కాలంతో పయనించేవాడే కవి అని, కాలానుగుణంగా వర్తమాన అంశాల్ని ఒడిసి పట్టుకుని కవిత్వం రాయడమే కవి యొక్క పని అని ప్రముఖ సామాజికవేత్త, దక్కన్ ల్యాండ్ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్ పేర్కొన్నారు. లుంబిని పాఠశాల, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో నిర్వహించిన శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర ఉగాది కవిసమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తమాన సమస్యలను ప్రపంచానికి చాటే విధంగా కవి ప్రయత్ని స్తాడని, ఆ ప్రయత్నంలోనే భాగంగానే సమాజ మార్పును కవి ఆహ్వానిస్తాడని ఆయన అన్నారు. అలాగే పర్యావరణానికి అను కూలంగా కవులు కవిత్వం రాయాలన్నారు. అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుం దన్నారు. ఉగాది కవిసమ్మేళనాన్ని ప్రతి సంవత్సరం నిర్వ హించడం గొప్ప విషయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన కె. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా లుంబిని పాఠశాలలో ఉగాది కవి సమ్మేళనాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఎంతోమంది యువకవులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాన వక్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు మాట్లాడుతూ కవులు పఠనాసక్తిని పెంపొందించుకోవాలని, పఠనం ద్వారానే కవిత్వం రాణిస్తుందనన్నారు. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలను గ్రహించి కవి తనదైన లోచూపుతో కవిత్వం ఆవిష్కరించాలన్నారు.
నిరంతరం గ్రంథపఠనం చేయడం వల్ల అనేక కొత్త అంశాలని కవులు తెలుసుకుంటారన్నారు. కావున కవులు ప్రసిద్ధమైన కవులు రాసినటువంటి కవిత్వాన్ని చదవాలన్నారు. కేవలం ఉగాది సందర్భంగా కాకుండానే నిరంతరం కవితారచన చేయాలన్నారు. విశిష్ట అతిథి, ప్రముఖ న్యాయవాది వి. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో ఎంతోమంది నూతన కవులు ఆవిర్భవిస్తున్నారని, వారి కోసం ఎన్నో సాహిత్య సంస్థలు ప్రోత్సహిస్తుండడం అభినందనీయమన్నారు. అలాగే శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రసిద్ధ నటులు బెల్లం సాయిలు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులు కోట్ల వెంకటేశ్వర రెడ్డి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, కార్యక్రమ సంయోజకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, వనపట్ల సుబ్బయ్య తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మణికొండ వేదకుమార్ సంపాదకత్వంలో వెలువడుతున్న ‘‘బాలచెలిమి’’ పిల్లల మాసపత్రికను పిల్లలు ఆవిష్కరించారు. ఈ కవిసమ్మేళనంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎనభైమందికి పైగా కవులు కవితాగానం చేశారు. పాల్గొన్న అందరికీ మెమెంటోలతో సన్మానం చేశారు.
- భీంపల్లి శ్రీకాంత్
ఎ : 9032844017