ఏప్రిల్ 14న డా।। భీమ్‍రావ్ రామ్‍జీ (బిఆర్) అంబేడ్కర్ జయంతి
డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్.. భారత రాజ్యాంగ నిర్మాత. సామాజికంగా దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడు. ఇప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి. ఆయన సూచించిన మార్గాలే పాలకులకు మార్గదర్శకాలు. ఆయన ఆలోచనల నుంచి జాలువారిన నిర్ణయాలు, ప్రతిపాదనలు సమాజ ప్రగతికి సోపానాలుగా నిలిచాయి. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన గొప్పదనాన్ని నెమరే సుకుందాం. ఆయన ఆశయాలను విశ్లేషించు కుందాం.
భీమ్‍రావ్ రామ్‍జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న ‘మౌ’ (ప్రస్తుతం మధ్యప్రదేశ్‍లో ఉన్న) పట్టణంలో, సైనిక కంటో న్మెంట్‍లో జన్మించారు. అంబేడ్కర్ భారతీయ న్యాయ నిపుణుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు, రాజ్యాంగ సభ చర్చల నుండి భారత రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి నాయకత్వం వహించారు. మొదటి మంత్రి వర్గంలో న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1956లో వీరు బౌద్ధమతంలోకి మారారు. హిందూ మతాన్ని త్యజించిన తర్వాత దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రేరేపించారు.
బాంబే విశ్వవిద్యాలయంలోని ఎల్ఫిన్‍స్టోన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాక, అంబేడ్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు, వరుసగా 1927, 1923లో డాక్టరేట్‍లు అందుకున్నారు. అంబేడ్కర్ లండన్‍లోని గ్రేస్ ఇన్‍లో న్యాయశాస్త్రంలో శిక్షణ కూడా పొందాడు. వీరు జీవిత ప్రారంభంలో ఆర్థికవేత్త, ప్రొఫెసర్, న్యాయవాదిగా పనిచేశారు. వీరు రాజకీయ కార్యకలాపాల ద్వారా గుర్తించబడ్డారు. 1990లో అంబేద్కర్‍కు మరణానంతరం భారతదేశ ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయబడింది.
సాధారణంగా అంబేడ్కర్ అంటే కేవలం దళితులకే దేవుడని, అణగారిన వర్గాలకు మాత్రమే నాయకుడని సమాజంలో ఓ ముద్ర వేశారు. కానీ, అన్ని వర్గాలకూ అంబేడ్కర్ నాయకుడు. నైపుణ్యం, తెలివి, చురుకుదనం, కష్టపడే తత్వం ఉన్న అన్ని వర్గాల్లోని, అన్ని కులాల్లోని, అన్ని మతాల్లోని వారు వ•ద్ధి చెందేం దుకు అవసరమైన బాటలు వేశారు డాక్టర్ అంబేడ్కర్.
సామాజిక అసమా నతలు, అంటరానితనం అత్యంత భయంకరంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాలంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ జన్మించారు. ఆ కాలంలో సామాజిక దురాచా రాలను, దుర్మార్గాలను స్వయంగా అనుభవించారు. చదువు కునేం దుకు అర్హుడు కాని కుటుంబంలో జన్మించాడన్న అవహేళనలు భరించారు. మెహర్ కులానికి చెందిన అంబేడ్కర్‍ను అప్పట్లో తరగతి గది బయటే కూర్చో బెట్టేవారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఆయన అప్పటి నుంచే హేళనలు, అవమానాలపై తిరగ బడ్డారు. ఈ తరహా వివక్ష లన్నింటినీ ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్ అత్యధిక మార్కులతో పాసయ్యారు. ప్రతీ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు. తన అనుభవాలనే నిచ్చెనలుగా వేసుకొని, తన ఆలోచనలనే అవకాశాలుగా మలచుకొని ఉన్నత స్థితికి ఎదిగారు. ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నారు. ‘ప్రజాస్వామ్యంలో సమానత్వం’ అనే కలను నెరవేర్చారు.
చిన్నప్పుడు తనను చిన్నచూపు చూసిన వాళ్లపట్ల ఆయన ద్వేషం పెంచుకోలేదు. తనపట్ల విద్వేషం చూపించిన వాళ్లకు వ్యతిరేకంగావ్యవహరించలేదు. తన సామాజిక వర్గాన్ని హేళన చేసిన వాళ్ల గురించి ప్రతికూలంగా అస్సలు ఆలోచించలేదు. అందుకే అంబేడ్కర్‍ను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన రచనలు చదవాలి. ఆయన జీవితాన్ని అవగతం చేసుకోవాలి. ఆయన స్వయంగా రాసిన రాజ్యాంగంపై అవగాహన పెంచు కోవాలి. అప్పుడే అంబేడ్కర్ అసలు ఆలోచన ఏంటో, ఆయన స్వప్నం ఏంటో అర్థమవుతుంది.
డాక్టర్ అంబేడ్కర్ భారత దేశపు మూలస్తంభపు పునాది ఏంటో తన అధ్యయనం ద్వారా కనిపెట్టారు. ఆ అధ్యయనంలో తన జీవితాన్ని కూడా అంకితం చేశారు. అంబేడ్కర్.. తన ఆశయం కోసం, భారతదేశ భవిష్యత్తు కోసం ఎంతగానో శ్రమించారు. బాంబే యూనివర్సిటీలో బీఏ చదివిన అంబేడ్కర్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీలో ఎంఎ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో ఎమ్మెస్సీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ కొలంబియా విశ్వవిద్యాలయంలోనే పీహెచ్‍డీ పూర్తిచేశారు. అయినా, అంబేడ్కర్ చదువును అంతటితో ఆపలేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డీఎస్సీ చదివారు. అంబేడ్కర్ విజ్ఞానాన్ని గుర్తించిన కొలంబియా యూనివర్సిటీ ఎల్‍ఎల్‍డి గౌరవ పట్టా ప్రదానం చేసింది. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీ కూడా డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టా అందజేసింది. గ్రేస్ ఇన్ లండన్ యూనివర్సిటీలో బారిష్టర్ ఎట్ లా చదివారు భీంరావ్. విదేశాల్లో ఎకనమిక్స్లో డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడిగా రికార్డు స•ష్టించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్ని రంగాలకు వర్తించే ఒక తాత్విక శక్తిగా ప్రజాస్వామ్యాన్ని మలచుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత ఆర్ధికవేత్తగా, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా, న్యాయవాదిగా విభిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత జాతీయోద్యమంలోకి ఎంటరయ్యారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత సమానత్వం, సమన్యాయం లక్ష్యాల కోసం పరితపించారు. రాజ్యాంగ రచనా కమిటీకి నేత•త్వం వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా (Constituion Of India) పేరొందిన భారత రాజ్యాంగం తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పడంలోనూ డాక్టర్ అంబేడ్కర్ పాత్ర ఉంది. చివరి రోజుల్లో అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బుద్దుని బోధనలకు ఆకర్షితులై బౌద్ధుడయ్యారు. కుల, మత, జాతి రహిత ఆధునిక భారతావనికి కోసం అంబేడ్కర్ ఎనలేని క•షి చేశారు. దేశపౌరులందరూ ఆయన జీవిత చరిత్రను చదవాల్సిన అవసరం ఉంది. ఆయన రచనలను అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఫలితంగా భారతదేశ ప్రగతిలో మనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు మార్గం లభిస్తుంది.
ప్రత్యేక తెలంగాణలో గత ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్‍కి అంబేడ్కర్ పేరు పెట్టారు. అలాగే గత ప్రభుత్వం సెక్రటేరియట్ పక్కకే ట్యాంక్‍బండ్ వద్ద హైదరాబాద్‍లో 125 అడుగల విగ్రహ స్థాపనకు 2016లో శంఖుస్థాపన చేసి, 132వ జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ప్రతిస్ఠాపన చేశారు. ఇక్కడ అంబేడ్కర్ మ్యూజియం ఉంది.
- ఎసికె. శ్రీహరి,
ఎ : 9849930145