పారిశ్రామిక నాగరికత – పర్యావరణ దృష్టి

ప్రకృతికీ, మానవులకూ మధ్య సహజంగా జరిగే జీవరసాయన క్రియలో ఒక పెద్ద అగాధం ఏర్పడిందని, అది నానాటికీ మరింత విస్తరిస్తూన్నదని ప్రకృతి శాస్త్రవేత్తలో, పర్యావరణవేత్తలో లేక పర్యావరణ సామాజిక శాస్త్రవేత్తలో చెప్పా రనుకోండి. మనమేమీ పెద్దగా పట్టించుకోం. ప్రతిస్పందించం. మన నిత్యావసరాల గొడవ లేనంతవరకూ మనకేమీ ఇటువంటి విషయాల పట్ల పెద్ద ఆసక్తి ఏమీ కలగదు. అదే ఒక్కరోజు రెండు గంటలపాటు కరెంటు లేకపోయినా, రెండు బిందెల మంచినీళ్లు అందకపోయినా ప్రపంచం తల్లకిందులై పోయిందని గగ్గోలు పెడతాం. ప్రభుత్వాలు ఆసమర్థతలను ఎత్తిచూపడానికి వెనుకాడం.


ప్రకృతికి, మానవాళికి మధ్య పెరిగిన దూరాన్ని ‘ఎకలాజికల్‍ రిఫ్ట్’ అంటున్నారు శాస్త్రవేత్తలు ప్రపంచం మొత్తం ఒక అఖండం అయితే ఈ అఖండాన్ని ఖండ ఖండాలుగా, శకల శకలాలుగా మార్చేది కృత్రిమ విభజన ఫలితం. మనలను మన పూర్వ తరాల నుండి వేరు చేస్తున్నది. భౌతిక-ప్రాకృతిక పరిస్థితులతోటి ఉన్న అస్తిత్వమే. మనకంటే ముందున్న తరాలు ప్రకృతితోటి సన్నిహితంగా ఉన్నారు. వారికిన్ని వాంఛలులేవు. ఆకాంక్షలులేవు. భౌతిక సంపదలను కొల్లగొట్టేయ్యాలన్న ఆశలులేవు. అసలు ప్రకృతిని ఏకమొత్తంగా జయించాలన్న అత్యాశలు లేవు.
మనకు భూమండలాన్ని కాపాడుకోవాలన్న ఆకాంక్షలేదు. మానవాళిని రక్షించుకోవాలన్న తపనలేదు. పెట్టుబడిని పరిరక్షించుకోవటం తద్వారా మరింత లాభాలను పొందగలగటం ఇదొక్కటే ఆశయంగా ఉంటోంది మనకు.


అసలు పర్యావరణ సమస్యలన్నిటికీ మూలం పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉన్నాయనే సత్యాన్ని విస్మరించాం.
పారిశ్రామిక నాగరికత జీవితానికి సరిపోదు. అది జీవించనీయదు. ఒక పద్ధతి ప్రకారం జీవాన్ని ఈ భూమండలం నుంచి తొలగిస్తుంది. ఈ సంస్క•తి భూమిని హత్యచేస్తుంది. మనం దీనిని నిరోధించక పోయినట్లయితే, సహజ ప్రకృతి దీనిని హతమారుస్తుంది. అది ఆవరణ వ్యవస్థ కుప్పకూలటం ద్వారా కావచ్చు. మరొక మార్గం ద్వారానైనా సంభవించవచ్చు. జీవించి ఉన్న ప్రతి ప్రాణినీ పారిశ్రామిక నాగరికత చంపుతుంది అన్నారు డెరిక్‍ మెన్‍సెన్‍, అరిక్‍మెక్‍బేలు తమ ‘దాట్‍వియ్‍ లీన్‍ బిహైండ్‍’ అనే పుస్తకంలో. మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం అనేది ప్రపంచం గురించి ఎట్లా ఆలోచించాలనే విషయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచం గురించి ఎలా ఆలోచిస్తున్నాం అనేది ప్రపంచాన్ని మనం చూసే విధాన్ని ప్రభావిత పరుస్తుంది. ప్రపంచాన్ని చూసే విధానం, ఆలోచించే విధానాలు ప్రపంచంలో ప్రపంచంతోటి ఎట్లా ప్రవర్తించాలనే విషయాన్ని ప్రభావితం చేస్తుంది. పారిశ్రామిక సంస్క•తి ప్రవర్తన మొత్తం భూమిని హత్యచేయటం కాబట్టి మనం మన ప్రవర్తనా పద్ధతిని ఇతర విషయాలతో పాటుగా మార్చుకోవాలి. మనం ప్రపంచాన్ని ఎట్లా చూడాలి. ప్రపంచం గురించి ఏమి ఆలోచించాలో కూడా మార్చుకోవలసి ఉంది. తమ గ్రంథంలో టెరిక్‍యన్‍సెన్‍ ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు అనేది గుర్తించలేని విలోమ సంస్క•తిలో జీవిస్తున్నాం అంటారు.


ఒకవైపు సముద్రాలు అంతరించిపోయి, తల్లిపాలలో డయాక్సిన్‍లు పెరిగిపోవటం అనేది ప్రధాన విషయంగా ‘పారిశ్రామిక పెట్టుబడి’ అతి ముఖ్యవిషయంగా పరిగణన పొందుతూ ఉన్నది. ప్రపంచం అంతరించి పోతుందనేది అంతగా భీతిల్లవలసిన విషయం కాదని ‘పారిశ్రామిక పెట్టుబడిదారీ వాదం’ అంతరించటం నిజంగా భయపడాల్సిన విషయమని నమ్మించ జూపే సంస్క•తిలో ఉన్నాం మనం. ఇటువంటి సంస్క•తిలో ఎక్కువమంది అడిగే ప్రశ్న ‘గ్లోబల్‍ వార్మింగ్‍ను మనమెలా ఆపగలం?’ అంటే వారడిగేది ఈ జీవన విధానాలను మార్చుకోకుండా మనమెలా దీనిని ఆపగలం అనే దీనర్థం. ఏమంటే జీవన విధానాలలో మార్పు రాకూడదు కానీ గ్లోబల్‍ వార్మింగ్‍లో మార్పు రావాలి. తాము తమ అలవాట్లు జీవనశైలులు మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. అట్లాంటప్పుడు అసలు గ్లోబల్‍ వార్మింగ్‍ ఉందా? అని కూడా కొందరు అడగవచ్చునేమో! లేదా గ్లోబల్‍ వార్మింగ్‍ను తగ్గించాలను కోవటం పిచ్చితనంగా కూడా భావించే వారూ ఉండొచ్చు.


పారిశ్రామిక పెట్టుబడి అనేది ఎప్పటికీ సుస్థిరమైనదికాదు. అది ఎప్పుడూ ఏ ఖనిజాల కోసం, పదార్థాల కోసం ఏ నేలమీద ఆధారపడి ఉందో దానినే విధ్వంసపరుస్తుంది. పారిశ్రామిక పెట్టుబడి పోవాలంటే దాని దోపిడీకి నేల, నీరు, గాలి లేకుండా పోయినప్పుడే సాధ్యమవుతుంది. గాలి, నేల, నీరు లేకుండా పోవాలనుకోవటం కంటే, పారిశ్రామిక పెట్టుబడే లేకుండా పోవాలి. పారిశ్రామిక పెట్టుబడులు పెరగటమే తప్ప. తరగటం చూడటం కుదరదు. పైగా అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులను ఆకర్షించాలని, అవి వొస్తే రాష్ట్రాలు, దేశం సౌభాగ్యవంత మవుతాయని పోటీలు పడి తెచ్చుకుంటున్నాయి ప్రభుత్వాలు. పారిశ్రామిక కారిడార్‍ తామరతుంపగా వృద్ధి చెందుతున్నాయి. పెరగనిది ఏదైనా ఉందంటే పర్యావరణం పట్ల ప్రజల బాధ్యత, భాగస్వామ్యం, బాధ్యతను గుర్తించగలిగినప్పుడే భాగస్వాములం కాగలుగుతాము.


అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చిపెట్టే ముప్పు ఏమిటో తెలుసుకోవటం అందరికీ అవసరం, పారిశ్రామిక నాగరికత సంస్క•తి ప్రసాదించే వ్యర్థ, నిరుపయోగ ఉత్పత్తుల పట్ల, వాటి వినియోగం ఆ వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు మొదలైన వాటి గురించి కనీసంగానైనా అవగాహన కావాలి.
నిజానికి వ్యర్థం అంటే ఏమిటి? మంచి వ్యర్థాలు అనేవి ఉంటాయా? లేక సరిగా వ్యర్థం చేయటమనేది ఉంటుందా అనేవి ప్రశ్నలు. వ్యర్థాల పట్ల మన వైఖరులు ఎలా ఉంటాయి? అనేదీ ముఖ్యమే. వ్యర్థం అనేదానికి రెండర్థాలున్నాయి. ఒకటి ఉపయోగం, రెండవది విధ్వంసం. ఏదైనా వ్యర్థమైందని అన్నామంటే దానిని సామర్థ్యమేరకు ఆర్థికంగా ఉపయోగించలేదని, లేదంటే పూర్తిగా ఉపయోగించాం కనుక ఇక పనికిరానిదని. కాలం, డబ్బు, జీవితం వృధా అయ్యాయని అన్నామంటే వాటిని సరిగా ఉపయోగించలేక పోయామని లేదా ఆశించిన ప్రయోజనం వాటినుంచి రాబట్టలేక పోయామని.
ఉపయోగించేవారి దృష్టికోణాన్ని బట్టి వ్యర్థం అనేది నిర్వచించబడుతూ ఉన్నది. ప్రకృతిని కూడా మానవులకు ఉన్న ఉపయోగాలను బట్టి నిర్వచిస్తూ వచ్చాం. ఈ దృష్టి కోణం సరైనది కాదు. నిజానికి ప్రకృతిలో పరస్పరం ఉపయోగాలను బట్టి వాటి మధ్య సంబంధం ఉంటుంది. ఒక్క మనిషి మాత్రమే తాను ఏ కొంచెం ప్రకృతికి ఉపయోగ పడకుండా ప్రకృతిని ఉపయోగించు కుంటున్నాడు. నీ వల్ల ప్రకృతికి ఉపయోగం ఏమీ లేనట్లయితే, ప్రకృతి దృష్టి కోణం నుంచి చూస్తే నువ్వు వర్థ్యానివే.


వాట్‍ విమ్‍లీవ్‍ బిహైండ్‍ రచనలో రచయిత ఒక ఉదాహరణను ఆసక్తికరంగా వివరించాడు. ప్రస్తుత వ్యవస్థలో ఏ వస్తువైనా అది మనకు
ఉపయోగపడిన జీవిత కాలం కంటే అది నిరుపయోగంగా వ్యర్థంగా ఎక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉంటుందని చెపుతాడు. ఒక సంఘటనను ఇలా చెపుతాడు ‘‘నేనొక మాల్‍కు భోజనం కొరకు వెళ్ళాను అక్కడ ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్‍ ఫోర్క్ ఇవ్వబడింది. నేను ఐదు నిమిషాలు వాడే సరికి విరిగిపోయింది. దానిని నేను బయట విసిరేశాను. అది చెత్తకుప్పలోకి అక్కడ నుండి భూమిలోకి పోయింది. ఆ ప్లాస్టిక్‍ చెంచా భూమిలో కరగాలంటే ఐదు వేల సంవత్సరాల కాలం పడుతుంది. ఆ ప్లాస్టిక్‍ అటువంటి రకం. నేను ఆ ఫోర్కును వాడింది ఐదే నిమిషాలు. కానీ, నిమిష కాలం నేను వాడితే ఆ చెంచా వెయ్యేళ్లు వ్యర్థంగా మిగిలిపోతుంది. ఈ ఉదాహరణ చెప్పి మనం వాడేది స్వల్పకాలమైనా అది దీర్ఘకాలం నిరుపయోగంగా ఉంటున్నది. ఇట్లాంటివి అనేకం చెప్పవచ్చు. పారిశ్రామిక నాగరికత అనివార్యంగా సంక్లిష్టమైన పద్ధతిలో భూమిని వ్యర్థ పదార్థంగా మారుస్తున్నది అంటాడు. కనుక ఆ నాగరికత భూమిపై వ్యర్థంగా పడి ఉంటున్నదని భారమైపోతున్నదని పేర్కొంటాడు. మనమిప్పుడు ఏ నాగరికత, సంస్క•తులకు ప్రతినిధులమో ఆలోచించుకోవాలి.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *