన్‍ లాంటి దేశాలతో భౌగోళిక రాజకీయాలను సమన్వయం చేసుకుంటూ, అంతర్జాతీయ అణ్వాయుధ ఒడంబడికలను, నియమాలను పాటిస్తూ భారత ఉపఖండంలో వ్యూహాత్మక స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *