అవును ఆ గుడి రాళ్లు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. పట్టించుకునేవారు లేక మూకుమ్మడిగా కూడబలుక్కొని మొత్తం నేల రాలబోతున్నాయి. వారసత్వ ప్రేమికులు ముక్కున వేలేసుకునేట్లు ఒకప్పటి చరిత్ర చెరిగి పోవటానికి కారణ మౌతున్నాయి. ఆ ఆలయం లోపల శివుడుండేవాడు. ఆయన భద్రత కోసం ద్వార శాఖలపై నిరంతర నిఘాతో పాలకులు కూడా ఉండేవారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగొందటానికి దాతల ద్వారా కానుకల రూపంలో కాసుల వర్షం కురిపించిన పై గడపపై ఉన్న గజలక్ష్మి మౌనముద్ర దాల్చింది. అభిషేక జలంతో పులకించిన శివలింగం గర్భాలయం నుంచి మాయమైంది. ముల్లోకాల్లో ఎక్కడి కెళ్లాలన్నా, సర్వసన్నద్ధంగా ఉండే నంది వాహనం అంతర్ధానమైంది. ఎక్కడోకాదు, హైదరాబాదు-కర్నూలు జాతీయ రహదారిపై జడ్చర్ల, కొత్తకోటకు మధ్యలో గల మూసాపేట దగ్గరున్న సం(లెం)కలమద్ది రామస్వామి గుట్టపై చిక్కి శిథిలమౌతున్న ఒకప్పటి శివాలయం. పైన జమదగ్ని రామాలయం. కొంచం కిందగా కుడివైపున తామరలు పూయించిన చక్కటి కోనేరు. కుడివైపున భక్తులకు స్వాగతం పలుకుతన్న శిలాతోరణమే సహజగోపురం. అలవోకగా ఆలయాల్ని చూచి రావటానికి చక్కటి మెట్ల వరుస.
ఎప్పుడో కళ్యాణి చాళుక్యుల కాలంలో రూపుదిద్దుకొని అంగరంగవైభవాలతో వెలుగొందిన ఆధ్యాత్మిక నిలయం. పండుగలూ, పబ్బాలూ, శివరాత్రి ఉత్సవాలకు హాలాహాలాన్ని దిగమింగిన శివుని భక్తుల కోలాహలంతో కళకళలాడిన ఆ శివాలయం, శిథిలాలను పదిలపరిచే నిజమైన ధర్మకర్తలకోసం ఎదురు చూస్తుంది.
కొంచెంపైనున్న బండలపై ఆదిమ మానవుని ఆనవాళ్లున్నాయి. కొత్తరాతియుగపు ఎద్దు, మనుషుల రాతి బొమ్మలున్నాయి. కోనేటి చుట్టూ శాతవాహన స్థావరం అడుగుజాడలున్నాయి. చాళుక్య, రాష్ట్రకూటుల కాలపు రాతిని తొలచిమలచిన గణేశ, మహిషాసుర మర్ధిని విగ్రహాలున్నాయి. పక్క పక్కనే ఉన్న మల్లికార్జున లింగం, చెన్నకేశవ విగ్రహాలు సామరస్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. సరస్వతి, సూర్యభగవాన్, సప్తమాతల విగ్రహాలు కళ్యాణీ చాళుక్య శిల్పుల మునివేళ్ల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఆ వూరిపేరు లెంకల మద్ది అని బల్లగుద్ది మరీ చెబుతున్న కళ్యాణీ చాళుక్యుల శాసనముంది.
లెంకలంటే చక్రవర్తులు, రాజులు, రాణులకు అంగరక్షకు లుగా ప్రాణాలు సైతం లెక్క చేయక, మొక్కవోని అంకితభావంతో సేవలందించిన వీరులని అర్థం. మద్ది అంటే ఇప్పటికీ బుద్ది జీవులు కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే చెట్లు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే ఈ ఊరు లెంకలమద్ది అయిందని, రానురాను సంకలమద్ది అయిందని కళ్యాణ చాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుని (క్రీ.శ.1075-1126) శాసనం కోడై కూస్తూనే ఉంది. ఈ ఆలయం మునుపటి వైభవాన్ని సంతరించుకొంటే చూడాలని ఆ శాసనం ఆశ పడుతూనే ఉంది. ఆలయ అభివృద్ధి కమిటి అందుకు సిద్ధమౌతుందని తెలిసి ముసిముసి నవ్వులు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది.
–ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446