ప్రకృతే సౌందర్యం! 23 ప్రకృతే ఆనందం!! తిండి పోతులం! ఆహారపు గొలుసులో మేమే తోపులం!!

జీవజాతులలో పరిమాణం దృష్ట్యా భూచరాలల్లో ఏనుగును, ఖడ్గమృగాన్ని, నీటిగుర్రాన్ని అతిపెద్ద జంతువులుగా గుర్తిస్తే, జలచరాలల్లో పెద్దజంతువులుగా సొరచేపని, తిమింగలాన్ని ప్రస్తావిస్తాం! భూ, జలచరాల్లో అన్నింటా తిమింగలమే అతిపెద్ద జంతువు. భారీకాయంతో, సుమారు 100 అడుగుల పొడవుతో, 150 టన్నుల (బ్లూవేల్‍) బరువుతో వుండే తిమింగలం నాలుకే మూడు టన్నులంటే నమ్మశక్యం కాదు. అయితే జంతువుల పరిమాణంను కచ్చితంగా తేల్చడం కష్టమైనపని. జంతువు యొక్క బరువు, పొడవు, ఎత్తు, శరీర సాంద్రత (mass) తదితర కొలతలు, తూకాలు అనేక అంశాలపై, అవి నడయాడే ప్రాంతాలపై ఆధారపడి వుంటాయి. ముఖ్యంగా భూచరాల లాగా, జలచరాల్ని అంచనా వేయడం మరింత కష్టసాధ్యమైన పని. ప్రధానంగా లభించిన కళేబరాల ఆధారంతో అంచనావేయడం జరుగుతుంది. అందుకే జలచరాల పరిమాణం గూర్చి పరస్పర వాదనలుంటాయి.
ఇప్పుడు సముద్రాల్లో ప్రధాన భూమికను పోషించి, ఆహారపు గొలుసులో కీలకపాత్రను పోషించే తిమింగలం ఆత్మకథను చూద్దాం!


తిమింగలం (WHALE) :

మా పేరు విననివారుండరు. కాని చూసిన వారు తక్కువే! మేం క్రూరజంతువులమని, పెద్దపెద్ద ఓడల్ని సైతం పడగొట్టే సత్తావున్న వారమని, మనుషుల్ని వేటాడుతామని నమ్మేవారు అత్యధికమే! ఇదంతా మిడిమిడి జ్ఞానపువారు, మా గూర్చి కల్పిత (fiction) కథల్ని అల్లేవారు సాగించే దృష్పచారం. కాని, ఆధునాతన పరిశోధనలు మేమెంత బుద్దిమంతులమో, సంఘజీవులమో చూపాయి. ఇంకా చెప్పాలంటే, మీ మానవులలాగా మేం క్రూరులం అసలేకాము. మీ మాటల్లో చెప్పాలంటే, మేం సాధుజంతువులం. సాధారణంగా మీరు ఆవుల గూర్చి, వాటి ఉపయోగాల గూర్చి, ప్రాధాన్యత గూర్చి ప్రచారం చేస్తూ వుంటారు. నిజం చెప్పాలంటే, మేం ఆవులను మించిన సాధు జంతువులం.


పర్యావరణ (జల) సంరక్షణలో, ఆహారపు గొలుసును నియంత్రించి సముద్రాన్ని మానవ, సకలజీవరాశికి అనుకూలంగా నియంత్రించుటలో మేమే పెద్దతోపు. ఒక్క క్షణం సూర్యుడి శక్తి ఆగుతే భూగోళంకు ఏం జరుగుతుందో ఊహించండి! మా జాతి కూడా మీలా ఒక్కరోజు ఉపవాసం వుంటే మొత్తం సముద్రాలన్నీ చేపలచే, ఇతర జలచరాల కళేబరాలతో నిండిపోతాయి. అప్పుడు సముద్రాల నీరంతా భూభాగాల్ని ముంచెత్తుతాయి. కాబట్టి మేం తిండిపోతులమే, కానీ, ఆహారపు గొలుసు నియంత్రణతోపాటు, భూగోళ సమతుల్యతను కాపాడే మహా ఉపకారులం.


భారీ కాయం – పిడికెడు గొంతు:
మా తిండి, మీ బకాసురుడు కూడా (కల్పిత) తినలేడు. రోజుకు వందల కిలోల నుండి సుమారు ఒక టన్ను చేపల్ని, ఇతర చిన్న జంతవుల్ని మేము తీసుకున్నా, మా గొంతు మాత్రం మీ పిడికెడంతా (fist) మాత్రమే వుంటుంది. మానోరు, నాలుక అతిపెద్దవే అయినా, మేం మీరనుకున్నట్లు మనుషుల్నిగాని, పెద్ద జంతువుల్ని గాని మింగలేము. పైగా మా నోటిలోకి వచ్చినా, వాటిని వెంటనే బయటికి తోస్తాం! ఇలా మా ఆహార విధానమే భూగోళ ఆహారపు సమతుల్యతకు ప్రధానకారణం!


మాదో వైవిధ్య భరిత జాతి :
మా గూర్చి, మా జాతి గూర్చి మీకు చాలా విషయాలు తెలియవు. ఇప్పుడిప్పుడే మా గూర్చిన చాలా అంశాలు మీ దృష్టికి వస్తున్నాయి. సర్కసు విన్యాసాలు చేస్తాయని భావించే అందమైన డాల్ఫిన్లు మాలోని ఒక కుటుంబమే! ప్రధానంగా మా ఆకృతిని బట్టి, పరిమాణాన్ని బట్టి మా క్రమమైన (order) సెటేసియన్‍ (cetacean)ను మూడు కుటుంబాలుగా విభజించారు.

  • తిమింగలాలు (whales) Balaenopteridae
  • డాల్ఫిన్స్ (dolphins) Dolphinidae
  • పోర్పోయిస్‍ (porpises) Phocoenidae
  • దాదాపు ఒకే విధమైన జీవన విధానాల్ని కల్గివున్నా, మా ఆకృతిని బట్టి ఈ విభజన చేసారు. అనగా
  • అ తొమ్మిది అడుగులకన్నా ఎక్కువ పొడవుగల వాటిని తిమింగలాలని.
  • అ తొమ్మిది అడుగులకన్నా తక్కువ గల వాటిని డాల్ఫిన్స్ అని, పోర్పోయిస్‍ అని. పోతే, పోర్పోయిస్‍, డాల్ఫిన్స్కన్నా మరింత చిన్న జంతువులన్న మాట!
  • అంటే, డాల్ఫిన్స్, పోల్పోయిస్‍లు కూడా తిమింగలాలే అయినా, తిమింగలాలన్నీ డాల్ఫిన్స్, పోర్పోయిస్‍ కావు.
  • ముఖ్యంగా మా గుణగణాలు మానవులకు దగ్గరగా వుంటాయి.
  • మేం మీలాగే ఊపిరితిత్తులతో శ్వాసిస్తాం. కాని, మీ ముక్కుపుటాల్లా కాకుండా, మాకు రంధ్రాలాంటి (blowholes) మార్గాలు వుంటాయి. ఇవి కొన్నింటికి రెండు వుంటే, కొన్నింటికి ఒకే రంధ్రం వుంటుంది.
  • మా శరీర ఆకృతి చేపల్లా వుండి, వీపుపై, చివరన భారీ వృంతాలు (fins) వివిధ ఆకృతుల్లో వుంటాయి.
  • మీలాగే పిల్లల్ని కని, పాలిచ్చి సాంఘికరణ (socialization) చేస్తాం.
  • మీకు లేనటువంటీ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించే పొరలతో, వాటిలో కొవ్వుతో (blubber)కూడిన బాహ్మ చర్యం వుంటుంది.
  • మేం వేడిరక్తపు జీవులమే!


మాది బలమైన సంఘ జీవనం!
మీలాగే మేం సంతోషాల్ని, దుఃఖాన్ని, బాధల్ని (griefs)ను వ్యక్తపరుస్తాం. సహచరులతో పంచుకుంటాం. డాల్ఫిన్స్ అయితే, అనారోగ్యానికి గురైన, గాయపడిన సహచరులకు మీలాగా నర్సింగ్‍ సపర్యల్ని అందిస్తాయి. వాటి వెన్నంటి వుంటాయి. మేం ప్రత్యేకమైన శబ్దాలచే (whistles) సంకేతాల్ని పంపించుకుంటాం. మా శబ్దాలు అవసరాన్ని బట్టి మార్చుకుంటాం. మా పిల్లలకు వేటాడే విధానాన్ని, శత్రువులకు చిక్కకుండా తప్పించుకునే నేర్పరితనాన్ని అందిస్తాం. పోతే, మా శబ్దాలు మీ మానవులు భరించలేనంతగా (130 డిసిబుల్‍ కన్నా ఎక్కువ) వుంటాయి. ఈ శబ్ద తరంగాల్నే మీరు గుర్తించి, జాగ్రత్త పడడం, ఓడల్ని నడపడం చేస్తుంటారు.


పలువరుస – జీవన విధానం !
భారీ ఆకారం వున్నా, మాలో కొన్నింటికి దంతాలే వుండకపోవడం గమనార్హం! అందుకే మమ్మల్ని మొత్తంగా రెండుభాగాలుగా విభజించారు.


దంతాలు లేనివి (mystcetes)
  • దంతాలు లేకుండా, పై దవడల నుంచి వేలాడే వడపోత (baleen) లాంటి జల్లెడ (bristles made with keratin) వుంటాయి.
  • దీంతో మమ్మల్ని బలీన్‍ (balean) వేల్స్ అని కూడా సంబోధిస్తారు.
  • సముద్ర పాచిని, క్రిల్స్ని (పీతల్ని) నీటి నుంచి వడపోసి, ఆహారంగా తీసుకోవడానికి ఇవి పనిచేస్తాయి.
  • ఈ రకం తిమింగలాలు ధ్వనిని (echolocate) కల్గించలేవు. ఇవి సుమారు 14 రకాలు : ఉదాహరణకు : బ్లూ వేల్‍, ఫిన్‍ వేల్‍, హంప్‍బ్యాక్‍ వేల్‍, గ్రే వేల్‍, నార్త్ అంట్లాంటిక్‍ రైట్‍ వేల్‍ (కొంత అపాయకరమైనవి) మొ।।.

దంతాలు కలవి (odontocetes)
  • ఈ రకం మీ లాగా దంతాలను కలిగి వుంటాయి.
  • పెద్దస్థాయి జంతువుల్ని కూడా పట్టుకోని ఆహారంగా తీసుకుంటాయి.
  • ధ్వనిని (echolocate) కల్గిస్తూ ముందుకు సాగుతాయి. ఇవి సుమారు 72 రకాలు : ఉదా।। స్పెర్మ్ వేల్‍ (అతి పెద్దది), ఓర్కా వేల్‍, బాటిల్‍ నోస్‍ వేల్‍, బెలుగా, హార్బర్‍ పోర్పోయిస్‍ మొ।।
  • అలాగే డాల్ఫిన్స్కు, పోర్పోయిస్‍కు తేడాలుంటాయి. అతి చిన్న డాల్ఫిన్‍ (మాయూస్‍ పొడవు 5-7 అడుగులు మాత్రమే!)

మా ప్రత్యేకతలు :
  • స్పెర్మ్ వేల్‍ తలలో నూనెలాంటి (spermacetic) జిగురు పదార్థ ముంటుంది. తిత్తిలాంటి ఈ అవయవం శబ్దాల్ని కల్గిస్తాయి. సముద్రమార్గంలో ఎదురుగా వచ్చే అడ్డంకుల్ని, పెద్ద పెద్ద ఓడల్ని ప్రతిధ్వని ద్వారా గుర్తించి జాగ్రత్తపడి దారి మళ్ళుతాయి.
  • ఈ జిగురును మీ మానవులు దీపాలకు, కొవ్వు వత్తులకు, కందెనలుగా ఉపయోగించుకుంటారు.
  • మా చర్మాలు పొరలతో మందంగా వుంటాయి. ఈ పొరల్లో కొవ్వు (fat) వుంటుంది. దీంతో మా శరీర ఉష్ణోగ్రతల్ని నియంత్రించుకుంటాం. దీన్నే బ్లబ్బర్‍ అంటారు.
  • మేం చనిపోతే, ఈ పొరల్లోని కొవ్వే మమ్మల్ని నీటిపై తేలేలా చేస్తుంది.
  • మేం కూడా మంచి పాటలు పాడుతాం. ఇవే మా ఉనికిని తెలియ జేస్తాయి. సమూహంగా వుండడానికి తోడ్పడుతాయి. బెలూగా వేల్‍ (beluga) దీంట్లో మరింత నైపుణ్యతను గలిగి వుంటుంది.
  • మా తల తిప్పడానికి అనుకూలంగా వుంటుంది.
  • సాధారణంగా మా జీవిత కాలం వంద సం।।లు కాగా, మాలోని బౌహెడ్‍ వేల్‍ (bow head) సుమారు 200 సం।। జీవిస్తాయి. అంటే, భూమిపై వృక్షాల్లా జీవించే దీర్ఘకాలిక జంతువులం మేమే!
  • మూడు కిలోమీటర్ల లోతువరకు మేం డైవ్‍ (dive) చేయగలం.
  • సుమారు రెండు గంటలు నీటిలో వుండగలం.
  • దాదాపు 16,000 కి.మీ. దూరాల వరకు, కాలానుగుణంగా మేం వలసపోతాం.
  • అ స్థూలంగా చెప్పాలంటే సముద్రాల్లో మానవునికి నడక నేర్పింది మేమే! మా ఆకృతులను బట్టే మీరు ఓడ నిర్మాణాలను, క్రూజులను నిర్మించుకుంటున్నారు. అంటే, మీ తెలివికి మూలం మేమే!


మా ఉపయోగాలు :
మా ఉపయోగాలు అంతా ఇంతా కాదు. దాదాపు మానవుడి అభివృద్ధికి, జీవన విధానానికి మేం తోడ్పడని రోజులేదు. సబ్బులు, కొవ్వత్తుల, కందెనల తయారిలో, బట్టల పరిశ్రమలో, సుగంధ పరిమళాల తయారిలో, ఫ్యాషన్‍ వస్తువులకు, అలంకరణ వస్తువులకు, గొడుగు పుల్లలకు, సిగరెట్‍ పరిశ్రమల్లో మా కొవ్వుల్ని, ఇతర భాగాల్ని వాడుతారు. ఇక మందుల పరిశ్రమల్లో, ఆరోగ్య సంబంధమైన గుండె జబ్బులకు, జీర్ణకోశ వ్యాధులకు, చర్మ సంబంధ వ్యాధులకు కూడా దీన్ని విరివిగా వాడుతారు. పరోక్షంగా చెప్పాలంటే, మీ నిత్య జీవితంలో మేం అన్నింటా మీతో వుంటామన్న మాట.


ముగింపు :
ముగింపు మా ఆత్మకథ గూర్చి కాదు. ఈ భూమిపై మేం కనుమరుగైతే, బహుషా భూగోళం చివరిదశ కావచ్చు అనేది. ఓ మహా వృక్షం ఎన్నివిధాలుగా, ప్రాణవాయువుతో సహా ఉపయోగపడుతుందో, మేం అంతే ఉపయోగపడుతాం. చెట్లు లేని భూగోళం ఎలావుంటుందో, మేం లేని భూగోళం కూడా అంతే అని గ్రహించండి.
పోతే మా గూర్చిన రక్షణ చట్టాలు ప్రపంచవ్యాపితంగా వున్నాయి. మా గూర్చిన చర్చలున్నాయి. కాని, ఆచరణలోనే నిర్లక్ష్యం. అమెరికాతో సహా, ప్రపంచ దేశాలన్ని మా రక్షణ చట్టాల్ని పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు మిలియన్‍ సంఖ్యలో ప్రపంచ సముద్రాల్లో ఈదులాడిన మా జాతి 200 సం।।ల క్రితం 1.5 మిలియన్లకు పడిపోయింది. బ్లూ వేల్స్ 25,000కు పడిపోయాయి. నార్త్ అట్లాంటిక్‍ రైట్‍ వేల్స్ కేవలం 500 గా, అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వున్నాయి. రెడ్‍లిస్టు (Red List)లో అత్యంత శీఘ్రంగా అంతరించుతున్న అతి భారీ జంతువుగా చేర్చింది. స్పెర్మ్ వేల్స్ సుమారు మూడు లక్షలే! ఇవన్నీ అంచనాలే! వాస్తవ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా వుంది. అందుకే IUCN వేదిక మమ్మల్ని అత్యంత ప్రమాదకర స్థితిలో వున్న జాతిగా ప్రకటించింది. మీకు అత్యంత వినోదాన్ని కల్గించే డాల్ఫిన్ల స్థితి కూడా బాధాకరమే!
ఉక్రేయిన్‍పై యుద్ధం చేస్తున్న రష్యా యుద్ధనౌకల వల్ల సముద్రంలో కల్గిస్తున్న కలుషితాలకు, భీకర శబ్దాలకు సుమారు 50,000కు పైగా డాల్ఫిన్స్, పోర్పోయిస్‍లు మృత్యువాత పడ్డాయని అంచనా! ఇప్పుడు చెప్పండి. మా దీనపరిస్థితికి కారకులెవరో! మేం కనుమరుగైతే భవిష్యత్‍ చిత్రపటం ఎలా వుంటుందో!


శ్రీ తెల్లని స్పెర్మ్వేల్‍పై హెర్మాన్‍ మెల్విల్లే (Herman Melville) రాసిన మోబిడిక్‍ (moby dick) నవల మాపై ఎంత తప్పుడు ప్రచారాన్ని కల్గించిందో చదవండి!
శ్రీ డాల్ఫిన్‍పై వచ్చిన ఫ్లిప్పర్‍ (ఖీశ్రీఱజూజూవతీ) టీవి సీరియల్‍ చూడండి! (వచ్చే సంచికలో పక్షుల దయనీయ స్థితిని చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *